పెరటి చెట్టు

కాల్పనికం కాదు కానీ, సృజనాత్మకతమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సాహిత్యానికి ఆధునికత పరిచయం చేసిన సాహిత్య ప్రక్రియ లన్నింట్లోకీ, ప్రచురమయినదీ - ఇప్పటికీ అత్యధికుల ఆదరణకి పాత్రమవుతున్నదీ - కాల్పనికేతర సాహిత్యమే. కవిత, కథానిక, నవల నాటకం తదితర కాల్పనిక సాహిత్య ప్రక్రియల్లో ఒకదాన్ని మెచ్చిన వాళ్లకి మరొకటి నచ్చకపోవచ్చు. కానీ, కాల్పనికేతర సాహిత్యాన్ని ఇష్టపడని వాళ్లు ఉండరు. బహుశా, ఆధునిక జీవనంలో కాల్పనికేతర సాహిత్యం సంతరించుకున్న ప్రాధాన్యమే దానికి కారణం అయివుండొచ్చు. మొదట్లో ఈ రంగం ప్రధానంగా సమాచార వ్యాప్తికే అంకితమయినప్పటికీ, క్రమంగా కాల్పనికేతర సాహిత్యంలో సృజనాత్మకత వెల్లివిరిసింది. వర్ణనాత్మక, వాదనాత్మక, వైజ్ఞానిక, సాంకేతిక, చారిత్రిక రచనలు - జీవిత కథలూ, ఆత్మకథలూ, అనుభవాలూ, జ్ఞాపకాలూ, పత్రికా రచనలూ - లేఖలూ, దినచర్యలూ, పాఠ్యపుస్తకాలూ, పరిశోధన పత్రాలూ, వ్యాసాలూ, సమీక్షలూ, విమర్శలూ వగయిరాలన్నీ కాల్పనికేతర సాహిత్యంలో భాగమే.
తెలుగునాట, ఆధునిక రచనా దృక్పథానికీ - భాషా సాహిత్యాలకీ ఆదికావ్య మనదగిన గ్రంథం ‘ఏనుగుల వీరాస్వామి అల్లించిన కాశీయాత్ర చరిత్ర’. 1830 - 31 సంవత్సరాల్లో వీరాస్వామి (1770-1836) చెన్నపట్నం - నేటి చెన్నై - నుంచి కాశీకి సపరివారంగా యాత్ర చేశారు. ఆ సందర్భంగా తనకు ఎదురయిన అనుభవాలను ఆయన ఎప్పటికప్పుడు దినచర్య రూపంలో అక్షరబద్ధం చేశారు. తన మిత్రుడు కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్లకి ఈ అనుభవాలను లేఖల రూపంలో ఎప్పటికప్పుడు పంపుతూ వచ్చారు. వీరాస్వామి చెన్నైకి తిరిగివచ్చిన తరువాత ఈ యాత్ర చరిత్రను పుస్తకంగా ముద్రించాలని గట్టిగా ప్రయత్నించారు గానీ, ఆయన జీవిత కాలంలో అది సాధ్యంకాలేదు. విచిత్రమయిన విషయమేమిటంటే, ఈ తెలుగు రచన, ముందుగా తమిళ అనువాదంగా అచ్చయింది. ఇది, మరాఠీ భాషలోకి కూడా అనువాదమయి, అచ్చయినట్లు తెలుస్తోంది కానీ, ఆధారాలు అలభ్యం. వీరాస్వామి కన్నుమూసిన రెండేళ్లకి మాత్రమే ‘కాశీయాత్ర చరిత్ర’ తెలుగులో మొట్టమొదటి ముద్రణగా వెలువడింది. పందొమ్మిదో శతాబ్దం ముప్పై దశకంలో, విపులమయిన యాత్ర చరిత్ర వెలువరించాలని యోచించడమే అరుదయిన విషయం కాగా, దాన్ని ఆనాటి చదువుకున్నవారి వ్యవహార భాషలో వెలువరించాలనుకోవడం మరింత విశేషమయిన యోచన. ఇక, వీరాస్వామి రచనా శైలి అనుపమానం. యాత్రికులకి వుపయోగపడుతుం దనుకున్న ప్రతి చిన్న వివరాన్నీ ఈ చరిత్రలో పొందుపరిచారు రచయిత. రహదారులూ, దేవాలయాల నిర్వహణలో అలసత్వాన్నీ, జమీన్దార్ల డబ్బు యావనీ నిశితంగా విమర్శించారు. ‘కాశీ యాత్ర చరిత్ర’లో మొదలయిన కాల్పనికేతర రచనలు సాహిత్య రంగం రూపరేఖల్ని మొత్తంగా మార్చేశాయి. అటు రచయితల్లోనూ, ఇటు పాఠకుల్లోనూ, మరోవైపు ప్రచురణకర్తల్లోనూ కొత్త తరాన్ని ఆవిష్కరించిన ఘనత ఈ కాల్పనికేతరానికి దక్కింది. మన సాహిత్యానికి నిజమయిన ఆధునిక స్వభావాన్ని సంతరించిన కీరిత కూడా ఈ ప్రక్రియకే దక్కింది!
అయితే, కాల్పనికేతర సాహిత్యానికి దక్కిన ఆదరణ ‘పడిలేచే కడలి తరంగం’ మాదిరిగా ఉంది. పందొమ్మిదో శతాబ్దంలో, తెలుగులో పత్రికలు మొదలయిన కొత్తలో, కాల్పనికేతర సాహిత్యం ఓ వెలుగు వెలిగింది. ‘వర్తమాన తరంగిణి’ లాంటి పత్రికల్లో దైనందిన జీవితానికి సంబంధించిన అనేక సమస్యలపై సామాన్య జనం మాట్లాడుకునే భాషలో ఎన్నో వార్తా కథనాలూ వ్యాఖ్యలూ వచ్చాయి. ఆనాటి సాహిత్య భాషను భద్రపరచాలనే దూరదృష్టితో ‘తెలుగు సూర్యుడు’ సీ.పీ.బ్రౌన్ వర్తమాన తరంగిణి పత్రికలో అచ్చయిన సంపాదక లేఖలును నకలు రాయించి పెట్టారు. తర్వాతి రోజుల్లో గిడుగు రామమూర్తి వాటికి నకళ్లు రాయించుకున్నారు. ‘పరిశోధక రాక్షసుడు’ బంగోరె వాటిని సంపాదించి, ‘బ్రౌన్ ఆధారంగా తెలుగు జర్నలిజం చరిత్ర’ అనే చక్కని పరిశోధక గ్రంథం రాశారు.
‘వృత్తాంతి’ వ్యవస్థాపకుడు - సంపాదకుడు మండిగల వెంకట రాయ శాస్ర్తీ, ‘వర్తమాన తరంగిణి’ వ్యవస్థాపక సంపాదకుడు సయ్యద్ రహమతుల్లా - తర్వాతి రోజుల్లో ఆ పత్రికను జయప్రదంగా నిర్వహించిన పువ్వాడ శేషగిరిరావు, ‘ఆంధ్రభాషా సంజీవని’ యజమాని కొక్కొండ వెంకట రత్నం, ‘వివేకవర్ధని’ వ్యవస్థాపకుడు - సంపాదకుడు కందుకూరి వీరేశలింగం, ‘అముద్రిత గ్రంథ చింతామణి’ వ్యవస్థాపకుడు - సంపాదకుడు పూండ్ల రామకృష్ణయ్య, ‘ఆంధ్ర పత్రిక’ ‘్భరతి’ సంపాదక యజమాని కాశీనాథుని నాగేశ్వరరావు తదితరులు కాల్పనికేతర సాహిత్య రంగాన్ని విపులమూ, సుసంపన్నమూ చేశారు. వాళ్ల తరం ప్రభావశీలంగా ఉండిన రోజుల్లో కాల్పనికేతర సాహిత్యానికి మంచి ఆదరణ దక్కింది. క్రమంగా - కథానికా, నవలా, పద్య నాటకాలూ, భావకవిత్వం వ్యాప్తి చెందిన కొద్దీ కాల్పనికేతర సాహిత్యానికి ఆదరణ తగ్గుతూ పోయింది. స్వాతంత్య్రానంతర కాలంలో ఈ ధోరణి స్థిరపడిపోయింది. 1960 దశకంలో, కాలక్షేపం సీరియల్ నవలలు దిన వార మాసికల్లో పాతుకుపోయిన తర్వాత, కాల్పనికేతర సాహిత్యానికి దినపత్రికలే దిక్కయయ్యా. ఎన్నికలూ, యుద్ధాలూ, అత్యవసర పరిస్థితి విధింపు లాంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కాల్పనికేతర సాహిత్యానికి సామాన్య పాఠకుల నుంచి కొద్దో గొప్పో ఆదరణ దక్కేది. మిగతా సమయాల్లో సంపాదకీయాలను చదివే వారి సంఖ్య అయిదు శాతానికి అటూఇటూగా ఉండేది. కాల్పనికేతర సాహిత్యం చదివే వారి శాతం అంతకన్నా ఒకటి రెండు శాతం ఎక్కువ ఉండేదేమో!
అయితే, ఇదే పరిస్థితి కలకాలం కొనసాగలేదు. ‘ఇండియన్ లిటరేచర్’ పత్రిక 1982 నవంబర్ - డిసెంబర్ సంచికలో, తెలుగు కాల్పనికేతర సాహిత్యం స్థితిగతుల గురించి సీనియర్ జర్నలిస్ట్ ధూళిపూడి ఆంజనేయులు ఓ వ్యాసం ప్రచురించారు. కాల్పనికేతర సాహిత్యం క్రమంగా గిరాకీ పెంచుకున్న వాస్తవాన్ని ఆంజనేయులు తన వ్యాసంలో నమోదు చేశారు. ఈ పరిణామానికి ప్రధాన కారకులు పత్రికలవారే. వంటల గురించి మొదలుకుని, యాత్రా సాహితి వరకూ ప్రతి ఒక్క రంగం గురించీ చదివే అభిరుచిని పెంచడంలో పత్రికలు కీలకపాత్ర పోషించాయి. కాల్పనికేతర సాహిత్యం అభిమానుల్లో అన్ని వర్గాల పాఠకులూ ఉండడం విశేషం. పుస్తకాలూ - సినిమాలూ - రాజకీయ ధోరణులను పరిచయం చేస్తూ రాసే ‘ఊతకర్ర’ వ్యాసాలకు ఇరవయ్యో శతాబ్ది ఉత్తరార్ధంలో గిరాకీ పెరుగుతూ వచ్చింది. 1970ల నాటి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ తరహా రచనలకి ప్రాచుర్యం పెరిగింది. గొర్రెపాటి వెంకటసుబ్బయ్య, తుర్లపాటి కుటుంబరావు, పరకాల పట్ట్భా రామారావు తదితరులు కొత్తతరం పాఠకుల ఆసక్తినీ, కుతూహలాన్నీ తీరుస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే అంబడిపూడి, విజయ బాపినీడు లాంటి రచయితలు- సర్వజ్ఞుల మాదిరిగా - ఏ విషయం గురించయినా రాయగలిగే పరిస్థితి ఏర్పడింది. ఇక, వ్యక్తిత్వ వికాస సాహిత్యం కుప్పలు తెప్పలుగా వెలువడ్డం మొదలయిన తర్వాత కాల్పనికేతర సాహిత్యం తాలూకు వాణిజ్య స్వభావంలో వౌలికమయిన మార్పు వచ్చింది. ఒకప్పుడు వాణిజ్య నవలలు రాయడమే వృత్తిగా వెలిగిన రచయితలు, ప్రక్రియ మార్చి, వ్యక్తి వికాస నిపుణులుగా అవతరించడమే ఈ వౌలికమయిన మార్పునకు నిదర్శనం. కాల్పనికేతర సాహిత్య రచన ఇప్పుడు ఒకే ప్రక్రియగా కాక, శాఖోపశాఖలుగా విస్తరించి, ముద్రణ రంగానికి జీవశక్తిని అందించే ప్రధానమయిన వనరుగా పరిణమించింది. వర్తమానమే కాదు, భవిష్యత్తు సయితం కాల్పనికేతర సాహిత్యానిదే అనడంలో సందేహం లేదు!

-మందలపర్తి కిషోర్ 81796 91822