రచ్చ బండ

కమ్యూనిస్టుల్లో కాలానుగుణ మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరడుగట్టిన అనే పదాన్ని వివిధ సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం. కాగా ఎక్కువగా కమ్యూనిస్టుల విషయంలో ఆ పదాన్ని వాడుతుంటారు. ఫలానా నాయకుడు కరడుగట్టిన కమ్యూనిస్టు అనడం వింటున్నాం. కానీ ఇటీవలి కాలంలో పరిస్థితులు మారాయి. వివిధ రాజకీయ పార్టీల నుంచి ప్రజాప్రతినిధులు లేదా ముఖ్యమైన నాయకులు మరో పార్టీలోకి ఫిరాయిస్తే ప్రజలు పెద్దగా సీరియస్‌గా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే సదరు నాయకుడు రాజకీయంగా పుట్టింది ఒక పార్టీ అయితే పెరిగింది మరో పార్టీ, చివరకు అధికారాన్ని అనుభవించేది మూడో పార్టీ. రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీపైనే విమర్శలు చేస్తూ, రాజకీయాల్లో విలువలు దిగజారుస్తున్నారు. ఫలానా పార్టీ తమకు రాజకీయంగా జన్మనిచ్చిందన్న విశ్వాసం ఏ కొద్ది మందిలోనో కనిపిస్తున్నది.
ఈ నెల 15న కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే బాస్కర రావు, మాజీ ఎంపి జి. వివేక్, మాజీ మంత్రి జి. వినోద్, సిపిఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ ప్రభృతులు టిఆర్‌ఎస్‌లో చేరారు. వివేక్, వినోద్ ఇదివరకే ఒక దఫా టిఆర్‌ఎస్ కారులో ఎక్కి, ఆ వెంటనే దిగేసి మళ్లీ వెనక్కి వచ్చారు. సరే ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెడితే గుత్తా అధికార పార్టీ ‘కారు’ ఎక్కడంతో మూడో పార్టీలో చేరినట్లయ్యింది. ఎమ్మెల్యే భాస్కర రావు మాత్రం పార్టీ ఫిరాయించడానికి ముందు ఆయన మనసులో ఎక్కడో బాధపడి కన్నీరు పెట్టుకున్నారు. ఇలా నేతలు పార్టీలు మారడం పెద్ద విషయమేమీ కాదంటూ ప్రజలు భావిస్తున్నారు.
కానీ దేవరకొండ నియోజకవర్గం సిపిఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ‘కారు’ ఎక్కడంతో వివిధ పార్టీల నేతలే కాదు చివరకు టిఆర్‌ఎస్ నేతలూ ‘అవునా!’ అని విస్మ యం చెందారు. ఎందుకంటారా? వామపక్షాల నేతలూ ఫిరాయింపులకు పాల్పడతారా? వారు ‘కరడుగట్టిన’ కమ్యూనిస్టులు కదా! అంటూ సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేయడం వారి వంతైంది. నిజమే మరి, కాలంతో పాటు కమ్యూనిస్టులూ మారాలి కదా! అని వారికి వారే సమాధానపరచుకోవాలి. ‘్ఫరాయింపుల పుస్తకం’లోని కొన్ని పేజీలు వెనక్కి తిప్పితే, సిపిఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ టిఆర్‌ఎస్‌లో చేరిక కొత్తేమి కాదు. ఆ పార్టీనే కాదు, సోదర పార్టీ అయిన సిపిఎం నుంచీ అనాదిగా వలసలు జరుగుతూనే ఉన్నాయి. కరడుగట్టిన కమ్యూనిస్టు నేత చెన్నమనేని రాజేశ్వర రావు తనయునికి ఎమ్మెల్యే సీటు ఇప్పించుకోవాలన్న తపనతో త్యాగం చేసి తెలుగు దేశం పార్టీలో చేరారు. తనయునికి సీటు ఇప్పించుకోవడంలో సాంకేతిక కారణాలు అడ్డురావడంతో టిడిపి నుంచి తనే పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత తనయుడు టిఆర్‌ఎస్‌లోకి ఫిరాయించి ఎమ్మెల్యే అయ్యారు. సుదీర్ఘకాలం భద్రాచలం నియోజకవర్గం సిపిఐ ఎంపిగా ఉన్న సోడే రామయ్య ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి టిడిపి ఎమ్మెల్యే అయ్యారు. వైరా నియోజకవర్గం సిపిఐ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రావతి టిఆర్‌ఎస్‌లో చేరి టిఎస్‌పిఎస్‌సి సభ్యులయ్యారు. రవీంద్ర నాయక్‌కు ముందు ఎమ్మెల్యేగా ఉన్న బద్దు చౌహన్ కూడా టిడిపిలో చేరారు. కరడుగట్టిన కమ్యూనిస్టు నేత, రాజకీయ దురంధురుడైన పువ్వాడ నాగేశ్వర రావు కమ్యూనిజంనే నమ్ముకుని, పార్టీనే అంటిబెట్టుకుని ఉన్నా, తనయుడు పువ్వాడ అజయ్ (ఖమ్మం) మాత్రం కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యే అయ్యారు. అంతటితో ఆగకుండా తాజాగా అధికార పార్టీలోకి అడుగు పెట్టారు.
సిపిఎం నాయకుడు పాయం వెంకటేశ్వర్లు బూర్గంపాడు నియోజకవర్గం నుంచి 2004 ఎన్నికల్లో విజయం సాధించారు. 2009 సంవత్సరం ఎన్నికల నాటికి టిడిపిలో చేరి, 2014 ఎన్నికల నాటికి వైకాపా గూటికి చేరినా ప్రజలు మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించారు. కాగా పాయం ‘కారు’ ఎక్కారు. సిపిఎం శాసనసభాపక్షం నాయకునిగా బాధ్యతలు నిర్వర్తించిన నోముల నర్సింహయ్య ‘గులాబీ’ కండువా కప్పించుకున్నారు. టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఒకప్పుడు కరడుగట్టిన కమ్యూనిస్టే. ప్రజలు లోగడ సండ్రను సిపిఎం నుంచి పాలేరులో గెలిపించారు, 2014 ఎన్నికల్లోనూ టిడిపి నుంచీ గెలిపించి ఆదరించారు. కట్టా వెంకటనర్సయ్య (మధిర), నర్సింహ (ఇబ్రహీంపట్నం) ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ‘తెర’పైకి వస్తారు. కమ్యూనిస్టులు అంటే పేద ప్రజల పాలిట దేవుళ్ళుగా భావించే వారు. ఎవరైనా ఒక కార్యకర్త ఒకసారి కమ్యూనిస్టు పార్టీలో చేరారంటే అంతిమశ్వాస వరకూ ఆ పార్టీనే అంటిపెట్టుకొని ఉండేవారు. వారు అంచెలంచెలుగా నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనా సామాన్య కార్యకర్తగానే ఉండేవారు. పార్టీ సమావేశాల్లో వేదికపై పార్టీ జాతీయ నాయకులు, లేదా రాష్ట్ర నాయకులు కూర్చొని ఉంటే, ఎదురుగా సభికుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు కూర్చొంటారు. పార్టీ సమావేశాల్లో అక్కడ వారికేమి ప్రొటోకాల్స్ ఉండవు. కార్యకర్తలుగానే కూర్చొవాలి. చాలా సింపుల్‌గా ఉండేవారు.
కమ్యూనిస్టు నాయకులు నర్రా రాఘవరెడ్డి, బోడేపూడి వెంకటేశ్వర రావు, ఓంకార్ వంటి ఎందరో కరడుగట్టిన కమ్యూనిస్టు నేతలు వారు ధరించే దుస్తులకు కనీసం ఇస్ర్తి కూడా ఉండేది కాదు. ప్రజల కోసమే వారి జీవితాలు త్యాగం చేశారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనా ఆర్భాటాలు లేవు. అక్రమ సంపాదనలు లేవు. ఎన్నికల్లో గెలిచినా, ఓడిపోయినా లేదా పోటీ చేయకుండా ‘మాజీ’లైనా సాదాసీదాగా బస్సుల్లో తిరిగే వారు. కొంత మందికి నేడు కుటుంబ పోషణే భారంగా ఉంది. మరణించిన తర్వాత భౌతికకాయంపై ‘ఎర్ర జెండా’ కప్పాలని కోరుకునే వారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. కాబట్టి విస్మయం చెందాల్సిన అవసరం లేదు.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి