పెరటి చెట్టు

తెలుగు వల్లభుండు, తెలుగొకండు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నీలమేఘము డాలు ఈలు సేయగచాలు మెరుగు చామన చాయ మేనితోడ/ అరవిందముల కచ్చు లడగించు జిగి హెచ్చు నాయతంబగు కన్ను దోయి తోడ/ పులుగురాయని చట్టుపల వనె్న నొరబట్టు హోంబట్టు జిలుగు రెంటెంబు తోడ/ ఉదయార్క బింబంపు ఒరపు విడంబంబు దొరలంగ ఆడు కౌస్త్భుము తోడ/ తమ్మికేలుండ పెర కేల దండ ఇచ్చు లేము లుడిపెడు లేచూపు లేమ తోడ/ తొల్కు దయ తెల్పు చిరునవ్వు తోడ కల తదంధ్ర జలజాక్షు డిట్లని ఆనతిచ్చె’ - - నీలమేఘ కాంతిని తేలిపోయేలా చేసే మెరుపుతో కూడిన చామన చాయతోనూ - తామరపూల గర్వాన్ని అణిచే విశాలమయిన కన్నులతోనూ - గరుత్మంతుని రెక్కల కాంతితో పోటీపడే పట్టుజరీ కలనేత వస్త్రంతోనూ - బాల సూర్యబింబం కాంతిని సవాలుచేసే కౌస్త్భు మణితోనూ - ఒక చేత్తో కమలాన్నీ, మరో చేత్తో కమలదళాయతాక్షుడినీ పట్టుకుని వుండి, దారిద్య్ర ధ్వంసకమయిన లేతచూపులు చూస్తూండిన లేమ (లక్ష్మి)తోనూ - దయ వొలికించే చిరునవ్వుతోనూ - ఆ ఆంధ్ర వల్లభుడు (కృష్ణా జిల్లాలో వెలసిన శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు) ఈ విధంగా ఆనతిచ్చాడని శ్రీకృష్ణదేవరాయలు తన స్వప్న వృత్తాంతాన్ని మనకి తెలియ చేస్తున్న సందర్భమిది. క్రీ.వ.1516 సంవత్సరం జనవరిలో - కళింగ జైత్రయాత్రలో భాగంగా - రాయలు శ్రీకాకుళం వెళ్లి వుంటాడని శాసనాల ఆధారంగా తుమ్మపూడి కోటీశ్వరరావు ఊహించారు. అదే సంవత్సరం చివర్లో ‘ఆముక్తమాల్యద’ కావ్య రచన పూర్తయి ఉంటుందని పరిశోధకుల అంచనా. ఈ కవి - రాజు గతంలోనే సంస్కృతంలో ‘మదాలస చరిత్ర’ ‘సత్యభామా పరిణయం’ ‘సకల కథా సారసంగ్రహం’ ‘జ్ఞాన చింతామణి’ ‘రసమంజరి’ తదితర కృతులూ కావ్యాలూ రాశాడని ఆంధ్ర మహావిష్ణువు నోటితోనే రాయలు చెప్పించాడు. ‘తల్లి సంస్కృతంబె ఎల్ల భాషలకును’ కనక, ఇన్ని కావ్యాలు దేవభాషలో రాసిన వాడికి తెలుగులో ఇంకో కావ్యం రాయడం పెద్ద పనేం కాదనీ, తనకు అనన్యుడయిన వెంకటేశ్వరుడికి దాన్ని అంకితమిచ్చుకోమనీ ఆ దేవుడే చెప్పినట్లు రాశాడు రాయలు. ఇదొక్కటే, మిగతా ప్రబంధాలకూ, ఆముక్తమాల్యదకూ సామాన్యంగా ఉండే లక్షణం. మరే విషయంలోనూ, రాయల కావ్యాన్ని ఇతర ప్రబంధాలతో పోల్చలేం. శబ్దాలంకారాల పరంగా చూసినా, భావాలంకారాల పరంగా చూసినా - ఎత్తుగీతితో కూడిన - ఈ సీసం రాయల కవితా శక్తికి నిదర్శనగా నిలుస్తుంది. ఇంతకు మించిన పద్యాలు మరెన్నో ఈ కావ్యం పొడుగునా కనిపిస్తూనే వుంటాయి. ఇందులోని కథ సుప్రసిద్ధం. పన్నిద్దరాళ్వార్లలో ఒకడయిన పెరియాళ్వారుకే విష్ణుచిత్తుడనే పేరూ ఉంది. అతని పెంపుడు కూతురు ఆండాళ్ అనే గోదాదేవి. ఆమె శ్రీరంగనాథుణ్ణే భర్తగా వరించింది. రంగడి కోసం సిద్ధం చేసిన పూలమాలల్ని ఆమె ముందు ధరించేదట. ఈమెని అందుకే ‘చూడి కుడుత్త నాంచారి’ అంటారు. పనె్నండుగురు ఆళ్వార్లలో ఆమె ఒక్కతే మహిళాళ్వార్. ఆమె తమిళంలో పాడిన ‘తిరుప్పావై’ ‘నాచ్చియార్ తిరుమొజ్షి’ గీతాలు ఇప్పటికీ మార్గజ్షి సందర్భంగా మారుమోగుతూనే ఉంటాయి. ఆమె కథే ఆముక్తమాల్యద. ఇక ఆముక్త మాల్యదలోని ప్రతి ఒక్క పద్యం, రాయల సాహితీ మూర్తిమత్వానికి అద్దం పడుతుంది. కాకునూరి అప్పగవీ, కస్తూరి రంగకవీ తదతర లాక్షణికులు ఈ కావ్యాన్ని పెద్దన రాశాడని ప్రచారం చేసినా, దాన్ని పరిశోధకులెవరూ పట్టించుకోలేదు.
నన్నయ్య, తిక్కన, శ్రీనాథుడు, ఎర్రన, నాచన సోమన లాంటి కొద్ది మందిలో తప్ప ఇతరుల్లో - రాయల్లో కనిపించేటంత - వౌలికత అగుపించదు. ప్రబంధ యుగంలో ఓ వెలుగు వెలిగిన కవులెవ్వరిలోనూ కానరాని ఈ విశిష్టత రాయల్లో కనిపిస్తుంది. ఓవైపు కథాకథనంలోనూ, మరోవైపు ఆలంకారికతలోనూ అనుపమానమయిన స్వతంత్రత ఈ కవి - రాజులో కనిపిస్తుంది. ఇది ఒక పద్యానికో, ఒక ఆశ్వాసానికో పరిమితమయిన లక్షణం కాదు. ‘ఆముక్తమాల్యద’లో ఎక్కడ చూసినా ఇదే ధోరణి. ఇలాంటి అద్భుత పద్యాలతో నిండి వున్న ఆముక్తమాల్యదను ‘సానబట్టని గనిలోని రత్నం’గా పరిగణించారు సురవరం ప్రతాపరెడ్డిగారు. ‘ఆముక్తమాల్యద’ను పెద్దన రాయలేదని రుజువు చేసే ప్రయత్నంలో - మనుచరిత్రలోని పద్యాలను రాయల పద్యాలను పోల్చి చెప్పే సందర్భంగా - ఆయనీ మాట అన్నారు.
లిపి లేనిదని చెప్పే తుళు కృష్ణదేవ రాయల మాతృభాష, దక్షిణ భారతదేశం తీవ్రమయిన రాజకీయ పరిణామాలకు లోనవుతూండిన చారిత్రిక దశలో, పదహారో శతాబ్దం తొలినాళ్లలో, రాయలు రాజుగానూ కవిరాజుగానూ కూడా రాణించాడు. ‘విశ్వనాథ నాయనయ్యవారి స్థానాపతి రాయవాచకం7 లాంటి రచనలూ, హంపీ శిథిలాలూ శ్రీకృష్ణ దేవరాయల చారిత్రికతను నిర్ధారిస్తున్నాయి. ఏడు లక్షల మంది కాల్బలంతోనూ, యాభయ్ వేల మంది గుర్రపు దళంతోనూ రాయలు యుద్ధాలు జరిపించినట్లు చరిత్రలో నమోదయింది. తనంత తాను కోరుకుని, రాయలు గద్దెనెక్కలేదంటారు. కానీ, పట్టం కట్టుకున్న తర్వాత సర్వంసహాధికారాలు తన చేతికి తీసుకున్నాడనీ, ఆ క్రమంలో తిమ్మరుసుపైనే ‘సత్యాగ్రహం’ చేశాడనీ చెప్తారు. వెల్చేరు - షుల్మన్ అన్నట్లుగా, బహుశా తెలుగు కవుల్లో కృష్ణ రాయల భౌతిక ఆకృతి ఒక్కటే తర్వాతి తరాల వారికి తెలిసింది. ఇందులోనూ చిన్నపాటి వైరుధ్యం లేకపోలేదు. ముక్కుమీద కోపం వున్నట్లుగా అనిపిస్తూ, పచ్చగానూ, స్ఫోటకపు మచ్చలతోనూ, ఒకింత ఒళ్లు చేసినట్లుగానూ రాయలు కనిపిస్తాడని ఆయన్ని కళ్ళారా చూసిన పోర్చుగీస్ యాత్రికుడు దమింగో పేయ్జ్ చెప్పిడు. అయితే, తిరుపతి గుళ్లో దేవేరు లిద్దరితోనూ ఉన్న రాయల విగ్రహంలో ఆయన అలా కనిపించడు. రాయల హయాం మరో పదేళ్లలో ముగుస్తుందనగా పేయ్జ్ విజయనగరం సందర్శించాడని తెలుస్తోంది. బహుశా, తిరుమల, తంజావూరులోని విగ్రహాలు అంతకు ముందటివి కావచ్చు.
‘బూతాడక దొరకు నవ్వు పుట్టదు సుమతీ’ అని చెప్పిన బద్దెన ప్రబంధ యుగానికి రెండు మూడు వందల ఏళ్ల ముందటివాడు. కానీ, పెద్దనాదుల పద్యాలు చూస్తే వాళ్ల ప్రయత్నం మొత్తమంతా దొరకి నవ్వు పుట్టించడం మాత్రమే - అంటే బూతు పురాణాలు వల్లించడం మాత్రమే - అనిపిస్తుంది. ఈ ప్రయోజనానికి భిన్నమయిన ప్రయోగం చేశాడు రాయలు. రాయల రచనా శైలి అనుపమానం. అతనికి ముందే కాదు - ఆ తర్వాత కూడా అలా రాయగలిగిన వాళ్లు లేకుండా పోయారు. ఆముక్తమాల్యదలోని ఏ ఒక్క పద్యాన్నీ ఆషామాషీగా ‘చదివి పారేయడం’ సాధ్యం కాదు. ప్రతి పద్యాన్నీ ప్రహేళికగానో, ప్రవహ్లికగానో చెక్కాడు కవి. ఇక, రోకటి పాట భాషను రాయలు దరి చేరనివ్వలేదు. పద్యాల నిర్మాణ రీతి, సమాస కల్పన, అలంకారాలను పొదగడం - అన్నీ వినూత్నమయిన పద్ధతిలో సాగించాడు. ఫలితంగా, అన్వయ క్లిష్టత అడుగడుగునా ఎదురయ్యే మాట ఎంత నిజమో, అందులోని అద్భుతమయిన పరిశీలనాశక్తి పాఠకుడి వివేకానికి పదును పెట్టే మాట కూడా అంతే నిజం. నిఘంటువులూ, టీకలూ, టిప్పణుల సహాయం లేకుండా ఆముక్తమాల్యదను చదవడం సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు. వెల్చేరు - షుల్మన్ అన్నట్లుగా, ‘ఆధునిక మానవ శాస్తవ్రేత్త ఎంత జాగ్రత్తగా పరిశీలిస్తాడో అంతే కట్టుదిట్టం’గా రైతులూ, గృహిణుల్లాంటి సామాన్య జనానీకం జీవన దృశ్యాలను చిత్రించాడు రాయలు. అందుకే, తెలుగు జాతి రాయల్ని సొంతం చేసుకుంది.

-మందలపర్తి కిషోర్ 81796 91822