పెరటి చెట్టు

పలుకులమ్మకి పట్టిన గిడుగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాషా సాహిత్యాలని సామాజిక సాధనాలుగా, సామాజిక ఉత్పత్తులుగా గుర్తించలేని వాళ్లు, తమ మడీ - తడీ - చాదస్తం వాటికీ అంటగట్టాలని చూస్తారు. తమ బుర్రల్లోనే భాష, సాహిత్యం పురుడు పోసుకున్నాయని తాము నమ్మి, ఇతరులనూ నమ్మించాలని చూస్తారు. మన చుట్టూ తిరిగే మనుషులు, ఏయే మాటల్ని ఎలా వాడుతున్నారో పరిశీలించి గ్రహించడానికి బదులుగా, ఆ భాషని సృష్టించిన సామాన్యులకే ఆ మాటల్లో మంచీ - చెడూ నేర్పించే ప్రయత్నం చేస్తారు. అంటే భాషని నేర్చుకోవడం చేతకానివాళ్లు, దాన్ని బోధించేందుకు తెగబడతారన్నమాట! ఎవరయినా పండితులు ముచ్చటపడి జనవ్యవహారాన్ని తమ కావ్యాల్లో ప్రతిధ్వనింపచేస్తే, వాళ్లకి తాటాకులు కట్టాలని చూస్తారు. ఇళ్లలో, కుటుంబ సభ్యులతో తాము నిత్యం వాడే భాష విషయంలోనే అస్పృశ్యత పాటిస్తారు. ‘ప్రయోగ మూలం వ్యాకరణం’ అనే మూలసూత్రాన్ని మర్చిపోతుంటారు. ‘నిత్య ప్రవాహినీ దేశ్యా’ అని ప్రాచీనులు - దేవభాషలోనే - చెప్పిన మాటని ఈ నడమంత్రపు పండితులు నిర్లక్ష్యం చేయడం కద్దు. జన వ్యవహారాన్ని చూసి ప్రయోగ సాధుత్వం తెలుసుకోమని చెప్పే - ‘శబ్దసిద్ధి ర్లోకా ద్దృశ్య’ - అనే నిర్దేశాన్ని ఈ పెద్దలు వాటంగా మర్చిపోతారు. తాము రూపొందించిన అరకొర నియమ నిబంధనల మేరకి నడవనందుకు భాషామతల్లిని దండించేందుకు కూడా ఈ మహానుభావులు వెనకాడరు. పలుకులమ్మ చేతివీణ అపస్వరాలు పలుకుతోందని అనడానికి సయితం తెగిస్తారు. ఫలాని మాట గ్రామ్యమనీ, ఫలానిది సాధుప్రయోగమనీ తాతాచార్ల ముద్రలు గుద్దేందుకు సిద్ధపడతారు. గురజాడ అప్పారావుకే కాదు - కందుకూరి వీరేశలింగంగానికీ, కొక్కొండ వేంకటరత్న ‘శర్మ’కీ కూడా మంచి తెలుగు రాదనడానికి జంకరు.
అయితే, ఇలాంటి దుస్సాహసాన్ని సహించలేని వాళ్లూ ఉంటారు. కొమ్ములు తిరిగిన ఈ పండిత భిషక్కుల భాషా భేషజాన్ని పదిమందిలోనూ పెట్టి జలకడిగేస్తారు వాళ్లు. పత్రికల్లోనూ, పుస్తకాల్లోనూ తమ వాదాన్ని ఉపపత్తులతో సహా వినిపిస్తారు. వందల గ్రంథాల్లోని వేల ప్రయోగాలను చూపించి, కాలంచెల్లిన వాదాలను తిరస్కరిస్తారు. అన్నిటికీ మించి, ఎక్కడో కొండల కోనల కడుపులో పుట్టి పెరిగే అడవితల్లి బిడ్డల మాటలు నేర్చుకుంటారు. రోజుల తరబడి వాళ్లతో కలిసి వుండి, వాళ్లు నిత్య జీవితంలో వాడే మాటలకి మూలాలు ఎక్కడున్నాయో వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ల భాషకి లిపిని సమకూర్చి, ఆ తెగల జనులు ఏయే మాటల్ని ఏయే అర్థాల్లో వాడుతున్నారో అధ్యయనం చేసి వాళ్ల నాషలకి వర్ణనాత్మక వ్యాకరణం రాస్తారు. ‘్భషాభిషక్కులూ, మీరు చెయ్యాల్సిన పని ఇది బాబూ!’ అని నచ్చ చెబుతారు. విని దారికి వస్తే అందరికన్నా వారే ఎక్కువ సంతోషిస్తారు! అలాంటి వ్యక్తులకి అత్యుత్తమమయిన నమూనా గిడుగు వెంకట రామమూర్తి. ఆయన సవర భాషకి రాసిన వర్ణనాత్మక వ్యాకరణం అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోగలిగిందంటే, దానికి గిడుగు చేసిన కఠోర పరిశ్రమే కారణం.
ఒడిశా సరిహద్దుల్లో, వంశధార నదీ తీరంలోని పర్వతాల వేటలో, 1863లో పుట్టిన గిడుగు రామమూర్తి, అయిదున్నర దశాబ్దాల పాటు పర్లాకిమిడిలో ఉపాధ్యాయ వృత్తిలో గడిపారు. కళింగాంధ్రులు అత్యధిక సంఖ్యలో ఉండిన పర్లాకిమిడిని ఒడిశా రాష్ట్రంలో కలపడాన్ని వ్యతిరేకించి, ఆ ఊరును వదిలి వచ్చేశారు. చిన్నప్పుడు, చీపురుపల్లిలో చదువుకునే రోజుల్లో, గురజాడ అప్పారావు గిడుగుకి సహాధ్యాయి. పరస్పరం గౌరవంతో కూడిన ప్రేమాభిమానాలు వారివి. తాపీ ధర్మారావు లాంటి విద్యార్థులకి చరిత్ర పాఠాలు చెప్పిన గిడుగు, శాసనాల ప్రాధాన్యాన్ని గ్రహించి వాటిని ఎలా చదవాలో నేర్చుకున్నారు. వివిధ లిపులనూ, శాసన పాఠాలనూ చదివిన కొద్దీ ఆయనకి భాషల్లో వచ్చిన మార్పులు అర్థమవుతూ వచ్చాయి. భాషాతత్వం బోధపడిన తర్వాత, సుబోధకమయిన భాషలో రాయవలసిందిగా ఆయన కవిపండితులను పదేపదే అన్యర్థిస్తూ వచ్చేవారు. ‘తెలుగు’ పత్రిక ద్వారా, భాషలకి సంబంధించిన శాస్ర్తియ సమాచారాన్ని పదిమందికి - ముఖ్యంగా పండితులమనుకునే వాళ్లకి - తెలియచేస్తూ వచ్చారు. చదువుకున్న సామాజికులు తమ భార్యాబిడ్డలతో మాట్లాడే భాషలోనే కథలూ కవితలూ రాయడానికి అభ్యంతరమేమిటని గిడుగు నిలదీసేవారు. మహామహోపాధ్యాయు లనిపించుకున్న పండితమాన్యు లెందరో గిడుగు మాటల్లోని సామంజస్యాన్ని - కాస్త ఆలస్యంగానే అయినా - గ్రహించారు. ‘ఏమైనా అభిమానమంటూ మిగిలిన ఏ పండితుడైనా, కవియైనా తన బిరుదాలూ పతకాలూ అన్నీ రామ్మూర్తి పంతులు గారికి దోసిలొగ్గి, సమర్పించుకొని మళ్లీ ఆయన అనుగ్రహించి ఇస్తే పుచ్చుకోవలసిందే!’ అన్నారట చెళ్లపిళ్ల వెంకట శాస్ర్తీగారు. ‘రామ్మూర్తి పంతులు తెలుగు సరస్వతి నోముల పంట. ఆయన వాదాన్ని అర్థం చేసుకోలేక, దురర్థ కల్పించి తెలుగు వాళ్లు ఎంతో నష్టపోయా’రన్నారట విశ్వనాథ సత్యనారాయణ. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్ర్తీ తన ‘ప్రబుద్ధాంధ్ర’ పత్రికలో గిడుగు రామమూర్తికి ఘనమయిన నివాళి సమర్పించిన సంగతి సాహిత్య విద్యార్థులకి తెలిసిందే. తెలికిచెర్ల వెంకటరత్నం సారథ్యంలో గిడుగు సప్తతి పూర్తి మహోత్సవం సందర్భంగా ఆయన రచనలు ప్రచురించారు. ఇక, కరుడుగట్టిన గ్రాంథికవాదిగా దశాబ్దకాలం కొనసాగి, చిన్నయసూరి వారసత్వం కోసం కొక్కొండతో పోరాడిన కందుకూరి వీరేశలింగం, చివరి మూడేళ్లలో గిడుగు గొడుగు కిందకే వచ్చిచేరారు. గిడుగు స్ఫూర్తితోనే వీరేశలింగం ‘వర్తమానాంధ్ర భాషాప్రవర్తక సమాజం’ అధ్యక్ష పదవిని చేపట్టారు కూడా.
అసలు, కవిపండితులందరూ వ్యావహారిక భాషలోనే రాయాల్సిందిగా గిడుగు రామమూర్తి ఎందుకు కోరుకున్నారు? ఆయనకి గ్రాంథిక భాషపై పట్టులేకనా? గిడుగు రాసిన ‘ప్రాదెనుగు కమ్మ’లాంటి రచనలు చదివిన వాళ్లు ఆ మాట అనలేరు. చిన్నయసూరి - బహుజనపల్లి తదితరులు చదివినంత లోతుగా సంప్రదాయ సాహిత్యాన్ని చదవనందుకే, గిడుగు వారి విధి నిషేధాలను తిరస్కరించారా? నన్నయ్య, తిక్కన, శ్రీనాథుడు, నంది మల్లయ - ఘంట సింగన, రామరాజ భూషణుడు తదితర కవుల రచనల్లో, పండితమ్మన్యులు ‘గ్రామ్యం’గా ఎంచిన ప్రయోగాలను ఎత్తి చూపించిన గిడుగును అలాంటి తప్పుడు మాటలనడానికి ఎవరికి నోరొస్తుంది? మరెందుకని గిడుగు వ్యావహారిక భాషలోనే రాయాలని అంత పట్టుపట్టారు? ఈ ప్రశ్నకి ఆయనే తిరుగులేని సమాధానం చెప్పారు - చిత్తగించండి.
‘దేశభాష ద్వారా విద్య బోధిస్తే కానీ ప్రయోజనం లేదు. శిష్టజన వ్యావహారిక భాష లోకంలో సదా వినబడుతూంటుంది. అది జీవంతో కలకలలాడుతూ ఉంటుంది. గ్రాంథిక భాష గ్రంథాలలో కనబడేదే కానీ వినబడేది కాదు. ప్రతిమ వంటిది.. ప్రాచీన కావ్యాలు చదువవద్దనీ, విద్యార్థులకు నేర్పవద్దనీ నేననను. కాని, ఆ భాషలో నేడు రచన సాగించడానికి పూనుకోవడం వృథా అంటున్నాను. (గ్రాంథికంలో) నిర్దుష్టంగా ఎవరునున్న వ్రాయలేరు. వ్రాసినా, వ్రాసిన వారికి కష్టమే. వినేవారికి కష్టమే.. స్వరాజ్యం కావలెనంటున్నాము. ప్రత్యేకాంధ్ర రాష్టమ్రు కోసం చిక్కుపడుతున్నాము. ప్రజాస్వామిక పరిపాలనం కోరుచున్నాము. ఇటువంటి పరిస్థితులలో మన ప్రజలకు, సామాన్య జనులకు, ఏ భాష ద్వారా జ్ఞానం కలుగజేయవలసి ఉంటుందో, ఏ భాషలో గ్రంథరచన సాగించవలసి ఉంటుందో ఆలోచించండి!’ - ఇది గిడుగు రామమూర్తి చేసిన తుది విన్నపం. కన్నుమూయడానికి సరిగ్గా వారం రోజుల ముందు - 1940, జనవరి 15న - పత్రికా సంపాదకులను సంబోధిస్తూ గిడుగు ఈ ‘తుది విన్నపం’ చేశారు. అప్పటికి ఆయన అర్ధ శతాబ్దం పైగా వ్యావహారిక భాషలో రచనలు చెయ్యాల్సిందిగా కవిపండితులను అభ్యర్థిస్తూనే ఉన్నారు. ఇవాళ ఏ పత్రిక చూసినా, అందులోని ప్రతి అక్షరంలోనూ గిడుగు రామమూర్తి ముఖం ప్రతిఫలిస్తోంది. చిత్తశుద్ధితో చేసిన కష్టం ఫలించకుండా ఉండదనడానికి ఇదే నిదర్శనం. అటువంటి కృషి చేసినందువల్లనే గిడుగు రామమూర్తి జన్మదినం - ఆగస్టు 29ని - తెలుగు భాషాదినోత్సవంగా పాటిస్తున్నాం!

-మందలపర్తి కిషోర్ 81796 91822