పెరటి చెట్టు

ఆంధ్ర భారతీయుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రెంచ్ భాషలో కానస్సాయ్(ర్) అనే మాట ఒకటుంది. రసజ్ఞుడని ఆ మాటకి - స్థూలంగా - అర్థం చెప్పుకోవచ్చు. కళాకారులు లక్షల సంఖ్యలో వుంటే రసజ్ఞులు పదుల సంఖ్యలో ఉంటారు. సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమం జయప్రదంగా మొదలు కావడానికి ఇలాంటి అరుదయిన వ్యక్తిత్వం ఒకటి అంకిత భావంతో పనిచెయ్యడం అత్యవసరం. అంత అరుదయిన వ్యక్తిత్వం అయినందువల్లనే, ఆ యువ సంపాదకుడు తన కంటే ముప్పయ్యేళ్లు పెద్దవాడయిన గురజాడ అప్పారావు తొలి కథానికలను తన పత్రికలో అచ్చువేసి ‘ఆంధ్ర భారతి’కి నీరాజనమిచ్చాడు. అదీ రెండు పదుల లేత వయసులోనే! తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమానికి చుక్కానిపట్టిన సరంగుల్లో ఒకడయిన మాడపాటి హనుమంతరావు తొలి కథానికను కూడా తన సంపాదకత్వంలోని పత్రికలోనే అచ్చు వేశాడా యువకుడు. నవ్యాంధ్ర కవిత్వానికి నాందీ ప్రస్తావన చేసిన రాయప్రోలు తొలి కవితలను కూడా తన పత్రికలోనే ప్రచురింప చేశాడా యువ సంపాదకుడు. ‘రోగికి ఆకలి యగునటుల చేసి అన్నము పెట్టకుండిన ఎట్లో మానవునకు విద్య గఱపి చదువుకొనుటకు గ్రంథముల నందజేయని యెడల అట్లే గదా!’ అనే పరిణతి అప్పటికే సాధించాడు కనుకనే, పాతికేళ్ల పరువంలోనే గ్రంథాలయోద్యమ ఆవిర్భావానికి రంగం సిద్ధం చేశాడు. ‘ప్రజా గ్రంథాలయం, ప్రజా విశ్వవిద్యాలయం’ అని గ్రహించినందువల్లనే జీవితాన్నంతటినీ ఈ గ్రంథాలయోద్యమానికే అంకితం చేశాడాయన. అయితే, ప్రజా గ్రంథాలయమనేది బాహ్య ప్రేరణ వల్ల ఫలదీకరించదనీ, స్వయంభువుగానే పుట్టుకు రావాలనీ స్పష్టం చేశాడాయన. భాషా - సాహిత్య - సమాజాల సంస్కరణకి కృషి చేసిన గిడుగు - గురజాడ - కందుకూరి ప్రభావ పరిధిలో, గ్రంథాలయోద్యమం ఆరంభించిన జాతీయవాది అయ్యంకి వెంకట రమణయ్య.
1907లో, బెంగాల్ విభజన నేపథ్యంలో, బిపిన్ చంద్రపాల్ తెలుగు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. అప్పటికి అయ్యంకి పదిహేడేళ్ల కౌమార దశలో ఉన్నారు. పాల్ వక్తృత్వ ధోరణికి ప్రభావితులయి, చదువు మానేసి, కదన రంగంలోకి దూకారు. అప్పటికి కందుకూరి - గురజాడ - గిడుగుల ప్రభ కూడా దివ్యం వెలుగుతోంది. సామాజిక రంగంలో భూస్వామ్య భావజాలంపై తిరుగుబాటుకు వీరేశలింగం నేతృత్వం వహించారు. వితంతు పునర్వివాహ సమస్యకే వీరేశలింగం సమాజ సంస్కరణ పరిమితం కాలేదు. అవిద్యపై ఆయన పూర్తి స్థాయి పోరాటం చేశారు. అలాగే, అవినీతికి వ్యతిరేకంగా కందుకూరి చేసిన పోరాటం గురించి ఆయన స్వీయ చరిత్రలో విపులంగా వివరించారు. ఇక, సాహిత్యంలో గురజాడ చేసిన పోరాటం క్రియాశీలకమయింది. చదువు సంధ్యలు పెద్దగా లేని సామాజికుల్లో పరివర్తన తీసుకురావడం లక్ష్యంగా గురజాడ రూపకాలూ, గేయకథలూ రచించారు. ఆధునిక భాషా సాహిత్యానికి ఆదికావ్యంగా ‘కన్యాశుల్కం’ అలా పుట్టిందే. కథానికా సాహిత్య సృజనకి ఆయన నడుంకట్టే సమయానికి రాయసం వెంకట శివుడు, సాంఖ్యాయన శర్మ, భండారు అచ్చమాంబ, కొమర్రాజు లక్ష్మణరావు తదితరులు ఆ రంగంలో ఒకపాటి కృషి చేసి వున్నారు. అయితే, కథానికా సాహిత్యానికి పరిణత రూపం ఇచ్చిన పుణ్యం గురజాడదే. దానికి, అయ్యంకి వెంకట రమణయ్య గారి ‘ఆంధ్ర భారతి’ వేదికగా నిలిచింది. ‘తెలుగు హార్ప్’ ‘ఇండియన్ లీజ్షర్ అవర్’ ‘కృష్ణా పత్రిక’ తదితర వేదికలను కూడా గురజాడ తన ప్రగతిశీల రచనల ప్రచురణకి వేదికలుగా వినియోగించుకున్నారు. భాషా రంగంలో గిడుగు కూడా భూస్వామ్య భావజాలంపై తిరుగుబాటు బావుటాలు ఎగరేస్తున్న తరుణమది. సవర భాషకి గిడుగు రాసిన వర్ణనాత్మక వ్యాకరణం ఆ కాలపు యువ మేధావులను ప్రభావితుల్ని చేసింది. ఈ ముగ్గురు సంస్కర్తల ప్రభావానికి తోడుగా బిపిన్ చంద్ర పాల్ జాతీయ భావోద్వేగం జోడయింది. ముఖ్యంగా, పాల్ ఉపన్యాసాలకి చిలకమర్తి చేసిన అనువాదాలు యువ శ్రోతల్లో ఆలోచనలు రేకెత్తించేవి. ఫలితంగా రూపుదిద్దుకున్న విశిష్ట వ్యక్తిత్వమే అయ్యంకి వెంకట రమణయ్య గారిది.
ప్రపంచ చరిత్రలోనే 1910 సంవత్సరానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. హేలీ తోకచుక్క కనబడిన ఆ సంవత్సరం, మూఢ విశ్వాసాల మీద విజ్ఞాన వేత్తలు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. సాంస్కృతిక ప్రపంచంలోనూ ప్రముఖమయిన సంఘటనలెన్నో జరిగాయి. టామ్‌సాయర్ - హక్ల్‌బరీ ఫిన్ లాంటి అద్భుతాలను సృష్టించిన మార్క్ ట్వెయ్న్ ఆ ఏడాదే అమెరికాలో కన్నుమూయగా, అదే సంవత్సరం మన మహాకవి శ్రీశ్రీ పుట్టారు. అదే సంవత్సరం బరంపురంలో సంస్కరణోద్యమ నేతలు తెలుగు వారందరినీ సమావేశపరిచారు. వాస్తవానికి అప్పటికి దశాబ్ది కాలంగా తెలుగు కథానిక క్రమంగా పదునెక్కుతోంది. 1902లోనే, భండారు అచ్చమాంబ కథానికలు రెండు ‘్ధన త్రయోదశి’ - ‘స్ర్తి విద్య’ అచ్చయ్యాయి. మొసలికంటి రమాబాయి సంపాదకత్వంలో వెలువడుతూ వుండిన ‘హిందూ సుందరి’ పత్రికలోనే ఈ కథానికలు ప్రచురితమయ్యాయి. వాటిల్లో ‘ధన త్రయోదశి’ పరిపూర్ణమయిన కథానిక. దానికి వుండిన ఒకే ఒక లోటు భాష. అచ్చమాంబగారి కథలన్నీ అతి సరళమయిన గ్రాంథికంలోనే ఉన్నాయి. ఇక, 1903లో వెలువడిన ‘లలిత’, మరుసటి సంవత్సరం వెలువడిన ‘విశాఖ’ కథానిక రచన దిశగా జరిగిన ప్రయత్నాలు మాత్రమే. ఈ రెండింటినీ, ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ, సొంత పత్రిక ‘కల్పలత’లోనే ప్రచురించుకున్నారు. ఇక, గురజాడ కథానిక ‘దిద్దుబాటు’ ప్రచురితమయిన 1910లోనే, ‘ఆంధ్ర పత్రిక’లో కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారి ‘ఏబది వేల బేరము’ కథానిక కూడా అచ్చయింది. అక్కగారయిన అచ్చమాంబ మార్గంలోనే, కొమర్రాజు గ్రాంథిక భాషలోనే తన కథానిక రాయడం గమనార్హం. మొత్తానికి అయ్యంకి వెంకట రమణయ్యగారి ‘ఆంధ్ర భారతి’ పత్రికలోనే, సర్వాంగ సుందరమయిన తెలుగు కథానిక ‘దిద్దుబాటు’ అచ్చయి ఓ గుణాత్మకమయిన పరిణామానికి తావిచ్చింది. అదే పత్రికలో, మాడపాటి హనుమంతరావు రాసిన ‘హృదయ శల్యము’ కూడా - రెండేళ్ల తర్వాత - అచ్చు కావడం కాకతాళీయం కాదు. ‘ఆంధ్ర భారతి’ పత్రిక నెలకొల్పిన ప్రమాణాలకి అది నిదర్శనం.
బెజవాడ - నేటి విజయవాడ - రామమోహన గ్రంథాలయం కార్యదర్శి బాధ్యతలు చేపట్టిన కొత్తలోనే - 1911లో - ఆ సంస్థని సమరశీల కార్యాచరణకి కేంద్రంగా మలచడం వెంకటరమణయ్య విశిష్టతకు తార్కాణం. 1914లో, బెజవాడలోనే ఆంధ్రదేశ గ్రంథాలయాల ప్రతినిధుల మహాసభ - రెండు రోజులపాటు - నిర్వహించడంతో, రాష్ట్ర స్థాయి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మరుసటి సంవత్సరమే, ‘గ్రంథాలయ సర్వస్వం’ పత్రికని మొదలుపెట్టారు. గ్రంథాలయ నిర్వహణకి సంబంధించిన శాస్ర్తియ - సాంకేతిక సమాచారాన్ని అందించిన ఏకైక పత్రికగా ‘గ్రంథాలయ సర్వస్వం’ చరిత్రకెక్కింది. 1979 వరకూ 36 రాష్ట్ర స్థాయి మహాసభలు నిర్వహించడంలో వెంకట రమణయ్య నిర్వహించిన పాత్ర అనుపమానం. జైల్లో ఉన్న స్వాతంత్య్ర సమరయోధులకి నిషిద్ధ సాహిత్యం రహస్యంగా పంపించడానికి ధైర్య సాహసాలు మాత్రమే సరిపోవు - సమర్థమయిన నిర్మాణ కౌశలం కూడా అత్యవసరం. ఉన్నవ లక్ష్మీనారాయణ రచించిన ‘మాలపల్లి’ నవల్ని జస్టిస్ పార్టీ ప్రభుత్వం నిషేధించినప్పుడు ఆ నవలని రహస్యంగా ముద్రింపచేసి రాష్టమ్రంతా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది గ్రంథాలయ ఉద్యమ కార్యకర్తలే. వాస్తవానికి, జాతీయోద్యమానికీ గ్రంథాలయోద్యమానికీ మధ్య లంకెగా వ్యవహరించడమే వెంకట రమణయ్య నిర్వహించిన చరిత్రాత్మక పాత్ర. ఈ కృషిలో గాడిచర్ల హరి సర్వోత్తమరావు, మారేపల్లి రామచంద్ర శాస్ర్తీ, టేకుమళ్ల రామచంద్రరావు, మాజేటి రామచంద్ర రావు, సూరి వెంకట నరసింహం తదితర జాతీయ సంస్కర్తలు అయ్యంకి వెంకట రమణయ్యతో కలిసి పని చేశారు. విశ్వకవి టాగూర్, దేశబంధు చిత్తరంజన్ దాస్, శాస్తవ్రేత్త పి.సి. రే తదితరులను కూడా గ్రంథాలయోద్యమంలోకి ఆకర్షించగలిగిన వ్యక్తిత్వం ఆయనది!
రామమోహన గ్రంథాలయ (ధర్మ పుస్తక కేంద్రం) వరండా కేంద్రంగా నడిచిన ‘ఫూల్స్ క్లబ్’ వెంకట రమణయ్య సృజనశీలతకీ, హాస్యప్రియత్వానికీ నిదర్శనం. తమ లోపాల గురించి తమకే తెలిసి వుండడమే ‘ఫూల్’ లక్షణమన్నది అయ్యంకి నిర్వచనం! అలా కాకుండా, తమ భుజాల మీదనే భూభారమంతా మోస్తున్నామని భావించేవాళ్లని ‘గాడిదలు’గా నిర్వచించారాయన. నోరి వెంకటేశ్వర్లు ఫూల్స్ క్లబ్ కార్యకలాపాలు రూపొందించడంలో కీలకపాత్ర పోషించేవారు. వాస్తవానికి, ఈ ఫూల్స్ క్లబ్‌ని బహిరంగ రాజకీయ శిక్షణా శిబిరంలా నిర్వహించారాయన. ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి క్లబ్బులు ఉండేవని చెప్తారు. విజయవాడ వీథుల్లో అలాంటి సంస్కారవంతమయిన కార్యాచరణను రూపొందించడం అయ్యంకి వెంకట రమణయ్యకే సాధ్యమయింది! ఆంధ్ర భారతిని, అంతర్జాతీయ స్థాయికి పెంచిన ఆనాటి ఫూల్స్ క్లబ్‌ని తక్షణం పునరుద్ధరించడం మన కర్తవ్యం!

-మందలపర్తి కిషోర్ 81796 91822