పెరటి చెట్టు

కథా-కమామిషు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కథానికలు ఎంతో వినోదదాయకంగా వుంటాయి కానీ, ఆ ప్రక్రియను నిర్వచించే ప్రయత్నం - సాధారణంగా - పరమ విషాదకరంగా మారుతుం’దన్నాడు డేవిడ్ డేవిడర్. కథానికను ‘జీవిత శకలం’గా అభివర్ణించి చేతులు దులుపుకునేవాళ్లు నిజానికి ఏమీ నిర్వచించడం లేదని గమనించ ప్రార్థన! ఎందుకంటే, జీవితం ఏ నిర్వచనానికి తలొంచుతుంది కనక? ‘కథాశిల్పం’ రచయిత వల్లంపాటి వెంకటసుబ్బయ్య లాంటి పెద్దలు కథానికను - శిల్పసంవిధానాల దృష్టితో - చక్కగానూ, సరళంగానూ నిర్వచించి వున్నారు. మంచి కథానిక ప్రధాన లక్షణాలను నిర్వచిస్తూ ఆయన క్లుప్తత - అనుభూతి ఐక్యత - సంఘర్షణ - నిర్మాణ సౌష్ఠవాలను పేర్కొన్నారు. ఇవన్నీ ఇంగ్లిష్‌లో కథానిక రూపవిశేషాలని వివరిస్తూ - బ్రాండర్ మాథ్యూ, విలియమ్ హెన్రీ హడ్సన్, ఎడ్గార్ ఎలాన్ పో, సోమర్సెట్ మామ్, జో క్లేరీ, సుజాన్ లోఫర్, ఛార్ల్స్ మే, వయోరికా పేటియా మొదలుకుని డేవిడ్ డేవిడర్ వరకూ అనేక మంది నిపుణులు కథానిక రూపరేఖలపై - రాసిన పుస్తకాలు చదివిన వాళ్లందరికీ తెలిసిన విషయాలే ఇవి. చాలామంది, కథానిక ఆవిష్కరణకీ, ముగించడానికీ అసాధారణమయిన ప్రాముఖ్యం ఇచ్చారు. వల్లంపాటి మేస్టారు ‘నిర్మాణ సౌష్ఠవం’ అని చెప్పిందాన్లో ఈ రెండూ ఉన్నాయి కదా! కథానికకి ఉండాలని మేస్టారు చెప్పిన క్లుప్తత విమర్శకీ ఉండాలిగా!
అయితే, కథానిక చరిత్రకి సంబంధించి, వల్లంపాటి మేస్టారు అప్డేట్ అయివుండకపోవచ్చు - అది వేరే విషయం. (ఆయనకేవో దురుద్దేశాలు అంటగట్టడం మన సంస్కార విశేషాన్ని మాత్రమే బయటపెడుతుంది!) తారీఖులు దస్తావేజులు చరిత్ర సారం కావనుకున్నారేమో మేస్టారు. సారం కాకపోవచ్చు కానీ, చరిత్ర సారం తియ్యడానికి అవసరమయిన ముడిసరుకు అదేనని - కొశాంబీ చరిత్ర రచనలు అనువాదం చేసిన వల్లంపాటికి - తెలియదనుకోను. ఏదేమయినప్పటికీ, సంగిశెట్టి శ్రీనివాస్ లాంటి మిత్రులు సకల వివాదాలకూ అతీతంగా, తెలుగు కథానిక పందొమ్మిదో శతాబ్ది చివర్లోనే - కచ్చితంగా చెప్తే 1898లోనే - భండారు అచ్చమాంబ చేతిమీదుగానే మొదలయిందని నిరూపించినా, ఈ విషయాన్ని ఇప్పటికీ అపరిష్కృత సమస్యగా పరిగణించడంలో అర్థం లేదు. అయినా, విశాఖపట్నంలో ‘గురజాడ’ విగ్రహం స్థాపించాలని దశాబ్దాల తరబడి పోరాటం చేసిన వ్యక్తి పురిపండా అప్పలస్వామి. ఆయన కడదాకా, తొలి తెలుగు కథానిక స్థానం ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మగారి ‘లలిత’ కథానికకి దక్కాలని అనేక వేదికల మీంచి చెప్తూనే ఉండేవారు. 1903లో, శర్మగారు మేరంగి నుంచి నడుపుతూ ఉండిన, ‘కల్పలత’ పత్రికలో ‘లలిత’ అచ్చయిన సంగతి సాహిత్య చరిత్ర విద్యార్థులకు తెలియంది కాదు. శర్మగారు ఆ కథను - గురజాడ మాదిరిగా - ఆధునిక, వ్యవహార భాషలో రాయలేదన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే! సాంఖ్యాయన శర్మ ‘కల్పలత’లోనే ప్రచురించిన స్వీయరచన ‘అపూర్వోపన్యాసము’ చక్కని వ్యంగ్య రచన. కానీ, దానికి కథానిక లక్షణాలు లేవు. గురజాడ మనకి చుట్టమా? అచ్చమాంబ కాకుండా పోయారా? ఆమె కాకపోతే, ‘రాయసం వెంకటశివుడో, సాంఖ్యాయన శర్మో, మాడపాటి హనుమంతరావో ఎవరో ఒకరు మొదలుపెడితేనే కదా, కథానిక ప్రక్రియ మారాకు వేసి, మహావృక్షంగా ఎదిగింది?
ఆధునిక సాహిత్య రూపాల్లో - బహుశా, కవిత్వం తర్వాత - అతి ముఖ్యమయిన ప్రక్రియ కథానిక. ఈ ప్రక్రియ పుడుతూనే ప్రౌఢ యవ్వన వయఃపరిపాకంలోకి అడుగుపెట్టిందని వల్లంపాటి వెంకట సుబ్బయ్య తన ‘కథాశిల్పం’ పుస్తకంలో తీర్మానించారు. గురజాడ అప్పారావు ‘ఆంధ్రభారతి’ 1910- ఫిబ్రవరి సంచికలో అచ్చువేసిన ‘దిద్దుబాటు’ కథానికని మనసులో పెట్టుకునే వల్లంపాటి మేస్టారు ఈ వ్యాఖ్య చేశారు. నిజంగానే, గురజాడ కథానికలు ఏది చదివినా అవి తొలితరం కథానికల మాదిరిగా తోచవు. ఆయన గేయ కథలుగా రాసినవి సయితం ఎంతో పరిణతితో ఉంటాయి. ఉదాహరణకి, ‘కన్యక’ గొప్ప కథానికలా తోస్తుంది. దాన్ని గురజాడ కథానిక ఫార్మాట్‌లో రాసివుంటే, అది అంతే మంచి రచనగా రాణించి వుండేది. తొలి కథానిక రాసివుండకపోవచ్చు కానీ, ప్రపంచ సాహిత్యంలోనే ‘కన్యాశుల్కం’ నాటకాన్ని గురజాడ 1890 దశకం మొదట్లోనే రాసిన సంగతి అందరికీ తెలిసిందే కదా. ‘కన్యాశుల్కం’ నాటకాన్ని సెట్టి ఈశ్వరరావుగారు ‘ఆధునిక భాషా సాహిత్యాలకి ఆదికావ్యం’గా పరిగణించిన సంగతి చరిత్రలో నమోదయిన విషయమే. ‘కన్యాశుల్కం’ నాటకం ద్వారా, ఆధునిక సాహిత్యాన్ని నిలువెత్తున ఆవిష్కరించిన ఘనత గురజాడది కాదనడం ఈనాడు ఎవరికయినా సాధ్యమా?
గురజాడ సమకాలికుల్లోనూ, ఆయన తర్వాతి తరంలోనూ ఎందరో విమర్శక పండితులు తెలుగు కథానిక రూపరేఖల్ని నిర్వచించేందుకు అపారమయిన కృషిచేశారు. అక్కిరాజు ఉమాకాన్త ‘విద్యాశేఖరులు’ ముఖ్యులు. ఈయన ఆధునిక (్భవ) కవిత్వం గురించి రాసిన ‘నేటికాలపు కవిత్వం’ పుస్తకాన్ని ఇప్పటికీ ప్రామాణికంగా పరిగణించే వాళ్లున్నారు. ఆయనతోపాటు, ఆండ్ర శేషగిరిరావు, శేషాద్రి రమణ కవులు కథానిక ప్రక్రియ గురించి రాసిన తొలితరం విమర్శకులు, గురజాడ సమకాలికుల్లో చిలకమర్తి లక్ష్మీనరసింహం, మాడపాటి హనుమంతరావు, రాయసం వెంకటశివుడు, అబ్బూరి రామకృష్ణారావు, భమిడిపాటి కామేశ్వరరావు, కనుపర్తి వరలక్ష్మమ్మ, మొక్కపాటి నరసింహశాస్ర్తీ, వెంపటి నాగభూషణం ముఖ్యులు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్ర్తీ, వేలూరి శివరామశాస్ర్తీ, మల్లాది రామకృష్ణ శాస్ర్తీ, పానుగంటి లక్ష్మీనరసింహరావు, గిడుగు సీతాపతి, అడివి బాపిరాజు, విశ్వనాథ సత్యనారాయణ, చలం, చింతాదీక్షితులు, కవికొండల వెంకట రావు, గుమ్మిడిదల దుర్గాబాయమ్మ, మునిమాణిక్యం నరసింహరావు, నందగిరి వెంకటరావు తదితరులను కూడా తొలితరం కథానిక రచయితలుగా పరిగణిస్తున్నారు. తొలితరం మలితరం మాట ఎలావున్నా తెలుగులో అద్భుతమయిన కథానిక సాహిత్యం పుట్టుకొచ్చింది. కొడవటిగంటి కుటుంబరావు, పాలగుమ్మి పద్మరాజు, చాగంటి సోమయాజులు, రాచకొండ విశ్వనాథశాస్ర్తీ, పురాణం సుబ్రహ్మణ్య శర్మ, అంగర వెంకట కృష్ణారావు, కాళీపట్నం రామారావు, అల్లం శేషగిరిరావు, పూసపాటి కృష్ణరాజు, నెల్లూరి కేశవస్వామి, రాచమల్లు రామచంద్రారెడ్డి, సొదుం జయరాం, ముళ్లపూడి వెంకటరమణ, కె.సభా, మధురాంతకం రాజారాం, పెద్ద్భిట్ల సుబ్బరామయ్య, కె.ఎన్.వై.పతంజలి, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, బి.వి.ఎస్. రామారావు, పులికంటి కృష్ణారెడ్డి, పి.రామకృష్ణ, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, సింగమనేని నారాయణ, నారాయణస్వామి తదితరులు గొప్ప కథలు రాశారు. వందలాది యువ రచయితలు నిత్యం గొప్ప కథానికలు రాస్తూనే వున్నారు. అంచేత, కథానిక ప్రాముఖ్యం ముందుముందు కూడా తెలుగు సాహిత్యంలో ఇలాగే కొనసాగుతుందనడంలో సందేహం లేదు.

-మందలపర్తి కిషోర్ 81796 91822