పెరటి చెట్టు

నవ నవోనే్మష - గంగా కూలంకష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా, మన దేశం స్వతంత్రం కావడానికి ముందు వెనకలుగా తెలుగు నవల ఓ మూల మలుపు తీసుకుంది. అప్పటికి దాదాపు రెండు దశాబ్దాలుగా, ‘వేయిపడగలు’ విప్పి, సామాజిక ‘మైదానం’లో వీర విహారం చేస్తూండిన తెలుగు నవల నెమ్మదిగా మనసు పొరల్లోకి తన ప్రవాహాన్ని మళ్లించింది. అప్పటివరకూ ‘్భవ కవిత్వం’గా ఉండిన భావకవిత్వం దేశభక్తి నావాలను సంతరించుకుని మధ్యతరగతి - సామాజిక - మనోభావాలకు వేదికగా మారుతూండిన దశ అది. జైళ్లకు వెళ్లివచ్చిన సాహిత్యోపజీవుల ద్వారా కొంతా - ఇంగ్లిషు సాహిత్య పఠనం ద్వారా ఇంకొంతా, బంగాలీ తదితర దిగుమతి సాహిత్యాల ప్రభావంలో మరికొంతా - కొత్త భావాలూ భావనలూ చెలామణీలోకి వచ్చిన దశ అది. మరోవైపు, గురజాడ చూపించిన సాహిత్య మార్గం తెలుగు రచయితల ఆలోచనల్ని తీవ్రంగా ప్రభావితం చేయడంతో అభ్యుదయ భావాలు అంకురిస్తున్న దశ అది. సరిగ్గా అదే దశలో తెలుగు నవల సామాజిక ఇతివృత్తాలను వదిలి, మానసిక ప్రపంచంలోకి నిదానంగా దారి మళ్లించుకున్న తరుణమది. 1946-47 సంవత్సరాల్లో వచ్చిన రెండు నవలలు - బహుముఖ ప్రజ్ఞావంతుడు త్రిపురనేని గోపీచంద్ నవల ‘అసమర్థుని జీవయాత్ర’, బుచ్చిబాబు నవల ‘చివరికి మిగిలేది!’- తెలుగులో మనోవైజ్ఞానిక సాహిత్యం ప్రభవించి, వికసించడానికి రంగం సిద్ధం చేశాయి. మరో అయిదేళ్లకి, రాచకొండ విశ్వనాథ శాస్ర్తీ వెలువరించిన ‘అల్పజీవి’ నవల భారతి లాంటి పత్రికలో ధారావాహికంగా వెలువడడం దాని ప్రామాణాకతకు నిదర్శనం.
’50వ దశకంలో డాక్టర్ వుప్పల లక్ష్మణరావు మొదలుపెట్టిన ‘అతడు-ఆమె’ అమోఘమయిన ప్రయోగం. రెండు దశాబ్దాల తర్వాత అది మారాకు తొడగడం మరో ప్రయోగం! డయరీ రూపంలో ఉన్న ఈ నవల నాయికా నాయకుల అంతరంగ తరంగాలను అక్షరాల రూపంలో మన ముందుంచింది. శాంత-శాస్ర్తీ ఓ తరం నాయికా నాయకులు. వాళ్లకి తెలంగాణలో దొరికిన అనాథ సుభ, ఆమెని వౌనంగా ఆరాధించే నిరుపేద ఇంజినియర్‌లు రెండో తరం నాయికా నాయకులు. ‘అతడు - ఆమె’ కూడా పాత్రల మనోవ్యాపారానే్న ప్రధానంగా చిత్రించినప్పటికీ, ఆ నవల ఇతివృత్తానికి ఉన్న సామాజిక స్వభావం తిరుగులేనిది. ఈ ప్రయోగంలో అంతర్నిహితంగా ఉండిన ఓ బలమయిన బలహీనతను అప్పట్లో ‘త్రివేణి’ పత్రిక - 1951 జులై సంచికలో - వచ్చిన సమీక్ష ఎత్తి చూపించింది. ఉత్తరాంధ్ర శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబికుల భాషలోనే అన్ని పాత్రలూ మాట్లాడుకోవడం ఓ మంచి మనోవైజ్ఞానిక నవలకు ఎంత మాత్రం తగని విషయం. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్ర్తీ లాంటి మహాశిల్పులు పాత్రల సంభాషణల విషయంలో ఎక్కడికక్కడ గొంతుమార్చడం గొప్ప శిల్ప రహస్యం. మహీధర్ రామమోహనరావు తొలి నవల ‘రథచక్రాలు’లోనే ఈ సంవిధానం పాటించడం కనిపిస్తుంది. మహీధర ప్రస్తావన వచ్చింది కనుక ఒక్క విషయం - ఆయన రాసిన నవలకి ‘ఇక ఈ కథ ఇంతే!’ లాంటి రచన తెలుగులో మరొక్కటి కూడా కనిపించదంటే అతిశయోక్తి కాదు.
కాలంతోపాటు జీవిత సాహిత్యాలు సుసంపన్నమవుతాయనే సామాన్య సూత్రానికి అపవాదులూ ఉన్నాయి. ‘60 దశకం నుంచీ, తెలుగు కాల్పనిక సాహిత్య ప్రచురణల్లో సింహభాగంగా ఉంటున్న కాలక్షేపం సాహిత్యం అలాంటిదే. చాలా భాషల్లో రచయితల సంస్కార విశేషాలు పాఠకులను ప్రభావితం చేస్తుంటాయి. ఇంగ్లిష్ లాంటి భాషల్లో, పాఠకుల అభిరుచులే రచయితలను (నిజానికి, ప్రచురణకర్తలను!) నియంత్రిస్తూ వుంటాయి. (పాశ్చాత్య దేశాల్లో చాలా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులే తమ ఉపాధ్యాయుల బోధన ప్రతిభను అంచనాకట్టి మార్కులిస్తుంటారు. ఇదీ అలాంటిదే!) కాగా, తెలుగులో రచయితల ప్రభావశీలతకీ, సామాన్య పాఠకుల అభిరుచికీ మధ్య పెద్ద దూరం కనిపించకపోవడం ఓ విశేషం. ముఖ్యంగా, కాలక్షేపం నవలల విషయంలో ఇది కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ’30 దశకంలో వెలువడిన కొవ్వలి లక్ష్మీనరసింహారావు నవలలు, వాటికి చెల్లెళ్ల లాంటి జంపన చంద్రశేఖరరావు నవలలూ - సినిమాలూ మొట్టమొదటిసారి ఈ విషయాన్ని రుజువు చేసాయి. ఇటీవలే అమెరికాలో కన్నుమూసిన ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణి ఈ విషయంలో తుదితీర్పు వెలువరించారు. ఆవిడ విజయ రహస్యం, పాఠకుల ‘నాడి’ని పట్టి, దానికి తగినట్లుగా రచనలు చెయ్యగలగడమే. కాలక్షేపం సాహిత్యం సృజించే రచయితల్లో ఎవరయినా సులోచనా రాణి గారిలా రాయకపోవడానకి ఏకైక కారణం, అలా రాయడం చేతకాకపోవడమే. సులోచనారాణి కన్నా ముందే - తృతీయ శ్రేణి బంగాలీ మూస నవలల ఫక్కీలో - చక్రభ్రమణం లాంటి నవలలు రాసిన కోడూరి కౌసల్యాదేవి లాంటి వాళ్లు, రచయితలకీ పాఠకులకీ మధ్య - సంస్కారం విషయంలో - పెద్ద ఎడం లేదన్న వాస్తవాన్ని రుజువు చేశారు. తెలుగు సినిమా పరిశ్రమాధిపతులు, అవే నవలల్ని సినిమాలు తీసి, బాక్సాఫీసులు బద్దలుకొట్టి మరీ, ఇదే నిజాన్ని నిర్ధారించారు.
వ్యాపారానికి బొత్తిగా పనికిరాని విషయం పాతదనం. మిగతా రంగాల మాట ఎలా వున్నా, వ్యాపార రంగంలో పాత ఎప్పుడూ రోతే. ఎడార్లలో ఇసుకనీ, సముద్రం ఒడ్డున ఉప్పుని అమ్మగలిగే వ్యాపారవేత్తలకి, కొత్తను వింతగా చెలామణీ చెయ్యడం ఓ లెక్కా? ఎటొచ్చీ అలా చెయ్యడానికి వాళ్లకి ‘తగిన’ మనుషులు కావాలి. వాళ్లు రచయితలు మాత్రమే కారు - ఫక్తు వాణిజ్య రచనల్ని పాఠకులకి చేర్చగలిగే పత్రికలు పుట్టుకురావాలి. వాటిని ఆ లక్ష్యం దిశగా నడపగల సమర్థులయిన సంపాదకులు కావాలి; సంపాదకుల మాట విని పాఠకులకి ‘కావల్సిన’ వేడివేడి పకోడీల్లాంటి రచనల్ని అల్లగలిగే వాణిజ్య విధేయ రచయితలూ కావాలి. ఈ త్రివేణీ సంగమం కూడిన నేపథ్యంలో, కాలక్షేపం సాహిత్యం లక్షలాది పాఠకుల హృదయ సామ్రాజ్యాన్ని అవలీలగా గెల్చుకోవడం అసాధ్యమేం కాదని తెలుగునాట రుజువయిన విషయమే. ఎటొచ్చీ ఈ క్రమంలో, మధ్యతరగతి మర్యాదస్తుల ఏలుబడిలో ఉండిన పత్రికలు నెమ్మదిగా ఆ మర్యాదలని అతిక్రమిస్తూ పోతాయి. దెయ్యాలూ, భూతాలూ, మంత్రాలూ, చింతకయలూ, అపరాధ పరిశోధనలూ, పరిశోధకుల అపరాధాలూ మర్యాదస్తుల పత్రికల్లో పరుచుకుపోతాయి. అచిరకాలంలోనే పత్రికల ముద్రణకీ నోట్ల ముద్రణకీ పెద్ద తేడా లేకుండా పోతుంది. ఈ పరిణామాల ఫలితంగా, తెలుగు నవల గుర్తుపట్టడానికి వీల్లేని రూపం ఎత్తిన మాట ఓ చేదునిజం. దానితోపాటే, పత్రికలు చదివే పాఠకలోకంలో కొత్తకొత్త వర్గాలు వచ్చి చేరిన మాట కూడా అంతే వాస్తవం.
గత నూట యాభయ్యేళ్లుగా తెలుగు నవల అనే జీవనది తిరిగిన మెలికలూ, తీసుకున్న మలుపులూ, ఎక్కిదూకిన ఎత్తుపల్లాలూ చూస్తుంటే భర్తృహరి చెప్పిన ‘గంగా కూలంకష’ పద్యం గుర్తుకు రాక మానదు. ఏమాటకామాట - చవకబారు (అంటే పచ్చి బూతు అని చదువుకో ప్రార్థన!) సినిమాలూ, నేలబారు - ఇలాస్టిక్ టీవీ సీరియళ్లూ, హాస్యం పేరిట మానవతను అపహాస్యం చేసే వెకిలి కూతల స్థాయికి, ఇంకా ఎదగలేదు తెలుగు నవల. కానీ, వాణిజ్య ప్రయోజనమే పరమ ప్రమాణంగా మారిన సాహిత్యానికి అది అనివార్యమయిన పరిణామం. ఇవాళ కాకపోతే రేపు - అంతే!

-మందలపర్తి కిషోర్ 81796 91822