రచ్చ బండ

కెసిఆర్ సరికొత్త సంప్రదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా చూపిస్త మావా...నీకు సినిమా చూపిస్త మావా’ అనే ఓ పాట తెలుగు సినిమాలో హిట్టయ్యింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అసెంబ్లీ వేదికగా ‘జలదృశ్యం’ చూపిస్తాననడంతో ప్రతిపక్షాలు లంఘించాయి. అసెంబ్లీ వేదికపై ఎలా చూపిస్తారు? మరెక్కడైనా చూపిస్తే వస్తామంటూ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ భీష్మించుకుని కూర్చున్నాయి. అసెంబ్లీలో ‘తెర’ ఎలా ఏర్పాటు చేస్తారంటూ ప్రశ్నించాయి. కానీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పట్టుదలతో నిర్వహించారు. గతంలో అధికారంలో ఉన్న టిడిపి, కాంగ్రెస్‌ల బండారం బయటపడుతుందన్న భయంతోనే ఆ రెండు పార్టీలు ఈ ‘తెర’ వంకతో రాలేదని ముఖ్యమంత్రి కెసిఆర్ విమర్శించారు. స్పీకర్ ఎస్. మధుసూదనాచారి అనుమతితో సభలో తెర పెట్టి ఇప్పటి వరకు నీటి పారుదల రంగం పురోగతిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ చూపించారు. సభలో ల్యాప్‌టాప్‌లు, ప్యాడ్‌లు ఉపయోగిస్తున్నప్పుడు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడంలో తప్పేమి లేదని పాలకపక్షం గట్టిగా వాదించింది.
దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇప్పటి వరకు ఇలాంటిది జరగలేదని, చట్ట సభల గౌరవం దెబ్బతింటుందని ఆ పార్టీలు తెలిపాయి. దేశంలోనే కాదు ప్రపంచంలోనూ ఎక్కడా జరిగి ఉండకపోవచ్చు కానీ సాంకేతిక విప్లవం వచ్చిన ఈ రోజుల్లో కెసిఆర్ ఈ ‘తెర’ ఏర్పాటు చేసి కొత్త సంప్రదాయానికి ‘నాంది’ పలికారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలు బహిష్కరించారు.
అయితే ప్రతిపక్షాల మనోభావాలను పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి కెసిఆర్ ఓ చిన్ని ‘చిట్కా’ చేస్తే బాగుండేది. అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేయించి, మళ్లీ అసెంబ్లీ సమావేశం మందిరం (సభ)లోనే ‘తెర’ ఏర్పాటు చేసి ఉంటే విమర్శలకు తావు ఉండేది కాదు. ఉదాహరణకు 2003 సంవత్సరంలో కావలి ప్రతిభా భారతి అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నప్పుడు కామన్‌వెల్త్ సమావేశాలను అసెంబ్లీలోనే నిర్వహించారు. కానీ ఇప్పుడు అలా చేస్తే అసెంబ్లీ రికార్డుల్లో ఉండేది కాదు. భవిష్యత్తుతరాలకు అసెంబ్లీ తలమానికంగా ఉండాలంటే కచ్చితంగా సభ జరుగుతున్నప్పుడే నిర్వహించాలన్నది ముఖ్యమంత్రి భావన. అనుకున్నట్లే జరిగింది. సుమారు మూడు గంటల పాటు కెసిఆర్ అనర్గళంగా, లోతుగా ప్రతి ప్రాజెక్టు, ఏయే చెరువులకు ఎలా నీరు వస్తుందో పేపర్ లేకుండా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తే సభ్యులు విస్తుపోయారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు కూడా కెసిఆర్‌ను అభినందిస్తూ లేఖ పంపించారు. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే, సినీ నటుడు బాబూ మోహన్ మాట్లాడుతూ కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలు సభకు రాకపోయినా చాటు-మాటుగా చూశారని వ్యాఖ్యానించడంతో అసెంబ్లీలో నవ్వుల జల్లుకురిసింది. వైకాపా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ‘క్లాస్’లో కూర్చున్నట్లు అనిపించిందని అన్నారు. ఇంకా అనేక మంది ఆయన్ను అభినందించారు.
అటు ఆంధ్ర ప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసాయి. రెండు రాష్ట్రాల్లోనూ సమావేశాలు హోరా-హోరిగా జరిగాయి. ఆద్యంతమూ ఉత్కంఠభరితంగా సాగాయి. రెండు దశాబ్దాల క్రితం అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై లోతుగా, అర్థవంతంగా చర్చించి పరిష్కారం కనుకునే వారు. ప్రతి అంశంపై, సమస్యపై పాలక-ప్రతిపక్షాలు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే వారు. రాను, రాను ఆ సంప్రదాయానికి ‘తెర’ పడుతోంది. పాలకపక్షం అవునంటే ప్రతిపక్షం కాదనాలని, ప్రతిపక్షం ఒకటంటే పాలక పక్షం మరొకటి అనాలనే భావన ఏర్పడుతోంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో కొందరు కేవలం సభలో ఇలాగే అల్లరి చేయాలేమోనన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నారు.
తాజాగా ముగిసిన రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాల పని తీరును పరిశీలిస్తే, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఒకింత మేలేనన్న భావం కలుగుతున్నది. ఒకటి, రెండు సమస్యల విషయంలో తప్ప దాదాపు తెలంగాణ సమావేశాలు సాఫీగానే సాగాయి. బడ్జెట్‌లో వివిధ ప్రభుత్వ శాఖల పద్దుల (డిమాండ్ల) విషయానికి వస్తే రెండు రాష్ట్రాల అసెంబ్లీలో పద్దులు ‘గిలిటెన్’ కాకుండా సభ ఆమోదాన్ని పొందాయి. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఎపి అసెంబ్లీ సమావేశాల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కె రోజా సస్పెన్షన్ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో రోజా సస్పెన్షన్ వ్యవహారం ఉత్కంఠను కలిగించింది. రోజాను సభకు అనుమతించాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇవ్వడం, దానిపై స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆదేశంతో అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ ముందు అప్పీలు చేయడంతో, డివిజన్ బెంచ్ సింగిల్ జడ్చి ఇచ్చిన తీర్పును కొట్టేయడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకున్నది. కాగా రోజా అంతటితో ఆగకుండా న్యాయం కోసం ‘సుప్రీం’ను ఆశ్రయించింది. సుప్రీంకోర్టు శుక్రవారం ఈ కేసును పరిశీలించి, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఆంధ్ర అసెంబ్లీ సమావేశాల ఆరంభంలోనే ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఆ తీర్మానంపై ఓటింగ్‌కు స్పీకర్ కోడెల శివప్రసాద రావు అనుమతించకుండా వాయిదా వేశారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మర్నాడు స్పీకర్‌పైనే అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించింది. ఈ రెండు తీర్మానాల విషయంలోనూ ప్రధాన ప్రతిపక్షానికి గడువు ఇవ్వకుండా ప్రభుత్వం వెంటనే చర్చను చేపట్టింది. తద్వారా వైకాపా తమ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ‘విప్’ జారీ చేసే అవకాశం ఇవ్వకుండా చేసింది. రాజకీయాల్లో ఇటువంటి ఎత్తుగడలు సహజమే. అంగన్‌వాడి, హోం గార్డుల వంటి చిన్ని ఉద్యోగుల సమస్యలు, పేద రైతుల బాధల సంగతి ఎలా ఉన్నా, ఎమ్మెల్యేలు మాత్రం తమ జీతాలను భారీగానే పెంచుకున్నారన్న విమర్శలను ఎదుర్కొక తప్పలేదు.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి