పెరటి చెట్టు

అచ్చుమచ్చు ‘తెలుగన్న’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అనుకు వెనె్నల తాల్చి తునిచి సేవెలు చేసి వెనె్నల పాలను జున్నొనర్చి/ గట్టి వెనె్నల పిండిగొట్టి వెనె్నల వెన్న కలయ వెన్నప్పాలుగా అమర్చి/ గడితంపు వెనె్నల గండ్రికల్ సిగరిగా తియ్య వెనె్నలలోన తెచ్చిపెట్టి/ ఎడల వెనె్నల చక్కెరిడి జోర్కు వెనె్నల పూనిక నాళీలు గాను కూర్చి/ పండు వెనె్నల అను వెండి పళ్లెరముల చెలగి యిల్లాండ్రు వడ్డింప చెలులు తాము/ వేడుకలు మీర బువ్వంపు కూడు కుడిచి పొదలు తమితోడ వెనె్నల పులుగు లమరె’ - ఎత్తుగీతితో కూడిన ఈ సీసంలోని ప్రతిమాటా ‘అచ్చ తెలుగు మాటే!’ ‘యయాతి చరిత్ర’ అనే మొట్టమొదటి అచ్చ తెనుగు కావ్యం రాసి, అడ్రస్ లేకుండా పోయిన పొన్నికంటి తెలగన్న - పదహారో శతాబ్దం మూడో పాదంలో (వీరేశలింగం గారి లెక్క ప్రకారం 1874-81 మధ్యకాలంలో) - రాసిందే ఈ కావ్యం. మహాభారతంలోని ముక్కోణపు ప్రేమకథ యయాతి - దేవయాని - శర్మిష్ఠల గాథను ఏడు వందల పైచిలుకు అచ్చ తెనుగు పద్యాల్లో కారుూకరించాడు తెలగన్న. చిత్రమేమిటంటే, ఈ పద్యంలోనివన్నీ అచ్చ తెలుగు మాటలే అయినా, మంచి నిఘంటువు సాయం లేకపోతే ఈ మాటలు మనకి బోధపడవు. ఈ దుస్థితి ఎందుకు దాపురించిందనే ప్రశ్నకి సమాధానం ఎవరికి వాళ్లు వెతుక్కోవలసిందే! ఎందుకంటే, తెలుగు మాటల స్థానంలో వేరే భాషల పదాలు వచ్చి పాతుకుపోవడమనేది నిన్నో మొన్నో మొదలయిందేం కాదు. తెలుగులో ‘ప్రామాణిక’ సాహిత్యం మొదలవడంతోనే పరాయి భాషల దురాగతాలూ మొదలయ్యాయి. ఒకప్పుడు సంస్కృతం, కొంతకాలం ఉర్దూ - హిందీల సమ్మేళనమయిన ‘హిందూస్తానీ’, మరి కొంతకాలం అరబ్బీ - పారశీకం, దరిదాపు రెండు దశాబ్దాలుగా ఆంగ్లం తెలుగు భాష మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో పెత్తనం వెలగబెడుతూనే ఉన్నాయి. చిత్రమేమిటంటే, బాగా చదువుకున్నామనుకున్న పెద్దలే చాలామంది ఈ ధోరణిని బారలు చాచి స్వాగతించారు. కాదన్న మాదన్నలనూ తెలగన్నలనూ చరిత్ర చెత్తబుట్టలో పారేశారు. అప్పుడప్పుడు మనం ఈ పాతర్లు తవ్వితీసి, అచ్చ తెనుగు తెలగన్నల రచనలను, మన తెలుగన్నలందరికీ చూపిస్తూ వుండాలి. లేనట్లయితే, నిజాలు నిలువులోతు పాతర్లలో పడి నీలుక్కుపోతాయి.
పైన చెప్పుకున్న పద్యంలో, చకోరాల కోసం వాటి ఇల్లాండ్రు వెనె్నలతో తయారుచేసే పిండివంటల జాబితాను ఇస్తున్నాడు తెలగన్న. పల్చని వెనె్నలను ఎండబెట్టి చిన్నచిన్న ముక్కలుగా విరిచి, సేమియా (సేవెలు) తయారుచెయ్యడం గురించి - వెనె్నల పాలతో (పాల వెనె్నలతో కాదు!) జున్ను తయారుచెయ్యడం గురించి - గట్టి వెనె్నల్ని పిండికొట్టి, వెనె్నల నుంచి తీసిన వెన్నతో ఆ పిండిని కలిపి, వెన్నప్పాలు చెయ్యడం గురించి - చిక్కగా తోడుకున్న వెనె్నలతో మెంతిమజ్జిగ లాంటి వంటకాన్ని తయారు చెయ్యడం గురించి - వెనె్నల చక్కెర వేసి నాళీలనే భక్ష్యాల్ని తయారుచెయ్యడం గురించి -నోరూరించేలా రాశాడు తెలగన్న. అంతేకాదు - పండు వెనె్నల అనే వెండి పళ్లేల్లో ఇల్లాండ్రు ఈ వంటకాల్ని వడ్డించగా, వెనె్నల పులుగులు తమిదీరగా బువ్వంపు కూడు కుడిచాయని కూడా రాశాడు. ఇక్కడ గమనించాల్సిన ససామాజికాంశం ఒకటుంది - ‘నాగరిక’ మానవ సమాజంలోని మగమహారాజులకేం తీసిపోని దర్జాలు వెనె్నల పులుగుల్లోని పుంజులకు సమకూర్చాడు మన అచ్చ తెలుగు కవీంద్రుడు! దీనే్న మానవారోపణం అంటారు. నదులకూ, కొండలకూ, పులుగులకూ, పురుగులకూ సైతం మనుషుల లక్షణాలను ఆపాదించడమే మానవారోపణమంటే.
‘కావ్యం మొత్తం మీద ఒక్క పద్యం అచ్చ తెనుగులో రాస్తేనే, దాని గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారు కదా, మొత్తం కావ్యమంతా అచ్చ తెనుగులోనే రాస్తే లోకం నిన్ను వేనోళ్ల కొనియాడదా?’ అని తెలగన్నను అడిగాడట మరింగంటి అప్పన్న. అలా అనుకునే తెలగన్న ఈ పనికి పూనుకున్నాడట. సదరు అచ్చ తెనుగు ప్రయోగం గురించి విని, దానికి కృతిపతి కాదల్చుకున్న అమీన్ ఖాన్ అనే సర్దార్ తెలగన్న దగ్గిరకి అప్పన్న ద్వారా రాయబారం పంపాడు. మాలిక్ ఇబ్రాహీం దగ్గిర కీలక స్థానంలో వున్న సర్దార్ ఒకడు నోరు తెరిచి అడగడంతో తెలగన్న ఎగిరి గంతేసి అతగాడికి ఆ కావ్యం అంకితమిచ్చాడు. అమీన్ ఖాన్‌కి ముచ్చటగా ముగ్గురు బేగంలు. అయిదుగురు కొడుకులు. అందరికీ తెలుగంటే అభిమానమట. ఆ వైనమంతటినీ, విపులంగా రాసి, తెగబోలెడు సంబరపడ్డాడు తెలగన్న. అవును మరి - ససాహిత్య పోషకుడయిన అమీన్ ఖాన్ తనను ఆశ్రయించిన వారికి పట్టంచుల పచ్చడాలూ, వరహాలూ, గుర్రాలూ, పల్లకీలూ, కుంచెల అందలాలూ, గొడుగులూ - పడగలూ మొదలయినవి ‘తోరహత్తు’గా సమకూర్చే ఉదారుడట. ఏకంగా కావ్యం అంకితమిచ్చిన తెలగన్నకి మాత్రం తక్కువ చేసి ఉంటాడా?
మొట్టమొదటిసారి, పూర్తి స్థాయిలో అచ్చ తెనుగు కావ్యం రాసిన వాడు పొన్నికంటి తెలగనే్న అయినప్పటికీ, ఈ ధోరణకి బీజాలు పనె్నండు - పదమూడు శతాబ్దాల్లోనే పడ్డాయని చెప్పాలి. పాల్కురికి సోమనాదులు అచ్చ తెలుగులోనూ, శుద్ధ సంస్కృతంలోనూ, హళె కన్నడంలోనూ కవిత్వం చెప్పినవాళ్లే. ఎటొచ్చీ వాళ్లు చెప్పిన ద్విపదలూ, రగడలూ పూర్తిగా అచ్చ తెనుగులో రాసినవి కావు. ఇక, తెలగన్న ప్రభావంతో కూచిమంచి తిమ్మకవి లాంటి వాళ్లు అచ్చ తెనుగులో కవిత్వం చెప్పినప్పటికీ, వాళ్లందరికన్నా తెలగన్న కవిత్వమే మెరుగ్గా ఉందని వీరేశలింగం గారు నిక్కచ్చిగా చెప్పేశారు. ఆయన అలా తీర్మానించడానికి బహుశా రెండు మూడు అంశాలు కారణమయి వుంటాయనిపిస్తోంది. భారతంలో ఉన్న యయాతి - దేవయాని - శర్మిష్ఠల కథ ఉన్నదున్నట్లుగా గానీ, అందులో ఉన్నదంతా గానీ తెలగన్న కావ్యంలో కనిపించదు. ఓ ముక్కోణపు ప్రేమకథని ఎక్కడ ఆపాలో తెలగన్నకి బాగా తెలుసు. మనసిచ్చిన శర్మిష్ఠనూ, మాటిచ్చిన దేవయానినీ ఇద్దరినీ యయాతి పెళ్లాడినట్లు చెప్పి కావ్యాన్ని ముగించాడు తెలగన్న. అది కవిగా అతగాడు ప్రదర్శించిన విచక్షణ. పోతే, అచ్చ తెనుగులోనే రాయాలనుకున్నప్పుడు ఎలాంటి వివరాలను విస్తృతంగా రాయాలి, ఎలాంటి విషయాలను సంక్షేపించి చెప్పాలి అన్న వివక్ష తెలగన్నలో పుష్కలంగా కనిపిస్తుంది. ఇలాంటి విజ్ఞత వీరేశలింగం లాంటి పండిత పరిశోధకులను ఆకట్టుకోవడంలో వింతేముంది?

-మందలపర్తి కిషోర్ 81796 91822