పెరటి చెట్టు

కవితా, ఓ కవితా;

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పందొమ్మిదో శతాబ్ది మొదటి సగం ఆంధ్ర సాహిత్య చరిత్రలో క్షీణ యుగం. నాడు జాతి జీవనం లాగే సారస్వత రంగమూ నిస్తేజంగా ఉండిపోయింది. సంప్రదాయాన్ని జీర్ణించుకుని సరికొత్త ప్రయోగాలు చేసే మహాకవి పుట్టలేదప్పుడు. అనుకరణ శీలం పెరిగింది. చిత్ర కవిత్వం మీద మమకారం ముదిరింది. పిల్ల వసుచరిత్రలు ఉసిళ్లుగా ఉద్భవించినవి. ప్రబంధ కవిత్వం క్రమంగా బంధ కవిత్వంగా మిగిలిపోయింది. బూతు కావ్యాల పుట్టలు, శే్లష కావ్యాల కట్టలు బయలుదేరిన’వని డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారన్న మాటలు అక్షర సత్యాలు. నిజానికి సి.నా.రె. చెబుతున్నది పందొమ్మిదో శతాబ్ది కవిత్వం గురించి. ఇప్పటి వాడుకలో మనం వచనం అని పిల్చుకుంటున్న రంగం అప్పుడప్పుడే తప్పటడుగులు వేస్తోంది. అంచేత, ఆ రంగంలో ‘సంప్రదాయాన్ని జీర్ణించుకుని సరికొత్త ప్రయోగాలు చేసే మహాకవి’ పుట్టే అవకాశం ఎక్కడిది? ఏనుగుల వీరాస్వామి, స్వామినీన ముద్దు నరసింహ్మం లాంటి వైతాళికులు అప్పటికే తమ రెక్కలు వదిలించుకుని వచన రచనల ద్వారా విశాల విహాయసంలోకి విస్తరించేందుకు ప్రయత్నిస్తూ వుండిన మాట వాస్తవమే. అప్పటికే ఓ యాత్రాచరిత్రా, ఓ నైతిక బోధిని (మోరల్ ఇన్‌స్ట్రక్టర్) వెలువడడం మామూలు మాటలు కావు. ఏనుగుల వీరాస్వామి, వెంబాక్కం రాఘవాచారి, కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ల తదితరులు ఆనాటి చెన్నపట్నంలో ‘హిందూ లిటరరీ సొసయిటీ’ ఏర్పాటు చేసి, జార్జ్ నార్టన్ లాంటి మేధావి చేత ధారావాహికంగా ఉపన్యాసాలిప్పించిన మాటా నిజమే. ఆంగ్ల విద్య, దేశ చరిత్రాది ఆధునిక అధ్యయన రంగాల్లో కృషి చెయ్యవలసిన ఆవశ్యకత గురించీ, ప్రజల హక్కుల ప్రాధాన్యాన్ని గ్రహించవలసిన అవసరం గురించీ ఈ ఉపన్యాసకుడు నొక్కి చెప్పిన మాటా నిజమే. 1838 నాటికే, ఈ ‘సొసయిటీ’ సారథ్యంలో ఇంగ్లిష్ విద్యా బోధన చేసే కళాశాల స్థాపన ఎంత అవసరమో నొక్కిచెప్తూ డెబ్బయివేల మంది చెన్నపురి పౌరుల సంతకాలతో కూడిన వినతిపత్రం సమర్పితమయిన సంగతి కూడా వాస్తవమే. ఫలితంగా, 1841 నాటికే మద్రాస్ యూనివర్సిటీ స్థాపితమయిన మాట కూడా నిజమే. ఒక్కమాటలో చెప్తే, సామాజిక రంగంలో చైతన్యం వెల్లివిరియకపోయినా, మొగ్గుతొడుగుతున్న దశ అది. కానీ, కవితా రంగంలో ఓ వెలుగు వెలుగుతున్న తారలు మాత్రం తమ దృష్టిని కవిలె కట్టల మీంచి, సమాజంవైపు ఇంకా మళ్లించలేదు. అందుకే, ఆ కాలాన్ని తెలుగు కవిత్వంలో క్షీణ యుగం అనేది.
సామాన్య పౌరులకన్నా, వారికి నాయకత్వం వహించే పెద్దలకన్నా - సాధారణంగా - కవులు ఒక్కడుగు ముందుంటారని చాలా దేశాల చరిత్ర చెప్తోంది. మన దేశంలోనే బంగాల్, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని వుండిన కాలమది. కానీ, తెలుగు కవులనే వాలఖిల్యులు అప్పటికింకా తలకిందులుగానే తపస్సు చేస్తున్నారు. ఈ వైరుధ్యానికి ఉత్తమ ఉదాహరణగా కందుకూరి వీరేశలింగం కవితా వ్యాసంగాన్ని పేర్కోవచ్చు. తెలుగులో ‘తొలి వచన ప్రబంధమును నేనే చేసితిని; మొదటి నాటకమును నేనే తెనిగించితిని; మొదటి ప్రకృతి శాస్తమ్రును నేనే రచించితిని; మొదటి ప్రహసనమును నేనే వ్రాసితిని; మొదటి చరిత్రమును నేనే రచించితిని; స్ర్తిలకై మొదటి పుస్తకమును నేనే కావించితిని’ అంటూ వీరేశలింగం తన ‘స్వీయచరిత్ర’లో చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే కదా! (ఆ ప్రకటనలోని చాలా విషయాలు పూర్తిగా నిజం కాదని తర్వాతి రోజుల్లో తేలిన సంగతి అలా ఉంచండి!) ‘గద్య తిక్కన’ అనిపించుకున్న అలాంటి రచయిత రాసిన కవిత్వం ఎలా వుందో చూడండి: ‘మార్కండేయ శతకం’ ‘శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిర్వచన నైషధం’ ‘రసిక జన మనోరంజనం’- ఇదీ వీరేశలింగం కవితా వ్యాసంగం! గోల్డ్‌స్మిత్ కవిత ‘ద ట్రావెలర్’ను వీరేశలింగం ‘పథిక విలాసము’గా అనువదించారు. విలియం కౌపర్ హాస్య కవిత ‘జాన్ గిల్పిన్’ను కూడా ఆయన అనువదించారట. ఈ కవులిద్దరూ పద్దెనిమిదో శతాబ్దికి చెందిన వారే కావడం - బహుశా - యాదృచ్ఛికమయి వుండదు! కవిత్వం విషయంలో - వౌలికమయినా, అనువాదాలయినా - వీరేశలింగం కనీసం వంద సంవత్సరాలు వెనకబడి వున్నారని దీన్నిబట్టి అర్థమవుతోంది. తెలుగు నాట సాంస్కృతిక విప్లవ సేనానిగా ప్రసిద్ధుడయిన వీరేశలింగం విషయమే ఇంత ఘోరంగా ఉంటే, ఇక సాదాసీదా కవిప్రాయుల కథ చెప్పాలా? పందొమ్మిదో శతాబ్ది చివరినాళ్లలో వీరేశలింగం కవితా దృక్పథం మారిందనడానికి ఆయన రాసిన ‘సరస్వతీ నారద విలాపం’ అనే వ్యంగ్య - సంవాద కృతి నిదర్శనం. (వాస్తవానికి ఈ రచన పూర్తిగా స్వతంత్రం కాదు. ఈ సంవాదంపై ఇంగ్లిష్ కవి ఎడ్మండ్ స్పెన్సర్ రాసిన ‘టియర్స్ ఆఫ్ మ్యూజెస్’ అనే సుదీర్ఘ కవితా ప్రభావం స్పష్టమన్నారు సి.నా.రె.!) అనువాదమే అయినప్పటికీ, సందర్భోచితమయిన ఈ సంవాద కవిత రాయడం ద్వారా, ‘బాహ్యాడంబర జృంభితమై, అంతశ్శోభారహితమైన’ ఆనాటి తెలుగు కవితలో మార్పు రావలసిన అవసరాన్ని నొక్కిచెప్పిన వాళ్లలో వీరేశలింగం ముఖ్యులయ్యారు.
అయితే, నిజానికి తెలుగు కవిత స్వభావాన్ని వౌలికంగా ప్రభావితం చేసిన కవిత ‘ముసలమ్మ మరణం’. కట్టమంచి రామలింగారెడ్డి అనే విద్యార్థి రచించిన సామాజిక కథాకావ్యం అది. ‘ప్రజలలో వ్యక్తులు - అందులో అబలలు - ప్రజా క్షేమమునకై చేయగల అఖండ త్యాగమును వర్ణించుచు రచించిన’ కావ్యం ముసలమ్మ మరణమని గాడిచర్ల హరిసర్వోత్తమరావు చక్కగా చెప్పారు. కచకుచాది అవయవాల వర్ణన ద్వారా శరీరగతమయిన శృంగారాన్ని వర్ణించడం తప్ప, రసమూలం హృదయంలో ఉన్న సంగతిని పట్టించుకోని సంప్రదాయ కవులకి ఇటువంటి ‘అఖండ త్యాగము’ గురించిన స్పృహ ఎక్కడిది? ఈ కావ్యాన్ని ప్రధానంగా స్ర్తిల కోసం రాశానని కట్టమంచి రామలింగారెడ్డి మొదటి కూర్పునకు సమకూర్చిన ‘ముఖపత్త్రము’లో పేర్కొనడం గమనార్హం. అప్పటికి కవి వయసు ఇరవై లోపేనని గుర్తించడం అంతకన్నా ముఖ్యం. చిత్తూరు జిల్లాకి చెందిన సీ.ఆర్.రెడ్డి ఈ కావ్యానికి ఇతివృత్తాన్ని ‘అనంతపురం స్థానిక చరిత్ర’ నుంచి గ్రహించారు. సీ.పీ.బ్రౌన్ ప్రచురించిన అనంతపురం కైఫియత్ నుంచి ఈ కథను తీసుకున్నాననీ, కావ్యం రాసేనాటికి తనకి ఆ ప్రదేశాలతో ప్రత్యక్ష పరిచయం లేదనీ నిజాయితీగా చెప్పారు కట్టమంచి. ఓ సామాజిక ఇతివృత్తంతో పందొమ్మిదేళ్ల విద్యార్థి ఆధునిక కావ్యం రాయడం అప్పటికెంత అపూర్వమో, దానికి చెన్నపురి క్రైస్తవ కళాశాల (మెడ్రాస్ క్రిశ్చియన్ కాలేజ్)కి అనుబంధంగా ఉండిన ‘శ్రీమదాంధ్ర భాషాభిరంజనీ సమాజం’ ఉత్తమ కావ్యంగా బహుమతి నివ్వడం కూడా అంతే అపూర్వం. ఎంత తొందరపడి ముందే కూసినప్పటికీ ఈ కోయిలలు తియ్యగా కూయడం విశేషం! తాను ‘నిశ్చయముగ పండితుడను గాను; పామరుడను, బాలుడను కావున నిందెవ్వి యేని దోషములున్న జూపి ననుం గృతార్థుని జేయ మీరెల్లరు బ్రార్థితు’లని సకలజన విధేయుడయిన కట్టమంచి రామలింగారెడ్డి ఈ ‘ముఖపత్త్రము’లో కోరుకున్నారు. ఇష్టకవి కీర్తన - (తమ దృష్టిలో) కుకవి నింద తప్ప ఇటువంటి సంస్కారమూ, ఈ తరహా ప్రవర్తన సంప్రదాయిక కవుల నుంచి అనూహ్యం. ఇదే ఆధునిక, ప్రజాస్వామ్య సంస్కారం. దాదాపు ఇలాంటి పాత్రనే రాయప్రోలు సుబ్బారావు కూడా పోషించారు. ఆయన, 1909లోనే ‘లలిత’ అనే కథాకావ్యాన్ని రాశారు. రేఖామాత్రమయిన నవ్యత అందులో తొంగిచూసిన మాట వాస్తవం.
క్యాలెండర్ లెక్కల ప్రకారం ఈ తరహా కావ్య రచన ముందుగా చేసింది కట్టమంచి - రాయప్రోలు అయినప్పటికీ, ఇరవయ్యో శతాబ్దమంతటా, ఈ తరహా ప్రజాస్వామ్య సంస్కృతికి ప్రతినిధిగా నిలిచినవాడు మాత్రం - నిస్సందేహంగా - గురజాడ. ఆయన రెండు కూర్పులుగా రాసిన ‘కన్యాశుల్కం’ నాటకం ఆధునిక భాషా సాహిత్యాలకు ఒజ్జబంతిగా నేటికీ నిలిచి వుంది. అత్యంత ఆధునికమనిపించుకున్న ఈ గొప్ప నాటకాన్ని ప్రదర్శించే విషయంలో - సాంకేతికంగా - మనం మరింత ఎదగాలి. 1910-15 సంవత్సరాల మధ్యకాలంలో గురజాడ రాసిన పదకొండు కవితలు - వాటిల్లో నాలుగు కథాకావ్యాలు- ఆయనకి మహాకవి పదమిప్పించి, నిలబెట్టాయి. ఆయనకి ఆ బిరుదునిచ్చి, ప్రశంసించిన మరో మహాకవి దేవులపల్లి కృష్ణశాస్ర్తీ అనే చారిత్రిక సత్యాన్ని మర్చిపోకూడదు! ముఖ్యంగా, ఏ దేశానికయినా జాతీయ గీతంగా నిలవదగిన ‘దేశమును ప్రేమించుమన్నా!’ పాట తెలుగు కవిత్వాన్ని ఓ మలుపు తిప్పింది. ‘అన్ని దేశాల్ క్రమ్మవలెనోయ్, దేశిసరుకుల నమ్మవలెనోయ్’ అనీ, ‘నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలెనోయ్’ అనీ గురజాడ ఆ పాటలో వ్యక్తం చేసిన భావనలు, అప్పటికి, యూరపియన్లకి సయితం అపూర్వమనిపించేవే! ఆయన రాసిన ‘నీలగిరి పాటలు’ కూడా గేయ సాహిత్యానికి మెరుగులు దిద్దిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ‘హరికథా పితామహ’ ఆదిభట్ల నారాయణదాసు, ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ, కేఎన్‌జీ రాజమణి తదితరులు - ఆంగ్ల కవితల ప్రత్యక్ష ప్రభావం చేత - తెలుగులో ఖండకావ్యాలు రాశారట. అటువంటి ప్రత్యక్ష ప్రభావం లేకపోయినా, కాలానుగుణమయిన కవిత్వం రాసిన వాళ్లలో ముఖ్యులు తిరుపతి - వెంకటకవులు.
గురజాడ, కట్టమంచి తదితరులు చూపించిన నవ్యకవితా మార్గంలో ఒకవైపు చిలకమర్తి, గరిమెళ్ల, గడియారం, పుట్టపర్తి, జంధ్యాల, తుమ్మలపల్లి, జాషువా, విశ్వనాథ, కొడాలి తదితరులు జాతీయ గానం చేస్తూ పోయారు. మరోవైపు బసవరాజు, అబ్బూరి, దువ్వూరి, అడివి, దేవులపల్లి, తల్లావజ్జల, నండూరి తదితరులు ప్రేమగీతాలను మృదుమధురంగా ఆలపించారు. 1930 దశకంలో శ్రీశ్రీ, నారాయణబాబు, శిష్‌ట్లా, మల్లవరపు విశే్వశ్వరరావు తదితరులు ప్రభంజన వేగంతో ప్రవేశించి భావకవుల కవితా సామగ్రిని తలకిందులు చేసేంతవరకూ భావకవితా మార్గంలోనే తెలుగు కవిత నడిచిందని చెప్పాలి. ఆధునికాంధ్ర కవిత్వం ఆవిర్భావ వికాసాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్లు ఈ లింక్ చూడొచ్చు:
http://smartprep.in/ wp-content/upload/ 2016/12/ Adhunika-andhra- kavitvam.pdf