పెరటి చెట్టు

కొనదేలిన ‘కొత్తపాళీ’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు భాష, రెండు తెలుగు రాష్ట్రాల్లోని జనాభాకే పరిమితమనుకుంటే తప్పులో కాలేసినట్లే! తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, బంగాల్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో కూడా తెలుగు జనులు విస్తరించి వున్న సంగతి - సాధారణంగా - మనకి స్ఫురించదు. తెలుగులో మొట్టమొదటి ఆధునిక రచన ‘ఏనుగుల వీరాస్వామి అల్లించిన కాశీయాత్ర చరిత్ర’ మద్రాసులో పుట్టింది. ఆ మద్రాసు ఇప్పుడు తమిళనాడులో ఉంది. తెలుగు రంగస్థలానికి మకుటం లేని మహారాజుగా వెలుగొందిన మహానటుడు బళ్లారి రాఘవ పేరులోనే తన ఊరి పేరు ధరించారు. ఆ బళ్లారి ఇప్పుడు కర్ణాటకలో ఉంది. ప్రామాణికమయిన వ్యావహారిక భాషని ప్రయోగించే విషయంలో స్పష్టత నిచ్చిన స్ఫూర్తిమంతుడు గిడుగు వెంకట రామమూర్తి ‘సవర భాషకి వర్ణనాత్మక వ్యాకరణం’ రాసింది పర్లాకిమిడిలో. ఆ పర్లాకిమిడి ఇప్పుడు ఒడిశాలో ఉంది. మొట్టమొదటి దినచర్య నవల ‘అతడు - ఆమె’ రాసిన ఉప్పల లక్ష్మణరావు మొదలుకుని - ఆయనకి ముందూ వెనకా - దేవరాజు వేంకట కృష్ణారావు, పంచాగ్నుల ఆదినారాయణ శాస్ర్తీ తదితరులెందరో తెలుగు రచయితలు బరంపురంలో ఓ వెలుగు వెలిగారు. ఈ కోవకి చెందినవాళ్లందర్లోకి విశిష్టమయిన వ్యక్తిత్వం తాపీ ధర్మారావు అనే ‘తాతాజీ’ది. కవిత్వం, సాహిత్య విమర్శ, పత్రికా రచన, సినిమా రచన, పరిశోధనాత్మక మానవ, సామాజిక పరిణామ శాస్త్ర రచన - మంచి వ్యావహారికంలో - చేసిన తాపీ ధర్మారావు కూడా తన కృషిని బరంపురంలోనే మొదలుపెట్టారు. ఆ బరంపురం కూడా ఇప్పుడు ఒడిశాలోనే ఉంది.
నల్లిచావుపై ‘కారుణ్య’ ప్రకటనగా, తెలుగులో మొట్టమొదటి స్మృతి గీతం (ఎలిజీ) రచించింది తాతాజీయే. ‘దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు?’ ‘పెళ్లి దాని పుట్టుపూర్వోత్తరాలు’ ‘ఇనప కచ్చడాలు’ అనే మూడు పుస్తకాల ద్వారా మానవశాస్త్రం తాలూకు ఓ ముఖ్యమయిన కోణంపై - స్ర్తి పురుష సంబంధాలపై - తాతాజీ కేంద్రీకరించారు. 1911లోనే, దేవరాజు వెంకట కృష్ణారావుతో కలిసి, తాతాజీ ‘వేగుజుక్క గ్రంథమాల’ స్థాపించారు. తాతాజీ కేంద్రీకరించి కృషి చేసిన మరో రంగం పత్రికా రంగం. 1912లోనే తాతాజీ ‘కొండెగాడు’ పత్రిక సంపాదకుడిగా క్రియాశీలకమయిన పత్రికా రచనకు శ్రీకారం చుట్టారు. ‘జనవాణి’ ‘సమదర్శిని’ ‘కాగడా’ పత్రికల ద్వారా తాతాజీ తెలుగులో సమకాలీన, వ్యావహారిక భాష ప్రధాన స్రవంతి ప్రసార మాధ్యమాల్లో నిలదొక్కుకునేలా ఒరవడి దిద్దారు. ఆయన అదే పని సినిమా రంగంలో కూడా చేయడం గమనార్హం. దాదాపు నాలుగు దశాబ్దాల చలనచిత్ర జీవితంలో పనిచేసిన తాతాజీ ఎనె్నన్నో పాటలూ, మాటలూ, కథలూ, చిత్రకథలూ రచించారు. ‘చలం’ కథానిక ఆధారంగా నిర్మితమయిన ‘మాలపిల్ల’, బళ్లారి రాఘవ ప్రధాన పాత్రధారిగా చేసిన ‘రైతుబిడ్డ’ మొదలుకుని ‘్భష్మ’ చిత్రం వరకూ నలభై సినిమాలకు తాతాజీ మాటలూ పాటలూ రాశారు.
తాపీ ధర్మారావు పుట్టి, పెరిగిన వాతావరణంలో సాహిత్య వాసనలు మచ్చుకయినా లేవు. ఆయన తండ్రి వృత్తిరీత్యా వైద్యులు. కొడుకు ‘పనికొచ్చే’ పెద్ద చదువులు చదివి పైకి రావాలన్నది ఆ తండ్రి కల. అందుకే, ధర్మారావు తెలుగు చదవడాన్నీ- రాయడాన్నీ నిషేధించారు డాక్టరుగారు. వద్దన్న కొద్దీ పట్టుదల పెంచుకునే తత్వం ధర్మారావు గారిది. అదిగో, అలా వచ్చి పడ్డారు ఆయన తెలుగు అక్షర వీథుల్లోకి. సాహిత్య నేపథ్యం లేనివాళ్లకి చేమకూర వెంకట కవి ‘విజయ విలాసం’ చదివి అర్థం చేసుకోవడమే కష్టం. కానీ, లెక్కల మేస్టారుగా తర్ఫీదయ్యానని చెప్పుకునే తాతాజీ అదే విజయ విలాసానికి ‘హృదయోల్లాస వ్యాఖ్య’ రాసి రసజ్ఞ లోకం చేత సెబాసనిపించుకున్నారు. ‘పారిజాతాపహరణం’లో ముక్కు తిమ్మనార్యుడు పలికించిన ముద్దు పలుకులకి ‘్భవప్రకాశిక’ రూపంలో వ్యాఖ్యానం చెప్పి తన ఉత్తమాభిరుచిని నిరూపించుకున్నారు. ‘ఆముక్తమాల్యద’ కర్తృత్వం విషయంలో తాతాజీ చేసిన పరిశోధన, బహు విషయ పరిజ్ఞానానికి నిదర్శనగా కలకలం నిలబడి ఉంటుంది. తెలుగు సాహితికి తాతాజీ చేసిన సేవకి మెప్పుదలగా సాహిత్య అకాదెమీ ఆయనకి విశిష్ట సభ్యత్వం ఇచ్చి గౌరవించగా, శృంగేరి శారదా పీఠం ఆయనకి ‘ఆంధ్ర విశారద’ బిరుదమిచ్చింది. పర్లాకిమిడి - హైస్కూల్‌లో చదువుకునే రోజుల్లో గిడుగు రామమూర్తి గారి దగ్గిర చరిత్ర పాఠాలు నేర్చుకున్నారు తాపీ ధర్మారావు. కానీ, ‘ఆంధ్ర భాషాభివర్ధినీ సమాజం’ సభల్లోనూ, ‘అభినవాంధ్ర కవి పండిత సభ’లోనూ గిడుగు మేస్టారి వ్యావహారిక వాదంతో ముఖాముఖీ తలపడడానికి వెనకాడలేదు. అదే విధంగా, తన వాదనలో పసలేదని గ్రహించిన ఉత్తర క్షణమే ఆ విషయం ప్రకటించడానికి సంకోచించలేదు.
అసలు, 1930 దశకంలో ‘దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు?’ అనే ప్రశ్న రావడమే విడ్డూరం. ఆ ప్రశ్నకి సమాధానం వెతికే క్రమంలో ప్రపంచ చరిత్రలోని అనేక సామ్యాలను తడుముతూ పోవడం అపూర్వం. తనకి దొరికిన సమాధానాలను పాటకులతో ధైర్యంగా పంచుకోవడం నిజంగా అనూహ్యం. ఇక, ‘పెళ్లి - దాని పుట్టుపూర్వోత్తరాలు’ సామాజిక సంబంధాల పరిశీలనకు అపూర్వమూ, అపరిచితమయిన దృక్కోణాన్ని తెలుగు పాఠకులకి చూపించింది. వెస్టర్‌మార్క్, ఫ్రేజర్, థర్‌స్టన్, హేస్టింగ్స్, మాలెనోవ్‌స్కియ్ తదితర పాశ్చాత్య పరిశోధకుల అధ్యయనాలను మథించి, ఈ రచన చేశారు తాతాజీ. అలాగే, ‘ఇనప కచ్చడాలు’ పుస్తకం కూడా. భారతీయ సామాజిక విమర్శలో చాలావరకూ అస్పృశ్యంగా ఉండిపోయిన అంశాన్ని స్పృశించింది - కాదు, నిలువుకోతగా చీల్చి చూపించింది! ఈ మూడు పుస్తకాలలోనూ లేవనెత్తిన ఎన్నో ప్రశ్నలకు సమాజశాస్త్ర పరిశోధకులు దరిమిలా సమాధానాలు కనిపెట్టిన మాట నిజమే. కానీ, తాతాజీ మాదిరిగా సమాజశాస్త్ర గ్రంథాలను ఉత్తమ సాహిత్యంగా రాయగల విద్య మాత్రం ఎవరికీ ఒంటబట్టలేదని చెప్పక తప్పదు!
భాష విషయంలో సంప్రదాయవాదిగా కొంతకాలం వుంటే వున్నారేమో గానీ, సాహిత్య విమర్శకుడిగా తాతాజీ ఎన్నడూ సంప్రదాయవాది కారు. ‘కొత్తపాళీ’లో కవుల ఇష్టారాజ్యం ఎలా సాగేదో ఇలా వివరించి చెప్పారాయన. ‘నాయికలని దింపినట్టే కవిత్వాన్ని కూడా శృంగార చేష్టలలోకి దింపి, కళాశాస్త్రంలో చూపినట్టే కవిత్వాన్ని కూడా శృంగార చేష్టలలోకి దింపి, కళాశాస్త్రంలో చూపినట్టే కవిత్వాన్ని కూడా బంధాలలోకి దించి, చివరికి నీళ్లాడించక తప్పదు - ఒక మత్త్భేం కడుపున నాలుగు పిల్లలు పుడితే, మరో శార్దూలానికి ఆరు పిల్లలు పుట్టిస్తూ - కవితను నానా భ్రష్టు పట్టిస్తూ వ’చ్చారని దుమ్ము దులిపేశారు. ఈ క్షుద్ర కవులు ‘ఆంధ్ర కవిత్వమంటే అసహ్యం కలిగేటట్లు చేశా’రనడానికి తాతాజీ జంకలేదు. సమాజ విమర్శలోనూ తాతాజీది ఇదే ధోరణి. జనవాణి, సమదర్శిని, కాగడా పత్రికల్లో సంపాదకుడు నిరంతర విమర్శకుడిగా వ్యవహరించడం ప్రతి కాలమ్‌లోనూ కనిపిస్తుంది. ముఖ్యంగా, పళనియప్పన్ పిశాచ గణాచారులు జరిపించిన కాటూరు - ఎలమర్రు ఘోరాన్ని ఖండించడంలో తాతాజీ ప్రదర్శించిన సాహసం ఈ కాలపు సంపాదకుల నుంచి ఆశించలేం.
‘పాడిన పాటేనా ఇంకా పాతపాటలేనా?’ అని తన కాలం కవుల మీద ‘కొత్త పాళీ’ ఝళిపించారు తాతాజీ. ‘కాదు సుమా కల కాదు సుమా - అమరగానమున, అమృత పానమున, గగనయానమున, గాలిని తేలుతు సోలిపోవుటిది కాదు సుమా కల కాదు సుమా!’ అంటూ కీలుగుర్రాల నెక్కి ఊహాగానం చేసే వాళ్ల వీపు చరిచి, నిద్రలేపి నేలకి దింపించారు తాతాజీ. ‘ఎండనకుండా వాననకుండా కండలు కరిగే కష్టం చేసి పండించాం ఇది మా పంట - దండుగ తిండికి రాకంటాం!’ అంటూ సమకాలీనమయిన భావాలతో కూడిన ఈ పాటని టాంటాం వేసిన కవి పందొమ్మిదో శతాబ్దం చిట్టచివరి దశకంలో పుట్టి, ఇరవయ్యో శతాబ్ది ఏడో దశకం మొదట్లో కన్ను మూసిన కురువృద్ధుడంటే నమ్మడం కష్టమే. తమ కాలంకన్నా యోజనాలు ముందుకు చూడగల తాపీ ధర్మారావు లాంటి ద్రష్టలూ యుగకర్తల పోకిళ్లు అలానే వుంటాయి మరి! మన మధ్యనుంచి ఆయన వెళ్లిపోయి అర్ధ శతాబ్దం కావస్తూన్నా తాతాజీ రచనల్ని ఇప్పటికీ యువతరం స్మరించుకుంటోందంటే ఆయన కాలం కడలికి చింతన వంతెన కట్టారని అర్థమవుతుంది!!
(తాతాజీ జీవిత సాహిత్యాల గురించి మరిన్ని వివరాల కోసం ఈ లింకులో ప్రయత్నించండి.)
https://archive.org /stream/in.ernet.dli.2015. 492328.taapiidharmaa#page/n65/mode/2up

-మంధలపర్తి కిషోర్ 81796 91822