పెరటి చెట్టు

సంఘ సంస్కరణ ప్రయాణ పతాక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘చీకటిలోనికి దీపికను తీసుకొని పోగలరు కాని, ఎవరూ చీకటినే వెలుతురుగా మార్చలేరు’ అని తేల్చి చెప్పాడు ముద్దుకృష్ణ. నిక్కమయిన సంస్కర్త సంస్కారం ఈ మాటల్లో ప్రతిధ్వనిస్తోంది. వెలుగులోకి రావాలనుకునే వాళ్లకి కరదీపికగా ఉపయోగపడేందుకు మాత్రమే సంస్కర్త ఉన్నాడు. ఇది సంఘ సంస్కరణకీ, భాషా సంస్కరణకీ, సాహిత్య సంస్కరణకీ, రాజకీయ సంస్కరణకీ - ఒక్కమాటలో చెప్తే ఏ రంగంలో సంస్కరణకయినా - వర్తించే సామాన్య సూత్రం. ఈ సూత్రం చెప్పిన ‘జ్వాల’ సంపాదకుడు - ‘వైతాళికులు’ కూర్పరి ముద్దుకృష్ణకి స్వయాన ముత్తాత ‘స్వామినీన ముద్దు నరసింహ్మం’. నరసింహంగారు 1850 దశకంలో రాసిన ‘హితసూచని’లోనే, తెలుగు నాట సంఘ సంస్కరణ - వ్యావహారిక భాషోద్యమాలకు సంబంధించిన మొట్టమొదటి ‘ప్రమేయాలు’ వ్యక్తమయ్యాయి. ‘సమకాలిక సమాజాన్ని గురించి, జీవితాన్ని గురించి, రావలసిన మార్పులను గురించి, స్పష్టమయిన అవగాహనతో భాష, విద్య, సామాజిక రంగాల్లో సంస్కరణ భావాలను ప్రకటించినవాడు సామినేని (ముద్దు నరసింహం) అని ఆచార్య కె.కె.రంగనాథాచార్యులు చెప్పిన మాటలు అక్షర సత్యాలు.
1862 జులై నెల్లో అచ్చయిన ‘హితసూచని’ని, నిజానికి అంతకు తొమ్మిదేళ్లకు ముందే రాసి వుండాలని ఆరుద్ర - తర్కం సహాయంతో- నిరూపించారు. ఈ పుస్తకంలో భాష, విద్య, వైద్యం, వివాహం, హేతువాదం వగయిరా ‘విషయాలపై’ ఎనిమిది ప్రమేయాలూ ఒక అభిప్రాయమూ కూర్చారు ముద్దు నరసింహం. ఆయన ఈ పుస్తకం రాసిన రోజుల్లోనే ‘తెలుగు సూర్యుడు’ బ్రౌన్ ఓ ఇంగ్లిష్ - తెలుగు బృహన్నిఘంటువు వెలువరించారు. అందులో, ‘ఎస్సే’కి అర్థం చెప్తూ బ్రౌన్ ‘వ్యాసం’ అనే తెలుగు (?)మాటని చూపించారు. ఇప్పటికీ తెలుగువాళ్లం ‘ఎస్సే’కి ఇదే మాట వాడుతున్నాం. ముద్దు నరసింహం ప్రయోగించిన ‘ప్రమేయం’, వ్యాసమేననే అభిప్రాయం ప్రచురంగా వుంది. కానీ, ప్రమేయమనే మాటని ‘చర్చనీయాంశం’ అనే అర్థంలోనే ముద్దు నరసింహం ప్రయోగించారని కొలకలూరి ఇనాక్, ఆరుద్రాదులు తేల్చారు. ఈ భావ విప్లవకారుడు నిజంగా కోరుకున్నది చర్చే!
చదువుకున్న తెలుగువాళ్లు - గ్రాంథికవాదులతో సహా - ఇళ్లలో మాట్లాడుకునే భాషనే పత్రికల్లోనూ, రచనల్లోనూ, పాఠ్య పుస్తకాల్లోనూ కూడా వాడాలని కోరుతూ మొదలయిన ఉద్యమమే, వ్యావహారిక భాషోద్యమం. దానికి నేతృత్వం వహించిన ఇద్దరు మిత్రులు గురజాడ - గిడుగు. అయితే, ఆ వాదం తాము కనిపెట్టింది కాదని గిడుగు ఏనాడో వెల్లడించారు. భారతదేశంలో సంఘ సంస్కరణ భావాలు ముందుగా బంగాల్‌లో పుట్టాయనీ, బ్రహ్మసమాజంతోపాటు అవి ఆంధ్రదేశానికి దిగుమతయ్యాయనే మాట ఎలా అర్థసత్యమో, అదే విధంగా వ్యావహారిక భాషావాదం తాను - గురజాడ కనిపెట్టి ప్రాచుర్యంలోకి తెచ్చినట్లు అప్పటికే చరిత్రకెక్కిన విషయం కూడా అలాంటిదేనని గిడుగు రామమూర్తి నిజాయితీగా 1924లోనే వెల్లడించారు. ‘వ్యావహారిక భాష ప్రయోజనాన్ని గుర్తించి ఆ వాదాన్ని ప్రారంభించినవాడు ముద్దు నరసింహం. అంతేకాదు - సంఘ సంస్కారము, వితంతు వివాహము, బ్రహ్మ సమాజము ద్వారా బంగాళా దేశం నుంచి ఆంధ్ర దేశంలోకి దిగుమతి కావడం నిజం కాదు. అంతకుపూర్వమే, మన తెలుగువాడొకడు ఈ ఉద్యమాన్ని తలపెట్టి ప్రచారం చేసినవాడున్నాడు అని రుజువు చెయ్యడానికి ఈ హితసూచని ఆధారం. అందుచేతను ఈ గ్రంథాన్ని తిరిగి అచ్చువెయ్యాల’ని గిడుగు, ముద్దుకృష్ణకి గట్టిగా బోధించారట. హితసూచని పునర్ముద్రణ ‘ప్రయత్నం జరిగే లోపున ముందు మీ తండ్రిగారిని అడిగి వారి తాతగారి జీవిత విశేషాలు కనుక్కొని ఉపోద్ఘాతం రాసి పంపం’డని గిడుగు మేస్టారు ముద్దుకృష్ణకి కర్తవ్య బోధ చేశారట కూడా. ‘హితసూచని’ 1986 ముద్రణకి రాసిన ‘ప్రవేశిక’లో ఆరుద్ర చెప్పిన విషయాలివి. ముద్దుకృష్ణ తన కర్తవ్యం తాను నిర్వర్తించారట కానీ, ‘రామమూర్తిగారి హితసూచని ప్రచురణ ప్రయత్నం కొనసాగలేద’ని 1959 మేలో ముద్దుకృష్ణ చెప్పారు. తొలి ముద్రణ జరిగిన నూట పాతికేళ్ల తర్వాతగానీ, ఈ చరిత్రాత్మక గ్రంథం మలి ముద్రణ భాగ్యానికి నోచుకోలేక పోయింది.
‘హితసూచని’ రచించే నాటికి - 1850 ప్రాంతంలో - వీరేశలింగం వయసు రెండు మూడేళ్లేనని గుర్తుంచుకుంటే తప్ప ముద్దు నరసింహం ముందు చూపు ఎంత గొప్పదో పూర్తిగా బోధపడదు. అప్పటికి కనీసం అరవై ఏళ్లుగా తెలుగునాట ఆధునిక విద్యాలయాలు నడుస్తున్న మాట నిజమే. వాటిల్లో ప్రాచ్య - పాశ్చాత్య విద్యా విధానాల కలయికగా విద్యాబోధన జరిగేది. మచిలీపట్నంలోని అలాంటి ఓ పాఠశాలలో - పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వాస్తవ్యుడయిన - కావలి వెంకట బొర్రయ్య 1790లో చదువుకున్నాడని ఆరుద్ర ‘హితసూచని’ ప్రవేశికలో రాశారు. అప్పటికి థామస్ బార్బింగ్టన్ మెకాలే ఇంకా పుట్టనే లేదని కూడా మనసులో పెట్టుకోవాలి. కారణమేమిటో తెలీదుగానీ, నరసింహంగారు రాజమండ్రి వదిలిపెట్టి, కుంభకోణం వెళ్లి, అక్కడ చదువుకున్నారట. అప్పట్లో మధ్య తమిళనాడు జిల్లాల్లో - తంజావూరు లాంటి చోట్ల - కూడా తెలుగు వాళ్లు బహుళ సంఖ్యలోనే వుండేవారు. బహుశా ఏ బంధువుల సహకారంతోనో ఆయన ఆ దూర ప్రాంతంలో చదువుకుని వుంటారు. అప్పటికి నరసింహం బ్రిటిష్ వారి కొలువులో చేరినట్లు లేరు. కొంతకాలం ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్‌గా పనిచేశారంటే, నరసింహం కనీసం హైస్కూల్ చదువయినా పూర్తిచేసి వుండాలి. అంచేత - ఆరుద్ర ఊహించినట్లుగా - ఆయన పదోయేటనే ఎవరో ఆంగ్లేయుణ్ణి ఆశ్రయించి అంత దూరం వెళ్లి వుంటారనుకోడానికి ఆధారం కనిపించడంలేదు.
చిన్నప్పటి నుంచీ వేర్వేరు ప్రాంతాలతో పరిచయం ఏర్పడ్డం వల్ల, నరసింహం మన దేశీయుల్లో వైవిధ్యానే్న కాకుండా, సామాన్య లక్షణాలను సయితం గ్రహించి వుంటారు. ఆడ మొగ తేడా లేకుండా దేశమంతటా వ్యాపించి వుండిన అవిద్య - ప్రధానంగా ఆడపిల్లలకి తప్పని వెనకబాటుతనూ ఆయన గుర్తించి వుండాలి. బాధ్యత కలిగిన పౌరుడిగా, ఈ పరిస్థితులకి ఓ పరిష్కారం వెతికే ప్రయత్నం చెయ్యడం నరసింహం వ్యక్తిత్వంలోని విశేషాంశం. ‘స్ర్తిలకు విద్యలు సాధకములౌచున్న’వనే వాక్యంతోనే ముద్దు నరసింహం తన ‘వాక్య గ్రంథం’ హితసూచని పీఠికను ప్రారంభించారు. ఆయన కఠినమయిన కట్టుబాట్లు పాటించే ఆది వెలమల ఇంట్లో పుట్టిన వాస్తవం దృష్టిలో పెట్టుకుంటే తప్ప ఈ ప్రారంభానికి వున్న సాంస్కృతిక ప్రాముఖ్యం పూర్తిగా బోధపడదు. ‘వివాహ ప్రమేయము’లో నరసింహం వివాహానికి తప్పనిసరిగా అవసరమయిన మూడు విషయాలను పేర్కొన్నారు. మొదటిది, వరానే్వషణ చేసే సంధానకర్తలకి దక్షిణ ఇచ్చేటప్పుడు వధువు చేత పలికించే ‘మదర్థం వరం వృణీధ్వం’ అనే మంత్రం. ఈ మంత్రానికి ‘నన్ను ‘మోహించినటువంటి’ ఫలాని పురుషుణ్ణి నా కొరకు కోరవలసినది’ అని అర్థం చెప్పారాయన. ఈ రెండింటితోపాటు, పాణిగ్రహణాన్ని పెద్దలు ధ్రువపరచడం మూడో విషయం. మిగతా విషయాలేవీ తప్పనిసరిగా అవసరమయినవి కావని నరసింహం స్పష్టం చేసి, పుస్తకంలో రాసేశారు. ఇదే అభిప్రాయాన్ని ఆయన తమ కుల సంఘం పెద్దలకి ఓ ప్రశ్న రూపంలో పంపడం నరసింహం వ్యక్తిత్వంలోని విశిష్టత. ఇలా వ్యవహరించగల నిజాయితీపరులు - ఆ రోజుల్లోనూ, ఈ రోజుల్లోనూ కూడా - అత్యల్ప సంఖ్యాకులుగానే ఉంటారు.
నరసింహం గురించి ఇంట్లో చెప్పుకునే విషయాల్ని పేర్కొంటూ, ముద్దుకృష్ణ రెండు సంఘటనల్ని ప్రత్యేకించి ప్రస్తావించారు. ఒకటి జిల్లా కలెక్టర్ (జిల్లా జడ్జ్ కూడా?)తో కలిసి ఆర్యాపురానికి ఆవలగా ఉన్న సీతమ్మ చెరువు ప్రాంతాల్లో తిరుగుతుండగా ఎదురయిన ఎలుగుబంటిని నరసింహంగారు - ఒంటరిగానే - కత్తితో ఎదుర్కొన్న సంఘటన. రెండోది, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో మరాఠీ బందిపోటు ముఠాని - నౌకరుతో కలిసి - కత్తితో ఎదుర్కొన్న సంఘటన. ఇవి రెండూ, నరసింహం వ్యక్తిత్వంలోని ఓ ముఖ్యాంశాన్ని ఎత్తిచూపిస్తున్నాయి. సమస్యలకి వెన్నిచ్చి పోయే తత్వం కాదాయనది - ఒంటరిగానో, కలిసివచ్చే వారిని కలుపుకునో పరిస్థితుల్ని సాహసంతో ఎదుర్కోవడమే నరసింహం లక్షణం. ‘హితసూచని’ చదివినా, అదే అభిప్రాయం కలుగుతుంది. ‘సువర్ణ ప్రమేయము’ చిట్టచివర్లో శంకరాచార్యులు ఎవరో ఈడిగ కులస్థునికి ‘సువర్ణముఖి’ అనే విద్య నేర్పించగా అతగాడు ‘శాణార కాసు’లనే బంగారు నాణేలు ముద్రించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని నిర్ద్వంద్వంగా ఖండించారు నరసింహం. ఇలాంటి మంత్రాలకి చింతకాయలు రాలవని కూడా స్పష్టం చెయ్యడం విశేషం. (హితసూచనిలో మంత్ర ప్రమేయము అనే ఓ స్వతంత్ర అధ్యాయమే ఉంది!) విశ్వాసుల సున్నితమయిన ‘మనోభావాలు’ దెబ్బతింటాయేమోనని జంకకుండా, ఇటువంటి ‘వివాదాస్పదమయిన విషయాల్లో’ తన అభిప్రాయం కుండ పగలేసినట్లు చెప్పడం ఈ యథార్థవాది తత్వమని దీన్నిబట్టి తేలుతోంది. ఇలాంటివాళ్లే చీకట్లో బతికేవారికి చిరుదివ్వెల్లాంటి పుస్తకాలు రాయగలరు మరి!

-మందలపర్తి కిషోర్ 81796 91822