పెరటి చెట్టు

శారదా నికేతనుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బౌద్ధంలో ‘అనికేతనుడ’నే భావన ఒకటుందని, పొత్తూరి మేస్టారు ‘పారమార్థిక పదకోశం’లో రాశారు. ఆ మాటకి ‘ఇల్లు వదిలినవాడు, సంసార పరిత్యాగం చేసినవాడు’ అనేవి అర్థాలట. ఉన్నవ లక్ష్మీనారాయణ గారు, తన సతీమణి లక్ష్మీబాయమ్మ గారిని - కేవలం భార్యగా కాకుండా - అక్షరాలా అర్ధాంగిగానే కడదాకా భావించిన వారు. అంచేత ఆయన్ని అనికేతనుడనలేం - లక్ష్మనికేతనుడని అనడమే న్యాయం; లేదంటే, ‘శారదా నికేతనం’ ఆశ్రమానికే తన జీవితం అంకితం చేశారు కనక ‘శారదా నికేతనుడ’ని అన్నా భావ్యమే. వీరేశలింగం గారి సంస్కరణ భావాల స్ఫూర్తితోనే, స్వాతంత్య్రోద్యమానికీ, సాహిత్యోద్యమానికీ తన సర్వశక్తులనూ ధారపోసిన బారిస్టరాయన. వెలివాడల్లో నివసించే దళితుల వాస్తవ జీవితాలనే కాకుండా, వాళ్ల జీవిత వాస్తవాలని కూడా చిత్రించిన గాంధీవాది ఉన్నవ. పల్నాడు పుల్లరి ఉద్యమంలో పాల్గొని, గొప్ప నివేదిక సమర్పించిన సాహసి ఆయన. పర్యవసానంగా, జైలుశిక్ష అనుభవించాల్సి వచ్చినప్పుడాయన చెక్కుచెదరలేదు. సరిగదా, ఆ శిక్షాకాలాన్ని ‘మాలపల్లి’ నవలా రచనకి సద్వినియోగం చేసుకున్నారు. గుంటూరు జిల్లా రైత్వారీ భాషలో ‘మాలపల్లి’ నవలని రాయడానికి పూనుకోవడమే సాహసం కాగా - రాసింది రాసినట్లుగా ఒక ప్రతిని బయటికి స్మగుల్ చేయించారాయన. బెల్లంకొండ రాఘవరావు ఆ నవల్ని రెండు భాగాలుగా ముద్రింప చేశారు. జైలు నుంచి రాక ముందే, ఈ నవల పంపిణీకి చేసిన ఏర్పాట్ల గురించి ‘బంగోరె’ రాసింది చదివితే ఉన్నవ ఎంత వ్యవహార దక్షులో అర్థమవుతుంది.
రాజమండ్రిలో, టీచర్ ట్రెయ్‌నింగ్ తీసుకునే రోజుల్లో ఉన్నవ కందుకూరి వీరేశలింగం గారికి ప్రత్యక్ష శిష్యరికం చేశారు. అయితే, అంతకు ముందే, పాతికేళ్ల వయసులోనే, ఉన్నవ గుంటూరులో వితంతు శరణాలయం నిర్వహించారు. అప్పటికి గుంటూరు ‘ఇంటిలిజెంటిల్‌మెన్’కి నిలయం కాదు. కరుడు కట్టిన సంప్రదాయవాదుల కాణాచి గర్తపురి. అలాంటి గుంటూరులో మొట్టమొదటి వితంతు పునర్వివాహం జయప్రదంగా జరిపించగలగడం ఉన్నవ సమర్థతకి తార్కాణం. ఆయన రాజమండ్రి వెళ్లేనాటికే, వీరేశలింగం వృద్ధాప్యంతోనూ, అనారోగ్యంతోనూ బాధపడుతున్నారు. తన ఆశ్రమ నిర్వహణ ఉన్నవ చేతిలో పెట్టాలని వీరేశలింగం భావించారని కూడా అంటారు. రకరకాల కారణాల వల్ల అది జరక్కపోవడం విషయాంతం. కాగా, ఒక్క ముక్కలో చెప్తే ఉన్నవ తెల్లచొక్కా స్వాతంత్య్ర సమరయోధులు కారు! ప్రజా సమస్యల్ని తీసుకుని, ప్రజలతో పాటుగా నిలబడి పోరాడిన ఉద్యమకారుడాయన. ఉద్యమ కార్యకలాపాల నిర్వహణలో నిండాములిగి పనిచేసేవాళ్లలో, ఇతరత్రా నైశిత్యం ఏమయినా ఉన్నా అది మొద్దుబారిపోవడం కద్దు. కానీ, ఉన్నవ తనలోని రచనాసక్తిని ఎప్పటికప్పుడు ఎగసనదోసుకుంటూనే వున్నారు. ఆయన ‘మాలపల్లి’ రాయగలగడానికి అదే కారణం.
ముందే చెప్పినట్లుగా, ‘మాలపల్లి’ చదివితే, ఉన్నవ తెల్లచొక్కా ఉద్యమకారుడు ఎంత మాత్రం కారని తేలిపోతుంది. వెలివాడని కథాక్షేత్రంగా ఎంపిక చేసుకోవడం చూస్తేనే ఆ విషయం బోధపడుతుంది. వెలివాడల్లోకి గాంధీవాదం చొరవగా ప్రవేశించక ముందే వెలువడిన నవల ‘మాలపల్లి’. సంగదాసు - ‘మాలపల్లి’ నవలకి నాయకుడు. వాస్తవానికి సమన్వయవాది. ఉన్నవదీ అదే సమన్వయవాదం. సంగదాసు తండ్రి, రామదాసు ఉన్నవ లక్ష్మీనారాయణ ఆదర్శవాదానికి మూర్త్భీవం. రచయితలోని తిరుగుబాటు తత్వానికి ప్రతీకగా రూపుదిద్దుకున్నవాడే తక్కెళ్ల జగ్గడు అనే వెంకటదాసు. ఇక, ఉన్నవ బోధించిన ప్రేమతత్వమనే మొక్కకి పూసిన రెండు మొగ్గలే అప్పాదాసు, జోతి. మాలపల్లి నవలలోని రామానాయుడు పాత్ర చేతకాని మంచితనానికి ప్రతీక. సంగదాసు ఆదర్శవాదాన్ని మాటల్లో సమర్థించడం తప్పితే, అంతకుమించి రామానాయుడు చేసేది, బహుశా చెయ్యగలిగేది శూన్యం. భూస్వామ్య సమాజంలో, భూమి మీద పెత్తనం ఎవరి గుప్పిట్లో ఉంటే వారి ఆటే సాగుతుంది. కరుడుకట్టిన ఆనాటి భూస్వామ్యవాదానకి ప్రతీక రామానాయుడి తండ్రి. తన దగ్గిర పనిచేసేవాళ్లే, తన సంపదల సృష్టికర్తలనే వాస్తవాన్ని అంగీకరించే సంస్కారం అలాంటి భూస్వాముల నుంచి ఆశించలేం. సరిగదా, తమ దగ్గిర పనిచేసేవాళ్లందరూ, తమ మోచేతికింద నీళ్లు తాగి బతుకీడుస్తున్న వాళ్లేనని ఆ భూస్వాముల నమ్మకం. అలా బతికే సంగదాసు, వెలివాడలోని కూలీనాలీ అలగా జనాన్ని సమర్థించిన నేరానికి అతని బతకనివ్వకపోవడం ఆనాటి భూస్వామి సహజమయిన ప్రవర్తనే. ఎటొచ్చీ, ఉన్నవ రాసేంతవరకూ, ఎవరూ ఈ కథను - నెరేటివ్‌ని - నవలకి ఎక్కించకపోవడం గమనార్హం. అక్కడుంది ఉన్నవ వైతాళిక తత్వం. అయితే, వర్గ సామరస్య సిద్ధాంతం ఎక్కడయినా పనికొస్తుందేమో కానీ, విరుద్ధ వర్గ ప్రయోజనాలు ముఖాముఖీ తలపడే వెలివాడల్లో సమన్వయ వాదం ప్రబోధించడం గొప్ప సాహసం. వర్గ వైరుధ్యాల్ని వాస్తవికంగా చిత్రించ దల్చుకున్న రచయిత తటస్థ వాదం వహించడం దాదాపు అసాధ్యం. మాలపల్లిలో రచయిత ద్వైదీభావానికి గురయిన సందర్భాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. మాలపల్లిని ఉన్నవ మునిపల్లిగా చూపించి, వాస్తవాన్ని వక్రీకరించారని విమర్శించేవాళ్లు. ఆయన దేశ కాల పరిస్థితులనూ, చారిత్రిక పరిమితులనూ గుర్తించారనలేం.
వాస్తవానికి వెలివాడల్లోని దళితుల వాస్తవ జీవన సమస్యలపై ఊరివాళ్లతో తలపడింది గాంధీవాదులు కారు - ఆ పని చేసినవాళ్లు తొలితరం కమ్యూనిస్టులు. అయితే వారికి, ఉన్నవ మాలపల్లే స్ఫూర్తినిచ్చిందని కంభంపాటి సత్యనారాయణ (సీనియర్) లాంటి వాళ్లు రాసిన వ్యాసాలు చెప్తున్నాయి. లెనిన్ నాయకత్వంలో 1917లో వచ్చిన రష్యన్ విప్లవంతో ప్రభావితుడయిన ఉన్నవ, తక్కెళ్ల జగ్గడి ‘్ధర్మబోధలు’ రాసే సందర్భంగా తనకు తెలిసిన సోషలిస్టు సూత్రాలు అందులో చొప్పించారు. ‘ఆదికాలమున అందరు జనులు అన్నదమ్ముల్లా’ ఉండేవారనీ, ‘తలుపులు ద్వారాల్లేని ఇళ్లలో’ వాళ్లుండేవారనీ ఉన్నవ రాశారు. తక్కెళ్ల జగ్గడి పాన్రు అయిదారు వందల సంవత్సరాల నాటి రాబిన్‌హుడ్‌కి ఆధునిక రూపంగా తీర్చిదిద్దారాయన. గద్దలను కొట్టి కాకుల్ని మేపే గజదొంగ తక్కెళ్ల జగ్గడు. తన తమ్ముడు సంగదాసును తలబద్దలు కొట్టి చంపినందుకు పగబట్టిన వెంకటదాసే తక్కెళ్ల జగ్గడుగా మారినట్లు ఉన్నవ కల్పించారు. కొందరి నమ్మకం ప్రకారం, కన్నిగంటి హనుమంతు - అల్లూరి రామరాజులను మనసులో పెట్టుకుని రచయిత తక్కెళ్ల జగ్గణ్ణి సృష్టించారు. ఆయన ‘మాలపల్లి’ నవల రాస్తూ ఉన్ననాటికి అల్లూరి రామరాజు నేతృత్వంలో రంప విప్లవం ఉవ్వెత్తున సాగుతోన్న మాట వాస్తవం. ఆ విప్లవం వెనకాల చోదకశక్తిగా ఉండిన రామరాజు, సన్న్యాసం వదిలి శస్త్రం చేపట్టడానికి - వెంకటదాసుకి వున్నట్లుగా - వ్యక్తిగత కారణాల్లేవు. పల్నాడు పుల్లరి ఉద్యమంలో ఉన్నవ - అస్తధ్రారిగా కాదుగానీ - పాల్గొన్న మాట వాస్తవం. అంచేత, హనుమంతు పోరాటానికి కూడా వ్యక్తిగత కోణం లేదన్న సంగతి ఆయనకి తెలిసే వుండాలి. కానీ, కథానికల్లోనూ - నవలల్లోనూ పాత్రల చిత్రణ ఫొటోగ్రఫీ కళలా ఉండదనే మాట కూడా నిజమే మరి!
ప్రజా పోరాటాలు బహుముఖీనంగా సాగుతాయని, ఆ పోరాటాలను - దూరం నుంచయినా - చూసిన వాళ్లకి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాటిల్లో ‘చట్టబద్ధ’ పోరాటం ఓ రూపం. తాను పాల్గొన్న పోరాటాల సందర్భంగా, బారిస్టరయిన ఉన్నవ, కచ్చితంగా ‘లీగల్’ పోరుబాటలో కొంత ప్రయత్నం చేసి వుంటారు. ఆ పోరాటం జయాపజయాలు చట్టాల ప్రాబల్యం మీద కాకుండా, రాజ్యం పెద్దమనిషితనం మీద ప్రధానంగా ఆధారపడి వుంటాయి. 1857 తర్వాత నేరుగా రంగంలోకి దిగిపోయిన బ్రిటిష్ సామ్రాజ్యం, తన జాతి లక్షణమయిన ‘పెద్దమనిషితనం’ ప్రదర్శించిన సందర్భాలు బహు అరుదు. జలియాఁవాలా బాగ్ మొదలుకుని రంప ఏజెన్సీ వరకూ అడుగడుగునా అక్రమంగా ప్రవర్తించిన సందర్భాలే ఎక్కువ. వలసవాద వారసత్వం ఒంటబట్టించుకున్న వందలాది పళనియప్పన్‌లు అదే దారిలో తమ గురువుల్ని మించి సాగిపోయారు. ఈ ధోరణి ఉన్నవ లాంటి మేధావి దృష్టికి రాకుండా వుండదు. ఈ వైరుధ్యాన్ని గమనించి, గ్రహించినప్పటికీ ఉన్నవలాంటి సమన్వయవాదులు - గాంధీయులు - ఈ సమస్యకి సులువయిన పరిష్కారం సూచించలేరు. అలాంటి సందర్భాల్లోనే, తక్కెళ్ల జగ్గడు లాంటి పాత్రల ద్వారా కళాత్మక సంఘర్షణని నివారించే ప్రయత్నాలు జరుగుతాయి. అయితే, సామాజిక సంఘర్షణల పరిష్కారం అంత తేలిగ్గా సాధ్యమయ్యేది కాదు మరి!

-మందలపర్తి కిషోర్ 81796 91822