పెరటి చెట్టు

ప్రబంధ యుగ ప్రతినిధి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘స్వైర విహార ధీరలగు సారసలోచనలున్న చోటికిన్/ భోరున లాతివారు చొరబోయినచో రసభంగమంచు నే/ చేరక పువ్వు తీవియల చెంతనె నిల్చి లతాంగి రూపు క/ న్నారగ చూచి వచ్చితి నవాంబురుహాంబక నీకు తెల్పగాన్’ - ప్రసిద్ధమయిన ఈ పద్యం ‘వసుచరిత్ర’లోది. ఇందులోని ‘సారస లోచనలు’ - ‘రసభంగం’ అనే మాటల్ని ప్రయోగించడం ద్వారా కవి ఉద్దేశించిన చమత్కారం గురించి మనమందరం హైస్కూల్లో పాఠాలు చెప్పించుకున్న వాళ్లమే. వందల సంవత్సరాల తర్వాత కూడా, ఓ అవధాని ఇలాంటి చమత్కారమే చేయడం గురించే ‘యాది’ సదాశివ మేస్టారు రాశారు. ఆ అవధాని పేరు గుమ్మన్నగారి లక్ష్మీ నరసింహ శర్మగారో శాస్ర్తీగారో అని గుర్తు. ‘జర్దా’ని ‘నరహిత జనార్దన’గా చమత్కరించారట ఆ అవధాని. (ప్రముఖ కవి జి.బాలశ్రీనివాసమూర్తి ఈయన కుమారుడేనన్నారు మిత్రులు సామల రాజవర్ధన్.) సంప్రదాయ కవిత్వంలో వందల సంవత్సరాలపాటు ఇలాంటి చమత్కారాలకు చెలామణీ ఉండడం కొత్తేమీ కాదు. అదే సంప్రదాయం బలమూ బలహీనతా కూడా!
పైన చెప్పుకున్న చమత్కార పద్యం ‘వసుచరిత్ర’లోది. ఈ ప్రబంధాన్ని రాసిన కవి పేరు భట్టుమూర్తి. బహుశా ఈ పేరుకూ, కవిగారి కులానికీ ఏదో సంబంధమున్నట్లుంది. అందుకే ఆయన తన పేరు ‘రామరాజ భూషణుడు’గా మార్చుకున్నాడు. ఇతగాడు తనను తాను ‘సంగీత కళా రహస్యనిధి’గా చెప్పుకున్నాడు. శ్రీకృష్ణ దేవరాయల పెద్దల్లుడు (అళియ) రామరాయల కొలువుకు భూషణంగా ఉండేవాడట ఈ భట్టుమూర్తి. తనను ఆదరించిన రాజును తల్చుకుంటూ తన పేరును ‘రామరాజ భూషణుడు’గా పెట్టుకున్నాడీ కవి. ఈ రామరాయలు నానాకళా పారీణుడూ, మంచి వైణికుడు కూడానట. వీళ్లిద్దరికీ సమకాలికుడయిన రామయామాత్యుడి ‘స్వరమేళ కళానిధి’లో ‘్భట్టుమూర్తి చేయి కొంత యున్నదేమో’నని కూడా పుట్టపర్తి నారాయణాచార్యులు అనుమానించారు. భట్టుమూర్తికి కొద్దిగా ముందు వెనకలుగా ఉండిన రామభద్రుడు - రామలింగుడు - సూరనలతో అతన్ని కలిపి చెప్తే అర్థం చేసుకోవచ్చు. కానీ వీళ్లందరినీ కట్టగట్టి, పెద్దన - తిమ్మన - ధూర్జటి - మల్లన లాంటి పూర్వికులతో కలిపి, అష్టదిగ్గజాలను సృష్టించారు మన ‘చారిత్రికులు’. కవులు నిరంకుశలని చెప్తారు. కవుల చరిత్రలు రాసేవాళ్లు కూడా ఆ కవులకేం తీసిపోరనిపిస్తుంది. అల్లుడి కొలువుకూటలోని కవిని ఎత్తుకెళ్లి మామగారి దర్బారులో చేర్పించగలగడం నిరంకుశులకే తప్ప అన్యులకు అలివయ్యే పనేనా?
‘కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నము లాద్య సత్క్థల్ వావిరి పుట్టురత్నము’లన్నాడు రామరాజ భూషణుడు. అందుకేనేమో, మహాభారతం, ఆది పర్వంలోని ఉపరిచర వసువు కథనే ఈ కావ్యానికి ఇతివృత్తంగా తీసుకున్నాడు కవి. ఉపరిచర వసువు పాలన సామర్థ్యానికీ, తపోదీక్షకూ మెచ్చి ఇంద్రుడు అతనితో స్నేహం చేశాడట. స్వర్గానికీ భూమికీ వస్తూ పోతూండడానికి వీలుగా ‘కనక రత్నమయంబును, కామగమనంబును అగు విమానంబు’తో పాటుగా తన కొత్త మిత్రుడికి దేవత్వం, ‘సకల ప్రహరణ నివారకంబగు ఇంద్రమాల అను కమలమాలయు, దుష్టశిక్షణ శిష్ట రక్షణ క్షమంబున వేణు యష్టియు’ ఇచ్చాడట. వేణు యష్టి అంటే వెదురు బెత్తంలాంటి ఆయుధం. దానికి ఏటేటా వసురాజు ఇంద్రోత్సవం అనే వేడుక జరుపుతూ దేవతలతో సన్నిహిత సంబంధాలు పెంచుకున్నాడట. ఇంద్రుడిచ్చిన విమానంలో తిరుగుతూండడం వల్లనే అతనికి ‘ఉపరిచర వసువు’ అనే పేరు వచ్చిందంటారు. అతగాడు మిత్రులతో కలిసి - హిమవంతుడి కుమారుడయిన - కోలాహల పర్వతం మీద ఆడుకునేవాడు. ఈ కోలాహలుడు శుక్తిమతి అనే నది మీద మోజు పడి ఆమెని బలవంతంగా తన అధీనంలోనికి తీసుకుని ఆమెతో వసుపదుడనే కొడుకునూ గిరిక అనే కూతుర్నీ కన్నాడు. అతగాడి బలవంతపు బంధాన్ని తట్టుకోలేక శుక్తిమతి ఓసారి పొంగిందట. ప్రజలను కాపాడేందుకు వెళ్లిన ఉపరిచర వసువుతో ఆమె జరిగిన కథంతా చెప్పిందట. వసురాజు తన కాలి బొటనవేలితో కోలాహలుడి దర్పం అణిచిపారేసి, శుక్తిమతికి స్వేచ్ఛను ప్రసాదించాడట. శుక్తిమతి కూతురు గిరిక అతనికి అదే పర్వతం మీద వీణ వాయిస్తూ కనిపించి, అతని హృదయం దోచేసింది. వసు రాజేం తక్కువ తినలేదు - అతగాడు కూడా ఆమె మనసును కొల్లగొట్టాడు. విరహ వేదనలో కొంతకాలం వాళ్లిద్దరూ బాధపడ్డారు. ఇంద్రుడి చొరవ మీద చివరికి వాళ్లిద్దరికీ పెళ్లవడమే ఈ ప్రబంధంలోని కథాంశం. వీధివీధికీ పిల్ల వసుచరిత్రలు పుట్టుకు రావడం చూస్తే, ఈ యుగంపై రామరాజ భూషణుడి ప్రభావం ఎంతటిదో అర్థమవుతుంది. అయితే, అది సత్ప్రభావమో తద్భిన్నమో విజ్ఞులే నిర్ణయించాల్సి ఉంది.
చమత్కార ప్రధానంగా కావ్యం రాయదల్చుకున్న కవి సరళమయిన ఇతివృత్తానే్న ఎన్నుకుంటాడు. రామరాజ భూషణుడు కూడా అదే చేశాడు. ప్రముఖ పండితుడూ, పరిశోధకుడూ, భాషా శాస్తవ్రేత్త వజ్జల చిన సీతా రామస్వామి శాస్ర్తీగారు - 1915లోనే - వావిళ్ల ప్రచురణ సంస్థ కోసం ‘వసుచరిత్ర విమర్శనము’ అనే పుస్తకం ప్రచురించారు. వజ్జల వారి అభిప్రాయం ప్రకారం, రామరాజ భూషణుడి ‘వసు చరిత్ర’పై పెద్దన రాసిన ‘మను చరిత్ర’ ప్రభావం అపారం. పెద్దనపై పిన వీరభద్రుడి ప్రభావం అనల్పం. ‘శృంగార నైషధం’ ‘శృంగార శాకుంతలం’ ‘మనుచరిత్ర’ ‘వసుచరిత్ర’ - ఈ నాలుగు కావ్యాలనూ పోలుస్తూ శాస్ర్తీగారు లోతయిన విమర్శన రాశారు. వాస్తవానికి ఇది మొత్తంగా ప్రబంధ సాహిత్యమంతటికీ వర్తించే విమర్శనం. ఇష్టదేవతా స్తుతి, సుకవి స్తుతి, కృతిపతి వర్ణన, షష్ఠ్యంతాలు, అష్టాదశ వర్ణనలూ - ఇలా ప్రతి చిన్న విషయంలోనూ ఈ కావ్యాలు పరస్పరం ఎంత సన్నిహితంగా ఉన్నాయో శాస్ర్తీగారు సోపపత్తికంగా - పట్టిక కట్టి మరీ - రుజువు చేశారు. శాస్ర్తీగారి రచన ‘వసుచరిత్ర విమర్శనము’ ఈ లింకులో దొరుకుతుంది. ప్రబంధాలపై మంచి అవగాహనకు ఈ పుస్తకం దోహదం చేస్తుంది.
https://archive.org/ stream/ vasucharitravimo 024940mbp page/n15/mode/2up
తెలుగు కవిత్వ ఛరిత్రలో దాదాపు రెండున్నర దశాబ్దాలు ప్రబంధాలకు అంకితమయి పోయాయి. సామాన్యుడికి అర్థమయ్యే భాషలో, సరళమయిన ఛందస్సుల్లో వేమన సామాజిక విమర్శనాత్మక కవితా ప్రభంజనం సృష్టించేంతవరకూ అత్యధికులు ప్రబంధ ధోరణిలోనే రాస్తూ పోయారు. ఫలితంగా, తెలుగు సాహిత్య భాష సుసంపన్నమయిన మాట ఎంత నిజమో, కల్పనా శక్తి కచకుచాలకే పరిమితమయిపోయిన మాట కూడా అంతే వాస్తవం. ముఖ్యంగా స్ర్తిని భోగవస్తువుగా చూడ్డానికీ, చూపించడానికి అనుభూతీ ఆమోదాలే కాదు - ఆదరణా దక్కింది! రాచకొలువు కూటాల్లో విదూషకులను ఎలా పోషించేవారో, అలాగే స్ర్తిల జననాంగాలపై చమత్కారాలు కుప్పించే కుకవుల పోషణ కూడా కొనసాగుతూ పోయింది. ఇరవయ్యో శతాబ్దంలో అభ్యుదయ కవిత్వం రాసిన వాళ్లు సయితం ‘పృథువక్షోజ నితంబ భార’లను గురించి వర్ణించడం - విప్లవ కవులమనుకునే వాళ్లు సయితం పీడిత పక్షం తరఫున పోరాడిన వీరులను ‘అరివేశ్యా భుజంగులారా!’ అని కీర్తించడం చూస్తే ప్రాబంధిక ధోరణి వేళ్లు మన సాంస్కృతిక జగత్తులో ఎన్ని యోజనాల లోతుకు పాతుకుపోయాయో అర్థమవుతుంది.

-మందలపర్తి కిషోర్ 81796 91822