పెరటి చెట్టు

నదీ ప్రవాహం.. నవలా రచనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితాన్ని ఓ రచయిత నదితో పోల్చాడు. ప్రవహించే కొద్దీ విశాలమూ, గహనమూ, దీర్ఘమూ అయ్యే స్రోతస్విని మాదిరే, జీవితం కూడా గడిచేకొద్దీ అనుభవ సంపన్నంగా మారుతుందన్నాడా రచయిత. జీవితానికే కాదు- దాన్ని ప్రతిఫలించే సాహిత్యానికి కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. తెలుగు పాఠకుల అభిమాన రచనా ప్రక్రియగా పాతుకుపోయిన నవల ఒకటిన్నర శతాబ్దంగా పొడుగూ వెడల్పూ లోతూ పెంచుకుంటూ పోతూనే ఉంది. మొదట్లో సమకాలీన జీవిత చిత్రణకి ప్రాధాన్యమిచ్చిన నవలా రచయితలు క్రమంగా మనసు పొరలను ఛేదించుకుంటూ లోలోతులకి దూసుకుపోయారు. మనోవైజ్ఞానిక నవలా రచన వైవిధ్య భరితమయ్యే కొద్దీ నవలా ప్రవాహం అన్ని కొలతలనూ పెంచుకుంటూ పోతూనే ఉంది. ముఖ్యంగా లోతును! నదీమూలాలూ సాధుసంతుల మూలాలూ శోధించకూడదని అంటారు. కానీ, నవలా రచన అనే నది మూలాలు శోధించక తప్పడంలేదు. ఆ క్రమంలో అనేక ప్రక్రియలకి తమను తామే ఆద్యులమని ప్రకటించుకున్న సాధువుల ప్రకటనలు ఏ మేరకి నిజమో నిగ్గు తేల్చడం కూడా తప్పడంలేదు మరి! సాహిత్య చరిత్రకి ప్రాతిపదిక వాస్తవమే కానీ, విశ్వాసం కాదు కదా.
సరిగా నూట యాభయి సంవత్సరాల కిందట - 1867లో - తెలుగులో నవలా రచనకు తొలి ప్రయత్నం జరిగింది. దాన్ని ప్రయత్నం అనడంకన్నా ప్రయోగం అనడం న్యాయం. క్రీ.శ.ఏడో శతాబ్దానికి చెందిన బాణభట్టు రాసిన సుదీర్ఘ వచన కావ్యం ‘కాదంబరి’. కొందరు సాహిత్య చరిత్రకారులు ‘కాదంబరి’ని నవలగా పరిగణించడం కద్దు. కన్నడంలో నవల అనే అర్థంలో ‘కాదంబరి’ అనే మాటనే వాడుతున్నారు. ఈ విమర్శలకులకి వచన, కథాకావ్యాల గురించయినా తెలియదనుకోవాలి - నవల గురించయినా తెలియదనుకోవాలి. అవి రెండూ తెలిసిన వాళ్లు బాణుడి కాదంబరిని నవల అనలేరు. అదలా వుంచండి. ‘కాదంబరి’ వచన కావ్యంలోని గంధర్వ కన్య మహాశే్వత కథ సుప్రసిద్ధం. సాక్షాత్తూ లక్ష్మీదేవి పుత్రుడయిన పుండరీకుడనే సన్యాసిని ప్రేమించిన మహాశే్వత అతనితో కలవడానికి సంబంధించిన కథ ఇది. చిత్రవిచిత్రమయిన ఉపకథలతో నిండి వుండే ఈ కథకు నవల రూపం ఇవ్వాలన్న కొక్కొండ వెంకటరత్నం ప్రయత్నం సఫలమయిందని చెప్పలేం. జటిలమయిన గ్రాంథిక భాషలో కొక్కొండ రాసిన ఈ జానపద గాథ సమకాలీన తెలుగు సమాజ జీవనాన్ని గానీ, ఆచార వ్యవహారాలను గానీ ఏ మాత్రం ప్రతిఫలించలేకపోయింది. అంతకుమించి, సామాన్య పాఠకుడి హృదయానికి చేరువ కావడంలోనూ ఈ ప్రయోగం విఫలమయింది. అంచేత, దాన్ని నవలగా భావించడానికి వీల్లేదన్నది విమర్శకులూ సాహిత్య చరిత్రకారుల ఏకాభిప్రాయం.
ఈ విఫలయత్నం జరిగిన తర్వాత అయిదేళ్లకి, మొట్టమొదటి తెలుగు నవల జయప్రదంగా వెలువడింది. కర్నూలు జిల్లా (?) డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసిన నరహరి గోపాలకృష్ణమ చెట్టి ‘శ్రీరంగరాజ చరిత్ర’ పేరిట రాసిన ఈ నవలకి కాల్పనిక సాహిత్యానికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. దానికి తోడు, అది ఏ రచనకూ అనువాదం కానీ అనుసరణ కానీ కాకపోవడం గమనార్హం. ఈ రచనకి ‘సోనాభాయి పరిణయము’ అనే మరోపేరు కూడా పెట్టారు రచయిత. చెట్టిగారి దృష్టిలో ఈ రచన ‘హిందువుల యాచారములను దెలుపునట్టి నవీన ప్రబంధంబు’. అప్పట్లో భారతదేశానికి వైస్రాయ్‌గా ఉండిన లార్డ్ మేయో ‘బంగాలం యాచారంబులు తెలుపు ప్రబంధంబు గావించువానికి బహుమానంబు చేయబడునని’ ప్రకటించడం చూసి ‘తెలుగుదేశము వారి యాచారంబులు దెలుపునట్టి ప్రబంధంబొక్కటి’ రాయాలనుకున్నట్లు చెట్టిగారు వివరించారు. ఆ రచనలోని ‘కథానాయకుడు మహాకులీనుడై యుండవలయునని’ రాజరికం కట్టబెట్టినప్పటికీ, అందులోని పాత్రలూ స్థలాలూ పూర్తిగా కల్పితాలని రచయిత స్వయంగా వెల్లడించారు. ఇంత స్పష్టతా, పరిణతీ ఉన్న వ్యక్తి చేతుల్లో రూపుదిద్దుకున్న కారణంగానే ‘శ్రీరంగరాజ చరిత్ర’ తొలి తెలుగు నవల కాగలిగింది.
ఇక, కొక్కొండ వెంకటరత్నంతో ప్రతి విషయంలోనూ పోటీపడే అలవాటున్న కందుకూరి వీరేశలింగం, తానూ ఓ నవల రాసేందుకు తలపెట్టడంలో వింతలేదు. ‘మహాశే్వత’ ఒక పత్రికలో ధారావాహికంగా అచ్చయిన పదేళ్ల తర్వాత - 1878లో - కందుకూరి ఒక ఆధునిక నవల రాయడం విశేషం. దాని పేరు ‘రాజశేఖర చరిత్రం’. కావడానికి ఇది కూడా వేరే రచన నుంచి ప్రేరేపితమయినదే. ప్రపంచ ప్రసిద్ధ ఐరిష్ కవీ, నాటక రచయితా, నవలా రచయిత ఆలివర్ గోల్డ్‌స్మిత్ రాసిన నవల ‘వికార్ ఆఫ్ ద వేక్‌ఫీల్డ్’కి అనుసరణగా వీరేశలింగం ‘రాజశేఖర చరిత్రం’ రాశారు. గోదావరి జిల్లా మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాల జీవితాన్ని ఆ నవల చక్కగా ప్రతిఫలించిన మాట వాస్తవం. ఆ కారణం చేతనే ఈ నవల ఇంగ్లిష్‌లోకి కూడా - ఫార్చ్యూన్స్ వీల్స్ పేరిట - అనువాదమయింది.
అయితే, వీరేశలింగం ‘స్వీయచరిత్ర’లో ప్రకటించినట్లుగా తెలుగులో తొలి వచన ప్రబంధమును తానే వెలయించలేదు! నరహరి గోపాలకృష్ణమ చెట్టి రాసిన ‘శ్రీరంగరాజ చరిత్ర’ను వీరేశలింగం చూశారనడంలో సందేహం అక్కర్లేదు. అందుకే తన నవలకి రాజశేఖర ‘చరిత్ర’మనే పేరు పెట్టారాయన. చెట్టిగారు, తన నవలను ‘వచన ప్రబంధంబు’ అన్నందువల్లనే వీరేశలింగం గారు కూడా తన రచనకి అదే పేరు పెట్టారు. ఆ ప్రబంధంబులో తెలుగువారి ‘యాచారంబులు’ తెలిపేందుకు ఆయన చేసిన ప్రయత్నం నుంచి స్ఫూర్తి పొందినందువల్లనే వీరేశలింగం ‘వికార్ ఆఫ్ ది వేక్‌ఫీల్డ్’ అనువాదం మధ్యలో ఆపారు; గోదావరి జిల్లా మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబ జీవిత కథను తన నవలకి ఇతివృత్తంగా తీసుకుని సఫలమయ్యారు. అయితే, ఆ కాలపు కవి పండిత భిషగ్వరులకి సామాన్యమయిన ‘అహం’ అడ్డువచ్చినందువల్లనే వీరేశలింగం స్వీయ చరిత్రలో అలా రాసి వుంటారు. ఆయన నిజం చెప్పి వుంటే, స్వీయ చరిత్ర విలువా, ఆయన వ్యక్తిత్వం విలువా పెరిగివుండేవే తప్ప తరిగిపోయేవి కావు. తర్వాత కాలంలోనయినా, సాహిత్య చరిత్రకారుల శోధనలో నిజానిజాలు ఎలాగూ బయటపడక తప్పవు కదా!
వీరేశలింగం మార్గంలో తెలుగు మధ్యతరగతి కుటుంబ జీవితానే్న ఇతివృత్తంగా తీసుకుని నవలలు రాసిన తొలి తరం రచయితల్లో అగ్రగణ్యుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం. ధూళిపూడి ఆంజనేయులు అన్నట్లుగా, చిలకమర్తి రచనలు - ముఖ్యంగా, ‘రామచంద్ర విజయం’ -్ఛర్ల్స్ డికెన్స్ రచనా రీతికి అనుకరణగా కాకపోయినా, గుర్తుచేసేలా వుండేమాట నిజం. నిజానికి చిలకమర్తి చారిత్రక ఇతివృత్తంతో రాసిన నవలలు వాల్టర్ స్కాట్ రచనలను గుర్తుచేస్తాయి. స్టాఇష్ రాజవంశీకుడు కావడం వలన స్కాట్ రచనల్లో కనిపించేంత విశ్వసనీయత, చిలకమర్తి ‘కర్పూరమంజరి’ ‘హేమలత’ ‘అహల్యా బాయి’ లాంటి కేవలం కల్పిత రచనల్లో కనిపించకపోవడంతో వింతేముంది? ఈ తరం రచయితల నుంచి ప్రత్యక్ష ప్రేరణ పొందిన వాళ్లలో ప్రత్యేకించి పేర్కొనవలసిన నవలా రచయిత ఉన్నవ లక్ష్మీనారాయణ. కేవలం, వాస్తవ జీవిత వివరాలను చిత్రించి ఊరుకోకుండా, జీవిత వాస్తవాలను కూడా చిత్రించిన మొట్టమొదటి రచయిత ఉన్నవ. వాస్తవిక నవలకు ఆద్యుడిగా ఆయన స్థానం సుస్థిరం. తనకు అర్థమయినంత మేరకు వర్గవైరుధ్యాన్ని సాహసోపేతంగా చిత్రించడం ద్వారా, ఉన్నవ చరిత్ర సృష్టించారు.
ఉన్నవ బాహ్య ప్రపంచంలోని, కుటుంబానికి ఆవలగా ఉన్న సమాజంలోని వైరుధ్యాలను సమర్థంగా చిత్రించారు. కుటుంబ జీవితంలో - ముఖ్యంగా స్ర్తి పురుషు సంబంధాల రంగంలో - వైరుధ్యాన్ని ఉన్నదున్నట్లు చిత్రించిన సాహసి గుడిపాటి వెంకట చలం. చారిత్రిక - ధార్మిక జీవితాల్లోని వైరుధ్యాలను నిజాయితీగా చిత్రించిన వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ. ఆ రెండు రంగాల్లోని తెలుగు సమాజ జీవనానికి కాల్పనికత రంగులు దిద్ది వాస్తవాన్ని వర్ణశోభితంగా దిద్దిన అక్షర చిత్రకారుడు అడివిబాపిరాజు. ఇక, పాఠశాల ఉపాధ్యాయులకి మనోవిజ్ఞానం బోధించడం చలం వృత్తి. ఆ క్రమంలో ఆయన మనోధర్మం గురించి - ముఖ్యంగా స్ర్తిలూ పిల్లల మానసిక ప్రపంచాల గురించి - బాగా అధ్యయనం చేసిన మేధావి. ఆయన రచనల్లో కూడా ఈ విజ్ఞానం ప్రతిఫలిస్తుంది. చలం మార్గంలో, ఆయనకన్నా ముందుకు పోయిన రచయిత కొడవటిగంటి కుటుంబరావు. వ్యక్తికి లోపలా, బయటా వుండే వైరుధ్యాలను కొ.కు అద్భుతంగా చిత్రించారు. ఆయనకి సమకాలికుడయిన పాలగుమ్మి పద్మరాజు కూడా తన నవలల్లో తెలుగు సామాజిక చిత్రాన్ని ఉన్నదున్నట్లు చూపించారు.
కారణం స్పష్టంగా తెలియదు కానీ, మన దేశం స్వతంత్రం కాబోతోందనగా, తెలుగు నవల ప్రయాణం సామాజిక చట్రం అంచుల్లోంచి, వ్యక్తుల మనఃప్రపంచపు పొరల్లోకి మళ్లింది. కొన్ని వర్గాల నవలా రచయితలు సామాజిక ఇతివృత్తాలను తీసుకుని ఇప్పటికీ రాస్తున్నప్పటికీ అత్యధికులు దిగుడు బావి లాంటి మానవ మనస్తత్వం లోలోతుల్లోకి ప్రయాణిస్తూనే ఉన్నారు. ఆ పోకడల గురించి రేపు తెలుసుకుందాం!