రివ్యూ

రంగు వెలిసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బాగోలేదు * రంగం-2

తారాగణం:
జీవా, తులసీనాయర్, నాజర్, జయప్రకాశ్, కరుణాకరన్, తంబి రామయ్య, బోస్ వెంకట్, తదితరులు.
సంగీతం: హేరిస్ జయరాజ్
కెమెరా: మనుష్ నాథన్
నిర్మాత: ఎఎన్ బాలాజీ
దర్శకత్వం: రవి కె చంద్రన్

జీవా హీరోగా గతంలో వచ్చిన రంగం చిత్రం సూపర్ హిట్ అనిపించుకుంది. అలనాటి అందాల తార రాధ తనయ కార్తీక అందులో హీరోయిన్. ఇప్పుడు అదే హీరోతో ఆ చిత్రానికి సీక్వెల్ వచ్చింది. రంగం-2లో రాధ రెండో కుమార్తె తులసి హీరోయిన్‌గా నటించింది. మొదటి రంగం విజయవంతమైన నేపథ్యంలో రంగం-2 కూడా అంతేస్థాయిలో ఆకట్టుకుంటుందని అంచనాలు పెట్టుకున్నారు. కానీ అవి కాస్తా పటాపంచలయ్యాయి. రంగం రంగులతో ముస్తాబైతే, రంగం-2 రంగులు వెలిసిపోయి కళావిహీనంగా కనిపించింది. నిరంతరం దినపత్రికల్లో గల్ఫ్ దేశాలకు వెళ్లి, ఇక్కడి ఏజెంట్ల మోసాలకు అక్కడ బలైపోతున్న అమాయకుల కథనాలు చూస్తూనే ఉంటాం. అలాంటి ఓ కథనాన్ని తీసుకుని రూపొందించిన చిత్రమే -రంగం -2.
**
చందు (జీవా) తల్లిదండ్రులు లేని అల్లరి చిల్లరిగా తిరిగే అబ్బాయి. బామ్మ పెంపకంలో పెరుగుతున్న అతనికి ఎటువంటి బాధ్యతలు ఉండవు. తొలి సన్నివేశంలో మాలిక్ అనే ఉగ్రవాదిని పోలీసులు మట్టుబెట్టిన కథనాన్ని చూపి చిత్రంలో ఏదో విషయం ఉందనిపించారు. ఆ ఎటాక్‌లో లవ్ అట్ ఫస్ట్‌సైట్ అన్నట్టుగా హీరో చందు హీరోయిన్ శ్రీల (తులసి)ని చూసి ప్రేమిస్తాడు. పనేం లేదు కనుక నిరంతరం నీడలా వెంబడిస్తూ ఆమె ప్రేమను పొందుతాడు. శ్రీల తన తండ్రి వద్దకు చందుని తీసుకెళ్తుంది. ఏ ఉద్యోగం లేని అతనికి తన కూతుర్ని ఇచ్చి పెళ్లిచేయనని, ఓ ఉద్యోగం చూసుకొని రమ్మని ఆవేశంతో బయటికి గెంటేస్తాడు శ్రీల తండ్రి. ఆ బాధతో ఏదో ఒక ఉద్యోగమని సమాధానపడిపోయి, గల్ఫ్‌లో ఓ ఉద్యోగం కోసం ఏజెంట్‌తో సంప్రదించి బయలుదేరతాడు. తీరా గల్ఫ్ వెళ్లాక అతని లగేజ్‌లో డ్రగ్స్ ప్యాకెట్లు ఉండటంతో అరెస్టుచేసి, చందుని జైల్లో వేస్తారు. కోర్టులో విచారించి, తలను నరికేసే తీర్పునిస్తారు. ఇక్కడ ఇండియాలో ఈ విషయం తెలుసుకున్న అతని స్నేహితులు, శ్రీలకు జరిగింది చెబుతారు. ఎలాగైనా చందుని రక్షించాలని గల్ఫ్ దేశం బయలుదేరుతుంది శ్రీల. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే తొలి సన్నివేశంలో పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన మాలిక్, గల్ఫ్ దేశంలో అబ్దుల్ రషీద్‌గా ఓ పెద్ద మనిషి హోదాలో చెలామణీ అవుతుంటాడు. జైల్లోవున్న చందు అక్కడికి వచ్చిన మాలిక్‌ను గుర్తుపడతాడు. తనను గుర్తుపట్టాడు కనుక అతను బ్రతికి ఉండకూడదని మాలిక్ జైలు అధికారులకు లంచం ఇచ్చి, చందును చంపేయమని చెబుతాడు. ఓవైపు జైలు అధికారుల నుంచి అపాయం, మరోవైపు కోర్టు విధించిన మరణశిక్షను తప్పించుకుంటూ, తనను కాపాడటానికి వచ్చిన శ్రీలను దుండగుల బారిన పడకుండా తన దేశం చందు ఎలా చేరాడు అన్న కథనమే మిగతా చిత్రం.
కథ అందించిన వెనె్నలకంటి శశాంక్ చాలా నీరసమైన పాయింట్‌ను తీసుకుని అల్లేశాడు. గతంలో ఇలాంటి పాయింట్‌తో అనేక చిత్రాలు వచ్చాయి. కథే సినిమాకు ప్రధానమైన మైనస్‌గా మిగిలింది. అయితే దర్శకుడు రవి కె చంద్రన్ పాత కథకు కొత్త స్క్రీన్‌ప్లే రాసుకుని సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసినా ఫలించలేదు. సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కెమెరా పనితనమే. విదేశాల్లో చిత్రీకరణ అద్భుతంగా సాగింది. పాటల చిత్రీకరణ కూడా సరికొత్తగా ఉంది. గుంతకల్లు టేసన్లో, ముంతకల్లు గొంతు దిగకుండా.. అన్న ఒక్క పాటే మింగుడు పడకుండా ఉంటుంది. ఎంత డబ్బింగ్ సినిమా అయితే మాత్రం తెలుగు పలకటం బొత్తిగా రాని గాయకుల చేత పాడిస్తే అదో కొత్త తరహా అనుకోవడం ఫ్యాషనైపోయింది. కనీసం భాష రాకపోయినా గాత్రమైనా సరిగా లేదు. ఫైవ్‌స్టార్ హోటల్లో విదేశీ అందగత్తెల మధ్య షూటింగ్ చేసిన ఆ పాటవింటే థియేటర్లనుంచి ప్రేక్షకులు లేచి వెళ్లిపోవడం ఖాయం. గాత్ర శుద్ధిలేని గాయకుల చేత డబ్బింగ్ సినిమాలకు పాడించటం పెద్ద మైనస్. మిగతా పాటలన్నీ ఫరవాలేదనిపిస్తాయి బాణీపరంగా. కానీ సాహిత్యం మాత్రం ఏ పాటలదీ అర్ధంకాదు. జీవా రంగం విజయవంతమైన ఉత్సాహంతోనో ఏమో అతిగానే నటించాడు. ముఖ్యంగా అతని ముఖంలో వున్న ఛార్మింగ్ కాస్త పోయింది. చాలా డల్‌గా కనిపించాడు. తులసి ఉన్నంతలో తన పాత్ర వరకూ ఫరవాలేదనిపించేలా నటించింది. ఇక నాజర్ తదితరులు ఓకే. చిత్రీకరణ పరంగా సినిమాను ఉన్నతంగా తీర్చిదిద్దాలని ప్రయత్నించినా పేలవమైన కథ కావడంతో రెండో రంగం ఆకట్టుకునే స్థాయిలో రూపుదిద్దుకోలేదు.

-సరయు