పెరటి చెట్టు

‘నవ్య ప్రాచీన, ప్రాచీన నవ్యుడతడు!’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-‘కవి సమ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణ గురించి జలసూత్రం రుక్మిణీనాథ శాస్ర్తీ అన్నమాట ఇది. అక్షరం మార్చనక్కర్లేకుండా పందొమ్మిదో శతాబ్దిలో పుట్టిగిట్టిన పండిత కవులెందరికో అతికే వర్ణన ఇది. వాళ్లలో అగ్రగణ్యుడు పరవస్తు చిన్నయసూరి. పందొమ్మిదో శతాబ్ది మొదట్లో జన్మించిన చిన్నయసూరి బతికింది అర్ధ శతాబ్దంకన్నా రెండేళ్లు ఎక్కువ. నూరికి పదహారేళ్లు వచ్చేదాకా అక్షరాభ్యాసమే జరగలేదని నిడదవోలు వెంకటరావు గారు రాసిన మాట నిజమే అయితే, అతగాడి అక్షర జీవనం అంతా కలిపి మూడున్నర దశాబ్దాలే నన్నమాట! ఈ స్వల్పకాలంలోనే సూరి పాతిక పుస్తకాల దాకా రాశారు. వాటిల్లో ‘బాల వ్యాకరణం’ లాంటి ‘ప్రామాణిక’ లక్షణ గ్రంథాలు మొదలుకుని, నీతిచంద్రిక (మిత్రలాభం - మిత్రభేదం) లాంటి సృజనాత్మక అనువాద రచనలు కూడా వున్నాయి. మద్రాసులోని సెయింట్ జార్జ్ కోటలో, కుంఫిణీ ఉద్యోగులకు ట్యూటర్‌గా ఉద్యగ జీవితం మొదలుపెట్టిన చిన్నయసూరి, ఏ.జే.అర్బత్‌నాట్ లాంటి అధకారుల అండదండలతో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. 1857లో - ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామ నేపథ్యంలో - మద్రాస్ యూనివర్సిటీ ఏర్పడినప్పుడు తొలి వైస్ ఛాన్సలర్‌గా అర్బత్‌నాట్ నియమితుడయ్యారు. యూనివర్సిటీ తెలుగు శాఖాధిపత్యం, సహజంగానే, ఆయన్ని ఆశ్రయించి వుండిన చిన్నయసూరికే దక్కింది. ఇలా చెప్పడంలో ఉద్దేశం, సూరికి అర్హతలేని అందలమేదో దక్కిందనడం ఎంత మాత్రం కాదు - బ్రిటిష్ అధికారులు భారతీయులకి ‘కల్పించే’ అవకాశాలకి గీటురాళ్లు ఏమిటో చెప్పడం మాత్రమే!
‘తెనుగునకున్న వ్యాకరణ దీపము చిన్నది’ అని తిరుపతి వెంకటకవులు చెప్పిన మాట ఎంత నిజమో, ఆ చిరుదివ్వెని వెలిగించినవాడు చిన్నయసూరే అనే మాట కూడా అంతే నిజం. ఇప్పటికీ, కవిత్రయ మహాభారతం మొదలుకుని ఏడెనిమిది వందల సంవత్సరాలపాటు అవిచ్ఛిన్నంగా సాగిన ‘సంప్రదాయ కవిత’కు సంబంధించిన వ్యాకరణాంశాలపై వివరణ అవసరమయిన వాళ్లకి చిన్నయసూరి బాలవ్యాకరణమే దిక్కు. పేరులోనే వున్నట్లుగా, ఇది కింది స్థాయి విద్యార్థుల కోసం ఉద్దేశించిన గ్రంథం. అయితే, పిల్లలకి అర్థమయ్యేలా వ్యాకరణం బోధించడం ఎంత కష్టమో చిన్నయ సూరికి బాగా తెలుసు. తాను 1844లో సంస్కృతంలో రాసిన ‘సూత్రాంధ్ర వ్యాకరణం’ పిల్లలకి సుబోధకంగా ఉండదని భావించే, 1855లో ‘బాలవ్యాకరణం’ రాస్తున్నట్లు సూరి స్వయంగా చెప్పుకున్నారు. ఇవి రెండే కాకుండా చిన్నయ సూరి పద్యాంధ్ర వ్యాకరణం, చింతామణి వృత్తి తదితర వ్యాకరణ గ్రంథాలు కూడా రాశాడంటారు. (అయితే, ఆయన రచనగా చెప్పుకునే ‘ఆంధ్ర ధాతుమాల’ మాత్రం వేదం పట్ట్భారామ శాస్త్రుల రచన అని పరిశోధకులు తేల్చిచెప్పారు. ఈ శాస్త్రులవారే ‘పట్ట్భారామ పండితీయం’ అనే వ్యాకరణం రాసిన ప్రముఖులు. అదలా వుంచండి!) బాలవ్యాకరణం పిల్లల వ్యాకరణ పరమయిన అవసరాలను తీర్చిందో లేదో తెలీదుకానీ, సంప్రదాయ కవిత్వం చదువుకో దల్చుకున్న వాళ్లకి మాత్రం చక్కగా వినియోగపడింది. అంతమాత్రంచేత బాల వ్యాకరణం స్వయంసంపూర్ణమనుకో కూడదు. అదే నిజమయితే, బహుజనపల్లి వారి ‘ప్రౌఢ వ్యాకరణం’ అనే త్రిలింగ లక్షణ శేషం’ అవసరం ఎందుకు ఏర్పడింది?
చిన్నయ సూరి విశేషించి కృషి చేసిన మరో రంగం నిఘంటు నిర్మాణం. ‘ఆకారాది నిఘంటువు’ మొదలుకుని ‘విశ్వనిఘంటువు’ వరకూ సూరి ఎన్నో ప్రయోగాలూ ప్రయత్నాలూ చేశారు. తెలుగు భాషకి అపూర్వమయిన బృహన్నిఘంటువు నొకదాన్ని నిర్మించాలన్నది సూరి కలల్లో ఒకటి. వెల్చేరు నారాయణరావు అన్నట్లుగా, ఇప్పటికీ తెలుగు వారికి ఉపయోగపడుతున్న నిఘంటువు - బహుజనపల్లి సీతారామాచార్యులు రూపొందించిన - ‘శబ్దరత్నాకరం’. ఈ నిఘంటువు కల్పనపై కూడా చిన్నయ సూరి ప్రభావం - ప్రత్యక్షంగానో, పరోక్షంగానో -ఉండనే ఉంది. శబ్దరత్నాకర కర్త చిన్నయసూరికి ప్రత్యక్ష శిష్యులు. చివరి రోజుల్లో సూరి నిర్మించతలపెట్టిన బృహన్నిఘంటువు తయారీలో ఆచార్యుల వారు తమ గురువుకు సహాయకులుగా పని చేశారు కూడా. అయితే, ఆ నిఘంటు నిర్మాణం పూర్తికాక ముందే సూరి కన్నుమూశారు. దాంతో, ఆచార్యుల వారు ‘శబ్దరత్నాకరం’ నిర్మాణం చేపట్టి ముగించారు.
సంస్కృతం, తెలుగు, ప్రాకృతం, తమిళ భాషల్లో పండితుడిగా చిన్నయ సూరి సువిఖ్యాతుడు. అయితే, తెలుగు సాహిత్య చరిత్రలో చిన్నయసూరికి సుస్థిర స్థానం దక్కడానికి వేరే కారణం వుంది. ‘పద్యమునకు నన్నయ - గద్యమునకు చిన్నయ’ అనే లోకోక్తిని బట్టి, పందొమ్మిదో శతాబ్దంలో పరిఢవిల్లిన నవ్య సంప్రదాయ వాదానికి ప్రవక్తృత్వ స్థానం చిన్నయ సూరిదేనని తెలుస్తోంది. వాస్తవానికి, ఆధునిక భాషా సాహిత్యాల చరిత్రలో చిన్నయ సూరి ప్రస్తావన పదేపదే వస్తూవుండడానికి మూల కారణం ఇదే. పద్యాలు రాయడానికి పనికివచ్చే తెలుగును రూపొందించినవాడు నన్నయ్యయితే, అదే భాషను (ఆధునికార్థంలో) వచనానికి ఉపయోగించడమెలాగో చేసి చూపించినవాడు చిన్నయ్య. అంతే అయితే, చిన్నయసూరికి నవ్య సంప్రదాయ వాదానికి ప్రవక్త అనే స్థానం దక్కివుండేది కాదు. కొక్కొండ, కందుకూరి తదితరులు ఇదే పని మరింత విస్తృతంగానూ, విపులంగానూ చేశారు కానీ వారికి ఆ స్థానం దక్కలేదు కదా! ఆధునిక తెలుగు సాహిత్యంలో నవ్య సంప్రదాయ వాదానికి సైద్ధాంతిక ప్రాతిపదికను ప్రసాదించే ‘లక్షణ గ్రంథాన్ని’ చిన్నయసూరి రచించాడు. అదే, ‘బాలవ్యాకరణం’. అందువల్లనే ఆయనకి ప్రవక్త పదవి దక్కింది?
ఇంతకీ, నవ్య సంప్రదాయ వాదం అంటే ఏమిటి? ఆధునిక యుగంలో మారిన పరిస్థితులకీ, అవసరాలకీ తగిన రీతిలో కొత్తబాట తొక్కడం యుగధర్మాన్ని పాటించినట్లవుతుంది. అలా చెయ్యకుండా గతించిన కాలపు రీతులనే ఆధునిక యుగంలో కూడా మొండిగా పాటించడమూ - అందుకు ఒక సైద్ధాంతిక ప్రాతిపదిక రూపొందించేందుకు సకలశక్తులూ ధారపోయడమూ నవ్య సంప్రదాయ వాదం అనిపించుకుంటుంది. చిన్నయసూరి చేసినదదే. 1840 నాటికే, ఛార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ ఆనాటికి చదువుకున్న తెలుగువాళ్లు వాడుక చేస్తూ వుండిన తెలుగు భాషకి ఓ వ్యాకరణం రాశారు. అది, పండితులు తమ ఇళ్లలో మాట్లాడే భాషకి రాసిన వ్యాకరణమే. కానీ, ఆ భాషకి అప్పటికి ఇంకా ఓ పేరు పెట్టలేదు. ఇరవయ్యో శతాబ్దిలో గానీ, దానికి ‘శ్టిః వ్యావహారికం’ అనే పేరు రాలేదు. ఈ పేరు పెట్టిన పుణ్యం గిడుగు - గురజాడలది. బ్రౌన్‌కన్నా ముందే విలియం కేరీ, ఏ.డీ.క్యాంబెల్, విలియం బ్రౌన్, జే.సీ.మారిస్ కూడా నాలుగు వ్యాకరణాలు - వాడుక తెలుగు భాషకే - రాసి ఉన్నారు. ఇవి, తెలుగు వాళ్లకోసం వుద్దేశించినవీ కావు - తెలుగులకి అలాంటి వ్యాకరణ గ్రంథాల అవసరమూ లేదు. ఎందుకంటే, తమకి మాతృభాషయిన తెలుగును వాళ్లు తమకు తెలియకుండానే నేర్చుకుంటారు తప్ప, లక్షణ గ్రంథాలు చదివి నేర్చుకోరు. పైన చెప్పుకున్న వ్యాకరణ గ్రంథాలన్నీ ‘తెలుగేతరుల’ ప్రత్యేక అవసరాల దృష్ట్యా రూపుదిద్దుకున్నవే. చిన్నయ సూరి బాలవ్యాకరణం కూడా మనకి సహజంగా ఒంటబట్టని భాషని నేర్చుకునేందుకు ఉద్దేశించినదే. ఆ భాష అసలెన్నడయినా వాడుక భాషగా ఉండిందా అనేది అనుమానాస్పదం! అటువంటి భాషకి వ్యాకరణం జయప్రదంగా రూపొందించినవాడు కనుకనే, చిన్నయసూరి నవ్య సంప్రదాయ వాదానికి ప్రతీక, ప్రవక్త కాగలిగాడు. అయితే, అభిరుచి కలిగిన పాఠకులెవరూ కాదనలేని పచ్చినిజం ఏమిటంటే, మిత్రలాభం - మిత్రభేదాలు కానివ్వండి, ‘బాలవ్యాకరణం’ కానివ్వండి - చిన్నయసూరి రాసిన ప్రతి ఒక్క రచనా, రచయితగా ఆయన ప్రతిభకు నిదర్శనలుగా నిలబడతాయి!

-మందలపర్తి కిషోర్ 81796 91822