రచ్చ బండ

విలీనం...వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగుదేశం శాసన సభాపక్షంలో డజను మంది టిడిపి ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో విలీనం అయినట్టు గురువారం స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి ఆదేశం మేరకు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ ఎస్. రాజా సదారామ్ బులిటెన్ విడుదల చేశారు. టిడిపి శాసన సభాపక్షం సమావేశమై టిఆర్‌ఎస్‌లో విలీనం కావాలని తీర్మానం చేసినట్టు శాసన సభాపక్షం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పీకర్‌కు లేఖ అందించారు. ఈ లేఖను ఆమోదిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. రెండింట ముడు వంతుల మంది విలీనం కోరినందున ఈ 12 మంది ఎమ్మెల్యేల విలీనాన్ని గుర్తిస్తున్నట్టు పేర్కొన్నారు. విలీనమైన ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో పాలకపక్షం వైపు సీట్లు కేటాయించారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి తరఫున ఎన్నికైన 15 మంది ఎమ్మెల్యేలలో ఇదివరకే 10 మంది టిఆర్‌ఎస్‌లో చేరగా, తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు (మాగంటి గోపినాథ్, అరికెపూడి గాంధీ) చేరారు. తమ పార్టీ తరఫున గెలుపొంది టిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని, వారి సభ్యత్వాలను రద్దు చేయాలని లోగడ ఎర్రబెల్లి దయాకర్ రావు టిడిపి శాసనసభాపక్షం నాయకునిగా ఉన్నప్పుడు స్పీకర్ ఎదుట పిటీషన్ దాఖలు చేశారు. చివరకు పిటీషనరే పార్టీ ఫిరాయించారు. ఇలాఉండగా టిఆర్‌ఎస్‌లో చేరిన వారంతా తాము పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారమే (మూడింట రెండో వంతు) విలీనమయ్యామని, తమ విలీనాన్ని గుర్తించి టిఆర్‌ఎస్ పక్షంగా గుర్తించాలని కోరారు. ఈ లేఖపై స్పీకర్ మధుసూదనాచారి మున్ముందు న్యాయపరమైన చిక్కులు ఏమైనా వస్తాయా? అని అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ ఎస్. రాజా సదారామ్‌తో, పలువురు న్యాయ నిపుణులతో చర్చించి చివరకు విలీనంగా గుర్తించారు. టిడిపిలో ఇక మిగిలింది ముగ్గురు ఎమ్మెల్యేలే. ఆ పార్టీకి శాసనసభాపక్షం నాయకుని హోదా కూడా కోల్పోయినట్లే. అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఏదైనా ప్రతిపక్ష పార్టీకి శాసనసభాపక్షం హోదా దక్కాలంటే ఐదుగురు ఎమ్మెల్యేలకు తగ్గకుండా బలం ఉండాలి. అప్పుడే ఆ పార్టీకి శాసనసభాపక్షం హోదా లభిస్తుంది. శాసనసభాపక్షం హోదా లభించే పార్టీకి అసెంబ్లీ ఆవరణలో శాసనసభాపక్షం కార్యాలయం కేటాయిస్తారు. శాసనసభాపక్షం నాయకునికి పర్సనల్ అసిస్టెంట్‌ను, అటెండరును, కార్యాలయంలో ఫాక్స్, ఫోను వంటి సౌకర్యాలు కల్పిస్తారు. ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యేలు ఎ. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఆర్. కృష్ణ య్య ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్న టిడిఎల్‌పి కార్యాలయాన్ని స్పీకర్ ఆదేశంతో ఖాళీ చేయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. కేవలం సమావేశాలు జరిగేప్పుడే అసెంబ్లీలోని లాబీల్లో ఒక గది కేటాయిస్తారు.
స్పీకర్ మధుసూదనా చారి తీసుకున్న విలీనంపై విమర్శలు వెల్లువెత్తాయి. రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఈ విలీనం సరైంది కాదని తెలుగు దేశం పార్టీ భగ్గుమంటోంది. 12 మంది ఎమ్మెల్యేలు టిడిపి తరఫున గెలుపొంది, ఒక్కొక్కరూ ఒక కారణం చెబుతూ విడివిడిగా రాజీనామాలు చేశారు. తొలుత తీగల కృష్ణారెడ్డి 2014 సంవత్సరం అక్టోబర్ 9న రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి ఫాక్స్ ద్వారా పంపించి టిఆర్‌ఎస్‌లో చేరారు. 2014 డిసెంబర్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపించి, బయట మీడియాకూ చూపించారు. తలసాని శాసనసభ్యత్వానికి చేసిన రాజీనామాను స్పీకర్ ఇంత వరకు దానిని ఆమోదించకుండా టిడిపి ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, అరెకెపూడి గాంధీ టిడిపికి రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరినట్లు లేఖ అందించగానే వెంటనే నిర్ణయం తీసుకోవడం విస్మయం కలిగించిందని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) నేత, ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి కూడా తీవ్ర అభ్యంతరం తెలిపారు. విలీనం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. దీనిని అసెంబ్లీలో ప్రస్తావిస్తామని అన్నారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయం అనైతికమని నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ నిర్ణయం తలవొంపులు తెచ్చేలా ఉందని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఆవేదన చెందారు. స్పీకర్ నిర్ణయంతో తెలంగాణ సమాజం విస్తుపోయిందని విమర్శించారు. ప్రజాస్వామాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి తెలంగాణలోని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని అన్నారు. 10వ షెడ్యూలులోని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని సూచించారు. 10వ షెడ్యూలులోని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం (క్లాజ్-4) నిబంధన ప్రకారం ఒరిజినల్ రాజకీయ పార్టీ విలీనం కాకుండా చట్ట సభకు ఎన్నికైన వారు తమంతట తాము మరో పార్టీలో చేరిపోతున్నట్లు చెప్పడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఒరిజినల్ పార్టీ విలీనమైనట్లయితే ఆ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల్లో మూడింట రెండో వంతు మంది (తక్కువ కాకుండా) సభ్యులు చీలిపోయి తమ ఇష్టమైన పార్టీలో చేరిపోయిందేకు అవకాశం ఉంది. ఒరిజినల్ పార్టీతో వెళ్ళవచ్చు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. ఆ సమయంలో ఉన్న ఎమ్మెల్యేలలో ఇద్దరు (శోభా నాగిరెడ్డి, కాటసాని రాంరెడ్డి) తప్ప మిగతా ఎమ్మెల్యేలూ కాంగ్రెస్‌లో విలీనమైనట్లు ప్రకటించారు. ఇలా ఒరిజినల్ పార్టీ సర్వసభ్య సమావేశం తీర్మానం లేకుండా చట్ట సభలోని ఏదైనా పార్టీ సభ్యులు తమ ఇష్టం వచ్చిన విధంగా విలీనమైనట్లు నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని, దానిని ఆమోదించరాదని పలువురు న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. దీనిని కోర్టులో సవాల్ చేయనున్నట్లు టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ మీమాంస ఇలా ఎంత కాలమో!.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి