పెరటి చెట్టు

నడిచే ‘విజ్ఞాన సర్వస్వము’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే
తత్ స్వయం యోగ సంసిద్ధిమ్ కాలేనాత్మని విందతి’ (ఈ ప్రపంచంలో, జ్ఞానం మాదిరిగా పవిత్రమయినది మరేమీ కనిపించదు. యోగంలో తనంతట తానే సిద్ధి పొందినవాడు - సరయిన సమయం ఆసన్నమయినప్పుడు - ఆ జ్ఞానాన్ని తనలోనే కనుక్కుంటాడు) అనే గీతా శ్లోకంతో మొదలవుతుంది ‘ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము’, ప్రథమ సంపుటం. ఆ వెనుకనే, మరో రెండు గీతా శ్లోకాలు కూడా ఉంటాయి. ప్రముఖ చరిత్ర పరిశోధకుడు, సంఘ సంస్కర్త, రచయిత, బహుభాషావేత్త ‘కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు, ఎం.ఏ.’ ఈ విజ్ఞాన సర్వస్వానికి ముఖ్య సంపాదకుడు. గాడిచర్ల హరిసర్వోత్తమరావు, మల్లంపల్లి సోమశేఖర శర్మ, జస్టిస్ వేపా రామేశం పంతులు, డాక్టర్ ఆచంట లక్ష్మీపతి, పురాణం సూరిశాస్ర్తీ, కాశీనాథుని నాగేశ్వరరావు, రాయప్రోలు సుబ్బారావు, మంగిపూడి వెంకట శర్మ తదితరులు ఈ ‘ప్రథమ సంపుటమునకు విలేఖకులు’ విలేఖకుల మాట ఎలా వున్నా, ముఖ్య సంపాదకుల ప్రభావం, బహుముఖ ప్రజ్ఞ ఈ విజ్ఞాన సర్వస్వంలోని ప్రతి పేజీలోనూ ప్రతిఫలిస్తుంది. ముఖ్యంగా, ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం స్వరూప స్వభావాలని తీర్చిదిద్దడంలో కొమర్రాజు లక్ష్మణరావు ప్రత్యక్ష ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ సంపుటాల్లో ఆయన 40 వ్యాసాలు స్వయంగా రాశారట.
ఇతరులను ప్రభావితులు చేసేవాళ్లు, సాధారణంగా, ఇతరుల ప్రభావానికి లోనయినవాళ్లే అయివుంటారు. మిగతా వాళ్ల మాట ఎలా వున్నా, కొమర్రాజు లక్ష్మణరావు విషయంలో ఇది నూటికి నూరుపాళ్లు సత్యం. బాల్యంలో ఆయనపై తన అక్క భండారు అచ్చమాంబ ప్రభావం ఎక్కువ. ఆమెకి చదువు నేర్పుతూ తానూ నేర్చుకున్నానని కొమర్రాజు అనేవారు. ఆమె తనకు నచ్చిన సంస్కరణ భావాలను తమ్ముడికి బోధించారు. ఆ భావాల ప్రభావం లక్ష్మణరావుపై కడదాకా బలంగా ఉంది. ఆమె దగ్గిరే కొమర్రాజు కథానికా శిల్పం కూడా నేర్చారు. అక్కగారు అర్థంతరంగా అస్తమించిన తర్వాత కూడా లక్ష్మణరావు కథలు రాస్తూనే ఉన్నారు. అక్కగారింట్లో వుంటూ మహారాష్టల్రో - మరాఠీ భాషలో - చదువుకున్నారాయన. మోరోపంత్ రామ్‌చంద్ర పరాడ్కర్ మరాఠీ భాషలో రాసిన ఆర్యా భారతంలోని కర్ణ పర్వానికి కొమర్రాజు సంపాదకత్వం వహించగలిగారంటే, ఆ భాషపై ఆయనకి ఎంత పట్టు ఉండేదో ఊహించవచ్చు. అప్పట్లో - పందొమ్మిదో శతాబ్ది చివరి పాదంలో - మహారాష్ట్ర జనజీవనంపై బాల్ గంగాధర్ తిలక్ ప్రభావం ప్రగాఢంగా ఉండింది. ‘స్వరాజ్యం నా జన్మహక్కు. దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించుకుంటా’నని తిలక్ చేసిన ప్రకటన యువతరాన్ని ఉత్తేజితులను చేసింది. అప్పట్లో తిలక్ - అగార్కర్ - చిప్లూంకర్ - నామ్‌జోషీ తదితరులు మరాఠీ యువకుల విద్యా ప్రమాణాలు పెంచడానికి ఉద్యమం ప్రారంభించారు. ఫెర్గూసన్ కాలేజ్, న్యూ ఇంగ్లిష్ స్కూల్ తదితర సంస్థల ద్వారా హిందూ జాతీయ భావాల వ్యాప్తికి తిలక్ బృందం శ్రీకారం చుట్టింది. ఆ భావాల ప్రభావం కొమర్రాజుపై ప్రత్యక్షంగా పడింది. కొమర్రాజు ‘హిందూ మహాయుగం’ ‘ముస్లిం మహాయుగం’ ‘శివాజీ చరిత్ర’ రాయడానికి స్ఫూర్తినిచ్చిన భావాలు ఇవే.
మరోవైపు, వీరేశలింగం ప్రచారం చేస్తూ ఉండిన సంస్కరణ భావాలు కూడా కొమర్రాజు లక్ష్మణరావును గాఢంగా ప్రభావితులను చేశాయి. పైపైన చూస్తే, ఇవి రెండూ పరస్పరం విరుద్ధమయిన ప్రభావాలు అనిపిస్తుంది. ప్రపంచంలోని అన్ని సంస్కృతులకన్నా హిందూ సంస్కృతి గొప్పదని ‘జాతీయ’ భావాలు చెప్తాయి. హిందూ సంస్కృతిలో - ముఖ్యంగా ధార్మిక ఆచార వ్యవహారాల్లో - సమూలమయిన సంస్కరణలు తీసుకురావలసిన అవసరం వుందని వీరేశలింగం లాంటి సంస్కర్తలు జీవితాంతం పోరాడారు. తిలక్ బృందం స్వాతంత్య్రేచ్ఛకి అసలు పేరయితే, బ్రిటిష్ ప్రభుత్వ పాలనలోనే దేశం అవిద్య - కుసంస్కారం - కులమత వైషమ్యాలూ - వెనకబాటుతనాల పెత్తనంలోంచి బయటపడ్డం మొదలుపెట్టిందని ఈ సంస్కర్తలు నమ్మి, బోధించారు. ఆ భావాలనూ ఈ భావాలనూ కూడా అభిమానించ గలగడం కొమర్రాజు లాంటి జాతీయ సంస్కర్తలకి అసాధ్యం కాదు.
ఇలాంటిదే మరో విలక్షణత కొమర్రాజులో కనిపిస్తుంది. ఇరవయ్యో శతాబ్ది తొలి సంవత్సరంలోనే - 1901లో - నాయని వెంకట రంగారావు, రావిచెట్టు రంగారావు లాంటి మిత్రులతో కలిసి హైదరాబాద్‌లో శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం స్థాపించారు కొమర్రాజు లక్ష్మణరావు. 1905లోనే, హైదరాబాద్ నుంచే ‘విజ్ఞాన చంద్రిక గ్రంథమాల’ పేరిట కొమర్రాజు ప్రచురించిన పుస్తకాలు నిజంగానే విజ్ఞాన చంద్రికలు వెదజల్లిన మాట అందరికీ తెలిసిందే. గురజాడ అప్పారావు, కట్టమంచి రామలింగారెడ్డి, చిలుకూరి వీరభద్రరావు, అయ్యదేవర కాళేశ్వరరావు, గోటేటి జోగిరాజు తదితర విద్వాంసులు ఈ గ్రంథమాల కోసం రచనలు చేసినవారే. భౌతిక - రసాయనిక - గణిత - భూగోళ - ఆర్థిక - రాజనీతి శాస్త్రాల గురించీ, పదార్థ విజ్ఞాన - పారిశ్రామిక రంగాల గురించీ, వృక్ష - జీవ - వైద్యశాస్త్రాల గురించీ ప్రామాణికమయిన గ్రంథాలను వెలువరించిన ఘనత ‘విజ్ఞాన చంద్రిక గ్రంథమాల’ సొంతం. వాటితోపాటు కావ్య నవలా నాటకాదులూ, జీవిత చరిత్రలూ - స్వీయ చరిత్రలూ కూడా వెలువరించి, ‘గ్రంథమాల’ ప్రచురణ పథకానికి సంపూర్ణత్వం సాధించారు లక్ష్మణరావు. భాషా నిలయం స్థాపన మొదలుకుని విజ్ఞాన చంద్రిక వరకూ ప్రతి ఒక్క కార్యక్రమం అత్యధిక సంఖ్యాకులయిన జనసామాన్యానికి - వారి మాతృభాషలోనే - విజ్ఞానం అందించడం లక్ష్యంగా మొదలయినవే. కానీ, కొమర్రాజు కడదాకా గ్రాంథికవాదిగానే కొనసాగడం, ఈ లక్ష్యానికి ఏ మాత్రం పొసగని పోకడ. వీరేశలింగం శిష్యులయిన కొమర్రాజు, తమ గురుపాదులు వ్యావహారికాన్ని బలపర్చి, ‘వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం’ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత కూడా, పాత వైఖరినే కొనసాగించారు. చిలకమర్తి లక్ష్మీనరసింహం, కాశీనాథుని నాగేశ్వరరావు లాంటి మరికొందరు జాతీయ వాదులయిన సంస్కర్తలు కూడా ఇదే వైఖరి ప్రదర్శించడం చూస్తే, ఇది చారిత్రిక కారణాల్లోంచి పుట్టిన ధోరణే తప్ప వైయక్తిక వైఖరి కాదనిపిస్తుంది.
రెండు సంపుటాలు వెలువరించేంత వరకూ, లక్ష్మణరావుగారే విజ్ఞాన సర్వస్వం ప్రయోగాన్ని స్వయంగా నిర్వహించారు. నిజానికి ఆయనకి ఇలాంటి ప్రయోగాలు కొత్తేం కాదు. నాగ్‌పూర్‌లో చదువుకునే రోజుల్లో, కొమర్రాజు గురువుగా సేవించిన హరి మహదేవ్ భట్ మరాఠీలో ‘వివిధ్ జ్ఞాన్ విస్తార్’ అనే విజ్ఞాన సర్వస్వానికి సంపాదకత్వం వహించారు. భట్ ఈ విజ్ఞాన సర్వస్వం కోసం చేసిన కృషికి లక్ష్మణరావు ఉడతాభక్తిగా సహాయమందించారు. కొమర్రాజు లక్ష్మణరావు బతికింది, అంతాకలిపి 46 సంవత్సరాలే. ఈ స్వల్పకాలంలోనే, ఆయన అనేక రంగాల్లో కృషి చేశారు. పీబీ షెల్లీ, జాన్ కీట్స్, స్టీఫెన్ క్రేన్ తదితరులు కూడా అతి తక్కువ కాలమే బతికి, అక్షర ప్రపంచంలో చిరంజీవులుగా వర్థిల్లుతున్నారు. కొమర్రాజు లక్ష్మణరావు ప్రధానంగా కేంద్రీకరించి కృషి చేసిన రంగం చరిత్ర రచన. తెలుగుల చరిత్ర రచనను స్వతంత్ర అధ్యయన రంగంగా అభివృద్ధి చేసిన పుణ్యం లక్ష్మణరావుగారికే దక్కాలి. మల్లంపల్లి సోమశేఖర శర్మ లాంటి స్వతంత్ర చరిత్ర పరిశోధకులు వికసించడానికి కారకులు కొమర్రాజు లక్ష్మణరావుగారే. మల్లంపల్లి వారు అంటుకట్టిన స్వతంత్ర సాహిత్య పరిశోధన వనంలోని ప్రతి మొగ్గలోంచీ కొమర్రాజు కలకలం వికసిస్తూనే ఉంటారు!

-మందలపర్తి కిషోర్ 81796 91822