పెరటి చెట్టు

‘ఆగర్భ పండితుడు - ఆబాల్య కవి!’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మకరధ్వజుని కొంప ఒక చెంప కనుపింప చీరకట్టినదయా చిగురుబోణి/ ఉభయ కక్షములందు ఉరుదీర్ఘతరములౌ నెరులు పెంచినదయా నీలవేణి/ పసుపు తావులు క్రమ్ము పైట చేలము లెస్స ముసుగువెట్టినదయా ముద్దుగుమ్మ/ పూర్ణచంద్రుని పోలె పొసగ సిందూరంపు బొట్టు పెట్టినదయా పొలతి నుదుట

ఎమ్మె మీరగ ఇత్తడి సొమ్ములమర/ ఓరచూపుల కుల్కు సింగార మొల్క/ కల్కి యేతెంచె మరుని రాచిల్క అనగ/ వలపులకు చేటి ఒక ఒడ్డె కులవధూటి’
-‘కవి సార్వభౌముడు’ శ్రీనాథుడు సింహాచలంలో చెప్పిన చాటు పద్యాలివి. ఈ రెండు పద్యాల్లోనూ కొట్టొచ్చినట్లు కనపడే విశేషాలు కొన్ని వున్నాయి. మొదటిది, సూక్ష్మమయిన వివరాలను, స్ఫుటమయిన మాటలతో చిత్రించడం. రెండోది, శబ్దాలంకారంతో పాటుగా భావాలంకారాలను కూడా తూకం వేసినట్లు పొదగడం. మూడోది అందాన్ని చూసి పరవశించిపోయే రాసిక్యం. నాలుగోది, అందం గురించి అంతే అందంగా చెప్పాలనే సారస్యం; అలా చెప్పగలిగే సామర్థ్యం. అయిదోదీ, అన్నిటికంటే ముఖ్యమయినదీ ఔచిత్యం. కవిత్వ కళ తిరుగులేని రీతిలో రాణించాలంటే అందులో ఈ లక్షణాలన్నీ ఉండితీరాల్సిందే. అవన్నీ- తగుపాళ్లలో - ఉన్నందువల్లనే శ్రీనాథుడు కవిసార్వభౌముడయ్యాడు. ఈ మహాకవి పద్యాలు - కాదు కావ్యాలు - ఒకటో రెండో ఉటంకించి తృప్తి చెందడం అసాధ్యం. తన ప్రయాణాల్లో అడుగడుగునా చెప్తూ పోయిన చాటువులతో సహా శ్రీనాథుడి రచనలన్నీ స్మరించుకున్నా ఈ ఆకలి తీరేది కాదు.
పధ్నాలుగో శతాబ్ది ఉత్తరార్థంలోనూ - పదిహేనో శతాబ్ది పూర్వార్థంలోనూ సాహిత్య సీమను ఎదురులేకుండా ఏలుకున్నవాడు శ్రీనాథుడు. కృష్ణాతీరంలోని కాళీపట్నంలో పుట్టాడని చెప్పుకునే ఈ కవి సార్వభౌముడు, పంపా - తుంగభద్రా - గోదావరి నదీ తీరాల్లో వీరవిహారం చేసినవాడు. తెలుగునాట అతి విస్తృతంగా పర్యటించిన కవి శ్రీరాథుడేనేమో. కుందూరి ఈశ్వరదత్తు అన్నట్లు శ్రీనాథుడు ‘ఆగర్భ పండితుడు’ ‘ఆబాల్య కవి’ కూడాను. చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడే ‘మరుత్తరాట్చరిత్ర’ రచించాననీ, నూనూగు మీసాల నూత్న యవ్వనంలో ‘శాలివాహన సప్తశతి’ని ఒడివించాననీ, నిండు జవ్వనంలో ‘శృంగార నైషధం’ సంతరించాననీ, ప్రౌఢ నిర్భర వయఃపరిపాకంలో ‘్భమఖండం’ చెప్పాననీ, వయస్సు చెయ్యిజారిపోక ముందే ‘కాశీఖండం’ తెనుగు చేస్తాననీ శ్రీనాథుడే చెప్పుకున్న పద్యం కాశీఖండంలో కనిపిస్తోంది. ఇవే కాకుండా ‘హరవిలాసం’ ‘శివరాత్రి మాహాత్మ్యం’ ‘్ధనంజయ విజయం’ ‘పల్నాటి వీరచరిత్ర’ వినుకొండ వల్లభరాయడి పేరిట నమోదయి వున్న ‘క్రీడాభిరామం’ కూడా శ్రీనాథుడే రాశాడన్నది సాహిత్య విద్యార్థుల నమ్మకం.
వీటన్నింటిలోకీ విశేషంగా చెప్పుకోవలసిన రచన ‘శృంగార నైషధం’, శ్రీహర్షుడు సంస్కృతంలో రాసిన మహాకావం గురించి చెప్తూ, ‘నైషధం విద్వదౌషధం’ అంటారు. అటువంటి కావ్యాన్ని, శబ్దాన్ని అనుసరించి - అభిప్రాయాన్ని గ్రహించి - భావాన్ని ఉపలక్షించి - రసాన్ని పోషించి - అలంకారాన్ని భూషించి - ఔచిత్యాన్ని ఆదరించి - అనౌచిత్యాన్ని పరిహరించి అనువదించానని సగర్వంగా చెప్పుకున్న యువకవి శ్రీనాథుడు. అంత ఆత్మవిశ్వాసంతోనూ, ఆ వయసుకు అసాధ్యమనిపించే స్పష్టతతోనూ అనువదించినందువల్లనే ‘శృంగార నైషధం’ తెలుగులో ప్రబంధ రచనకు ఒరవడి దిద్ది, గొప్ప చారిత్రిక కర్తవ్యం నెరవేర్చింది.
శ్రీనాథుడు కేవల కవిప్రాయుడు కాదు. పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఓ వెలుగు వెలిగాడు. దర్బారును ఆశ్రయించేందుకు వచ్చే కవి పండితులపై పరీక్షాధికారిగా వ్యవహరించాడు. డజను దాన శాసనాలకు పైగా స్వయంగా రాశాడు. కోకిల అడవిలో కూసినా అంతే తియ్యగా కూస్తుందన్నట్లుగా, 1408 నాటి ఫిరంగిపురం శాసనంలో కూడా శ్రీనాథుడు గొప్ప శ్లోకం రాశాడు. ‘పెదకోమటి వేమారెడ్డి కీర్తిలత శ్రీశైలంలో స్థిరమూలమై, కుమారాచలంలో వృద్ధి పొంది, పంచారామాలలోనూ సింహాచలంలోనూ పందిరల్లి, శ్రీకూర్మంలోనూ పురుషోత్తంలోనూ పుష్పించి, కాశిలో విశ్వనాథుని ఎదుట నిత్య నైవేద్యానికి పనికివచ్చేట్లు ఫలించిందని ఈ శ్లోకానికి అర్థం’ చెప్పారు ఆరుద్ర.
శ్రీనాథుడు లాంటి ప్రతిభావంతుల విషయంలో ఓ గొప్ప ప్రమాదం తరచు ఎదురవుతూ ఉంటుంది. కళ్లు మిరుమిట్లు గొల్పించే వాళ్ల ప్రతిభ మనలోని విమర్శనాత్మక విచక్షణను దిగమింగేస్తుంది. ‘గమికర్మీకృత నైకనీ వృతుడనై’ లాంటి ‘తెనిగింపు’ల ద్వారా సాహిత్యాన్ని సామాన్య పాఠకులకు అందనంత ఎత్తుకు ఎత్తుకుపోయిందీ శ్రీనాథుడే. అతని కవితల్లోంచి డుమువులు తొలగిస్తే, మిగిలేదంతా సంస్కృతమేననే విమర్శ నిరాధారం కాదు. ఇక, సౌందర్య శాస్త్ర ప్రమాణాల రీత్యా కొండంత ఎత్తున ఉండే శ్రీనాథుడి చాటుపద్యధార, వస్తువు విషయానికి వచ్చేసరికి నేలబారు ప్రమాణాలతో ఉంటుంది. ఒకానొక అందగత్తెని వెలయాలిగా కాక మగనాలిగా పుట్టించిన పాపానికి బ్రహ్మదేవుణ్ణే తప్పుపట్టిన దుస్సాహసి ఈ కవిసార్వభౌముడు. స్ర్తిల శారీరక సౌందర్యాన్ని ఒళ్లు మర్చిపోయి వర్ణించి, పులకించిపోయే లేకితనానికి గౌరవం - కనీసం, ఆమోదయోగ్యత - సంపాదించి పెట్టిన ఘనుడు శ్రీనాథుడే. స్ర్తిని భోగవస్తువుగా మాత్రమే చూడ్డంలో భాగమే ఈ లక్షణం కూడా. భీమఖండంలో వర్ణితులయిన స్ర్తిలందరూ అప్సరోభోగినులేననీ, అంచేత వాళ్లనలా వర్ణించడంలో తప్పులేదనీ కొందరు పండితులు - మడికట్టుకుని మరీ - శ్రీనాథుణ్ణి సమర్థించేందుకు తెగించడానికి ఈ ప్రతిభారాధనే కారణం. సామాజిక స్వభావం లేని కళ ఉండదనే వాస్తవం దృష్టిలో పెట్టుకోకపోతే, కళకి కచ్చితంగా సామాజిక ప్రయోజనం ఉండితీరాలన్న చైతన్యం మరుగున పడే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. శ్రీనాథారాధకులు మర్చిపోకూడని ప్రాథమిక సూత్రమిది.

-మందలపర్తి కిషోర్ 81796 91822