పెరటి చెట్టు

చరిత్రాత్మకం, ‘యాత్ర చరిత్రం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునికత, ముఖ్యంగా ఆధునిక సాహిత్యం, తిథి వార నక్షత్రాలు చూసుకుని మరీ పుట్టదు. అది సుదీర్ఘమయిన, సంక్లిష్టమయిన పరిణామ క్రమంలో భాగంగా రూపుదిద్దుకుంటుంది. మన భాషలోనూ అలాగే జరిగింది. తెలుగు సంప్రదాయ సాహిత్యం ‘క్షీణయుగం’ గండంలోనూ, చిత్ర-బంధ కవిత్వపు సుడిగుండంలోనూ పడికొట్టుకుంటున్న దశలోనే, ఆధునిక తెలుగు సాహిత్యం పురిటి నొప్పులు పడి, తొలి బిడ్డను కన్నది. ఆనాడు, తెలుగు మేధావులకు ఆటపట్టుగా ఉండిన చెన్నపట్నంలోనే అది జరగడం అత్యంత సహజం! అంతవరకూ, తెలుగులో కనీవినీ ఎరుగని సాహిత్య ప్రక్రియ - యాత్రా చరిత్ర - రూపంలోనే ఈ ప్రథమ ఫలం పక్వానికి వచ్చింది. అదే, 1838లో తొలిసారి అచ్చయిన ‘ఏనుగుల వీరాస్వామి అల్లించిన కాశీయాత్ర చరిత్ర’. రచనానంతరం ఏడేళ్లకి - రచయిత మరణానంతరం రెండేళ్లకి - ప్రచురితమయిన గ్రంథమిది. కోమలేశ్వర పురం శ్రీనివాస పిళ్ల అనే ఆప్త మిత్రుడికి వీరాస్వామి రాసిన లేఖలనూ, రచయిత అలవాటుగా రాసుకున్న దినచర్య పుస్తకాన్నీ కలిపి ఈ యాత్రా చరిత్ర రూపొందించారు. (ఈ పుస్తకాన్ని చదవదల్చుకున్న వాళ్లు ఈ లింకులో ప్రయత్నించవచ్చు.
https://archive.org/ stream/NaakasiYatra/Kasi%20Yatra% 20Charitra#page/n1/mode/2up)
‘కాశీ యాత్ర ఛరిత్ర’లో గుళ్లూ గోపురాల స్థల పురాణాలతోపాటు వాటి భౌతిక స్థితిగతులను కూడా రచయిత విపులంగా వివరించినందువల్ల, ఇది కేవలం తీర్థ యాత్రా చరిత్ర కాకుండా తన విశిష్టతను నిలబెట్టుకుంది. ఏయే ప్రాంతం నుంచి ఏ ప్రదేశం ఎంతెంత దూరంలో ఉందో, దార్లో ఎదురయ్యే నదులూ కాలవలూ చెరువులూ సత్రాల సమాచారంతోపాటు ‘్భట’లో ఆరోగ్య పరిస్థితులనూ నేల నైజాన్నీ పంటల పైర్ల తీరుతెన్నులనూ కూడా అపరిచిత యాత్రికుల ప్రయోజనార్థం నమోదు చేశారు వీరాస్వామి. పనిలో పనిగా పాలకులు భక్తులూ యాత్రికుల సొమ్ములు ఎలా నొల్లుకుంటున్నారో, ధర్మస్థలాల విషయంలో ఎంత అధర్మంగా వ్యవహరిస్తున్నారో కూడా రచయిత పేర్కొన్నారు. ఉత్తర దక్షిణ భారత రాష్ట్రాల ప్రజాజీవనంలోని వైవిధ్యాన్ని సోదాహరణంగా చరిత్ర కెక్కించిన తొలి ఉద్గ్రంథమిది. తెలుగు ప్రజలు ప్రధానంగా విస్తరించివున్న ఆనాటి దక్షిణ కోస్తా (అంటే, చెన్నపట్నంతో కలిపి), రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర, మధ్యకోస్తా జిల్లాల ప్రజాజీవనంతోపాటుగా ఆయా ప్రాంతాల సంస్కృతులనూ మాటతీరునూ కూడా పరిచయం చేశారు వీరాస్వామి. ఇటువంటి సాహిత్యం తెలుగు భాషకి అపూర్వమే కాదు - అపరం కూడా అనిపించుకునే రీతిలో వీరాస్వామి ఈ పుస్తకం రాశారు. అందుకే, అది ఆధునిక సాహిత్య వృక్షానికి కాసిన తొలి పక్వఫలం అనిపించుకోగలిగింది.
నిజానికి యాత్ర చరిత్ర భారత సాహిత్యానికి తెలియని ప్రక్రియేమీ కాదు. క్రీస్తు పూర్వం మూడో శతాబ్దానికి చెందిన మెగస్తనిస్ చంద్రగుప్తుడి ఆస్థానంలో సిరియా రాయబారిగా ఉండిన వియమూ, చరిత్రాత్మకమయిన ‘ఇండికా’ గ్రంథం రాసిన విషయమూ సుప్రసిద్ధాలే కదా! క్రీ.శ. చైనాకి చెందిన బౌద్ధ యాత్రికులు- ఫాహియాన్ అయిదో శతాబ్ది మొదట్లోనూ, హ్యూయెన్ త్సాంగ్ ఏడో శతాబ్ది మధ్యలోనూ, ఈ-త్సింగ్ అదే శతాబ్ది చివర్లోనూ తమ భారత యాత్రానుభవాలను రికార్డు చేశారు. అరబ్ యాత్రికుడు అల్ మసూదీ పదో శతాబ్ది చివర్లోనూ, పర్షియా (నేటి ఇరాన్)కి చెందిన అల్ బెరూనీ పదకొండో శతాబ్ది రెండో పాదంలోనూ, వెనీషియన్ యాత్రికుడు మార్కోపోలో పదమూడో శతాబ్దిలోనూ, మొరాకో యాత్రికుడు ఇబ్న్ బతూతా - డెమాస్కస్ యాత్రికుడు షిహాబుద్దీన్ అల్ ఉమారీ పధ్నాలుగో శతాబ్దిలోనూ, మరో వెనీషియన్ యాత్రికుడు (తెలుగు భాషని ప్రాచ్య ప్రపంచపు ఇటాలియన్ అన్నవాడు) నికలో దె కంతీ - విజయనగర సామ్రాజ్యం గురించి గొప్పగా రాసిన అబ్దుర్రజాక్ - రష్యన్ యాత్రికుడు అథనేషియన్ నికీతిన్ కూడా పదిహేనో శతాబ్దిలోనూ, మరెందరో అటు తర్వాతా తమ యాత్రా చరిత్రలను రాసివున్న మాట నిజమే.
అలాగే, ఆధునిక యుగంలో వీరాస్వామికి ముందు తెలుగు వారెవరూ యాత్రాచరిత్రలు రాయలేదనీ కాదు, వాటికి చారిత్రికంగా ప్రాధాన్యం లేదనీ కాదు. పద్దెనిమిదో శతాబ్దం చివర్లోనే, 1790 దశకంలో, మెకంజీతో కలిసి తాను చేసిన యాత్రల విశేషాలను కావలి వెంకట బొర్రయ్య గ్రంథస్థం చేశారు. అటుతర్వాత, ఏనుగుల వీరాస్వామి కాశీయాత్రకి స్ఫూర్తినిచ్చిన ఆయన సమీప బంధువు వెనె్నలకంటి వెంకట సుబ్బారావు కూడా 1822-23 మధ్యకాలంలో కాశీయాత్ర చేసి వచ్చి, తన అనుభవాలను గ్రంథస్థం చేశారు. అయితే, ఆ రచనలన్నీ ఇంగ్లిష్‌లోనే ఉండగా, వీరాస్వామి తన ‘కాశీయాత్ర చరిత్ర’ను తెలుగులో, అదీ వాడుక భాషలో, రాయడమే విశేషం. వృత్తిరీత్యా దుభాషీ అయిన వీరాస్వామి కూడా చక్కని, కవితాత్మకమయిన ఇంగ్లిష్ భాషను - ఆ భాషకి అందాన్నిచ్చే నుడికారపు సొగసుతో - రాయగలిగినవారే. వ్యక్తిగత విషాదాలతో సతమతమవుతూ ఉండిన సుబ్బారావుకి వీరాస్వామి ఆంగ్లంలో రాసిన లేఖ చూస్తే, వారి మధ్య ఆత్మీయత ఎంత ప్రగాఢమయినదో అర్థం కావడంతోపాటు, వీరాస్వామికి ఆంగ్లభాషలో ఉన్న అభినివేశం కూడా బోధపడుతుంది.
‘కాశీకి పోవడం, కాటికి పోవడం ఒకటే’ అనేది వీరాస్వామి కాశీయాత్ర చేసిన రోజుల్లో తెలుగు జనం చెప్పుకునే ఓ పలుకుబడి. అలాంటి రోజుల్లో పదిహేను నెలల పదిహేను రోజుల పది నిమిషాలపాటు యాత్ర చేసి వచ్చినట్లు వీరాస్వామి స్వయంగా ప్రకటించారు. వీరాస్వామి కాశీయాత్ర ఒక వ్యక్తికో, ఒక కుటుంబానికో పరిమితమయిన వ్యవహారం కాదు. ఈ యాత్రలో వంద మంది పరివారం ఆయనతో చేరి గంగలో ములిగి వచ్చారు. అనేక సందర్భాల్లో ఆయన వ్యక్తం చేసిన అత్యాధునిక భావాలు, అంతకు మించి విశేషంగా అనిపిస్తాయి. ముఖ్యంగా గయ క్షేత్రంలో యాత్ర చేస్తున్న సందర్భంగా వీరాస్వామి ప్రదర్శించిన యథార్థవాదం ఆయన్ను అంతెత్తున నిలబెడుతోంది.
డాక్టర్ జాన్ డేవిడ్సన్ ‘దొర’ తనను ‘నీవు యెన్ని దేవుండ్లను ఆరాధన చెయ్యడము?’ అని అడిగాడనీ - ‘దేవుడనేవాడు ఒకడేగాని ఒకదానికన్నా ఎక్కువైన పదార్థం ఏ బ్రంహ్మాండానికైనా కద్దా?’ అని తాను తిరిగి అడిగాననీ వీరాస్వామి రాశారు. హిందూమతంలోని ముప్ఫై కోట్ల దేవతలు - క్రైస్తవంలోని ‘సేయింట్సు’ వంటి - దివ్యపురుషులే గానీ, జగదీశ్వరులు కారని ‘శానా ప్రయాస’పడి తాను వివరించినట్లు కూడా ఆయన రాశారు. ఆ మాట చెప్తూనే శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణాపత్య శాఖలను అనుసరించే హిందువులు అన్య దర్శనాల పట్ల ప్రదర్శించే అసహన వైఖరికి రచయిత అభ్యంతరం చెప్పారు. ఇలాంటి వైఖరుల వల్లనే విదేశీయుల్లో హిందూ మతం నవ్వులపాలయిందని ఆయన ఆనాడే హెచ్చరించారు. బిహార్ రాష్ట్రంలోని ముంగేర్ దగ్గిర సీతాగుండం అనే ‘తిరుకొలను’ గురించీ, - దాని చుట్టుపక్కల వున్న పుణ్యక్షేత్రాల గురించీ - వీరాస్వామి నాలుగున్నర పేజీలు రాశారు. సీతా గుండంలో ‘వుదకము’ వేడిగా వుండడానికి, అక్కడి నేలలో వున్న గంధకపు నిల్వలే కారణమని ప్రత్యేకించి రాయడం ఈ రచనను అక్షరాలా ఆధునిక గ్రంథంగా నిలబెడుతోంది. గంధకికామ్లం అనే సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రధానంగా ఖనిజామ్లం. దాన్ని మూడు రెట్లు నీళ్లలో కలిపి ఒక్క చుక్క రుచి చూపిస్తారు - రసాయన శాస్త్ర విద్యార్థులకి. దాన్ని గుర్తు తెచ్చుకుని, వీరాస్వామి ఈ ఆమ్లజలాన్ని గుర్తించడం ఆయన సద్యోస్ఫూర్తికి నిదర్శనం.
గయ క్షేత్రంలో పర్యటించే సందర్భంగానే, జార్జ్ మారిస్ అనే బ్రిటిష్ న్యాయమూర్తి, వీరాస్వామి రాకను పురస్కరించుకుని, అక్కడి కవి పండితులతో ఓ సమావేశం ఏర్పాటు చేశాడట. సతీ సహగమనం గురించి, వితంతు పునర్వివాహాల గురించి ఆ సమావేశంలో ‘మారీసు ధొర’ ప్రశ్నలు లేవనెత్తారట. ఆదిస్మర్త అయిన పరాశరాదులు రాసిన శ్రుతిస్మృతులను ఉటంకించి, సహగమన దురాచారాన్ని నిషేధించిన విలియమ్ బెంటింక్ చర్యను వీరాస్వామి సమర్థించడం ఆయన ఆధునిక - సమన్వయ దృక్పథాన్ని చాటి చెప్తోంది. వీరేశలింగం పుట్టడానికి 18 సంవత్సరాలు ముందే - 1830లోనే - ఇటువంటి సంస్కరణ భావాలు వ్యక్తం చేసిన ఆధునికుడు వీరాస్వామి. ఆయనపై, రాజారామ్మోహన్ రాయ్ ప్రభావం పడి వుంటుందని కొందరు భావించారు కానీ, దానికి ఆధారాలు దొరకలేదు. ఈ అంశం కూడా ఏనుగుల వీరాస్వామి వౌలికతను నిరూపిస్తోంది. ఇన్ని విధాల వౌలిక స్వనావం కలిగి వున్న రచయిత కావడం చేతనే వీరాస్వామి తొలి తెలుగు ఆధునిక రచనను వెలయించగలిగారు!