పెరటి చెట్టు

వేనవేల వేగుచుక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పందొమ్మిదో శతాబ్దం ప్రథమార్ధంలోనే తెలుగునాట, ముఖ్యంగా ఆనాటి సంకీర్ణ మద్రాసు రాష్ట్రంలో, సామాజిక పరిణామ పవనాలు పెద్దపెట్టున రేగాయి. ఆనాటి మద్రాసు రాష్ట్రానికి రాజధానీ నగరంగా ఉన్న చెన్నపట్నం ఈ పరిణామ శీలతకు కేంద్రంగా నిలిచింది. చెన్నపట్నం కాకుండా, ఉత్తర సర్కారులుగా పిలిచే మధ్య కోస్తా - ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా ఈ సామాజిక పరిణామ ప్రభంజనం విజృంభించింది. కాగా, ఆంధ్రదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం, సంఘ సంస్కరణ ఉద్యమం చెట్టాపట్టాలు వేసుకునే సాగాయి. తరచు ఈ రెండు ఉద్యమాల మధ్యా సరిహద్దు రేఖలు చెదిరిపోయి, చెరిగిపోతుండేవి. దానికి కారణం అందరికీ తెలిసిందే. ఆ ఉద్యమంలోనూ, ఈ ఉద్యమంలోనూ అగ్రపీఠికన ఉన్న వ్యక్తులు ఒక్కరే కావడం వల్లనే ఇలా జరుగుతూ వచ్చింది. అయితే, ఇందుకు మినహాయింపులు లేకపోలేదు. కందుకూరి వీరేశలింగం అలాంటి పెద్ద మినహాయింపుల్లో ముఖ్యులు. తెలుగు మేధావులకి వౌలికంగా ఆలోచించడమూ, వాస్తవికంగా వివేచించడమూ, విశే్లషించుకోవడమూ నేర్పించిన డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంటారేమో! ఇరవయ్యో శతాబ్ది తొలిపాదంలో కూడా, వీరేశలింగం, సీ.ఆర్.రెడ్డి గ్రాంథిక వాదులుగానే కొనసాగారు. 1920 దశకంలో, ‘మాలపల్లి’ నవలని ఆనాటి జస్టిస్ పార్టీ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ చర్యని ఖండిస్తూ కట్టమంచి, ఆనాటి విద్యామంత్రి రామస్వామి అయ్యర్‌కి ఓ లేఖ రాస్తూ, తనకి నచ్చిన ఆధునిక రచనలు రెండూ (గురజాడ ‘కన్యాశుల్కం’, ఉన్నవ ‘మాలపల్లి’) ప్రత్యర్థి వర్గానికి - వ్యావహారిక వాదానికి - చెందినవే కావడం గురించి సూటిగా ప్రస్తావించారు. అయినప్పటికీ, ‘మాలపల్లి’పై నిషేధాన్ని ఎత్తివేయాల్సిందిగా డిమాండ్ చెయ్యగలగడం కట్టమంచి వ్యక్తిత్వంలోని విశేషాంశ. ఆధునిక, ప్రగతిశీల సామాజిక భావనల వ్యాప్తికి వీరిద్దరూ చేసిన దోహదాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే తప్ప ఈ వైరుధ్యంలోని తీవ్రత పూర్తిగా బోధపడదు.
సంఘ సంస్కరణ రంగంలో ఆధునిక భావాల వ్యాప్తి లక్ష్యంగా వీరేశలింగం ‘వివేక వర్ధని’ పత్రికని స్థాపించి చేసిన సేవ చరిత్రకెక్కిన వాస్తవమే. మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, పరాశర స్మృతి తదితర హైందవ ‘శాస్త్రాల’ నుంచి విస్తృతంగా ఉటంకిస్తూ వితంతు పునర్వివాహం ధర్మబద్ధమేనని ఆయన రుజువు చేశారు. అప్పట్లో న్యాయమూర్తిగా ఉండిన మహదేవ గోవింద రనడే, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, రాజా రామమోహన్ రాయ్, జి.ఎస్.కపర్దే, మహేంద్రలాల్ సర్దార్, ఆర్.జి.్భండార్కర్ తదితర జాతీయ స్థాయి మేధావులతో సన్నిహిత సంబంధాలు పెంచుకున్న సంఘ సంస్కరణ సేనాని వీరేశలింగం, యువజనుల అండదండలతో, పందొమ్మిదో శతాబ్ది చివర్లో - 1881లో - ఈ సంస్కరణ సేనాని రాజమండ్రిలో మొట్టమొదటి వితంతు పునర్వివాహం జరిపించి చరిత్ర సృష్టించారు. ఇక, గురజాడ అప్పారావు, ‘కన్యాశుల్కం’ నాటకం ద్వారానూ - ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ ‘ముత్యాల సరాలు’ ‘లవణరాజు కల’ లాంటి కవితల ద్వారానూ - ‘అసమ్మతి పత్రం’ లాంటి భాషాశాస్త్ర పరిశోధన పత్రం ద్వారానూ సాంస్కృతిక రంగంలో కాలం చెల్లిన భూస్వామ్య భావజాలాన్ని తిప్పికొట్టారు. గిడుగు రామమూర్తి ‘నేటి తెలుగు: ఒక నివేదిక’ ‘ఆంధ్ర పండితభిషక్కుల భాషా భేషజం’ ‘శ్రీసూర్యరాయాంధ్ర నిఘంటు విమర్శనం’ ‘బాలకవి శరణ్యం’ ‘సోర (సవర) భాష; వివరణాత్మక వ్యాకరణం’ తదితర గ్రంథాల ద్వారా భాషా పరిశోధన రంగంలో భూస్వామ్య భావజాలంతో ముఖాముఖీ తలపడ్డారు. చివరికి, తన పాండిత్య గరిమతోనూ, వాదనా పటిమతోనూ వీరేశలింగం లాంటి గ్రాంథిక వాదిని వ్యావహారిక భాషోద్యమం వైపు మరల్చగలిగారు గిడుగు!
సామాజిక రంగంలో కందుకూరి, సాంస్కృతిక రంగంలో గురజాడ, భాషారంగంలో గిడుగు భూస్వామ్య భావజాలంపై పోరాటాలకి నేతృత్వం వహించారని మా గురువుగారు రాంభట్ల కృష్ణమూర్తి అనేవారు. ఈ ముగ్గురూ, ఒకరి రంగంలో మరొకరు అడుగుపెట్టలేదని కాదు - ఆయా రంగాల్లో సారథ్య భారం ఒక్కొక్కరు వహించారని అర్థం. ఈ సాంస్కృతిక - సామాజిక పరిణామం ఉద్యమానికి నేతృత్వం వహించిన మేధావులు ప్రధానంగా రెండు రకాలు. గురజాడ, కట్టమంచి తదితరులు బ్రిటిష్ ప్రగతిశీల భావజాలం చేత ప్రత్యక్షంగా ప్రభావితులయినవారు. కాగా, వీరేశలింగం, చిలకమర్తి, గిడుగు రామమూర్తి తదితరులపై బ్రహ్మ సమాజం ప్రభావం అధికం. అందుకే, ఈ సామాజిక - సాంస్కృతిక ఉద్యమాల విమర్శకులు అవి ఎరువుతెచ్చుకున్న భావాలపై ఆధారపడిన ఉద్యమాలని అభ్యంతరం చెప్పేవారు.
నిజానికి తెలుగునాట సామాజిక - సాంస్కృతిక సంస్కరణ ప్రయాణ పతాకమెత్తిన తొలి వ్యక్తి. ఆ భావాలను మరెక్కడి నుంచో దిగుమతి చేసుకున్న వాడు కాదు. తను కళ్లారా చూసిన జీవితంలో, మార్పు - చేర్పులు అవసరమని అనిపించిన విషయాలన్నింటి పైనా విపులమయిన వివరణలతో ఆ వ్యక్తి ఓ పుస్తకమే రచించారు. ఆయన పేరు స్వామినీన ముద్దు ‘నరసింహ్మం’ నాయుడు (1792-1856). పందొమ్మిదో శతాబ్ది ఉత్తరార్ధం మొదట్లోనే, ఆయన రాసిన పుస్తకం పేరు ‘హితసూచని’. తెలుగు నేలపై, భాష, విద్య, విజ్ఞానం, సంఘ సంస్కరణ, హేతువాదాలనే బీజాలను చల్లిన తొలి సంస్కర్త ముద్దునరసింహం. ఆయన మరణించిన ఆరేళ్లకి, నరసింహం కుమారులు రంగప్రసాదరావు ‘హితసూచని’ని ప్రచురించారు. నిజానికి, ‘ఏనుగుల వీరాస్వామి అల్లించిన కాశీయాత్ర చరిత్ర’ హితసూచని కన్నా పాతికేళ్లు ముందే వాడుకభాషలో, కాల్పనికేతర రచనగా వెలువడి, చరిత్ర సృష్టించింది. కానీ, వీరాస్వామి ఎంత ఉదారవాది అయినప్పటికీ, సంఘ సంస్కరణ విషయంలో ఆయన ప్రదర్శించిన ఆసక్తి పరిమితమే. అయితే, ముద్దు నరసింహం గురించి అలా చెప్పలేం.
భారతదేశంలో సంఘ సంస్కరణ భావాలు ముందుగా బంగాల్‌లో పుట్టాయనీ, బ్రహ్మసమాజంతోపాటు అవి ఆంధ్రదేశానికి దిగుమతయ్యాయనే మాట అర్ధసత్యం మాత్రమేనని గిడుగు రామమూర్తి 1924లోనే చెప్పారు. తాను - గురజాడ కనిపెట్టి ప్రాచుర్యంలోకి తెచ్చినట్లు అప్పటికే చరిత్రకెక్కిన విషయం కూడా అలాంటిదేనని ఆయన నిజాయితీగా వెల్లడించారు. ‘వ్యావహారిక భాష ప్రయోజనాన్ని గుర్తించి ఆ వాదాన్ని ప్రారంభించినవాడు ఈ ముద్దు నరసింహం. అంతేకాదు - సంఘసంస్కారము, వితంతు వివాహము, బ్రహ్మ సమాజము ద్వారా బంగాళాఖాతం నుంచి ఆంధ్ర దేశంలోకి దిగుమతి కావడం నిజం కాదు. అంతకు పూర్వమే, మన తెలుగువాడొకడు ఈ ఉద్యమాన్ని తలపెట్టి ప్రచారం చేసినవాడున్నాడు అని రుజువు చెయ్యడానికి ఈ హితసూచని ఆధారం. అందుచేతను ఈ గ్రంథాన్ని తిరిగి అచ్చువెయ్యా’లని గిడుగు ‘వైతాళికుడు’ ముద్దుకృష్ణకి గట్టిగా బోధించారట. ముద్దుకృష్ణకి ముత్తాతగారే ‘హితసూచని’ కర్త ముద్దు నరసింహం. అందుకే హితసూచని పునర్ముద్రణ ‘ప్రయత్నం జరిగే లోపున ముందు మీ తండ్రిగారిని అడిగి వారి తాతగారి జీవిత విశేషాలు కనుక్కొని ఉపోద్ఘాతం రాసి పంపం’డని గిడుగు మేస్టారు ముద్దుకృష్ణకి కర్తవ్యబోధ చేశారట కూడా. ‘హితసూచని’ 1986 ముద్రణకి రాసిన ‘ప్రవేశిక’లో ఆరుద్ర చెప్పిన విషయాలివి. ముద్దుకృష్ణ తన కర్తవ్యం తాను నిర్వర్తించారట కానీ, ‘రామమూర్తిగారి హిత సూచని ప్రచురణ ప్రయత్నం కొనసాగలేద’ని - ‘సంస్కృతి’ పత్రిక 1959 మే ఒకటో తేదీ సంచికలో - ఆయనే చెప్పారు. నూట పాతికేళ్ల తర్వాతగానీ, ఈ చరిత్రాత్మక గ్రంథం పునర్ముద్రణ భాగ్యానికి నోచుకోలేక పోయింది. మన జాతి లక్షణం అంత సుందర ముదనష్టంగా ఉంది మరి!

-మందలపర్తి కిషోర్ 81796 91822