రచ్చ బండ

దుర్ముఖిలోనైనా తల రాత మారేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు ప్రజలకు ‘యుగాది’ కొత్త సంవత్సరం ఆరంభమైంది. గత ఏడాది అనేక ఆటు-పోట్లను ఎదుర్కొన్న ప్రతిపక్షాలు ఉగాది నుంచైనా మంచి రోజులు వస్తాయన్న ఆకాంక్షతో ఉన్నాయి. కానీ దుర్ముఖి పేరు వింటేనే ప్రజలకు, పాలక, ప్రతిపక్షాల్లో భయం, వణుకుపుడుతోంది. ఉగాది పండుగను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ గురువారం రాజ్‌భవన్‌లో ఉత్సవం ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేర్వేరు సమయాల్లో హాజరయ్యారు. ఆ సంగతి అలా ఉంచితే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఉత్సవానికి హాజరైన వారినుద్దేశించి ప్రసంగిస్తూ దుర్ముఖి పేరు ఉన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరమేమీ లేదన్నారు. దుర్ముఖిలో మంచిగా వర్షాలు కురుస్తాయని, రాష్ట్రం పాడి-పంటలతో సుభిక్షంగా ఉంటుందని శాస్తవ్రేత్తలు చెప్పినట్లు ఆయన ఉటంకించారు. ఇది ఒకింత ఊరటే. అసలే భూగర్భ జలాలు అడుగంటి, కరవు పరిస్థితులు నెలకొన్న ఈ సమయంలో శుభం జరగాలన్నది ప్రతి ఒక్కరి ఆకాంక్ష. తెలుగు ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.
ఎటొచ్చి బాధపడుతున్నదంతా విపక్షాలే. గత ఏడాది ముఖ్యమంత్రి కెసిఆర్ ధాటికి విపక్షాలు విలవిలలడాయి. రాజకీయ సమీకరణల మార్పులు-చేర్పులు జరిగాయి. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ కోలుకోలేనంతగా దెబ్బతిన్నది. టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎపి ముఖ్యమంత్రి కావడం వల్ల ఆయన ఇక్కడ దృష్టి సారించలేకపోతున్నారు. పైగా పార్టీ తెలంగాణ శాఖలో సరైన నాయకుడు లేకపోవడం, ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు ‘కారు’ ఎక్కడంతో పార్టీ శ్రేణులు డీలాపడ్డాయి. ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఏ వ్యూహంతో ఎదుర్కొవాలా? అనేది ఆ పార్టీకి అంతుచిక్కడం లేదు. ప్రజలతో కలిసి ఉద్యమిద్దామా? అంటే ప్రజలు టిఆర్‌ఎస్‌కే అనుకూలంగా తీర్పులిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ప్రజలు టిఆర్‌ఎస్‌కే ప్రజలు పట్టం కట్టారు. రెండు పడకల గదుల ఇండ్ల పట్ల ఆకర్షితులయ్యారా? లేక మరొకటా? అనేది ఇక్కడ అప్రస్తుతం. ఏదైతేనేం ప్రభుత్వం పట్ల ఓట్ల రూపేణా విశ్వాసం వ్యక్తం చేశారు. టిడిపి పరిస్థితి అలా ఉంటే బిజెపి సంస్థాగతంగా బలపడేందుకు కృషి చేస్తోంది. టిడిపిని వదులుకుంటే తప్ప పార్టీకి భవిష్యత్తు ఉండదన్న భావన పార్టీలో మెజారిటీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి పదవీ కాలం ముగిసింది. ఆయన స్థానంలో పార్టీ శాసనసభాపక్షం నాయకునిగా ఉన్న డాక్టర్ కె. లక్ష్మణ్‌ను పార్టీ జాతీయ నాయకత్వం శుక్రవారం నియమించింది. బిసిని నియమించడం పట్ల పార్టీలో హర్షం వ్యక్తమైంది. లక్ష్మణ్ స్థానాన్ని కిషన్‌రెడ్డికి అప్పగించే అవకాశం ఉంది. ఉగాది రోజు నియమితులైన లక్ష్మణ్‌పై పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించే బాధ్యత పడింది.
ఇక ప్రధాన ప్రతిపక్షమైన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గత ఏడాది చేసింది, సాధించింది శూన్యమనే చెప్పవచ్చు. టి.పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో ఆశించినంతంగా విజయం సాధించలేకపోయారు. తాజాగా జిహెచ్‌ఎంసి, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయం చెందింది. శాసనసభ సమావేశాల్లోనూ పార్టీ పాలక పక్షాన్ని ఎదుర్కొవడం, ప్రజా సమస్యలను ఎండగట్టడంలో విఫలమైంది. ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభలో నీటి పారుదలరంగంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు సభకు హాజరుకాలేదు. సభకు హాజరయ్యే అంశంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సభకు హాజరై నిలదీద్దాం అని కొంత మంది ఎమ్మెల్యేలు సలహా ఇచ్చినా మిగతా నాయకులు పెడచెవిన పెట్టారు. సభకు హాజరుకాకుండా బయటే ఉండడాన్ని పార్టీ అధిష్టానం కూడా తప్పుపట్టింది. పార్టీ ఎమ్మెల్యేలను ఏకతాటిపై తీసుకెళ్ళడంలో ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి, ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్ళడంలో పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెనుకబడ్డారన్న విమర్శలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. దుర్ముఖినామ సంవత్సరంలోనైనా ప్రజల పక్షాన పోరాడి, పార్టీ బలోపేతం కావాలని ఆ పార్టీ శ్రేణులు ఆశిస్తున్నాయ. తెలంగాణ బలీయంగా ప్రతిపక్షాలు నిలబడలేకపోతున్నాయి. తెలంగాణలో ఖమ్మం జిల్లాలో మిగిలి ఉన్న వైకా పా ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును ఏ సమయంలోనైనా టిఆర్‌ఎస్‌లో కలుపుకుంటారేమోనన్న (విలీనం) ప్రచారం జరుగుతున్నది.
ఇక గత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్‌లో బలమైన ప్రతిపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలిచినా, క్రమేణా అధికార పార్టీ వైపు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అడుగులు వేస్తుండడంతో ఆ పార్టీలోనూ గుబులు ఆరంభమైంది. ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు ఉన్న ప్రధాన సమస్య. జగన్ వెన్నంటి ఉంటూ, పార్టీ కోసం పాలకపక్షాన్ని తూర్పారబట్టిన వారే తెల్లారే సరికి ఆ పార్టీలోకి ఫిరాయించేస్తున్నారు. బిజెపి టిడిపికి మిత్రపక్షంగా ఉన్నది. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్సే కారణమన్న కసితో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నందున, ఇప్పట్లో ఆ పార్టీ కోలుకునే పరిస్థితుల్లో లేదు. ఇలా ప్రతిపక్షాలు కొట్టుమిట్టాడుతున్నాయి. దర్ముఖిలోనైనా తమ రాతలు మారకపోతాయా? అనే ఆశతో..ఆయా పార్టీలు ఉన్నాయి.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి