పెరటి చెట్టు

అసలు, బద్దెనను ‘సుమతి’ అనడం తగునా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు పద్య సాహిత్యంలో శతకాలది ఓ ప్రత్యేక స్థానం. ఆ శతకాల్లో సుమతీ శతకానిది ఓ విశిష్ట స్థానం. దురదృష్టమేమిటంటే, సదరు విశిష్ట శతకాన్ని ఎవరు ఎప్పుడు ఎక్కడ రాశారనే విషయంపై సాహిత్య చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు. ఈ శతకాన్ని సుమతి అనే పేరిట ప్రసిద్ధుడయిన ఓ జైన గురువు రాశాడన్నది ఓ వాదం. దాన్ని మరో వర్గం పరిశోధకులు ఎలుగెత్తి ఖండించారు. బద్దెన పేరిట ప్రసిద్ధుడయిన భద్రభూపాలులడనే రాజే ఈ శతకం రాశాడనేది మరికొందరి వాదన. దాన్ని కూడా ఎందరో పరిశోధక పండితులు తిరస్కరించారు. కాకతీయులకి సామంతుడిగా ఉండిన ఈ భద్రుడు, తిక్కనకి శిష్యుడనీ, కవిబ్రహ్మ దగ్గిరే ఆయన కావ్యకళ ఒంటబట్టించుకున్నాడనీ కూడా చెప్తారు. ఈ ఐతిహ్యాలను సమర్థించగల చారిత్రిక నిదర్శనాలు దొరకని కారణంగానే బద్దెన చరిత్ర ఇంతవరకూ సువ్యవస్థితం కాలేదు.
‘నీతిశాస్త్ర ముక్తావళి’ అనే చిన్న సంకలన గ్రంథంలో, బద్దెన తనను తాను 19 బిరుద నామాలతో ప్రస్తావించుకున్నాడట! అవి కాకుండా, బద్ది భూపతీ, బద్ది నృపా, బద్ది నరేంద్రా అనే మూడు రకాల పేర్లతో కూడా తనను తాను సంబోధించుకున్నాడట ఈ కవిరాజు. చిత్రమేమిటంటే, ఇవేవీ, సదరు రాజకవి ఏ కాలానికి చెందినవాడో, ఏ ప్రాంతానికి చెందినవాడో, అతగాడి గురుశిష్యులెవరో లెక్కతియ్యటానికి ఎంత మాత్రం ఉపయోగపడలేదు. అయితే, బద్దెన తనను తాను బద్దె చోడుడననీ ‘నన్నన గంధవారణుడ’ననీ పిల్చుకున్నాడు. ఈ రెండు పేర్ల ఆధారంతో మన పరిశోధకులు కొద్దిపాటి కసరత్తు చేశారు. ఏదో శాసనంలో, బద్దె చోడ నరేంద్రుడనే పేరు కనిపించిందనీ, అది పశ్చిమ చాళుక్య రాజైన భువనైక మల్లుని కాలంనాటిదనీ, దాన్నిబట్టి బద్దెన క్రీ.శ.1070 ప్రాంతాలవాడు కావచ్చుననీ మానవల్లి రామకృష్ణ కవిగారు అన్నారట. అంతలోనే, సదరు శాసనం ‘నమ్మదగినది కాద’ని కూడా ఆయనే తేల్చారట. బద్దెన ‘లఘుకృతి’ నీతిశాస్త్ర ముక్తావళిని తొలిసారి ప్రచురిస్తూ కవిగారు వెల్లడించిన విషయాలివి!
ఇక, ‘నన్నన గంధవారణుడ’నే బిరుద నామం అర్థమేమిటంటే, ననె్నచోడుడి పాలిట ఏనుగంతటి వాడు అని. ఏనుగు ఎవరి సొంతమయితే, అతగాడికి అపారమైన బలం చేకూరుతుందనేది రాజుల లెక్క. ఆ లెక్కన, తాను ననె్న చోడునికి అండదండలుగా ఉండిన విధేయుడయిన బలసంపన్నుడనని బద్దెన చెప్పుకుంటున్నాడన్న మాట. బాగానే ఉంది గానీ, ఈ ననె్నచోడుడు కుమారసంభవం రాసిన కవిత రాజ శిఖామణేనా? ఆయనా కవే, ఈయనా కవే కావడంచేత ఎందుకు కాకూడదన్నది కేవలం ఊహ కాగలదే కానీ, బలమయిన చారిత్రిక నిరూపణ కాజాలదు. బద్దెన చెప్పిన ననె్నచోడుడు టెంకణాదిత్యుడు కాకపోవచ్చని అభ్యంతరం చెప్పేవాళ్లు తిక్కనగారిని రంగంలోకి తీసుకొస్తున్నారు. కానీ, బద్దెన తన ‘గురువు’గారి పట్ల గౌరవం ప్రకటిస్తూ ఎక్కడా ఏదీ రాసినట్లు తోచదు. తిక్కయజ్వ అంతటి వాడికి శిష్యుడు కావడమే నిజమయితే, దాన్ని దాచుకుంటాడా బద్దెన? తిక్కనగారి శిష్యులెవరయినా అలా చేశారా? అంచేత, బద్దెన చారిత్రికతను నిర్ధారించే క్రమంలో తిక్కన శిష్యుడనే విషయం చరిత్రకెందుకూ కొరగాదు.
ఇప్పుడు మనం సుమతీ శతకం విషయానికి మళ్లీ వద్దాం. తెలుగు పద్యాలు రెండు వచ్చిన వాడికి ఒక్క సుమతీ శతకం పద్యమయినా వచ్చి ఉంటుంది. ఆ రెండోది వేమన పద్యమయి ఉంటుంది. ‘అక్కరకు రాని చుట్టము’ ‘తలనుండు విషము ఫణికిని’ ‘బలవంతుడ నాకేమని’ ‘కనకపు సింహాసనమున’ ‘ఎప్పుడు సంపద కల్గిన’ లాంటి పద్యాలను చదువురాని గ్రామీణులు సైతం తరచు చెప్తుంటారు. వాళ్లెవరూ బద్దెన గురించి కనీసం విని వుండరు. ఏడెనిమిది శతాబ్దాలపాటు, ఈ శతకంలోని పద్యాలను నిత్యపారాయణంగా నేర్చుకున్నారు తెలుగులు. అంతటి ప్రాచుర్యం సంపాదించిన సుమతీ శతకంలో ఆ కాలానికి కూడా వెనకబడినవిపించే భావాలతో నిండిన పద్యాలు కోకొల్లలు. చరిత్రపరంగా ప్రతి మనిషికీ - ముఖ్యంగా కవులకి - ఎన్నో పరిమితులుంటాయి. కాదనడం లేదు. కానీ, ఆడవాళ్లు నిజం చెప్పడాన్ని ‘పొల్లున దంచిన బియ్యము’ - ‘తెల్లని కాకులు’ లాంటి అసాధ్యాలతో పోల్చడం కేవలం కాలపరమయిన పరిమితికి సంబంధించిన విషయం కాదు. అది ఆ వ్యక్తి సంస్కార విశేషాలతో ప్రత్యక్షంగా ముడిపడి వుండే విషయం. అల్లుని మంచితనం గురించిన ఆయన ఆక్రోశానికి ఎవడో దశమగ్రహం నుంచి సంప్రాప్తమయిన స్వానుభవ సారం కారణం కావచ్చు. కానీ, మిగతా విషయాల మాటో? కాళిదాసు పుట్టిన దేశంలో -ఆయనకన్నా అయిదు వందల సంవత్సరాల వెనకాల - పుట్టి, రెండు మూడు వందల నీతి పద్యాలు చెప్పిన కవిప్రాయుడు ‘గొల్లని సాహిత్య విద్య’ ఓ అసాధ్యమయిన విషయమన్నట్టు మాట్లాడితే, అతగాడణ్ణి సుమతి అనడం న్యాయమేనా? విశ్వ బ్రాహ్మడి స్నేహాన్నీ, వెలమల చెలిమినీ కలలో చూసిన కలిమితోనూ - అంతకుమించి వెలయాలి బాసలతోనూ - పోల్చడంలో ఏమంత మంచి బుద్ధి (సుమతి) ప్రతిఫలించిందో విజ్ఞులే తేల్చాలి! అగసాలినీ మంగలినీ మాత్రమే కాదు - పుర్రచేతి వాటం వున్న వ్యక్తిని కూడా నమ్మొద్దని చెప్పాడీ సుమతి!
మన సాహిత్యోపజీవులతో అసలయిన సమస్య ఒకటుంది! ‘సుమతీ శతకాన్ని బద్దెన రాశాడా? సుమతి అనే జైనకవి రాశాడా?’ అనే అంశం గురించి వందల సంవత్సరాలు గుద్దుకు చావడంపై చూపించిన శ్రద్ధ, ‘మన పిల్లలకి నేర్పించదగిన నీతి వచనాలు ఈ శతకంలో ఉన్నాయా లేవా? అనే విమర్శపై చూపించరు. సుమతీ శతక కర్త తిక్కన కన్నా ముందటివాడా? తర్వాతివాడా? అనే విషయంకన్నా ఆయన పిల్లల కోసం రాసిన పద్యాల్లో ఏం చెప్పాడన్నది ఎక్కువ ముఖ్యమని మనవాళ్ల బుర్రకెక్కదు! వందల సంవత్సరాల తరబడి, ‘వీడెము సేయని నోరును..’ ‘పలుదోమి సేయు విడియము’ లాంటి పద్యాలు పిల్లలకి నూరిపోసిన ఆచార్య దేవుల విజ్ఞతను ఏమనుకోవాలి?
కవికాలాది వివరాలనూ, సదరు కవి ఏయే దర్బారుల్లో ఎలా యెలా సభారంజన చేశాడో చెప్పే కథలూ, గాథలూ, లభ్యాలభ్య రచనల పట్టికలనూ పోగేయడం ఏమయినా కావచ్చు కానీ - సాహిత్య చరిత్ర నిర్మించడం మాత్రం కాదు! తెలుగు జాతి సంస్కార జగత్తులో ఆయా కవులు ఏ పాత్ర పోషించారో నిగ్గుదేల్చడం సాహిత్య చరిత్ర నిర్మాణంలో ఓ కీలకాంశం. బద్దెన లాంటి కవుల విషయంలో దాన్ని మనవాళ్లు సక్రమంగా నెరవేర్చారా?

-మందలపర్తి కిషోర్ 81796 91822