రచ్చ బండ

ఎంతెంత దూరం...చాల చాల దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతెంత దూరం...చాల, చాల దూరం’ అని గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ పిల్లలు వరుసగా ఒకరి వెనకాల ఒకరు పరుగెడుతూ పాడుతుంటారు. ఆట, పాటల్లో భాగంగా పట్టణ ప్రాంతాల్లోనూ ఈ పాట ఒకప్పుడు బాగా పిల్లలు పాడుకునే వారు. ఆడుతూపాడుతూ, అలుపూసొలుపూ లేకుండా లక్ష్యాన్ని చేరుకోవడం ఆ పాట ఇచ్చే స్ఫూర్తి. ఇప్పుడు ఆ పాటను బిజెపి ఆలపిస్తోందా అనిపిస్తోంది...ఆ పార్టీ నాయకుల తీరుతెన్ను చూస్తే. రెండు తెలుగు రాష్ట్రాల్లో కమలం వికసించాలంటే తెలుగుదేశం పార్టీతో ఉన్న మైత్రి మాయలోంచి బయటపడి ప్రయాణం మొదలెట్టాలని, అందుకు చాలాదూరం ప్రయాణం చేయాల్సి ఉంటుందని వారు భావిస్తున్నారు. అందుకే ఆ పాటలోని అంతరార్థం బాగా ఒంటబట్టించుకున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ అధికారం అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్న ఆ పార్టీ ఆ దిశగా అడుగులు వేసేందుకు ప్రయత్నాలూ మొదలు పెట్టింది. రాజకీయ పార్టీ అన్నప్పుడు ఆ విధంగా ఆశించడంలో తప్పేమి లేదు. కాకపోతే రెండు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీకి మిత్రపక్షమైన తెలుగు దేశం పార్టీ తోడుగా ఉంది. తోడుగా ఉంటే సరిపోతుందా? అంటే ఆ తోడు-నీడ కాస్త సొంతంగా పార్టీ బలపడకుండా అడ్డుగా ఉంటుందన్న ఆవేదన. ఇది ఎక్కువగా తెలంగాణ పార్టీ నేతలను బాధిస్తున్నది. అటు ఆంధ్రలో, ఇటు తెలంగాణలో బిజెపి బలపడాలంటే, రాబోయే ఏ ఎన్నికల్లోనైనా ఒంటరిగానే పోటీ చేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. కానీ అనుకున్నట్లు జరుగుతుందా? బిజెపి కేంద్ర నాయకత్వం వద్ద ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి మార్కులు కొట్టేసినందున టిడిపిని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అంతేకాదు కేంద్ర మంత్రివర్గంలో టిడిపి చేరడం, ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గంలో ఇరువురు బిజెపి ఎమ్మెల్యేలు చేరడంతో అక్కడ ఆ ‘బంధం’ అంత సులభంగా తెగిపోయేలా లేదు.
ఈ పరిస్థితులను తెలంగాణ బిజెపి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. టిడిపితో ఉన్నంత కాలం పార్టీ బలపడలేదని ముఖ్య నాయకులు వాదిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడినందున, మరోవైపు కేంద్రంలో తమ పార్టీనే అధికారంలో ఉన్నందున, పార్టీని బలోపేతం చేసుకుని, భవిష్యత్తులో టిఆర్‌ఎస్‌కు బిజెపినే ప్రత్యామ్నాయంగా నిలబడేలా చేయాలన్న పట్టుదలతో కొంతమంది నాయకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అధ్యక్షతన ఆ పార్టీ ముఖ్య నాయకులు సమావేశమై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్ రావు, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు, మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్ధన్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు తదితరులు సమావేశమయ్యారు.
తెలంగాణలో పార్టీ బలోపేతానికి చాలా సీరియస్‌గా ముందుకెళ్లాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు నిర్ణయించారు. రాబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా అడుగులు వేయాలని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ నెల 29న తెలంగాణ రాష్ట్రానికి రానున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటనను విజయవంతం చేయాలని నిర్ణయించారు. ఇప్పటి నుంచే పార్టీ జాతీయ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో పార్టీ పటిష్ఠతకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. పార్టీ అగ్ర నాయకుల, కేంద్ర మంత్రుల పర్యటనలతో తెలంగాణ జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేయిస్తూ, కార్యకర్తలకు చేరువ కావాలని, తద్వారా ప్రజల వద్దకు వెళ్ళాలని భావించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి బిజెపియే ప్రత్యామ్నాయంగా ఎదిగేలా పట్టుదలతో పని చేయాలని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడ్డారు. పొత్తుల గురించి ఆరాటపడకుండా, స్వతహాగా పార్టీని బలోపేతం చేసుకునేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపితో జత కట్టినందున, ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చిందన్న బాధను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో వేర్వేరుగా పోటీ చేశారు. సిద్ధిపేట మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లోనూ వేర్వేరుగా పోటీ చేయడంతో టిడిపి కనుమరుగైనా, తమకు రెండు స్థానాలైనా లభించాయన్న సంతృప్తి మిగిలిందన్న అభిప్రాయం వెలువడింది. కాబట్టి టిడిపితో వెంటనే తెగతెంపులు చేసుకోలేకపోయినా, ఆ పార్టీతో మిత్రత్వం ఉందన్న భావనను మనసుల్లో నుంచి తీసేసి ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనేలా పార్టీని తీర్చిదిద్దాలన్న పట్టుదలతో ముందుకెళదామని వారు భావించారు. బిజెపి అంటే హైదరాబాద్‌కే పరిమితమైందనో, పట్టణాల్లోనే బిజెపి ఉంటుందన్న భావనను తొలగించేందుకు గ్రామీణ ప్రాంతాలపైనా దృష్టి పెట్టేందుకు సమాయత్తం కావాలని నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు ఇకమీదట జిల్లా పర్యటనలు చేపట్టాలని, ప్రతి గ్రామాన్ని సందర్శించి, స్థానికంగా చురుకైన కార్యకర్తలతో గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మండల కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పార్టీ జాతీయ నాయకులను ఆహ్వానిస్తూ వివిధ కార్యక్రమాలు చేపట్టాలని భావించారు. వచ్చే మూడేళ్ళ వరకు పార్టీ సమావేశాలకు కేంద్ర మంత్రులనూ ఆహ్వానించాలని నిర్ణయించారు.
రాష్ట్భ్రావృద్ధికి కేంద్రం సహకరించడం లేదన్న టిఆర్‌ఎస్ నాయకుల ఆరోపణలపై ఎదురు దాడి చేయాలని, కేంద్రం ఏయే పథకాలకు ఏ మేరకు సహకరించిందో ప్రజలకు వివరించాలని భావించారు. 24 గంటలూ విద్యుత్తు ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకున్నదే తప్ప కేంద్ర సహకారం గురించి చెప్పకపోవడం గురించీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్రాల అభివృద్ధి సాధ్యం కాదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళనున్నారు. ఇలా ఎంతెంత దూరం... చాల, చాల దూరం అనకుండా దగ్గర్లోనే అనుకుంటూ పయనించే బిజెపి నేతల ప్రయత్నం ఏ మేరకు విజయవంతం అవుతుందో చూద్దాం.

వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి