రామాయణం... మీరే డిటెక్టివ్

రామాయణం.. 111 -మీరే డిటెక్టివ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయణం (అయోధ్యకాండ 11వ సర్గ)
ఆ తర్వాత భరతుడు సంతోషిస్తూ శతృఘు్నడితో కలిసి రథం ఎక్కాడు.
వశిష్ఠుడు, వామదేవుడు దృఢమైన వ్రతాలు గల జాబాలి, ఉత్తమమైన ఆలోచనా శక్తిగల మంత్రులు అంతా అతనికన్నా ముందే బయల్దేరారు. వారంతా చిత్రకూట పర్వతానికి ప్రదక్షిణంగా దక్షిణ దిక్కువైపు తిరిగి మందాకినీ నది వైపు వెళ్ళారు. అపుడు భరతుడు సైన్యంతో కలిసి ప్రయాణిస్తూ, వేలకొద్దీ అనేక రకాల సుందరమైన ధాతువులని చూసాడు.
బుద్ధిమంతుడైన భరతుడు చిత్ర కూట సమీపంలోని భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్లి, రథం దిగి ఆ మహాముని పాదాలకి నమస్కరించాడు. అతన్ని చూసి సంతోషించిన భరద్వాజుడు అడిగాడు.
‘‘నాయినా! నీ పని పూరె్తై రాముడ్ని కలిసావా?’’
సోదరులమీద ప్రేమగల భరతుడు ఇలా చెప్పాడు.
‘‘దృఢపరాక్రమం గల రాముడి గురువైన వశిష్ఠుడు, నేను ప్రార్థించగా అతను సంతోషించి వశిష్ఠుడితో చెప్పాడు. ‘పధ్నాలుగు సంవత్సరాలు నేను అరణ్యంలో ఉండాలని నా తండ్రి చేసిన ప్రతిజ్ఞని పాలిస్తన్నాను’. మహాబుద్ధిశాలి, మాటల్లో సమర్థుడైన వశిష్ఠుడు అది విని బదులు చెప్పాడు. ‘గొప్ప బుద్ధిగల ఓ రామా! నువ్వు బంగారంతో అలంకరించబడ్డ పాదుకలని సంతోషంగా ఇవ్వు. ఇవి అయోధ్యలో ప్రజల యోగక్షేమాలని చూస్తాయి’. వశిష్ఠుడి మాటలు విని రాముడు ఉత్తర దిక్కుకి తిరిగి ఈ పాదుకలని తొడుక్కుని రాజ్యాన్ని పాలించడానికి వీటిని నాకు ఇచ్చాడు. మహాత్ముడైన రాముడి అనుమతి పొంది నేను మంగళకరమైన ఈ పాదుకలతో మళ్లీ అయోధ్యకి వెళ్తున్నాను’’.
భరతుడి శుభకరమైన ఆ మాటలు విని భరద్వాజుడు కూడా శుభకరమైన మాటలే చెప్పాడు.
‘‘మానవుల్లో శ్రేష్ఠుడా! విడిచిన నీరు పల్లంలో నిలిచినట్లు పూజనీయమైన లక్షణాలన్నీ నీలోనే ఉండటంలో నాకు ఆశ్చర్యం లేదు. ధర్మజ్ఞుడు, ధర్మంమీద ఆసక్తిగల నీ వంటి వాడిని కొడుకుగా పొందిన నీ తండ్రి దశరధుడు మరణించినా మరణించనివాడే’’.
మహాత్ముడైన ఆ భరద్వాజముని మాటలు విని భరతుడు నమస్కరించి, ఆయన పాదాలని స్పృశించి ప్రయాణానికి అనుమతి కోరాడు. శ్రీమంతుడైన భరతుడు భరద్వాజుడికి మాటిమాటికీ ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించి మంత్రులతో అయోధ్యకి వెళ్లాడు. విశాలమైన భరతుడి సేన అతని వెంటే వాహనాలు, బళ్ళు, గుర్రాలు, ఒంటెలు, ఏనుగులతో తిరిగి అయోధ్యవైపు మళ్లింది. తర్వాత వారంతా అలల వరసలతో నిండిన శ్రేష్ఠమైన యమునా నదిని దాటి పవిత్రమైన నీరుగల గంగానదిని మళ్లీ చూసారు. అందులో స్నానం చేసాక భరతుడు బంధువులతో, సైనికులతోకలిసి అందమైన నీటితో నిండిన ఆ గంగానదిని దాటి సుందరమైన శృంగబేరపురంలోకి ప్రవేశించాడు.
అక్కడనించి అయోధ్యకి వెళ్లాడు. తండ్రి, అన్న లేని అయోధ్యని చూడగానే దుఖంతో సారధితో చెప్పాడు.
‘‘ఓ సారధీ! అయోధ్యా నగరం పూర్తిగా చెడిపోయి, మంచి ఆకారం లేకుండా అందవిహీనమై, మంచి శబ్దాలన్నీ నశించి ఏ మాత్రం ప్రకాశించడం లేదు’’ (అయోధ్యకాండ సర్గ 114)
గొప్ప కీర్తివంతుడు, ప్రభువైన భరతుడు చెవులకి ఇంపైన, గంభీరమైన శబ్దం చేసే రథంమీద అయోధ్యలోకి చేరుకున్నాడు. అక్కడ పిల్లలు, గుడ్లగూబలు తిరుగుతున్నాయి. మనుషులు, ఏనుగులు బయట తిరగడంలేదు. దాంతో అయోధ్య చీకటి ఆవరించి, వెలుగులేని నల్లని రాత్రిలా ఉంది. ప్రకాశించే కాంతిగల, ఎదురుగా వున్న క్రూర మృగం చేత బాధించబడ్డ చంద్రుడి ప్రియభార్య రోహిణిలా అయోధ్య కాంతివిహీనంగా ఉంది. వెడెక్కి తరిగిపోయిన స్వల్ప జలాలతో పక్షులన్నీ ఎండి బాధపడుతూండగా, చిన్న, పెద్ద చేపలు, మొసళ్ళు, అడుగున అణగి కృశించిన పర్వత నదిలా అయోధ్య శోభావిహీనమై ఉంది. మొదట పైకి ఎగురుతూ, పొగ లేక బంగారంలా ప్రకాశిస్తూ, తర్వాత హవిస్సు వేయగానే ఆరిపోయిన యజ్ఞంలోని అగ్నిశిఖలా అయోధ్య అందవిహీనంగా ఉంది. ఘోర యుద్ధంలో కవచాలన్నీ బద్ధలై, ఏనుగులు, గుర్రాలు, రధాలు, జండాలు కిందపడి ఉత్తమ వీరులంతా మరణించగా, గొప్ప ఆపదలో వున్న సైన్యంలా అయోధ్య భయంకరంగా కనపడుతోంది.
ఎక్కువ నురుగుతోను, ధ్వనితోను లేచి ఇంతలో ప్రశాంతమైన గాలి చెదరకొట్టడంతో, చప్పుడు లేకుండాపోయిన సముద్ర తరంగంలా అయోధ్య ఎలాంటి ధ్వనులూ లేకుండా ఉంది. యాగ సమప్త దినం గడిచాక చుట్టుప్రక్కల యజ్ఞాలకి సంబంధించిన ఉపకరణాలు, ఉత్తములైన ఋత్విక్కులు లేకపోవడంతో అయోధ్య నిశ్శబ్దంగా ఉన్న వేదికలా ఉంది.
ఎద్దు దూరంగా వెళ్లిపోగా దానిమీద అధికమైన ఆసక్తితో ఆర్తురాలై చావిడి మధ్యలో నిలిచి గడ్డిమేయని గోవులా ఆ అయోధ్య ఉంది. మంచి జాతికి చెందినవైన పద్మరాగాది మణులు లేని కొత్త ముత్యాలహారంలా ఆ అయోధ్య ఉంది. పుణ్యం క్షీణించడంవల్ల స్థానం నించి కదిలి, కాంతి అంతా నశించగా ఆకాశం నించి జారి తటాలున భూమిమీద పడ్డ నక్షత్రంలా ఆ అయోధ్య ఉంది. పువ్వులతో నిండిన మదించిన తుమ్మెదల రొదతో కూడిన వనలత వసంతం చివర్లో దావాగ్నితో వేడెక్కి ఏ విధంగా వాడిపోతుందో అయోధ్య అలా ఉంది.
అయోధ్యలోని కార్యాలన్నీ ఏ పనులూ లేకుండా ఉన్నాయి. దుకాణాలు, వాటి వీధులు మూసి వేయబడ్డాయి. ఇలా స్తబ్దంగా ఉన్న అయోధ్య మేఘాలు ఆవరించి చంద్రుడు, నక్షత్రాలు కనపడకుండాపోయిన ఆకాశంలా ఉంది. చుట్టూ బద్ధలైన ఉత్తమ పానపాత్రులు పడుతూండగా, పానశాలాధ్యక్షుడు మరణించి, సంస్కారం లేని పానభూమిలా అయోధ్య కాంతిహీనంగా ఉంది. నేల పగిలి పల్లమైపోయి బద్ధలైన పాత్రలు అటు, ఇటు పడి ఉండగా, తాగడానికి నీళ్ళు లేక విరిగి నేలమీద పడ్డ చలివేంద్రంలా అయోధ్య కనపడుతోంది.
తగిన పొడవుగల విశాలమైన నారి బలవంతుల బాణాలతో ఛేదించబడి, ధనుస్సునించి నేలమీదికి జారిపడితే ఎలా వుంటుందో అయోధ్య అలా ఉంది. యుద్ధంలో శూరుడైన రౌతు తటాలున ఎక్కి యుద్ధ రంగానికి వెళ్ళగా అక్కడ శతృవుల చేతపడి నేలమీద పడ్డ ఆడగుర్రంలా అయోధ్య కనపడింది. నీరు ఎండిపోయి అనేకానేక పెద్ద పెద్ద చేపలు, తాబేళ్ళు బయటపడి ఉండగా చుట్టుప్రక్కలవున్న తీర ప్రాంతం బీటలై, కలువలు లేని దిగుడు బావిలా అయోధ్య కాంతివిహీనంగా ఉంది. పైన పూసుకునే చందనాలు మొదలైనవి పూసుకోక, ఆభరణాలు ధరించక శోకంతో బాధపడే పురుషుడి శరీరంలా అయోధ్య ఉంది. మంచి వర్షాకాలంలో సూర్యుడు మేఘ మండలంలో ప్రవేశించగా, నల్లటి మేఘాలతో కప్పబడ్డ సూర్యుడి కాంతిలా ఆ అయోధ్య ఉంది.
శ్రీమంతుడు, దశరధుడి కొడుకైన భరతుడు రథంమీద కూర్చుని దాని సారధితో చెప్పాడు.
‘‘అయోధ్యలో ఇపుడు పూర్వంలా గంభీరమైన గీతా వాద్యాల ధ్వని సర్వత్రా వ్యాపించి వినపడటంలేదు. కారణం ఏమిటో? మద్యం వాసన, పూలమాలల సుగంధం, అగరుధూపాల సువాసన అంతటా వ్యాపించి గుబాళించడం లేదు.

1.భరతుడు రాముడి పాదుకలని తలపైన ఉంచుకుని రథం ఎక్కాడు. ఈ విషయాన్ని హరిదాసు చెప్పలేదు.
2.వారంతా చిత్రకూట పర్వతానికి ప్రదక్షిణంగా తూర్పు దిక్కువైపు తిరిగారు. హరిదాసు దాన్ని దక్షిణదిక్కు అని తప్పుగా చెప్పాడు.
3.రాముడు పాదుకలని తూర్పు దిక్కువైపు తిరిగి తొడుక్కున్నాడు. హరిదాసు ఉత్తర దిక్కు అని తప్పుగా చెప్పాడు.
4.భరతుడి సేనలో ఒంటెల ప్రస్తావన వాల్మీకి ఈ కాండలో చేయలేదు. కాని అవి ఉన్నట్లుగా హరిదాసు చెప్పాడు.
5.భరతుడు గంగానదిలో స్నానం చేయలేదు. హరిదాసు ఇది తప్పుగా చెప్పాడు.
==========================================================
మీకో ప్రశ్న
*
భారతంలోని శంతనుడికి, రామాయణంలోని రాముడికి గల పోలిక ఏమిటి?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు
*
సగరుడు గర్భంలో ఉండగా అతని తల్లికి విషం పెట్టిన సవతి పేరేమిటి?
జవాబు: కాళింది

-మల్లాది వెంకట కృష్ణమూర్తి