పెరటి చెట్టు

మందార మకరంద మాధుర్యమున తేలిన మధుపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏరా దక్ష, అదక్షమానస! వృథా రుూ దూషణం బేలరా?
ఓరీ పాపము లెల్ల పో విడువరా, ఉగ్రాక్షు చేపట్టరా,
వైరం బొప్పదురా, శివుం దలపరా, వర్ణింపరా, రాజితోం
కారాత్ముండగు నీలకంఠు తెగడంగా రాదురా దుర్మతీ!’
ఓ కూతురు, తన తండ్రిని - సాక్షాత్తూ దక్ష ప్రజాపతి అంతటివాణ్ణి - వుద్దేశించి చెప్పిన పద్యమిదంటే నమ్మగలరా మీరు? అందులోనూ, సహజ సాత్విక కవి బమ్మెర పోతరాజు చెప్పిన పద్యమిదంటే నమ్మడానికి వీలయ్యే పనేనా? కానీ, ఎవరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం మరి! ఎవరో అన్నట్లు, కల్పన కంటే కటిక నిజమే విడ్డూరంగా ఉంటుంది ఒక్కోసారి. దక్షయజ్ఞం సందర్భంగా తన పతిని దూషించిన తండ్రి మీద సతి విరుచుకు పడిన తీరిది. చూడగా చూడగా, పార్వతి పదారణాల తెలుగాడబడుచేమో అనిపించేలా రాశాడు పోతన. పదిహేనో శతాబ్దం ఉత్తరార్థం నాటికి తెలుగు కవిత్వంపై మతావేశాల ప్రభావం ఎంత తీవ్రంగా ఉండేదో గ్రహించడానికి పోతన రాసిన ‘వీరభద్ర విజయం’ ఉపయోగపడుతుంది. ఇదే పోతన తొలి రచనగా భావిస్తున్నారు సాహిత్య చరిత్రకారులు.
కవులు రెండు రకాలు. ఒక రకం కవుల్ని చరిత్ర సృష్టిస్తుంది. మరో రకం కవులు తామే చరిత్రను సృష్టిస్తారు. వీరిద్దరిలో ద్వితీయులే అద్వితీయులయి, సాహిత్య చరిత్రను శాసిస్తారు. పోతన ఈ రెండో రకం కవి. ఆయన పెద్ద పండితుడేం కాదు. సంస్కృతాంధ్ర సాహిత్యాలు నమిలి మింగినవాడూ కాడు. మహా అయితే, రైత్వారీ ఆరాధ్య బ్రాహ్మణ కుటుంబాల్లో మాదిరే సంస్కృతాంధ్ర భాషల్లో పంచ మహాకావ్యాలు చదివుంటాడు. కరణాల ఇంటను పుట్టినందువల్ల చిట్టావర్జాల తబ్సీళ్ళు తెలుసుకుని ఉంటాడు. తల్లీ తండ్రీ అన్నా అక్కా నడిచిన దారిలోనే తానూ నడక మొదలుపెట్టి వుంటాడు. అలా, చరిత్ర చెప్పుచేతల్లో ఉండే దశలో, కవిత్వం చెప్పి పొట్టపోసుకునేందుకు పోతన ప్రయత్నించే ఉంటాడు. ‘్భగినీ దండకం’ లాంటివి రాసి, శ్రీమంతుల చవకబారు అభిరుచులను రంజింప చేసేందుకు ఓ ప్రయత్నం చేసే వుంటాడు. అటు రాచకొండలో రాజ్యమేలే పద్మనాయకులనో, ఇటు ఓరుగల్లులో అధికారం చెలాయించో రెడ్డిదొరలనో ఆశ్రయించాలని చూసే వుంటాడు. అయితే, ఆ ప్రయత్నాలు సఫలమయినట్లు తోచవు. దాంతో, ‘నిజదార సుతోదర పోషణార్థమై’ బమ్మెర బాట పట్టి వుంటాడు. హాలికుడిగానో, కందమూల కౌద్ధాలికుడిగానో బతకడానికి సమాధానపడి ఉంటాడు. అలా జరిగి వుండకపోతే, పోతన తన భాగవత్వం ద్వారా చరిత్ర సృష్టించగలిగేవాడే కాడు! ఓరుగల్లుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బమ్మెరలో పుట్టిన పోతన ఎక్కువ కాలం ఆ గ్రామంలోనే జీవించాడని చెప్తారు.
స్వభావసిద్ధంగా పోతన, మరెవరో నడిపిస్తే నడిచే మనిషి కాడు. అందుకే, ఎంత ‘పలికించెడి వాడు రామభద్రుండ’ని పోతన అన్నప్పటికీ, అది కేవలం వినయంతో కూడిన వందనంగానే తీసుకోవాలి. ఆయన చేసిన నిర్ణయాలన్నీ స్వేచ్ఛగానూ, స్వాతంత్య్రం కోసమూ తీసుకున్నవే అయి వుంటాయనిపిస్తుంది. విత్తనం వేసి మొక్కలు మొలిపించి - నారు పోసి, నీరు పెట్టి - చేలు ఊడ్చి, కలుపు తీసిన సేద్యగాడు కావడం వల్లనే సాహిత్య వ్యవసాయం చెయ్యడంలోని సాధక బాధకాలను సయితం సులువుగానే నేర్చి ఉంటాడు. జీవితం నేర్పిన పాఠాలను సాహిత్యానికి చక్కగా అన్వయించుకుని, శైవ - వైష్ణవ భేదాలు పక్కన పెట్టగలిగే పరిణతి సాధించాడనిపిస్తుంది. అణగారిన జీవుల నిట్టూర్పుగానూ, గుండెలేని సమాజానికి గుండెకాయగానూ, ఆత్మలేని పరిస్థితులకు ఆత్మగానూ, సామాన్య ప్రజలకు బాధోపశమనంగానూ ఉండే మతం విషయంలో అసహనం తగదని గ్రహించగల సాత్వికత పోతనకు సొంతమయిందనిపిస్తుంది. జీవితం నూరిపోసిన ఈ సాత్వికతే, ఆయన చేత శ్రీమదాంధ్ర మహాభాగవతానికి శ్రీకారం చుట్టేలా చేసింది. ‘చేతులారంగ శివుని పూజించడేని, నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయను సత్యము లోనుగా తలుపడేని, కలుగనేటికి? తల్లుల కడుపుచేటు!’ అనే పద్యం చదివితే, మతానుశీలత కన్నా ధార్మికత ఉన్నతమయిందనే సత్యం పోతన ఏనాడో గ్రహించాడని అర్థమవుతుంది. పోతన భాగవతాన్ని తనకి అంకితమియ్యవలసిందిగా సర్వజ్ఞ సంగభూపాలుడు అడిగాడనీ, కానీ ‘మనుజేశ్వరాధములకు’ తన కావ్యం అంకితమివ్వనని పోతన స్పష్టం చేశాడనీ అంటారు. ఈ సర్వజ్ఞుడూ, పోతనా సమకాలికులు కారనీ, ఎన్నడూ కలవలేదనీ వాదిస్తారు మరికొందరు. ఏదేమయినా, భాగవతాన్ని తన ఇష్టదైవం శ్రీరాముడికే అంకితమిచ్చాడు పోతన.
పాతికేళ్ల కిందటి వరకూ, మధ్యతరగతి తెలుగిళ్లలో, భాగవతం చదివిన వాళ్లు ఇద్దరు ముగ్గురయినా ఉండేవాళ్లు. ‘ఎవ్వనిచే జనించు..’ ‘శ్రీకైవల్య పదంబు చేరుటకునై..’ ‘హరియను రెండక్షరములు..’ ‘అలవైకుంఠపురంబులో..’ ‘సిరికిం చెప్పడు...’ ‘లావొక్కింతయు లేదు..’ ‘నల్లనివాడు పద్మనయనంబులవాడు...’ ‘ఘనుడా భూసురు డేగనో లేదో..’ లాంటి పద్యాలు సాధారణంగా చదువుకున్న వాళ్లందరికీ నోటికి వచ్చి వుండేవి. శబ్దాలంకారాల మీద పోతనకుండే పట్టు కారణంగా ఆయన పద్యాలు తొందరగా నోటికి పట్టేవి. మంచన, ఎర్రన, నాచన సోమనల ప్రభావం పోతనపై స్ఫుటంగా కనిపిస్తుంది. హరిహరనాథ తత్వం అనే పరతత్వ భావన విషయంలో తిక్కన ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పోతన జీవితంలోని సంఘర్షణ ఆయనే్న గొప్ప పాత్రగా తీర్చిదిద్దింది. పోతన అసంపూర్ణంగా వదిలేసిన ఓ పద్యాన్ని సాక్షాత్తూ శ్రీరామచంద్రుడే దిగొచ్చి పూర్తి చేసి పోయాడని చెప్పే కథ సరేసరి!! శ్రీనాథుడి తర్వాత పోతన మీద ఉన్నన్ని కథలు మరెవరి మీదా కనిపించవు. శ్రీనాథుడి బావమరుదుల్లో దగ్గుపల్లి పోతన్న (దగ్గుపల్లి దుగ్గన అన్నగారు) ఒకడు. అతని స్థానంలో బమ్మెర పోతనని స్థాపించి, భిన్నధృవాల్లాంటి ఈ సమకాలికులిద్దరికీ చుట్టరికం కట్టబెట్టారు మనవాళ్లు. శ్రీకృష్ణుని బాల్య క్రీడలు, కాళిందీ మర్దనం, గోవర్థన గిరిధారణ, రుక్మిణీ కళ్యాణం, గజేంద్ర మోక్షం లాంటివి కథలు కథలుగా చెప్పుకునేవాళ్లు. రంగనాథ రామాయణానికీ, పోతన భాగవతానికీ ఒక చెప్పుకోదగిన పోలిక ఉంది. ఇవి రెండూ కూడా పండిత లోకంలో ప్రాముఖ్యానికి నోచుకోలేదు. కానీ, పాఠక లోకం ఈ రెండు కావ్యాలకీ పెద్దపీట వేసింది. ఎవరో అన్నట్లు పోతన నిజంగానే ప్రజాకవి!

-మందలపర్తి కిషోర్ 81796 91822