రచ్చ బండ

బాదుడు పరీక్ష..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర ప్రభుత్వం ఉన్నఫళంగా విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలను పెంచేసింది. విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీల రూపంలో ప్రజలపై సుమారు 1800 కోట్ల రూపాయల భారాన్ని మోపింది. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టి ఇటీవల (ఈ నెల 2న) రెండేళ్ళు పూర్తి చేసుకున్నది. రాష్ట్ర విభజనకు ముందు కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వడ్డన జరిగింది. ఛార్జీలు పెంచకపోతే ఆ సంస్ధలు మనుగడ సాధించలేవు కాబట్టి తప్పని సరి పరిస్థితుల్లో ఛార్జీలు పెంచేందుకు అనుమతి ఇవ్వక తప్పలేదని ప్రభుత్వం చెబుతోంది. కాగా ఛార్జీల పెంపుదల బాదుడు ఇప్పుడు అటు ప్రభుత్వానికి, ఇటు ప్రతిపక్షాలకు పరీక్షగానే మారింది.
ఇది బాదుడు కాదు, తప్పని సరి పరిస్థితుల్లో పెంచామని ప్రభుత్వం ప్రజలకు నచ్చజెప్పుకోవాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల్లోనే కాదు, అసెంబ్లీ, లోక్‌సభ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఇలా ఏ ఎన్నికలు వచ్చినా విజయదుందుభి మోగించడంతో ప్రజలు ప్రభుత్వం పక్షాన నిలబడ్డారన్న ధీమా ఇంత కాలం తెలంగాణ రాష్ట్ర సమితి నేతలకు ఏర్పడింది. ఇప్పుడు పెరిగిన ధరల తర్వాత కూడా అదే అభిప్రాయంతో అధికార పార్టీ నేతలు ఉంటారా? ప్రతిపక్షాలు చేసే ఆందోళనలో ప్రజలు భాగస్వాములవుతారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రజల భాగస్వామ్యం లేకపోయినా, ఆందోళనలు, ఉవ్వెత్తున నిరసన జ్వాలలు లేనట్లయితే ఈ బాదుడు పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించినట్లేనని భావించేందుకు అవకాశం ఉంటుంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 1999 సంవత్సరంలో తెలుగు దేశం పార్టీ మళ్లీ అధికారం చేపట్టిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్తు ఛార్జీలు పెంచడంతో ప్రతిపక్షాలు ఆందోళన బట్టాయి. ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్, వామపక్షాలు చేపట్టిన ఆందోళన, అసెంబ్లీ ముట్టడి విషాదానికి దారి తీసింది. అసెంబ్లీ ముట్టడిని అడ్డుకునేందుకు బషీర్‌బాగ్ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు లెఫ్ట్ కార్యకర్తలు మృత్యువాత పడ్డారు. బషీర్‌బాగ్ వద్ద జరిపిన కాల్పుల్లో మృత్యువడిలోకి వెళ్ళిన వారి జ్ఞాపకార్థం అక్కడ స్థూపం ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి స్పూర్తితో ప్రతిపక్షాలు ఏకమై ప్రజా మద్ధతుతో ఆందోళన బాట పడతాయా? అంటే అన్ని పార్టీలూ ఫిరాయింపులతో సతమతమవుతున్నాయి. బిజెపి, మజ్లిస్ మినహా కాంగ్రెస్, టిడిపి, సిపిఐల ఎంపీలు, ఎమ్మెల్యేలు ‘కారు’ ఎక్కడంతో ఆ పార్టీల నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పార్టీ నుంచి ప్రజాప్రతిపతినిధులను కాపాడుకోవడమనే ప్రధాన బాధ్యత వారిపై ఉంది. పైగా ప్రజల మద్ధతు కూడగట్టగలమా? అనే సందేహాలు లేకపోలేదు. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విధి లేని పరిస్థితుల్లో పెంచామని నాడు కాంగ్రెస్ నేతలు చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనూ తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సి వచ్చిందని నాడు టిడిపి నేతలు, అప్పటి మంత్రులు చెప్పినా ప్రజలు విశ్వసించలేదు. విద్యుత్తు షాక్ తగిలి 2004 ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది.
తెలంగాణ రాష్ట్ర సమితి రెండేళ్ళ పాలనలో ప్రజాభిమానాన్ని చూరగొన్నది. ప్రజలు తమ వెంటే ఉన్నారన్న భరోసాతో ప్రభుత్వం ఈ పెంపుదల నిర్ణయం తీసుకుందా? మరోవైపు ఈ ఛార్జీల పెంపుదల ప్రతిపక్షాలకు ఆయుధంగా మారనున్నదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండ రామ్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, రాష్ట్ర మంత్రులు, టిఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయనపై గుర్రుమన్నారు. ఛార్జీల భారాన్ని ప్రభుత్వం మోపడంతో ప్రొఫెసర్ కోదండరామ్‌కు అనుకోకుండా ఆయుధంగా అందిందా? దీనిని ప్రొఫెసర్ అవకాశంగా తీసుకుని ఈ సమయాన్ని తనకు అనుకూలంగా మలచుకుని ఉద్యమిస్తారా? అని అనేక మంది ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వంపై ఇప్పటికే విసుర్లు విసిరిన ప్రొఫెసర్ ఉద్యమానికి శంఖారావం పూరిస్తే వివిధ వర్సిటీల విద్యార్థులు ఆయన వెన్నంటి నడిచి బాసటగా నిలుస్తారా? అనే చర్చ ఆరంభమైంది. పైగా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని స్థాపించాలన్న వత్తిడి ఆయనపై భారీగానే ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆయన అడుగు ఎటు వైపు వేస్తారోనని చాలా మంది ఎదురు చూస్తున్నారు.
ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నుంచి ఒక ఎంపీ, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ఫిరాయింపులతో ఆ పార్టీ డీలాపడింది. పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు మనోధైర్యం కల్పించేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర నాయకత్వం యత్నిస్తున్నది. ఇటీవల ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణలో పార్టీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్ సింగ్‌ను హైదరాబాద్‌కు పంపించారు. దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర పార్టీలో కొరవడిన సమన్వయం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ నేతలు సమన్వయంతో ముందుకు సాగాలని హితవు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఛార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకూ పోరాటం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. శనివారం నుంచి ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఛార్జీల పెంపుదలను నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు చేపట్టనున్నారు. తెలుగు దేశం పార్టీ కూడా ఆందోళన బాటకు సమాయత్తమవుతూ, కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నది. వామపక్షాలూ ఆందోళన బాట పట్టనున్నాయి. టిఆర్‌ఎస్‌కు మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్ పెద్దగా పట్టించుకునే సూచనలు లేవు. వైకాపా ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. మిగిలింది బిజెపినే. పార్టీ ఫిరాయింపులు లేకుండా బలంగా నిలిచిన బిజెపి ఛార్జీల పెంపుదలపై కనె్నర్ర చేసింది. ఆందోళనలకు సమాయత్తమవుతోంది. బాదుడుపై ప్రతిపక్షాల ఆందోళనలకు ప్రజామద్దతు ఏ మేరకు లభిస్తుందో, ప్రభుత్వం ఎలా ఎదుర్కొని ప్రజలను సమాధానపరుస్తుందో చూద్దాం.

-వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి