పెరటి చెట్టు

సంచార సంకీర్తన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తాళ్లపాక వారిని చదవందే తెలుగు రాద’ని నిష్కర్ష చేశారు పరిశోధక - పండితులు వేటూరి ప్రభాకరులు. నిజమే మరి - ఒక్క వ్యక్తి తన జీవితకాలంలో ముప్పయి రెండు వేల కీర్తనలను ఆలపించడమంటే మాటలా? కర్ణాటక శాస్ర్తియ సంగీతం నిర్దేశించిన ‘శాస్ర్తియ’ చట్రం లోపలే ఇన్ని వేల సంకీర్తనలనూ గానం చెయ్యడం కచ్చితంగా విశేషమే. అది కూడా, ప్రాంతీయ సంస్కృతికి ప్రాతినిధ్యం కల్పించే పలుకుబళ్లతో నిండిన తేట తెలుగు మాటల్లో ఈ సంకీర్తనలను కట్టడం మరింత విశేషం. రసరాజమని చెప్పే శృంగార రసం ప్రధాన రసంగా ఉండే ఈ కీర్తనలు - వీటిలో కొన్ని కేవలం పడక గది రహస్యాలకే పరిమితమయినవి - భక్తిగీతాలు కానేరవని, ఇనప కచ్చడాలు కట్టుకున్న పండితంమన్యులు సయితం అనలేరు. ఎందుకంటే, ఈ సంకీర్తనల్లో భగవంతునితో తల్లీనావస్థ చెందని పంక్తి ఒక్కటి కూడా లేదనే విషయం అన్నమయ్యను చదివిన తెలుగు వాళ్లందరికీ తెలిసిన మాటే. అంచేత, ఈ సంకీర్తనలు రాసే సందర్భంగా అన్నమయ్య మూడో మనిషిగా లేడు. అందుకే, తిరుమల గుడి ప్రాంగణంలోనే పాతర వేసిన అన్నమయ్య సంకీర్తనలను వెలుగులోకి తెచ్చిన సార్థకనాములు ప్రభాకరులు అన్నమాట అక్షర సత్యమని అందరూ ఆమోదించారు!
రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, శ్రీపాద పినాకపాణి, నేదునూరి కృష్ణమూర్తి, కందయనల్లూర్ వెంకటరామన్ లాంటి చరితార్థులు మొదలుకుని గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, శోభారాజు, కేజే ఏసుదాసు, ఎం.ఎం.కీరవాణి లాంటి సృజనశీలుర వరకూ ఎందరో అన్నమయ్య సంకీర్తనలకు బాణీలు కట్టి ధన్యులయ్యారు. తెలుగు నేల నాలుగు చెరగులా - ఓ మోస్తరుగా పాడడం వచ్చిన - ప్రతి ఒక్కరూ అన్నమయ్య సంకీర్తనలను ఆలపించినవారే. టీవీ కోకిలలన్నీ అన్నమయ్య కూజితాలతోనే గొంతు సవరించుకున్నాయి. మహామహులు మల్లాది రామకృష్ణ శాస్ర్తీ, అన్నమయ్య జీవితాన్ని - తొమ్మిదిన్నర దశాబ్దాలపాటు సాగిన - సుదీర్ఘ ‘సంకీర్తన’ యాత్రగా భావించి, చక్కని రచన చేశారు. యథాప్రకారం, మన తెలుగు ప్రచురణకర్తలు ఈ రచన పునర్ముద్రితం కాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు - అది వేరే విషయం! ఇక అన్నమాచార్య ‘చరిత్ర’ని కథలుగా, హరికథలుగా, దృశ్య - శ్రవ్య నాటకాలుగా, టీవీ రూపకాలుగా, చివరికి సినిమాగా కూడా రూపొందించడంలో మన సృజనాత్మక రచయితలు పోటీలు పడ్డారు. ఇంతమంది ఇంతగా ఎగబడ్డానికి ఆయన జీవితంలో అంత ఘనమయిన విశేషాలేమున్నాయనే ప్రశ్న రావడం సహజం. ఒక లెక్క చెప్తా- జాగ్రత్తగా వింటే, ఇలాంటి ప్రశ్నలు పటాపంచలయిపోతాయి.
నూరేళ్లకు అయిదేళ్లు తక్కువగా బతికాడు అన్నమయ్య. రోజుల లెక్కలో చూస్తే, అన్నమయ్య 34,200 రోజులు బతికాడు. అందులోంచి పదహారేళ్లు తీసేద్దాం - అంటే 5,760 రోజులన్నమాట. అప్పుడు మిగిలేది 28,440 రోజులు. ఈ ఇరవయ్యెనిమిదిన్నర వేల రోజుల్లో అన్నమయ్య వెంకటేశ్వరుని మీద కీర్తన చెప్పని రోజు లేదు. అలా అనుకున్నా, ఈ సంకీర్తనల సంఖ్య 29వేలకు లోపు ఉండాలి. కానీ, అన్నమయ్య 32 వేల సంకీర్తనలు ఆలపించాడని ఆయన మనవడు చిన్నన్న చరిత్రకెక్కించాడు. అంటే, అన్నమయ్య రోజుకు ఒకటి కంటే ఎక్కువ కీర్తనలే పాడాడని తేలిపోతోంది. అయితే, వాటిలోంచి 20వేల సంకీర్తనలు వాయులీనమయిపోయాయి. పనె్నండువేల సంకీర్తనలే మనకి దక్కాయి. (‘సమగ్రాంధ్ర సాహిత్యం’లో ఆరుద్ర ‘రెండువేలా చిల్లర’ కీర్తనలే దక్కాయన్నారు. అన్నమయ్య కీర్తనలు 12వేలు దొరికాయని ఎక్కడో చదివిన గుర్తుండి అలా రాశాను. నిజమయినా కాకపోయినా, పెద్ద అంకె అనుకుంటే అదో తృప్తి!) అన్నమయ్య సంస్కృతంలో రాసిన ‘వెంకటాచల మహాత్మ్యం’ వరాహ పురాణంలో కలిసిపోయిందని వేటూరి ప్రభాకరులే వెల్లడించారు. ఇది కాకుండా, అన్నమయ్య ‘సంకీర్తన లక్షణం’ అనే లాక్షణిక గ్రంథాన్ని కూడా సంస్కృతంలో రాశాడని ఆరుద్ర చెప్పారు. ఆదికావ్యమయిన రామాయణాన్నీ, శృంగార మంజరి అనే మరో కావ్యాన్నీ ద్విపదలుగా రాశాడట. ఇవన్నీ చాలవన్నట్టుగా అన్నమయ్య పనె్నండు శతకాలు చెప్పాడట. అయితే, మన వాళ్లు వాటిల్లోంచి - పొదుపుగా - ఒక్క శతకానే్న మనకోసం దాచిపెట్టారు. మనం ఆ జాగ్రత్త కూడా తీసుకోవడం లేదు. అంచేత, ముందు తరాల వాళ్లకి అన్నమయ్య అంటే కాంక్రీటు బొమ్మలే అనే అభిప్రాయం ఏర్పడినా విస్తుపోనక్కరలేదు. ఈ వివరాలు చూస్తే, అన్నమయ్య కథని రూపకంగా రూపొందించాలని అంతమంది అంతగా ఎందుకు ఎగబడ్డారో బోధపడుతుంది.
పదహారో ఏటనే, అన్నమయ్య ఇంటి నుంచి వెళ్లిపోయి, సంచార సంకీర్తన జీవన సరళిని ఎంచుకున్నాడు. ఆ క్రమంలోనే, ఘన విష్ణువనే వైష్ణవ గురువు చేతుల మీదుగా చక్రాంకితాలు వేయించుకుని, సమాశ్రయణం పొందాడు; సిసలయిన శ్రీవైష్ణవుడయ్యాడు. ఆ తర్వాత, అహోబిలంలోని ఆదివణ్ శఠగోప మునీశ్వరుల దగ్గిర కొన్నాళ్లు వేదాంత సాధన చేశాడట. అసలు పెళ్లే వద్దనుకున్నవాడు, ఓ దగ్గిర బంధువు ముందుకొచ్చి తన కూతుళ్లనిద్దరినీ కట్టబెడతానంటే, జంట లంపటం తగిలించుకున్నాడు. బాల్య సఖుడయిన సాళువ నరసింగ రాయలకి ఆధ్యాత్మిక గురువు పాత్ర కొన్నాళ్లు పోషించాడు. అన్నమయ్య ఇచ్చిన నైతిక బలంతో పుంజుకున్న రాయలు పెద్దవాడయి కన్నడ రాజ్యాన్ని పట్టం కట్టుకున్నాడు. అద్దుమాలిన అధికారం, కళ్లు నెత్తికెక్కిస్తుంది. వైష్ణవ మధుర భక్తి సంప్రదాయంలో వైకుంఠంలోని పడక గది రహస్యాలను బహిరంగంగా పాడుతున్న అన్నమయ్య చేత, తన శృంగార క్రీడలను కూడా పాడించుకోవాలని రాయలకి అనిపించింది. ఎంత ‘నా విష్ణుః పృథ్వి పతిః’ అనుకున్నా, పృథ్వీపతే విష్ణువు, అతనితో పడక పంచుకున్నామే లచ్చిందేవి అనుకోడానికి అన్నమయ్య సిద్ధంగా లేడు. అందులో అతనికి వైష్ణవమేమీ కానరాలేదు. కాదని చెప్పకుండా చల్లగా జారుకున్నాడు. ‘రాజుల్ మత్తులు’ కదా- అంత తేలిగ్గా వదిలేస్తాడా రాయలు? బంధించబోయి భంగపడ్డాడు. చివరికి, తానే, ఓ కొమ్ముకాసి, అన్నమయ్యను తిరుమలకు తీసుకుపోయాడని కథ చెప్తారు.
ఈ సంఘటన తర్వాత అన్నమయ్య తిరుమల నుంచి కదలలేదని ఓ కథనం. దాని మాటెలా వున్నా, అన్నమయ్య కుటుంబం వైష్ణవ మధురభక్తి సంకీర్తనకే అంకితమయిపోయింది. నిజానికి, ఈ సంప్రదాయం అన్నమయ్య తల్లి రోజుల్లోనే మొదలయిందంటారు. దానిమాటెలా వున్నా, అన్నమయ్య పెద్ద భార్య తాళ్లపాక తిమ్మక్క ‘సుభద్రా కల్యాణం’ అనే ద్విపద కావ్యం రాసి, కుటుంబ సంప్రదాయాన్ని నిలబెట్టింది. ఆమె సవతి కొడుకు పెద తిరుమలాచార్యులు ‘వెంకటేశ్వర వచనాలు’ ద్వారా సుప్రసిద్ధుడు. ఈ తిమ్మన కుటుంబమంతా కవులే. అతని అయిదుగురు కొడుకులూ, అల్లుడూ, మనవలూ కూడా కవులేనట. తానే కాకుండా, కుటుంబమంతటి చేతా అక్షరార్చన చేయించాడు అన్నమయ్య.
తాళ్లపాక అన్నమాచార్య జీవితంలో ప్రత్యేకించి చెప్పుకోవలసిన విశిష్టత ఒకటుంది. శృంగారాన్నీ, వైభోగానే్న కాకుండా వైరాగ్యాన్ని కూడా అలీనంగా ఉంటూనే అక్షరీకరించాడు అన్నమయ్య. మధుర భక్తిలో భక్తుడికీ - దేవుడికీ ఉండే బాంధవ్యం ప్రేయసీ ప్రియుల మధ్య వుండే బాంధవ్యం లాంటిదేనంటారు. బహుశా, సూఫీ వైరాగ్య సంప్రదాయం సారాంశం కూడా ఇదేనేమో! కులాలూ మతాలూ వాటినడ్డం పెట్టుకుని నడిచే రాజకీయాలూ పరస్పరం అసహనం పెంపొందించుకున్న ప్రతి చారిత్రిక దశలోనూ మధురభక్తి లాంటి సాంస్కృతిక ఉద్యమం పుట్టుకొచ్చింది. ఓ చేదు నిజమేమిటంటే, మన ప్రపంచం ప్రస్తుతం ఇదే దురవస్థలో ఉంది. ఈ సందర్భానికి అన్నివిధాలా ఉచితంగా ఉండేది అన్నమయ్య ప్రస్తావన.

-మందలపర్తి కిషోర్ 81796 91822