పెరటి చెట్టు

ఆంధ్ర పత్రికనిచ్చి, అమృతాంజనమిచ్చి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయన ఓ సమాజ సంస్కర్త; పారిశ్రామికవేత్త; రచయిత; పత్రికల వ్యవస్థాపకుడు; గ్రంథాలయ ఉద్యమకారుడు; జాతీయ భావాలున్న రాజకీయవేత్త. ఒకే వ్యక్తిత్వానికి ఇన్ని పార్శ్వాలు ఉండడమే అరుదనుకుంటే, వాటన్నింటికీ పరిపూర్ణమయిన న్యాయం చెయ్యగలగడం - దాదాపు - అనితరసాధ్యమని చెప్పవచ్చు. కందుకూరి వీరేశలింగం ప్రభావ పరిధిలో వికసించిన ఈ సంస్కరణాభిలాషి, గీతాసారం వొంటబట్టించుకుని, పందొమ్మిదో శతాబ్ది కడపటి పాదంలోనే పారిశ్రామికవేత్తగా అవతరించినవాడు. కొత్తతరం పాఠకులకు సాహిత్య చరిత్రను పరిచయం చేసే ఉద్దేశంతో ‘ఆంధ్ర వాంగ్మయ చరిత్ర’ రచించిన వాడు. ఇరవయ్యో శతాబ్ది తొలినాళ్లలోనే ప్రామాణికమయిన తెలుగు వారపత్రికను ఆనాటి బొంబాయిలో స్థాపించి, అయిదేళ్ల తర్వాత - అప్పటికి తెలుగు నగరంగా ఉండిన - మద్రాసుకు దాన్ని తరలించారు. ఆంధ్ర గ్రంథమాల అనే ప్రచురణ సంస్థను స్థాపించి, డజన్లాదిగా మూలగ్రంథాలను ముద్రింప చేసినవాడాయన. ఈ గ్రంథమాల తరఫునే బసవ పురాణం - పండితారాధ్య చరిత్ర - జీర్ణ విజయ నగర చరిత్ర - తంజాపురాంధ్ర నాయకుల చరిత్ర - మరెన్నో పునర్ముద్రణలనూ వెలువరించారు. అప్పట్లో కోస్తా జిల్లాల్లో 120 గ్రంథాలయాలు స్థాపించి నిర్వహించడాన్ని ఇతోధికంగా ప్రోత్సహించారు. ఈ గ్రంథాలయాలన్నింటికీ, ఆంధ్ర పత్రిక, ఆంధ్ర గ్రంథమాల పుస్తకాలన్నీ ఉచితంగా అందించేవారు. 1924లో ‘్భరతి’ మాసపత్రికను ప్రారంభించి, కొత్త తరం రచయితలకి ఓ వేదికను సమకూర్చిన వాడాయన. ’24 నుంచి ’34 వరకూ ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వుండి, ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా, ప్రత్యక్ష రాజకీయ కార్యాచరణలో పాల్గొని అరెస్టయ్యారు. జైల్లో వున్న ఆరునెల్ల కాలంలో, ఎప్పటి నుంచో వాయిదా వేస్తూ వచ్చిన భగవద్గీత వ్యాఖ్యానాన్ని రచించాడాయన. ఇన్ని వివరాలు చెప్పిన తర్వాత, ఇంకా ఆ వ్యక్తి పేరు కాశీనాథుని నాగేశ్వరరావు అని చెప్పవలసిన అవసరం ఉందా?
‘వివేకవర్ధని’ పత్రికలో వీరేశలింగం రచనలు చదివిన నాగేశ్వరరావు, విద్యార్థి దశలోనే సంస్కరణ భావాల పట్ల ఆకర్షితులయ్యారు. ఒక్క నాగేశ్వరరావే కాదు - అప్పట్లో చురుకయిన తెలుగు యువకులందరూ వీరేశలింగం భావాల వైపు ఆకర్షితులు కావడానికి ప్రధాన కారణం తెలుగు సమాజ సంస్కరణ ఉద్యమానికి వీరేశలింగం రూపొందించిన కార్యక్రమాలే. సమాజంలోని అన్ని వర్గాల్లోనూ విద్యా వ్యాప్తి - పౌరుల్లో చొరవ పెంచి, వారి సహకారంతో బాలికల కోసం ఓ పాఠశాలని స్థాపింప చెయ్యడం వీరేశలింగం సాధించిన తొలి విజయాలు. కాశీనాథుని నాగేశ్వరరావు లాంటి జాతీయ భావాలున్న సంస్కర్తల్ని ప్రభావితులను చేసినవి ఈ కార్యకలాపాలే. అందుకే, వీరేశలింగం కన్నుమూసిన నేపథ్యంలో కట్టమంచి రామలింగారెడ్డి ‘ఆంధ్ర పత్రిక’లో ఓ వ్యాసం రాస్తూ, ఆధునికాంధ్ర సమాజ నిర్మాణానికి సంబంధించి కందుకూరి సాక్షాత్తూ బ్రహ్మదేవుడే నన్నారు. ‘ఆంధ్రపత్రిక’ 1919 వార్షిక సంచికలోని వ్యాసం మొదలుకుని, 55 సంవత్సరాల తర్వాత ‘వికాస లహరి’లో ఆరుద్ర రాసిన వ్యాసం వరకూ ప్రతి ఒక్కరూ ఆయనకి అదే స్థానం ఇవ్వడం చూస్తాం. వాస్తవానికి ఒక్క వ్యక్తికి సంస్కరణ ఉద్యమ పితామహత్వం కట్టబెట్టడం కేవలం అలంకారికం, ప్రతీకాత్మకం మాత్రమే. వీరేశలింగం కన్నా ముందు నుంచీ సంస్కరణలు తీసుకురావడానికి కృషిచేసిన మహనీయులు లేరనీ కాదు; వాళ్లు గొప్పవారు కాదనీ కాదు. ఏ ప్రజా ఉద్యమాన్నయినా, ఒక ప్రతీక పేరిట గుర్తించడం లోకరీతి. సంఘ సంస్కరణ ఉద్యమానికి సంబంధించి ఆ ప్రతీక హోదా వీరేశలింగం గారికే దక్కిందనడంలో రెండు అభిప్రాయాలకు తావులేదు. అయితే, ప్రతీకలు వేరు - చారిత్రిక సత్యాలు వేరు. అది వేరే సంగతి!
ఇరవయ్యో శతాబ్ది తొలినాళ్లలో, నాగేశ్వరరావు కాంగ్రెస్ కార్యాచరణలోనూ, పత్రికా రంగంలోనూ ఒక్కసారే అడుగుపెట్టారు. అంతకు ముందే ఆయన మందుల వ్యాపారం మొదలుకుని అనేక వాణిజ్య వ్యవహారాల్లో జయప్రదంగా కృషి చేసి వున్నారు. పందొమ్మిదో శతాబ్ది చివరి దశకంలోనే, ఆయన అమృతాంజనం కనిపెట్టి అదే పేరుతో ఓ సంస్థను స్థాపించారు. అచిరకాలంలోనే అమృతాంజనం ఆయన్ను కోటీశ్వరుణ్ని చేసింది. ‘అదృష్టం ఎప్పుడూ సాహసించే వాడి చంకెక్కుతుం’దన్నాడట ప్రాచీన రోమన్ కవి వర్జిల్. ‘్ధర్యే సాహసే లక్ష్మీ’ అని మనవాళ్లు చెప్పిందీ అదేగా! అమృతాంజనాన్ని మించిన సాహసం ‘ఆంధ్ర పత్రిక’. ‘పత్రిక’ కన్నా ముందు తెలుగులో వార్తాపత్రికలు లేవని కాదు. ఎవరూ చూడని ‘సత్యదూత’ నిజంగా 1835లో వెలువడిందో లేదో గానీ, మరో మూడేళ్లకి మండిగల వెంకట రాయశాస్ర్తీ (వృత్తాంతి’(ని?) మొదలుపెట్టి కొంతకాలం నడిపిన సంగతి చరిత్ర కెక్కిన విషయమే. 1842లో ‘వర్తమాన తరంగిణి’, ’48లో ‘హితవాది’, ’61లో ‘దిన వర్తమాని’, మరుసటి సంవత్సరం ‘సుజన రంజని’, ’64లో ‘తత్వబోధిని’, ’71లో ‘ఆంధ్ర భాషా సంజీవని’, మరుసటి సంవత్సరమే ‘పురుషార్థ ప్రదాయిని’ వరసగా వెలువడ్డాయి. మరో రెండేళ్లకి - 1874లో - మొదలయిన ‘వివేక వర్ధని’ తెలుగు పత్రికా రంగ చరిత్రలో మూల మలుపుగా నిలిచింది. నిర్భీతికి నిలువుటద్దంగా నడిచిన ‘వివేకవర్ధని’ నవ యువకుల్ని కార్యాచరణ పథంలోకి తీసుకువచ్చింది. పందొమ్మిదో శతాబ్దం చివరి దశకంలో - 1893లో - మొదలయిన ‘జనానా’ పత్రిక సంపాదక యజమానిగా కందుకూరి శిష్యుడు రాయసం వెంకట శివుడు ఆధునిక సాహిత్యానికి అధికతర ప్రాముఖ్యం ఇచ్చారు. ‘హిందూ సుందరి’ పత్రిక మొసలికంటి రమాబాయి సంపాదకత్వంలో 1902లో మొదలయింది. ఈ పత్రికలో - ఒక దశలో - 84 మంది రచయిత్రులు తమ రచనలు ప్రచురించారని కొండవీటి సత్యవతి రాశారు.
కాగా, కాశీనాథుని నాగేశ్వరరావును పాఠకుడిగా ప్రభావితుణ్ణి చేసిన ‘వివేక వర్ధని’ ఆయన మనసులో ఆదర్శ పత్రికగా నిలిచిపోయింది. ఆ ప్రభావానికి ఫలితంగా 1909లో తలెత్తిన తొలి మొలక ‘ఆంధ్ర పత్రిక’ ఆవిర్భావం. అది, అయిదేళ్ల తర్వాత మద్రాసులో మారాకు వేసింది. దాదాపు అర్ధ శతాబ్ది కాలం, ఆంధ్రపత్రిక తెలుగుల అనధికార సాంస్కృతిక ప్రతినిధిగా ఏకస్వామ్యం అనుభవించిందంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రపత్రికతోపాటుగా, మరో వంద పత్రికలు ఇరవయ్యో శతాబ్దిలో మొదలయ్యాయి. వాటిల్లో, ‘కృష్ణా పత్రిక’ ‘గోల్కొండ పత్రిక’ ‘ఆంధ్రప్రభ’ ‘ప్రజాశక్తి’ ‘విశాలాంధ్ర’ ‘ఆంధ్రభూమి’ ‘ఆంధ్రజ్యోతి’ ‘ఈనాడు’ ‘ఉదయం’ ముఖ్యమయినవి. ఈ పత్రికలన్నీ నాగేశ్వరరావు నెలకొల్పిన సత్సంప్రదాయాలను అంతో ఇంతో అనుసరించినవే! నిజానికి, కాశీనాథుని నాగేశ్వరరావు పత్రికా రంగ చరిత్రలో మహోజ్వల ఘట్టం ‘్భరతి’. ఆంధ్ర పత్రిక మద్రాసుకి వచ్చిన పదేళ్లకి - 1924లో - ‘్భరతి’ సాహిత్య మాసపత్రికగా మొదలయింది. గన్నవరపు సుబ్బరామయ్య, మల్లంపల్లి సోమశేఖర శర్మ, కొంపెల్ల జనార్దనరావు, తిరుమల రామచంద్ర లాంటి మేధావులు - బహుభాషా కోవిదులు ‘్భరతి’లో పని చేశారు. తెలుగునాట పేరొందిన రచయితలందరూ, తమ రచనలు ‘్భరతి’లో అచ్చు కావాలని ఆశపడిన వాళ్లే. ఇప్పటికీ, ప్రామాణిక సాహిత్య పత్రికగా ‘్భరతి’ స్థానం సురక్షితం.
ఆసియా దేశాల్లో వ్యక్తులు సంస్థలుగా ఆవిర్భవించడమనేది, ఇరవయ్యో శతాబ్ది యుగధర్మమేమో అనిపిస్తుంది. రాజకీయాల విషయానికి వస్తే తిలక్, గాంధీజీ, ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్‌లు అలాంటి వ్యక్తులే. సంస్కృతి విషయానికి వస్తే టాగూర్, సుబ్రహ్మణ్య భారతి, గురజాడలు అలాంటి మూర్త్భీవాలే. వైజ్ఞానిక రంగం విషయానికి వస్తే జేసీ బోస్, సి.వి.రామన్, మేఘ్‌నాథ్ సాహలు అలాంటి వాళ్లే. పత్రికా రంగం విషయానికి వస్తే ఫ్రాంక్ మొరేస్, కోటంరాజు రామారా, కె.ఎ.అబ్బాస్‌లు అలాంటి వాళ్లే. అయితే వారందరిలోనూ విడివిడిగా ఉన్న లక్షణాలు కాశీనాథుని నాగేశ్వరరావులో ఒకే వ్యక్తిత్వంలో భాగంగా ఉన్నాయి. అదే ఆయన విశిష్టత!

-మందలపర్తి కిషోర్ 81796 91822