పెరటి చెట్టు

ప్రయోగం - ప్రయోజనం, ఆధునికతకు రెండు చక్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎలెక్ట్రిక్ బల్బ్ కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్‌ని ఓ స్కూల్ బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా పిలిచారట. ఆయన చేతుల మీదుగా బహుమతి అందుకున్న ఓ గడుగ్గాయ ఆయన్నిలా అడిగాడట. ‘ఒక సెంటు (అప్పట్లో) ఖరీదు చేసే బల్బు కనిపెట్టినందుకు మీకు అన్ని అవార్డులూ, పేటెంట్లూనా?’ అని ఆ కుర్రకుంక విస్తుపోయాడట. ఆ కుర్రాణ్ణి నోరు మూయించడానికి ప్రయత్నించబోయిన పెద్దల్ని ఆపి, ఎడిసన్ ఇలా జవాబిచ్చాడట: ‘బల్బ్ పనిచేసే విధానం కనిపెట్టేందుకు నేను 366 ప్రయోగాలు చేశాను. అందులో ఆఖరిది మాత్రమే సఫలమయింది. కానీ, మొత్తం అన్ని ప్రయోగాల వివరాలూ మీ కోసం భద్రంగా రాసి పెట్టి వుంచాను. అవి చదివితే, మీకు బోలెడంత - వృథా - శ్రమ తప్పుతుంది కదా! అలా మీ సమయం ఆదా చేసినందుకే నాకిన్ని అవార్డులూ పేటెంట్లూ ఇస్తున్నది!’ అన్నాడట ఎడిసన్. నిజమే, ప్రయోగాలన్నీ సఫలం కాకపోవచ్చు - కానీ ప్రతి ఒక్క ప్రయోగం ప్రయోజనకరమయిందే మరి! కొన్ని గుణ ప్రకరణంలో చోటు సంపాదించుకుంటే మరికొన్ని దోష ప్రకరణంలో స్థానం సంపాదించుకుంటాయి. కానీ, తర్వాతి తరాల వాళ్లకి అవీ పనికొస్తాయి. ఇవీ పనికొస్తాయి! అసలు ప్రయోగాలే జరగకపోతే, ఆ ప్రకరణమూ ఈ ప్రకరణమూ కూడా ఖాళీగా మిగిలిపోతాయి. తర్వాతి తరాల వాళ్ల నెత్తిన బండెడు వృథా శ్రమ వచ్చి పడుతుంది. ఇది విజ్ఞానశాస్త్రాల విషయంలోనే కాదు - సాహిత్యంలోనూ అంతే నిజం!
సాహిత్యంలో ప్రయోగాలకి వుండే ప్రాధాన్యం, ఆ రంగంతో సంబంధం లేని వాళ్లకి పెద్దగా తెలిసే అవకాశం లేదు. పాఠకుల హృదయాలు దోచుకున్న ఎన్నో కళాఖండాలు ప్రయోగాల సత్ఫలితాలేనని ఎక్కువమందికి తెలియదు. ఎందుకంటే, పాఠకుల్లో అత్యధికులు రచనా ప్రక్రియని ఓ శ్రమరూపంగా భావించరు. చాలామంది రచయితలకు కూడా, రచన మేధోశ్రమ రూపమనే స్పృహ ఉండకపోవచ్చు. అంతకు మించి, పెద్దపెద్ద రచయితలు రచనను ఓ మేధోక్రీడగా భావించే విషయం కూడా - వాళ్లతో సాన్నిహిత్యం ఉన్నవారికి తప్ప - ఇతరులకి తెలియకపోవచ్చు. శ్రీశ్రీ, పెద్ద్భిట్ల సుబ్బరామయ్య, అదృష్టదీపక్ లాంటి పెద్ద రచయితలు దశాబ్దాల తరబడి పదబంధ ప్రహేళికలు తయారుచెయ్యడానికి గంటల తరబడి కసరత్తు చెయ్యడం వెనక ఉన్న కారణమేమిటో ఊహించారా ఎప్పుడయినా? అదే మేధో క్రీడానందమంటే! రచనలో ప్రయోగాలు చేసే ప్రముఖులకి సయితం దక్కేది ఈ మేధోనందమే. అంతకు మించి, సృజనాత్మక రచయితలకి, శిల్ప సంబంధమయిన ‘మానసిక’ అవసరాలు కొన్ని వుంటాయి. ఇక, ఈ ప్రయోగాల ఫలితాలను అందుకునే పాఠకుల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది?
సాహిత్యానికి సంబంధించి, రచయితలను అడిగే ప్రశ్నల్లో వౌలికమయినవి రెండున్నాయి. రచనల్లో ఏం చెప్పావు, ఎలా చెప్పావు అనేవే ఆ రెండు ప్రశ్నలూను. (మూడోదీ ముఖ్యమయిందీ ఇంకో ప్రశ్న ఉంది - ‘రచన ఎందుకు చేశావు?’. ఈ మూడో ప్రశ్నకి సూటిగానూ, నిజాయితీగానూ సమాధానం చెప్పే రచయితలు చాలా తక్కువమంది!) వాటిలో మొదటి ప్రశ్నకి చెప్పే జవాబు - సాధారణంగా - ఆయా రచనల సారంతో (వస్తువుతో) ప్రత్యక్షంగా ముడిపడి వుంటుంది. ఇక, ఎలా చెప్పావనే ప్రశ్న ఆయా రచనల రూపానికి సంబంధించినదయి ఉంటుంది. రచనకి ‘సారం’ అంటున్నామంటేనే, ‘వస్తువు’ ఎంత ముఖ్యమయిందో చెప్తున్నాం కదా! అది సాహిత్య ప్రయోజనంతో ప్రత్యక్షంగా ముడిపడి వుంటుంది కనుక దాని ప్రాముఖ్యం అద్వితీయమని చెప్పాలి. కానీ, సాహిత్యానికి కచ్చితమయిన వ్యిక్తిత్వం, గుర్తింపు ప్రసాదించే అంశం వస్తువు కాదు- రూపమే! ఇంకా, స్పష్టంగా చెప్తే, రూపంలో భాగమయిన శిల్పం వల్లనే రచనకి నిర్దిష్టమయిన వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. దాని ప్రభావశీలతని ఈ శిల్పరూపాలే నిర్ణయించడం కద్దు. మరి శిల్పానికి విశిష్టమయిన గుర్తింపు ఎలా దక్కుతుంది? అది ప్రయోగాత్మకత వల్లనే సిద్ధిస్తుంది!
ప్రబంధ సాహిత్యం ప్రభావంలో దాదాపు నాలుగు శతాబ్దాల కాలం తెలుగులో వేరే ప్రక్రియలు వికసించలేదు. పందొమ్మిదో శతాబ్దంలో - 1830 ప్రాంతంలో - ఏనుగుల వీరాస్వామి రాసిన ‘కాశీ యాత్ర చరిత్ర’ తెలుగులో ఆధునిక సాహిత్యానికి రంగం సిద్ధం చేసింది. మరో మూడు దశాబ్దాల తర్వాత - 1860 దశకంలో - స్వామినీన ముద్దు నరసింహ్మ నాయుడు ‘హితసూచని’ వెలువరించి తెలుగు సాహిత్యానికి ఆధునిక చింతనను, సంఘ సంస్కరణ దృష్టినీ పరిచయం చేశారు. 1867లో కొక్కొండ వేంకటరత్న ‘శర్మ’ బాణభట్టు ‘కాదంబరి’ నుంచి కొంత భాగాన్ని మహాశే్వత పేరిట- సంస్కృతంకన్నా ప్రౌఢంగా అనిపించే గ్రాంథిక తెలుగు భాషలో - వెలయించిన సంగతి కూడా సాహిత్య చరిత్ర చదువుకున్న వాళ్లకి తెలిసిన విషయమే. ఇది, ఈ రంగంలో జరిగిన తొలి ప్రయోగాత్మక కృషి. అయిదేళ్ల తర్వాత, 1872లో, నరహరి గోపాలకృష్ణను చెట్టి స్వతంత్రంగా, తెలుగు వచన ప్రబంధం (నవల) - శ్రీరంగరాజ చరిత్రం అనే సోనాబాయి పరిణయం - రాయడం సయితం ప్రయోగాత్మకతలో భాగమే. దాన్ని చూసి, కందుకూరి వీరేశలింగం 1878లో ‘రాజశేఖర చరిత్రం’ వెలువరించడం కూడా అదే స్ఫూర్తితో చేసిన ప్రయత్నమే. ఇరవయ్యేళ్ల కాలంలో జరిగిన ఈ ప్రయోగాలు మూడూ, తెలుగు సాహిత్యంలో ప్రధానమయిన రచనా ప్రక్రియగా వెలుగుతున్న ‘నవల’ను మనకు అందించాయి. ఛాందసుడిగా ప్రసిద్ధుడయిన కొక్కొండ ఆనాడు తొలి ప్రయోగం తలపెట్టి వుండకపోతే, నవల పాదుకోడానికి మరెంతకాలం పట్టేదో? ప్రయోగాత్మకత - ప్రయోజనాత్మకతల మేలికలయికగా రూపుదిద్దుకున్న ‘క్లాసిక్’ గురజాడ ‘కన్యాశుల్కం’. పందొమ్మిదో శతాబ్దం చివర్లో తెలుగు కథానిక రూపుదిద్దుకుని, గురజాడ చేతిమీదుగానే ప్రౌఢ యవ్వన వయఃపరిపాకంలోకి ప్రవేశించింది. చలం, శ్రీపాద, కొడవటిగంటి, పాలగుమ్మి తదితరులు ఈ ప్రక్రియలో చేసిన ప్రయోగాలు దాన్ని సుసంపన్నం చేశాయి.
వందల సంవత్సరాల నిస్తబ్దతలో కూరుకుపోయిన తెలుగు కవిత్వానికి జీవకళను ప్రసాదించింది నవ్యకవిత్వం అనే భావకవిత్వం. కట్టమంచి, గురజాడ, రాయప్రోలు, అబ్బూరి, బసవరాజు తదితరులు ప్రవేశపెట్టిన విభిన్న కవితా మార్గాలను తర్వాతి తరాల కవులు సుసంపన్నం చేశారు. ఇరవయ్యో శతాబ్దం తొలిపాదంలోనే దేవులపల్లి కృష్ణశాస్ర్తీ సారథ్యంలో ఉద్యమరూపం దిద్దుకున్న భావకవిత్వం, ప్రాబంధిక ధోరణి కవిత్వానికి చెల్లుచీటీ ఇప్పించింది. భావకవిత కూడా ప్రయోగంగానే మొదలయి మహోద్యమంగా మారింది. 1940 దశకం నాటికి పీడితవర్గ పాక్షికత పతాకగా అభ్యుదయ సాహిత్యం పుట్టుకురావడానికి, భావకవిత్వమే పరోక్షంగా కారణమూ ప్రేరణమూ కూడా. కవిత్వంలో శ్రీశ్రీ, కథానికల్లో చాసో తదితరులు చేసిన ప్రయోగాల వల్లనే వాళ్లు ఈ ధోరణికి ప్రతినిధులుగా నిలిచారు. మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు వెనకలుగా, తెలుగులో కాల్పనిక సాహిత్యం కొత్తమలుపు తీసుకుంది. మనోవైజ్ఞానిక నవలా సాహిత్యమే ఈ మూలమలుపు. 1946-47 సంవత్సరాల్లో వచ్చిన ‘అసమర్థుని జీవయాత్ర’ - ‘చివరికి మిగిలేది’ ఈ దిశగా జరిగిన తొలిమలి ప్రయోగాలు. మరో అయిదేళ్లలో, జి.వి.కృష్ణారావు ‘కీలుబొమ్మలు’, రాచకొండ విశ్వనాథశాస్ర్తీ ‘అల్పజీవి’ రావడంతో అరవయి దశకంలో ఈ ప్రక్రియ తెలుగు పాఠకుల హృదయాలను కొల్లగొట్టింది. ప్రయోగాత్మకత ప్రభావం ఇంత కొట్టొచ్చినట్లుగా కనపడిన సందర్భాలు తక్కువ.
ఈ పరిణామాలన్నీ చాటిచెప్తున్న వాస్తవం ఒక్కటే. ప్రయోగం, ప్రయోజనం రెండు చక్రాలుగా ఆధునిక సాహిత్యం ఉరుకులు పరుగులు తీస్తూ పోయింది. ఫలితంగా తెలుగు జాతి సంస్కారం సుసంపన్నం అవుతూ వచ్చింది. సాహిత్యానికి అంతకు మించిన ప్రయోజనం ఏముంటుంది?

-మందలపర్తి కిషోర్ 81796 91822