పెరటి చెట్టు

తనలో తానే పాడుతున్న తాత్వికుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రాజుల్మత్తులు, వారి సేవ నరకప్రాయంబు; వారిచ్చు అం/్భజాక్షీ చతురంతయాన తురగీ భూషాదు లాత్మవ్యధా/ బీజంబుల్; తదపేక్ష చాలు, పరితృప్తింబొందితిన్; జ్ఞాన ల/క్ష్మీ జాగ్ర త్పరిణామ మిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వరా!’ - జీవితమంతా రాచకొలువుల్లో గడిపేసిన ఓ మహాకవి చేసుకున్న చిరు విన్నపమిది. రాజులు మదమెక్కిన వారట! వారి సేవ నరకప్రాయమయినదట! రాజులు ధారపోసే భోగకాంతలూ, వారు సమకూర్చే పల్లకీలూ, గుర్రాలూ, నగలూ నాణేలూ ఆత్మవ్యధకు విత్తనాల్లాంటివట! ఆ శ్రీకాళహస్తీశ్వరుడి దయ, ప్రేమ చాలట! తనకు సంపూర్ణంగా సంతృప్తి లభించిందట! అంచేత, ఇంకనయినా కళ్లు తెరిపించి, ఆ జ్ఞానలక్ష్మిని దయచేయించవయ్యా మహాదేవా అని శ్రీకాళహస్తీశ్వరుణ్ణి వేడుకుంటున్నాడీ మహాకవి. ఈ కవి పలుకులకి ఇంతటి ‘అతులిత మాధురీ మహిమ’ ఎటుల లభించిందోనని, ఆయన్ని ఆదరించి కవి - రాజే ఆశ్చర్యపోయాడట. సదరు రాజుగారు పరమ భాగవతోత్తముడయిన వైష్ణవుడు. కవిగారేమో, పుట్టుకతో వైష్ణవుడే అయినా, మధ్యలో మతం మార్చుకుని భక్తి పారవశ్యంలో ఒళ్లు మర్చిపోయిన పరమ మాహేశ్వరుడు. మనం చెప్పుకుంటున్న ఈ కవిగారి పేరు ధూర్జటి. ‘శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యం’ ‘శ్రీకాళహస్తీశ్వర శతకం’ రాసి, తనకంటూ ఓ విశిష్ట స్థానం సంపాదించుకున్న ఈ మహాకవిని ఆదరించిన కవి - రాజు పేరు కృష్ణదేవరాయలు అంటారు. వీళ్లిద్దరూ ఒకరినొకరు తెలిసి వున్నా లేకున్నా, ఒకే కాలానికి చెందినవాళ్లనేదాన్లో సందేహం లేదు. ధూర్జటి, తాను పొత్తపినాటికి చెందినవాణ్ణని చెప్పాడు. ఒకప్పుడు, కడప కేంద్రంగా రాయలసీమలో విస్తరించిన ప్రాంతమే పొత్తపినాడంటే. ఇతని మనవడు కుమార ధూర్జటి అనే పేరుతో ‘ఇందుమతీ పరిణయ’మనే కావ్యం - తర్వాతి కాలంలో - రాశాడనే విషయం తప్ప, ధూర్జటి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు చరిత్రకెక్కలేదు.
తెలుగు కవిత్వ చరిత్రలో, మొట్టమొదటిసారిగా, పూర్తి ఆత్మనిష్ట కవిత్వం చెప్పినవాడు ధూర్జటి. ధూర్జటి అంటేనే శివుడని అర్థం. ఆయన రాసిన ‘శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యం’ లాంటి భక్తి కావ్యాలకన్నా, నేరుగా మహాదేవుడితో మొరపెట్టుకుంటూ ధూర్జటి చెప్పిన ‘శ్రీకాళహస్తీశ్వర శతక’మే ఎక్కువ ప్రాచుర్యానికి నోచుకుంది. అనేక మంది ప్రబంధ పరమేశ్వరుల మధ్య కూర్చుని, నిజం పరమేశ్వరుని మీదే మనసు లగ్నం చెయ్యగలిగినందుకు ధూర్జటిని అభినందించాల్సిందే. అయితే, స్థల కాలాలతో సంబంధం లేని ధూర్జటి భక్త్యావేశాలు సమకాలీనుల నుంచి - ముఖ్యంగా సాహిత్య చరిత్రకారుల నుంచి - పెద్ద ఆదరణకు నోచుకోలేక పోయాయి. సాక్షాత్తూ రాయలంతటి వాడే మెచ్చుకున్నట్లు చెప్పినప్పటికీ, సాహిత్య చరిత్రలో అర్హస్థానం పొందలేకపోయిన ప్రతిభావంతుల్లో ధూర్జటి ఒకడు.
వెల్చేరు నారాయణరావు, డేవిడ్ షుల్మన్‌లు - ‘శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యం’లోంచి నత్కీరుడి కథను అనువాదం చేస్తూ - ధూర్జటి గురించి ఓ ముఖ్యమయిన విషయం చెప్పారు. నత్కీరుడి పాత్రచిత్రణ సందర్భంగా ధూర్జటి పేర్కొన్న చాలా విషయాలు స్వయంగా కవికే వర్తిస్తాయన్నదే వాళ్ల వ్యాఖ్య. నత్కీరుడిలో తలెత్తిన వైరాగ్య భావనలు, పశ్చాత్తాపం ‘శ్రీకాళహస్తీశ్వర శతకం’లోని అనేక పద్యాల్లో ప్రతిధ్వనించడం తేలిగ్గానే గుర్తుపట్టొచ్చు. నిర్దిష్ట మానసిక అవస్థలో కూరుకుపోయిన రచయితలు, తమ కళనూ, కల్పననూ, తమ మానసికతనూ వేరుచెయ్యలేక పోవడం తరచు చూసేదే. మరీ ముఖ్యంగా, వ్యక్తినిష్టమయిన సాహిత్యం సృజించే వాళ్లలో చాలామంది విషయంలో ఇది జరుగుతుంది. అందుకే, ‘శ్రీకాళహస్తీశ్వర శతకం’లోని అనేక పద్యాలు, ధూర్జటి కవి వ్యక్తిగతంగా తన గురించి రాసుకున్నవే అనిపిస్తుంది.
అలాగని, ధూర్జటి కథాకథనం చేతకానివాడేం కాదు. తిన్నడి కథను చక్కగా చెప్పి ఒప్పిస్తాడు. అయితే, ఆ కథనంలో కూడా భక్తితత్పరతకే ప్రాధాన్య మిచ్చాడు. తను తిన్నదే, తను తాగిందే - మాంసం, కల్లు - దేవుడికీ పెట్టాడు తిన్నడు. ఇందులో మనో ధర్మశాస్త్రానికి సంబంధించిన ఓ ముఖ్యాంశం అంతర్నిహితంగా ఉంది. మనిషికి ఉన్నంత ఆత్మ ముగ్ధత్వం మరే జీవిలోనూ కనిపించదు. ప్రపంచమంతా ఎటు కొట్టుకుపోయినా, తన అస్తిత్వం కాపాడుకోవాలనుకుని చూసుకునే లక్షణం మానవత్వంలో భాగమయిపోయింది. అందుకే, తనకు అత్యంత ప్రీతిపాత్రమయిందని చెప్పడానికి మనిషి ‘నాకు అదంటే ప్రాణం!’ అంటాడు. దీనికి మనుషుల్లో రెండే అపవాదాలున్నాయి. మొదటిది తల్లి. అందుకే ప్రపంచంలోని ప్రతి భాషలోనూ అమ్మ అంటే ఆది దేవతనే అర్థం. ఈ విశ్వజనీన మానవ సూత్రానికి రెండో అపవాదం భక్తుడు. నిజమయిన భక్తుడికి - తనకు ఆవలగా - దేవుడి అస్తిత్వం ఉన్న సంగతి సాధారణంగా స్ఫురించదు. దీనికి తగినట్లే, తిన్నడు దేవుణ్ని తనలో కలిపేసుకున్నాడు - ఆ తర్వాతే దేవుడు తిన్నణ్ణి తనలో కలుపుకున్నాడు! అలాగే, ‘కంటికి కన్ను - పంటికి పన్ను’ అనే ఆటవిక న్యాయానికి, తిన్నడు కొత్త భాష్యం చెప్పాడు. శివుడు కంట నీరు పెడితే, తన కన్ను పెరికి శివుడికి అమర్చాడు తిన్నడు. రెండో కంట్లో కూడా నీరు రావడం గమనించి, కాలి బొటనవేలితో వైద్యనాథుడి కన్ను ఎక్కడుందో గుర్తుపెట్టుకుని మరీ, అదే చికిత్స చేశాడు తిన్నడు. ఈ చికిత్సే తిన్నడిని ‘కన్ను+అప్ప’= కన్నప్పగా మార్చింది.
నత్కీరుడి కథ చెప్పే సందర్భంగా నత్కీరుడయిపోయినట్లుగానే, తిన్నడి కథలో కన్నప్పగా మారిపోయి కథ చెప్పడం ధూర్జటి విశిష్టత. ఇది, పాత్రల స్వాతంత్య్రాన్ని దిగమింగేయడం కాదు. కొయ్యబొమ్మల్లాంటి పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చెయ్యడం. ఈ పని అందరూ చెయ్యలేరు. ఉదాహరణకి, వరూధినిని వర్ణించే సందర్భంలో పెద్దన కేవలం మగ కవిలా ప్రవర్తిస్తాడు. ప్రవరుడి అందచందాలను వరూధిని దృక్కోణం నుంచి వర్ణిస్తాడు. (వాస్తవానికి అతని లక్ష్యం రాయల్ని రంజింపజెయ్యడమే!) అంతే తప్ప, ఆయా పాత్రల మనస్సుల్లోకి దూరిపోవడం పెద్దనకి చేతకాదు. అసలాయన అందుకు ప్రయత్నించనే లేదు! కానీ, పాత్రల మనోవ్యాపారాన్ని చిత్రించడంలోనే కాల్పనిక సాహిత్య విజయం ఉందంటారు విమర్శకులు.
అత్యాధునిక, మళ్లీ మాట్లాడితే నిత్యాధునిక సాహిత్యం పరారుూకరణ అనే భావనను విస్తృతంగా చర్చించింది; ఇంకా చర్చిస్తోంది కూడా. సాహిత్యం మొత్తం - ఒక దశలో - ఆత్మగతంగా మారిపోతుందని ఈ చర్చలో పాల్గొన్న పెద్దలు అన్నారు. నిజానికి, ‘శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యం’ ‘శ్రీకాళహస్తీశ్వర శతకం’ లాంటి ధూర్జటి రచనల్లో ఈ ఆత్మగతీకరణే - పరిపూర్ణమయిన రూపంలో కాకపోయినా - కనిపిస్తోంది. దురదృష్టమేమిటంటే, సంప్రదాయ సాహిత్య విమర్శకుల స్థాయి, సామాన్య పాఠకుల స్థాయికన్నా ఎగువన లేకపోవడం వల్ల ఇలాంటి ముఖ్యమయిన విషయాలు చర్చకు రాకుండా పోయాయి. ఈ సందర్భంగా పాఠ జనానికి నాదో చిన్న విన్నపం - ఏదో ధూర్జటికి ఒక్కడికే అన్యాయం జరిగిందనుకుని ఆయన జాలి పడకండి - నిజమయిన అన్యాయం మనకందరికీ జరిగిందీ, జరుగుతోందని గుర్తించండి!)