రచ్చ బండ

అనైతికతకు పరాకాష్ఠ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అధికార పక్షం వైపు ఎమ్మెల్యేలు ఆకర్షితులవుతున్నారు. తెలంగాణలో తెలుగు దేశం పార్టీ తుడిచిపెట్టుకునిపోగా, ఆంధ్ర ప్రదేశ్‌లో మాత్రం ఆ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను వరుస పెట్టి చేర్చుకుంటూ సంఖ్యాపరంగా బలపడుతోంది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ నుంచి తొలుత తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కృష్ణారెడ్డి ప్రభృతులు తెలంగాణ రాష్ట్ర సమతి ‘కారు’లో ఎక్కడం ప్రారంభించారు. దీంతో టిడిపి జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్‌పై నిప్పులు చెరిగారు. ఇది అనైతికమని, విలువలను మంటగలుపుతున్నారని విరుచుకుపడ్డారు. తెలంగాణలో టిడిపి ఎమ్మెల్యేలు 15 మంది గెలుపొందగా ‘డజను’ ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్ గూటికి చేరగా, మిగిలింది ముగ్గురే.
రెండు రాష్ట్రాల్లోనూ ప్రధాన ప్రతిపక్షాలకు అధికార పక్షం నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ‘సైకిల్’ ఎక్కుతుండగా, తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు ‘కారు’ ఎక్కుతున్నారు. బుధవారం ఒక్క రోజే వైకాపాకు గట్టి దెబ్బ తగిలింది. వైకాపాకు సలహాదారునిగా ఉన్న సీనియర్ నాయకుడు, మాజీ హోం మంత్రి ఎం.వి. మైసూరారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆ రాజీనామా లేఖలో విమర్శలు గుప్పించారు. మరోవైపు ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరి జగన్‌కు ‘షాక్’ ఇచ్చారు. గురువారం వైకాపా ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర రెడ్డి(శ్రీశైలం), సర్వేశ్వర రావుకు (అరకు) చంద్రబాబు పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. దీంతో ఇప్పటి వరకు టిడిపిలో చేరిన వైకాపా ఎమ్మెల్యేల సంఖ్య 16కు చేరింది. ఇటీవల వైకాపా ఉప నాయకుడు జ్యోతుల నెహ్రూ తెలుగు దేశం పార్టీలో చేరారు. జగన్‌కు నమ్మిన బంటుగా ఉన్న జ్యోతుల పార్టీ ఫిరాయించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అంతకు ముందు భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియ టిడిపిలో చేరారు. జగన్‌తో బంధుత్వం ఉన్న నాగిరెడ్డి టిడిపిలో చేరడం కూడా చర్చనీయాంశమైంది. ఇలా వైకాపా నుంచి ఎమ్మెల్యేలు టిడిపిలోకి ‘క్యూ’ కట్టారు.
తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తెలుగు దేశం పార్టీ దాదాపు ఖాళీ అయ్యింది. సార్వత్రిక ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా ముగ్గురు ఎమ్మెల్యేలు ఎ. రేవంత్ రెడ్డి, ఆర్. కృష్ణయ్య, సండ్ర వెంకట వీరయ్య మిగిలారు. ఈ ముగ్గురిలో ఆర్. కృష్ణయ్య బిసి సంక్షేమ సంఘం, నిరుద్యోగుల సమస్యలు వంటి అంశాలపై పోరాటం చేస్తూ, టిడిపికి అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు.
ఇలాఉండగా కాంగ్రెస్ నేతల్లో ఆందోళన పెరుగుతున్నది. ఫలానా ఎమ్మెల్యే ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ ఫిరాయించరు, కాంగ్రెస్ పార్టీ పట్ల అంకితమైన భావంతో ఉన్నారని గట్టిగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో ఘర్షణ పడ్డారు. రాంమోహన్ రెడ్డిపై గువ్వల ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టం కింద కేసు కూడా నమోదు చేయాలని అప్పట్లో భావించారు. అయితే అందరూ నచ్చజెప్పడంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. గువ్వలతో అంత వైరం ఉన్నందున చిట్టెం ఎట్టిపరిస్థితుల్లోనూ టిఆర్‌ఎస్‌లో చేరరని అందరూ భావించారు. పైగా టిఆర్‌ఎస్‌లో చేరాలనుకుంటే తన స్వయాన సోదరి డికె అరుణతో చర్చించకుండా వెళ్ళే పరిస్థితి లేదనకున్నారు. ఆ విధంగా చర్చిస్తే డికె అరుణ ససేమిరా అంటారేమోనని చిట్టెం భావించినట్లున్నారు. అందుకే ఆమెకు మాట మాత్రంగానైనా చెప్పకుండా టిఆర్‌ఎస్ ‘కారు’ ఎక్కారు. సోదరుడు చిట్టెం మాట వరుసకైనా తనకు చెప్పలేదని డికె అరుణ బాధ పడ్డారు. తాజాగా ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ టిఆర్‌ఎస్‌లో చేరారు. ఇలా ప్రతిపక్షాల ప్రజాప్రతినిధులు అధికార పార్టీలో చేరుతుండడం ఆ పక్షాలకు ఆందోళన కలిగిస్తున్నది.
లోగడ ఎప్పుడూ లేని విధంగా ఫిరాయింపులు జరుగుతున్నాయి. లోగడ ఎవరైనా ఎమ్మెల్యే సొంత పార్టీతో విభేదించి ఇతర పార్టీలో చేరాలనుకుంటే బహిరంగంగా చేరకుండా, తనకు ఇష్టమైనా పార్టీతో అనధికారికంగా అనుబంధ సభ్యునిగా ఉండేవారు. అందుకు రెండు కారణాలని చెప్పవచ్చు. ఒకటి: నైతికత, రెండు: పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హులం అవుతామేమోనన్న భయం. ఇప్పుడు అలాంటి భయాలు, నైతిక విలువలేమీ లేవు. వేదికపై సొంత పార్టీ అధ్యక్షుని పక్కనే కూర్చుని, వేదిక దిగిన తర్వాత ‘కారు’ ఎక్కేసి, తనకు నచ్చిన పార్టీలో బాహటంగా చేరిపోతున్నారు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన సొంత పార్టీ అధ్యక్షుని పక్కన కూర్చొవడానికి ముందే ‘స్కెచ్’ వేసేసుకుంటున్నారు. వేదికపై నుంచి ప్రసంగిస్తూ ఆ పార్టీ పట్ల తమకున్న అంకితమైన భావాన్ని చెబుతూ, అధినేత త్యాగాలను కొనియాడుతూ కార్యకర్తల ‘క్లాప్స్’ కొట్టించుకుంటుని, ఆ తర్వాత కొన్ని గంటల్లోనే మరో పార్టీలో చేరినట్లు టివీల్లో హెడ్‌లైన్లు, పత్రికల్లో వార్తలు చూసి కార్యకర్తలు అవాక్కవుతున్నారు. ఈ పరిస్థితులు మారేదెన్నడో!.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి