సెంటర్ స్పెషల్

రణక్షేత్రం - 21

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కానీ... కొన్నాళ్లు ఆగి వాళ్ల సంగతి చూద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాం కదా! ఈలోపు ప్రతిరోజూ ప్రతీకారం అని ఆలోచించి పనులు పాడు చేసుకోవటం అవసరమా?’ నా బాధను తేలిగ్గా తీసేస్తూ అన్నాడు అశోక్.
‘ఒడ్డున కూర్చుని కబుర్లు చెప్పేటప్పుడు ఎన్ని మాటలైనా చెప్పచ్చు. మూడు పశువులు నా అనుమతి లేకుండా నా శరీరంతో ఆడుకున్నాయి. జంతువులకంటే హీనంగా ప్రవర్తించారు. అలాంటి వారు ఏ శిక్షా లేకుండా తిరుగుతుంటే ఎంత బాధగా ఉంటుందో మీకేం తెలుస్తుంది?’ నిరసనగా అన్నాను.
అంతకంటే ఆ విషయంలో చర్చ అనవసరం అన్నట్లు అక్కడి నుండి వెళ్లిపోయాడు అశోక్.
అప్పుడే నిర్ణయం తీసుకున్నాను - ఇక ముందు నా పగ గురించి అశోక్ ముందు మాట్లాడకూడదని.
* * *
ఎలక్షన్లు దూసుకువచ్చాయి. నాకు పార్టీ టిక్కెట్ వచ్చింది. రోజులో ఉన్న ఇరవై నాలుగుగంటల సమయం చాలటంలేదు. అశోక్ చూపిస్తున్న మార్గంలో ముందుకు దూసుకుపోతున్నాను.
ఎన్నికలు పూర్తి అయ్యేటప్పటికి నా గెలుపు మీద ఎవరికీ ఎలాంటి అనుమానమూ లేకుండా పోయింది. ఏదైనా అనుమానం ఉందంటే... అది అశోక్ మెజారిటీ నేను దాటుతానా, లేదా... అన్నదే!
ఆ అనుమానం కూడా ఎన్నికల ఫలితాలు రావటంతో తొలగిపోయింది. అశోక్ మెజారిటీ రికార్డు బద్దలయింది. అభినందనలు, పొగడ్తలు, ఊరేగింపులతో రోజు గడిచిపోయింది.
మరుసటిరోజు నుండి కొత్త మంత్రివర్గం మీద చర్చలు మొదలయ్యాయి. అశోక్ పోటీ చేసి గెలిచి ఉంటే అతనికి గ్యారంటీగా మంత్రి పదవి వచ్చి ఉండేది. అయినా అతను నిరుత్సాహపడకుండా నాకు మంత్రివర్గంలో చోటు కల్పించటానికి ప్రయత్నిస్తున్నాడు.
‘బ్యాడ్‌లక్. ముఖ్యమంత్రి ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నాడు. నా మీద కోపం నీ మీద చూపిస్తున్నాడు...’ అన్నాడు అశోక్ ఒకరోజు నిరాశగా.
‘మనకి మంత్రి పదవి అంత అవసరమా?’ అడిగాను.
‘ఇప్పుడు నువు మొదటిసారి ఎన్నికయ్యావని మంత్రి పదవి నిరాకరిస్తున్నాడు. మళ్లీ వచ్చేసారి నేను గెలిచినా.. అప్పుడు నన్నూ కొత్తవాడినే అన్నా అంటాడు. ఇలా అయితే ఇక ఎప్పటికీ రాజకీయంగా మనం ఎదగలేం.. బహుశా అతనికి కావలసింది కూడా అదేనేమో!...’
అశోక్ అంత నిరుత్సాహంగా మాట్లాడటం నేను భరించలేక పోయాను. ముఖ్యమంత్రికి అశోక్ అంటే అంత విముఖత ఎందుకో నాకు అర్థం కాలేదు. ‘పోనీలే అశోక్! నిరాకరిస్తుంది నిన్ను కాదు, ననే్నగా...’ ఓదారుస్తున్నట్లు అన్నాను.
‘నువ్వూ, నేనూ వేరువేరు అని నేను అనుకోవటం లేదుగా...’ అన్నాడు అశోక్.
ఆ మాట నన్ను కదిలించింది. కాసేపు వౌనంగా ఆలోచిస్తూ కూర్చున్న నాకు ఒకనాటి జానకి చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. ‘నాకు ముఖ్యమంత్రిగారి అపాయింట్‌మెంట్ ఇప్పించగలరా?’ అని అడిగాను.
‘ఎందుకు?’ ఆశ్చర్యంగా అడిగాడు అశోక్.
‘ఇంకెందుకు? మంత్రి పదవి కోసం. డైరెక్ట్‌గా ఆయనతోనే తేల్చుకుందాం...’
అశోక్ మొహంలో సందేహం. అయినా బలవంతం చేయటంతో ‘రేపు ప్రయత్నిస్తాను...’ అన్నాడు.
మరుసటిరోజు మధ్యాహ్నం రెండు గంటలకు అపాయింట్‌మెంట్ దొరికింది. అది కూడా అశోక్ లేకుండా నన్ను కలవటానికే ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు.
‘మొదటిసారి అతన్ని కలుస్తున్నావ్! జాగ్రత్తగా మాట్లాడు. అసలే అతనికి ముక్కు మీద కోపం ఉంటుంది...’ అన్నాడు అశోక్.
‘మీకే తెలుస్తుందిగా..’ అన్నాను నేను.
చెప్పిన సమయానికి ముందే ముఖ్యమంత్రి ఆఫీసుకు చేరుకున్నాం ఇద్దరం.
అపాయింట్‌మెంట్ సమయానికి నన్ను లోపలకు పంపారు.
నేను కుర్చీలో కూర్చునే వరకు కూడా ఆగకుండా ‘చెప్పు... ఏం పని మీద వచ్చావ్?’ అన్నాడు ముఖ్యమంత్రి.
‘మంత్రివర్గంలో నన్ను తీసుకోమని వేడుకోవటానికి వచ్చాను సార్’
‘మొదటిసారి గెలిచిన ఎవరికీ మంత్రివర్గంలో చోటు ఇవ్వటంలేదు...’
‘కావచ్చు. కానీ... ఒక మహిళా అభ్యర్థిగా, మా కులం నుండి గెలిచిన మొదటి అభ్యర్థిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.’
ముఖ్యమంత్రి నా వైపు తీక్షణంగా చూశాడు. ‘ఆ సంగతులన్నీ నాకు తెలుసు. తరువాత మంత్రివర్గ విస్తరణ సమయంలో నీ విషయం చూస్తాను...’
‘అప్పటిదాకా ఆగితే... రాజకీయంగా మేము వెనుకబడిపోతాం సార్!’
‘మేము అంటే?’
‘అందరికీ తెలిసిందే కదా!... నేను ఎవరి తరఫున ఎన్నికల్లో నిలబడ్డానో...’
ముఖ్యమంత్రి అసహనం పెరిగిపోయింది. ‘అందుకే నీకు మంత్రి పదవి ఇవ్వంది. ఒక ఉంపుడుకత్తె కేబినెట్‌లో నాతోపాటు కూర్చోవటం నాకు ఇష్టంలేదు’
ఆ మాట అతను మాట్లాడతాడని నేను ముందే ఊహించాను. అందుకే తడబడలేదు. ‘నిజమే! నేను ఉంపుడుకత్తెనే! కొన్ని కారణాల వలన అతన్ని నమ్ముకోవలసి వచ్చింది. అంతే తప్ప రోజుకొకరితో తిరగటం లేదే?’
‘నా దృష్టిలో వ్యభిచారానికీ, దీనికీ తేడా లేదు. రెండూ నీచమయినవే!’ తన ఆవేశాన్ని ఏ మాత్రం తగ్గించు కోకుండా అన్నాడు ముఖ్యమంత్రి.
‘వ్యభిచారం నీచమయింది అనుకుంటే అది కేవలం ఆడవారి తప్పేనంటారా? మగవారి ప్రమేయం ఏమీ ఉండదంటారా?’
‘ఈ చర్చ తప్పు దారి పడుతోంది. ఇలాంటి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పను’
‘లేదు, లేదు. మీరు నా మీద అభియోగం మోపారు. అందుకే మీ అభిప్రాయం అడుగుతున్నాను’
‘ఇద్దరిదీ తప్పే!’
‘మరి అలాంటప్పుడు మీ అబ్బాయికి ఏమి శిక్ష విధించారు?’
‘వాట్ నానె్సన్స్ యూ ఆర్ టాకింగ్?’ అసహనంగా అన్నాడు అతను. ‘మధ్యలో మా అబ్బాయి ప్రస్తావన ఎందుకు వచ్చింది?’ అతని కొడుకు కూడా ఈసారి ఎన్నికల్లో నిలబడి గెలిచాడు. తన తరువాత అధికారం చేపట్టటానికి అతన్ని తయారుచేసుకుంటున్నాడని అందరూ అనుకుంటున్నారు. అందుకే కొడుకును అనేటప్పటికి అతనికి అంత కోపం వచ్చింది.
నా చేతిలోని ఒక కాగితాన్ని అతనికి ఇచ్చాను. ‘అందులో చెప్పిన తారీఖుల్లో, సమయాల్లో మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో అతనే్న అడగండి. అతనికి గుర్తు రాకపోతే నాకు ఫోన్ చెయ్యమనండి. నా దగ్గర వీడియో ఉంది. తెచ్చి చూపిస్తాను...’ అంటూ లేచి బయటకు నడిచాను.
ఇక్కడకు వచ్చే ముందు నేను జానకికి ఫోన్ చేశాను. ‘నా దగ్గరకు సీ.ఎం. కొడుకు కూడా వస్తాడు...’ అన్న ఒకప్పటి జానకి మాట గుర్తుకు వచ్చి, ఆమె నుండి కొన్ని విషయాలు కన్ఫర్బ్ చేసుకున్నాను. వీడియో మాట ఉత్తిదే! బ్లఫ్ చేశాను.
బయటకు వెళ్తున్న నన్ను గుడ్లప్పగించి చూస్తూండిపోయాడు ముఖ్యమంత్రి.
‘ఏమయింది?’ బయటకు వస్తున్న నన్ను చూసి అడిగాడు అశోక్.
‘అతనికి చెప్పవలసిందంతా చెప్పాను. ఆ తరువాత అతని ఇష్టం...’ అన్నాను.
ఆ రాత్రికి కొత్త మంత్రుల పేర్లు ప్రకటించారు. అందులో నా పేరు ఉంది.
* * *
నాకు మంత్రివర్గంలో చోటు దొరకటం అందరికంటే ఎక్కువ అశోక్‌నే ఆశ్చర్యపరచింది. తను ఎంత చెప్పినా వినని ముఖ్యమంత్రి నా మాటలకు ఎలా కన్విన్స్ అయ్యాడో అతనికి అర్థం కాలేదు. నేను కూడా అశోక్‌కి ఎక్కువ వివరాలు చెప్పలేదు.
కాలం గడిచేకొద్దీ చాలా నిర్ణయాలు నేనే తీసుకోవటం మొదలుపెట్టాను. ఒట్టి ఎమ్మెల్యేగా ఉంటే ఎలా ఉండేదో కానీ, మంత్రిని అయ్యాక ప్రతిదీ అశోక్ సలహా తీసుకోవటానికి కుదరదు. సలహాలివ్వటానికే కదా ఐఎఎస్ వాళ్లు ఉండేది. ప్రజలకు మంచి జరిగే పని అనుకుంటే, ఎవరినయినా ఎదిరించి, ఏ ప్రలోభానికీ లోనుకాకుండా నిర్ణయాలు తీసుకుంటానన్న పేరు వచ్చింది.
నా మంత్రివర్గం కిందకే చలనచిత్ర పరిశ్రమ కూడా వస్తుంది. రెండు మూడుసార్లు నిర్మాతల సమాఖ్యకీ, వేరే సాంకేతిక నిపుణుల సంఘాలకూ మధ్య విభేదాలు వచ్చి షూటింగులు ఆగిపోయే పరిస్థితి వచ్చినపుడు నేనే కల్పించుకుని చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యమయిన నిర్ణయాలు తీసుకున్నాను.
మొదటిసారి ప్రభుత్వం తమకు అండగా ఉందన్న అభిప్రాయం పరిశ్రమలోని అందరికీ కలిగింది. దానికి కారణం నేను చూపిస్తున్న చిత్తశుద్ధి అన్నదాంట్లో ఎవరికీ భేదాభిప్రాయం లేదు.
ఒకరోజు ముఖ్యమంత్రి, నేనూ ఒకే కారులో ప్రయాణిస్తున్నాం. ‘నీకు బలవంతంగా మంత్రి పదవి ఇవ్వవలసి వచ్చిందని కోపం వచ్చింది. కానీ, నీ పని తీరు చూస్తే ఆ పదవికి నీకంటే అర్హులు ఇంకెవరూ ఉండరనిపిస్తోంది...’ అన్నాడతను.
‘్థంక్స్ సార్! అలాగే నేనూ మీతో ఒక మాట చెప్పాలి. ఆ రోజు నాకు మంత్రి పదవి ఇవ్వలేదన్న ఆవేశంతో, మీ అబ్బాయికి సంబంధించి వీడియోలు బయటపెడతానని పరుషంగా బెదిరించాను. నిజానికి అలాంటి వీడియో ఏమీ లేదు. మీరు ఆ విషయం మరచిపోండి. నా పని తీరునుబట్టే నన్ను మంత్రివర్గంలో ఉంచుకోండి. లేదంటే మీ ఇష్టం...’ అన్నాను.
ఒక్క క్షణం విస్తుపోయిన ఆయన తేరుకుని ‘నిజం చెప్పాలంటే మా అబ్బాయి విషయం నీతో ఎలా ఎత్తాలా అని అనుకుంటున్నాను. నాకా బాధ లేకుండా చేసావు. ఇక నిన్ను తీసెయ్యటం అంటావా, ఇప్పుడు నిన్ను మంత్రివర్గం నుండి తొలగిస్తే, ప్రజల్లో నా ఇమేజ్ పడిపోయేటట్లు ఉంది...’ అని నవ్వుతూ వెళ్లిపోయాడు.
నంది అవార్డుల కోసం కొత్తగా వేసిన కమిటీ మెంబర్లతో సమావేశమై తిరిగి వస్తున్నాను. నాతోపాటు రేఖ కూడా కారులో ప్రయాణిస్తోంది. అశోక్ వేరే వ్యక్తిని సిఫారసు చేసినా నేను ఇష్టపడలేదు. ‘ఎవరయినా ఆడవారయితే నాకు కంఫర్టబుల్‌గా ఉంటుంది...’ అని అలాంటి వ్యక్తి కోసం వెతికి మరీ రేఖని పి.ఏ.గా సంపాదించుకున్నాను.
రేఖ కూడా నా అభిప్రాయాలూ, అలవాట్లతో త్వరగా ట్యూన్ అయిపోయింది. ఆమెకు ఇంకా పెళ్లి కాకపోవటం కూడా నాతోపాటు సమయంతో సంబంధం లేకుండా బయట తిరగటానికి ఉపయోగపడుతోంది.
ప్రతిరోజుతో పోల్చుకుంటే ఆ రోజు త్వరగా ఇంటికి చేరుకున్నాం ఇద్దరం.
వంట మనిషికి కాఫీ తెమ్మని చెప్పి విశ్రాంతిగా సోఫాలో కూర్చున్నాను.
టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెట్టింది రేఖ.
‘బ్రేకింగ్ న్యూస్’ అని వస్తోంది అందులో. కుతూహలంతో అనియంత్రితంగా అటు చూశాం ఇద్దరం.
‘నగరంలో ఈ మధ్య డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరుగుతోందన్న వాదనలకు బలం చేకూరుస్తూ ఒక నైజీరియన్ డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డాడు. అతని దగ్గర లక్షలు ఖరీదుచేసే డ్రగ్స్ దొరికాయని తెలుస్తోంది. టాలీవుడ్‌కి చెందిన అనేక మంది ప్రముఖులకు అతను సప్లయర్ అని చెప్తున్నారు. పోలీసు అధికారులు ఇంకా కన్ఫర్మ్ చేయనప్పటికీ అనేక మంది యువ హీరోల పేర్లు అతని లిస్టులో ఉన్నాయని తెలుస్తోంది. ఇదే విషయం గురించి ఈ కేసు పరిశోధిస్తున్న డిఎస్‌పి శ్రీనివాస్‌గారిని ప్రశ్నించినపుడు ఆయన సమాధానం ఇవ్వటానికి నిరాకరించారు...’
‘నిజమే మేడమ్! ఈ మధ్య డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోతోంది..’ స్పందించింది రేఖ. ‘ఘోరం ఏమిటంటే స్కూళ్లల్లో చదివే చిన్నపిల్లలు కూడా వీటి బారిన పడుతున్నారు. ఈ విషయంలో మన ప్రభుత్వం చేయవలసినంత చేయటం లేదని అనిపిస్తోంది...’ ఆవేదనగా అంది.
రేఖ మాటలకు నేను స్పందించే లోపే టీవీలో సీరియస్ వార్తలకు బ్రేక్ ఇస్తూ... ఒక సినిమా వార్త మొదలయింది.
‘... ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న యంగ్ హీరో అభిమన్యు నటించిన మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రావటానికి సిద్ధమయింది. అభిమన్యు ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ‘వసంతం’ సినిమాతో అతని ప్రతిభ వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత అతను నటించిన మరే సినిమాలూ హిట్ కాకపోవటంతో అతను తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనయ్యారు. ఇప్పుడు ఈ సినిమాతో తన పూర్వ వైభవాన్ని పొందటానికిగానూ పూర్తి శక్తిని రంగరించి ఈ సినిమాని సిద్ధం చేశారు. ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా...’
‘అమ్మా! కాఫీ తీసుకోండి...’ వంట మనిషి ఇచ్చిన కాఫీ అందుకున్న నాకు ఎదురుగా టీవీలో కనిపిస్తున్న అభిమన్యుని చూస్తుంటే కసిగా ఉంది.
ఇంతకు ముందు ఆ ముగ్గురినీ తలచుకుంటే అదుపు చేయలేని కసితో తను కంపించిపోయేది. ప్రస్తుతం ఆ కసిలోని తీవ్రత తగ్గలేదు కానీ, వారిన చూస్తుంటే పాము బోనులో చిక్కుకున్న ఎలుకలు గుర్తుకు వస్తున్నాయి.
తన పక్కన ఎలుక అటు, ఇటూ పరిగెడుతున్నా పాముకి ఆకలి అయ్యేవరకూ దాన్ని పట్టుకునే ప్రయత్నం చెయ్యదు.
నా మానసిక స్థితి కూడా అలానే ఉంది. నేను చర్య తీసుకోవలసిన సమయం ఆసన్నమయిందని అనిపిస్తోంది. అశోక్‌ని సంప్రదిస్తే అతను ఇచ్చే సలహా ఏమిటో కూడా నాకు తెలుసు. ఇంకా వేచి చూద్దాం అంటాడు. ఇక వేచి చూసే ఓపిక లేదు.
‘రేఖా! ఆ డ్రగ్స్ కేసు డీల్ చేస్తున్న డిఎస్పీ శ్రీనివాస్‌ని నన్ను కలవమన్నానని చెప్పు...’
‘మేడమ్! ఆ కేసు మీ పరిధిలోకి రాదు’
‘్ఫరవాలేదు. నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. అంతే తప్ప అతని పనిలో కల్పించుకోవాలని కాదు...’
రేఖ రెండు మూడు ఫోన్లు చేసి చివరకు శ్రీనివాస్‌ని కాంటాక్ట్ చేసింది. అతనితో కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది.
‘మేడమ్! ఆయన మరొక గంటలో ఇక్కడకు వస్తానన్నారు’
‘సరే!... ఇక నువు వెళ్లి రా...’
‘ఆయన వచ్చే వరకు ఉండమంటారా?’
‘వద్దు. నువ్వెళ్లు. పని త్వరగా పూర్తి అయిన రోజయినా ఇంటికి వెళ్లక ఇక్కడ ఎందుకు?’
రేఖ వెళ్లిన గంటకు వచ్చాడు డిఎస్పీ శ్రీనివాస్.
అతన్ని నా గదిలోకి తీసుకు వెళ్లి కాసేపు మాట్లాడాను. నా మాటలు సావధానంగా విన్న అతను చేయవలసింది అర్థమైనట్లు తల ఆడించి వెళ్లిపోయాడు.
చాలా రోజుల తరువాత ఆ రోజు ఆదమరచి నిద్ర పట్టింది నాకు.
మరుసటి రోజు నిద్ర లేచి బద్ధకంగా కూర్చుని టీవీ ఆన్ చేసిన నాకు వీనుల విందుగా బ్రేకింగ్ న్యూస్ వస్తోంది.
‘డ్రగ్ రాకెట్‌లో పట్టుబడ్డ ప్రముఖ హీరో అభిమన్యు...’ అన్న వార్త టీవీలో వస్తోంది.
ముఖాన్ని కవర్ చేసుకుంటూ జీపు ఎక్కుతున్న అభిమన్యు ఫుటేజ్ అన్ని ఛానల్స్‌లో ఫ్లాష్ అవుతోంది.
నిన్నటిదాకా మాట్లాడటానికి ఇష్టపడని డిఎస్పీ శ్రీనివాస్ ఇప్పుడు అడిగిన ఛానల్‌కల్లా ఇంటర్వ్యూ ఇస్తున్నాడు.
‘ఇప్పటివరకు అనుమానితులు ఎవరంటే ఏమీ చెప్పలేదు. రాత్రికి రాత్రి అరెస్ట్ ఎలా చేయగలిగారు?’ అడిగాడు ఒక రిపోర్టర్.
‘రాత్రి ఇంటరాగేషన్‌లో పట్టుబడ్డ నైజీరియన్ నోరు విప్పాడు. తన క్లయింట్ల పేర్లు చెప్పాడు. అందులో ఇద్దరు ముగ్గురు ప్రముఖుల పేర్లు కూడా చెప్పాడు. వెంటనే వారి ఇళ్ల మీద దాడి చేశాం. మిగిలిన వారి దగ్గర ఏమీ దొరకలేదు. కానీ... అభిమన్యు దగ్గర మాత్రం డ్రగ్స్ దొరికాయి. అందుకని వెంటనే అరెస్ట్ చేశాం...’ డిఎస్పీ వివరిస్తున్నాడు.
‘ఆ నైజీరియన్ చెప్పిన మిగిలిన పేర్లేమిటి?’
‘అవి అనవసరం.వారి ఇళ్లలో ఏమీ దొరకనపుడు పేర్లు చెప్పి అవమానించటం అనవసరం...’
‘ఇప్పుడు అభిమన్యు పరిస్థితి ఏమిటి?’
‘ఈ రోజు మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతాం. మిగిలింది కోర్టు చూసుకుంటుంది...’
‘అభిమన్యు నటించిన సినిమా ఈ రోజు రిలీజ్ అవుతోంది. ఈ అరెస్ట్ ప్రభావం సినిమా కలెక్షన్ల మీద ఉండొచ్చా?’
‘అరెస్టుకు ముందు నేరం జరిగిందా, లేదా అన్నది ఆలోచిస్తాం తప్ప, మిగిలిన విషయాలతో మాకు సంబంధం లేదు’
తరువాత సీను అభిమన్యు ఇంటికి మారింది. కళ్లల్లో నీళ్లతో అతని అమాయకత్వాన్ని అందరికీ వివరించే ప్రయత్నం చేస్తున్నారు అభిమన్యు తల్లిదండ్రులు.
‘డ్రగ్స్ సంగతి వదిలిపెట్టండి. మా అబ్బాయికి సిగరెట్, డ్రింక్స్ అలవాట్లు కూడా లేవు. ఏదో పొరపాటు జరిగింది. మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. మా అబ్బాయి నిర్దోషి అని తేలుతుంది. ఈ రోజే మేము బెయిల్ కోసం అప్లై చేస్తాం. బెయిల్ లభిస్తుందని మాకు పూర్తి నమ్మకం ఉంది’ అంటున్నారు అతని తల్లిదండ్రులు.
వెంటనే టీవీ స్టూడియో వాళ్లు ఒక ప్రముఖ లాయర్ని ఫోన్‌లో అనుసంధానించారు.
‘అభిమన్యు పేరెంట్స్ అతనికి బెయిల్ వస్తుందని నమ్మకంగా చెప్తున్నారు. వచ్చే ఛాన్స్ ఉందంటారా?’ అడిగాడు యాంకర్.
మిగతా వచ్చేవారం

-పుట్టగంటి గోపీకృష్ణ 94901 58002