పెరటి చెట్టు

వాళ్లందరూ వైజ్ఞానికులే కానీ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంప్రదాయ సాహిత్యానికీ, ఆధునిక సాహిత్యానికీ మధ్య సరిహద్దు రేఖ గీయడం చాలా క్లిష్టమయిన వ్యవహారం. ఇది వచనానికీ, నిర్వచనానికీ సంబంధించిన సరళమయిన సమస్యేమీ కాదు. సాహిత్య రంగంలో అనిదంపూర్వమయిన విషయాన్ని గుర్తించడం చాలా కష్టం. అలా అపూర్వం కానిది ఆధునికం కాజాలదు. దానికి నిర్దిష్టమయిన తాత్విక భూమిక ఉండాలి. అలా లేని పక్షంలో ఆ సరిహద్దు రేఖకి సార్వజనికమయిన ఆమోదం దక్కదు. ఉదాహరణకి శాస్త్ర రచన అనేది ఆధునిక సాహిత్యానికి ప్రాతినిధ్యం వహించే అంశాల్లో ముఖ్యమయింది. కానీ, అదొక్కటే ఆధునిక రచయితలకి గీటురాయి కాజాలదు. నన్నయ్యకి సమకాలికుడిగా భావిస్తున్న పావులూరి మల్లన్న ‘సారగణిత సంగ్రహం’ - కావ్యరూపంలోనే అయినప్పటికీ - రాసి వున్నాడు కదా?! పధ్నాలుగో శతాబ్దానికి చెందిన దోనయామాత్యుడు వ్యవసాయం గురించిన ‘వైజ్ఞానిక’ విషయాలతో కూడిన కావ్యం ‘సస్యానందం’ రచించాడు. అతనికన్నా ముందటివాడయిన వావిలాల కూచన్న గురించి ‘ఎపిగ్రాఫియా ఇండికా’ సంపాదకుడు బర్జెస్ కూడా ప్రశంసాత్మకంగా ప్రస్తావించాడట. కూచన్న ఖగోళ (బహుశా జ్యోతిష) శాస్తవ్రేత్తగా హెర్మన్ జాకోబీ ప్రశంసలకు పాత్రమయినవాడనే మాట నిజమే కానీ, అతగాడు ఆధునికుడవుతాడా? అలాగే, పధ్నాలుగో శతాబ్దానికి చెందిన ‘స్వరశాస్త్ర మంజరి’ కర్త గణపనారాధ్యుడు తొలి ‘స్వరయోగి’ అని ముంగిలి నిరూపణ. కొండబత్తిని జగదీశ్వర్‌రావు అనే పరిశోధకుడు పేర్కొన్న పాలకుర్తి సోమనాథుడనే రసవాదజ్ఞుడు, విష్ణ్భుట్టు అనే ‘రసరాజ్యలక్ష్మీ’ కృతికర్త, అతగాడి కుమారుడు - ‘ఆరోగ్యచింతామణి’ కృతికర్త - దామోదరభట్టు, ఇతగాడి కుమారుడు - ‘సారంగధర సంహిత’ కృతికర్త - సారంధరుడు, ‘వైద్య వల్లభ’ కృతికర్త లక్ష్మణ పండితుడు, ‘వైద్యజీవన’ కృతికర్త లోలంబరాజు, ‘బసవరాజీయ’ కృతికర్త బసవరాజు, పానకాల రాయుడు - ఆత్రేయుడు - ధన్వంతరి తదితరులందరూ శాస్త్ర కవులే. కానీ వాళ్లెవ్వరూ ఆధునికులు కారు! వీళ్లందరూ ఇప్పటికి ఏడెనిమిది వందల సంవత్సరాల కిందటే వైజ్ఞానిక శాస్త్ర విషయాలపై గ్రంథాలు రచించినవారే. (సంస్కృతంలో అయితే వేల సంవత్సరాల కిందటే వైద్యం, ఖగోళశాస్త్రం లాంటి వైజ్ఞానికాంశాలపై రాసినవాళ్లు ఉన్నారు!) వాళ్లందరికీ మనం శిరస్సు వంచి నమస్కరించాల్సిందే. కానీ, వీళ్లెవ్వరూ ఆధునికులు కారనే వాస్తవాన్ని కూడా నిష్కర్షగా చె(ఒ)ప్పుకోక తప్పదు!
ఇంతకీ, ఈ వైజ్ఞానికులను ఆధునికులను కాకుండా అడ్డుపడుతున్నదేమిటి?
ఆధునిక విజ్ఞానశాస్త్రం, సమకాలీన సమాజంతో ప్రత్యక్షంగా ముడిపడి వుండాలి. అలా ముడిపడివుండని పక్షంలో అది ఆధునికమయినా కాకపోవాలి; లేదా వైజ్ఞానికమయినా కాకపోవాలి. జీవమనేది ఓ ‘రాసాయనిక ప్రక్రియ’ అనే వైజ్ఞానిక అవగాహన మధ్యయుగాల్లోనే ప్రదర్శించిన మన శాస్తజ్ఞ్రులు తమ భావాలనూ, భావనలనూ నిర్దిష్టంగా ప్రకటించే విషయంలో పాటించిన ప్రమాణాలు దాదాపు అనన్యం. అయితే, ఆధునిక విజ్ఞానంలో అనిర్దిష్టతకి తావులేనట్లే, గోప్యతకీ తావులేదు. వైజ్ఞానిక సమాచారాన్ని పరీక్షించగల, ప్రయోగించగల, ఉపయోగించుకోగల అవకాశం అందరికీ ఉండాలి. ఎందుకంటే, వైజ్ఞానిక సమాచారానికి ప్రాసంగికత అనేది చాలా ముఖ్యం. ఎచ్.జీ.వెల్స్, జెర్ట్రూడ్ స్టెయ్న్, జేమ్స్ జాయ్స్, వర్జీనియా వూల్ఫ్, ఈ.ఎం.్ఫర్‌స్టర్ తదితరుల రచనల్లో చిత్రితమయిన వైజ్ఞానిక విశేషాలు తర్వాతి కాలంలో వాస్తవ రూపం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. జే.బీ.ఎస్. హాల్డేన్, కార్ల్ సైగాన్ లాంటి రచయితల వైజ్ఞానిక దృక్పథం విజ్ఞాన శాస్త్ర పరమయిన చింతనను ప్రత్యక్షంగా ప్రభావితం చేసిన సంగతి కూడా చరిత్ర కెక్కిన విషయమే. భౌతిక ప్రపంచం గురించి బేషరతుగా చేసే విశే్లషణనే వైజ్ఞానికతగా ఆధునికత పరిగణిస్తుంది. శాస్త్ర కావ్యాల్లో ఇటువంటి విశే్లషణకు అవకాశం లేనందువల్లనే అవి ఆధునిక వైజ్ఞానిక రచనలు కాలేకపోయాయి.
ఈ వ్యాసం మొదట్లో ప్రస్తావించుకున్న సాంప్రదాయిక వైజ్ఞానిక ఉద్గ్రంథాలన్నీ పద్యాల్లో ఉన్నాయి; అంటే అవి (ఆనాటి) సామాన్య పాఠకులకి అందుబాటులో లేని రూపంలో ఉన్నాయన్న సంగతి ఓ చారిత్రిక సత్యం. (వేమన, బద్దెన రాసిన రెండు పద్యాలు కూడా నోటికి రాని ఈ తరం గురించి చెప్పనే అవసరం లేదనుకోండి!) ఇది కూడా ఈ రచనలకి ఆధునిక స్వభావం లేదని చెప్పడానికి గొప్ప నిదర్శనం. ఒకప్పుడు గొబ్బూరి వెంకటానంద రాఘవరావు, వసంతరావు వెంకటరావు, విస్సా అప్పారావు, కాళీపట్నం కొండయ్య, కొడవటిగంటి కుటుంబరావు, వేమరాజు భానుమూర్తి, జమ్మి కోనేటిరావు, తదితరులు సామాన్య పాఠకుల ప్రయోజనం కోసం సరళమయిన భాషలో వైజ్ఞానిక భావనలను పరిచయం చేశారు. రాచమల్లు రామచంద్రారెడ్డి, ఏ.వీ.ఎస్. రామారావు, తదితరులు చంద్రలోక యాత్ర ఇతివృత్తంగా రాసిన వైజ్ఞానిక నవలలు పిల్లలకి అత్యాధునిక శాస్త్ర సమాచారాన్ని కూడా అందించిన కాల్పనిక రచనలు. ఆ తర్వాతి తరంలో మహీధర నళినీమోహన్, సి.వి.సర్వేశ్వరశర్మ, చందు సుబ్బారావు తదితరులు - మన తరంలో దేవరాజు మహారాజు, నాగసూరి వేణుగోపాల్, మర్ల విజయ కుమార్, ఆనందేశి నాగరాజు లాంటి వాళ్లు సామాన్య పాఠకుల ప్రయోజనం కోసం సరళమయిన భాషలో అత్యంత క్లిష్టమయిన వైజ్ఞానిక భావనలను పరిచయం చేస్తున్నారు. ఇదే, ఆధునిక శాస్త్ర రచయితల వౌలిక, ప్రాథమిక లక్షణం.
మనం ఇంతకు ముందు చెప్పుకున్న ‘శాస్త్ర కవులు’ సయితం అదే ప్రయోజనం ఆశించి రచనలు చేశారని చెప్పడానికి ఆధారాలున్నాయా? కచ్చితంగా లేవు! ఒకవేళ వాళ్ల లక్ష్యం కూడా సామాన్య పాఠకుల ప్రయోజనం కోసం సరళమయిన భాషలో అత్యంత క్లిష్టమయిన వైజ్ఞానిక భావనలను పరిచయం చెయ్యడమే అయితే, ఆ కావ్యాలు ఛందోబద్ధంగా, ప్రౌఢమయిన భాషలో విరచితమయి వుండవు. నేటితో పోలిస్తే, వందల సంవత్సరాల కిందట అక్షరాస్యత, విద్యావ్యాప్తి చాలా పరిమితంగా ఉండేవి. వాటికి దారితీసిన సామాజిక పరిస్థితులు అందరికీ తెలిసినవే. ద్విజులు కానివాళ్లలో ‘చదువు సంధ్యలు’ అనూహ్యమయిన రోజులవి. ప్రతాప రుద్రుడు, కృష్ణదేవరాయలు, మాలిక్ ఇబ్రాహిమ్ తదితరులను చూపించి, ఈ వాదనను పూర్వపక్షం చెయ్యాలనే ప్రయత్నం వృథా. ‘నా విష్ణుః పృథ్వీపతిః’ లాంటి మినహాయింపుల పుణ్యమాని, ద్విజేతరులయిన పాలకులు కొందరికి దక్కిన మహద్భాగ్యాన్ని ఓ సార్వజనిక సత్యంగా చూపించాలనుకోవడం నిష్ఫలం. అటువంటి సామాజిక నేపథ్యంలో - ఆనాటి సామాజిక నియమ నిబంధనలకు తలొగ్గి - శాస్తక్రావ్యాలు వెలువరించినందువల్లనే వాళ్ల వైజ్ఞానికతను అంగీకరిస్తూనే, ఆధునికతను తిరస్కరించవలసి వస్తోంది. ఇక్కడ ఆధునికతను కేవలం కాలసూచికగా తీసుకుని, ఈ కవుల్ని ఆధునికులు కానివాళ్లుగా జమకట్టడం లేదని గ్రహించ ప్రార్థన. మన దృష్టి చారిత్రిక దృక్పథం. ఈ దృక్పథానికి కాలం కచ్చితంగా ఓ ప్రాతిపదికే కానీ, ఆ ‘కాలం’ సమయ గణనకి పరిమితమయిన గడియారం ముల్లు కాదని మనసులో పెట్టుకోవాలి. చారిత్రిక పరిణామాన్ని కొలిచే అనేక ప్రక్రియల్లో కాలం కూడా ఒకటి. మనకు కాలంతో అంతవరకే ప్రమేయం.

-మందలపర్తి కిషోర్ 81796 91822