రివ్యూ

*** రంగస్థలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం:
రామ్‌చరణ్, సమంత,
జగపతిబాబు, ఆది పినిశెట్టి,
అనసూయ, ప్రకాష్‌రాజ్,
నరేష్, రోహిణి, బ్రహ్మాజీ,
రాజీవ్ కనకాల, అమిత్‌శర్మ,
జబర్దస్త్ మహేష్, అజయ్ ఘోష్,
పూజా హెగ్డే తదితరులు.

నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
కెమెరా: రత్నవేలు
నిర్మాతలు: నవీన్ యేర్నేని,
వై.రవిశంకర్, మోహన్ (సివిఎం)
రచన, దర్శకత్వం:
సుకుమార్

విభిన్న కథాంశాలతో విలక్షణమైన శైలిలో సినిమాలను తెరకెక్కించే దర్శకుల్లో సుకుమార్ ఒకరు. టాలీవుడ్ దర్శకుల్లో ఆయన రూటేవేరు. సుకుమార్ సినిమాల్లో కథానాయకులు కూడా గత చిత్రాల్లో కనిపించిన తీరుకు పూర్తి భిన్నంగా ఉంటారు. క్యారెక్టరైజేషన్ ఆధారంగా కథను తయారు చేసి సినిమా చేయాలనుకునే ఈ దర్శకుడి చిత్రం అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. ఇక మాస్ ఇమేజ్ ఉన్న హీరో రామ్‌చరణ్ నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఏం ఆశిస్తారో ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లేదు. ఇప్పటి వరకు స్టయిలిష్ చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కించిన దర్శకుడు సుకుమార్, మాస్ హీరో కలిసి సినిమా చేస్తున్నారంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఏ విధంగా ఉంటాయో ఊహించుకోవచ్చు. మెగా ఫ్యామిలీ వారసుడిగా వెండితెరకు పరిచయమైన రామ్‌చరణ్ తొలి నుంచి తనదైన శైలిలో చిత్రాలను చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. అంతేకాదు, మాస్, కమర్షియల్ హీరోగా తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు కూడా. దర్శకుడు సుకుమార్‌ది విభిన్న శైలి. మరి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే ‘లెక్కలు’ ఏ స్థాయిలో ఉంటాయో చెప్పనక్కర్లేదు. చరణ్‌తో పాటు సుకుమార్ కూడా తన రెగ్యులర్ స్టయిల్‌ను పక్కన పెట్టి ఈ సినిమా చేశాడు. ఇన్నాళ్లు కమర్షియల్ స్టార్‌గా మాత్రమే నిరూపించుకున్న రామ్‌చరణ్, ఈ సినిమాతో నటుడిగానూ మరో మెట్టు ఎక్కాలని భావిస్తున్నాడు. మరి అంతటి భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘రంగస్థలం’ అంచనాలను అందుకుందా? చరణ్ కల నెరవేరిందా? కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా తెరకెక్కిన ‘రంగస్థలం’ ప్రేక్షకులను ఆకట్టుకుందా? చరణ్-సుకుమార్‌ల కొత్త ప్రయోగం ఎలా ఉంది? ఏడాదికి పైగా చరణ్ పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందా? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
రంగస్థలం 1980ల కాలంలోని ఓ గ్రామం. 30 ఏళ్లుగా గ్రామాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకొని ప్రజలను పీడిస్తుంటాడు ఆ గ్రామ ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి (జగపతిబాబు). గ్రామంలో అతడు చెప్పిందే వేదం. అతడి పేరు పలకడానికి కూడా జనం భయపడిపోతుంటారు. ప్రెసిడెంట్ ఇంటి ముందు నుంచి వెళ్లాలన్నా చెప్పులు విడిచి వెళ్లాలి. ప్రెసిడెంట్‌గా ఉంటూ ప్రజలకు అందాల్సిన నిధులను కాజేస్తూ ఉంటాడు ఫణీంద్ర భూపతి. సొసైటీ పేరు చెప్పి ఊరి ప్రజలకు అప్పిచ్చి వడ్డీ వసూలు చేస్తుంటాడు. ఎదురు తిరిగిన వాళ్లని హతమార్పించే పనిలో ఉంటాడు. ఇదే గ్రామంలో పొలాలకు నీరు పెట్టే ఇంజన్‌ను నడుపుతూ ఉంటాడు చిట్టిబాబు (రామ్‌చరణ్). గ్రామంలో అందరితోనూ సరదాగా ఉంటాడు. అతడి తండ్రి (సీనియర్ నరేష్) గ్రామంలో దర్జీ. వినికిడి లోపంతో ఇబ్బంది పడే చిట్టిబాబు, రామలక్ష్మి (సమంత)ని చూసి ఇష్టపడతాడు. దుబాయ్‌లో ఉద్యోగం చేసే చిట్టిబాబు అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) ఏడాది తర్వాత రంగస్థలం గ్రామంలో అడుగుపెడతాడు. అక్కడ జరుగుతున్న అన్యాయాలను చూసి ఎదురు తిరుగుతాడు. దక్షిణామూర్తి (ప్రకాష్‌రాజ్) సహకారంతో ఫణీంద్ర భూపతికి పోటీగా ప్రెసిడెంట్‌గా నామినేషన్ వేస్తాడు. ముందుగా ఊరి ప్రజలు ప్రెసిడెంట్‌కు భయపడ్డా, నెమ్మదిగా కుమార్‌బాబు అందరినీ తన వైపునకు తిప్పుకుంటాడు. అయితే ప్రెసిడెంట్ ఫణీంద్ర.. కుమార్‌బాబుని చంపడానికి ప్లాన్ చేస్తాడు. గతంలో ఫణీంద్ర భూపతికి వ్యతిరేకంగా పోటీ చేయాలనుకున్న వారందరూ మరణించారని తెలుసుకున్న చిట్టిబాబు.. తన అన్నకు ఏమైనా జరుగుతుందేమో అని భయపడతాడు. అనుకున్నట్టుగానే కుమార్ బాబును కూడా చంపేస్తారు. కానీ చనిపోయే ముందు కుమార్‌బాబు, చిట్టిబాబుతో ఏదో చెప్పాలని ప్రయత్నించినా అది చిట్టిబాబుకు వినిపించదు. కుమార్‌బాబు, చిట్టిబాబుకు ఏం చెప్పాలనుకున్నాడు? అతడి చావుకు ప్రెసిడెంటే కారణమా? ఈ విషయాలను చిట్టిబాబు ఎలా కనిపిట్టాడు? అన్నదే కథ.
ఇది 1985 నాటి కాలంలో సాగే కథ. భూ స్వామ్య వ్యవస్థ.. ఒకే వ్యక్తి చేతిలో అధికారం ఉండటం. 30ఏళ్లుగా గ్రామాన్ని పాలిస్తున్న ఓ ప్రెసిడెంట్ చేసే అరాచకాలను నిలదీసే ఓ యువకుడు. ఇదీ స్థూలంగా రంగస్థలం నేపథ్యం. ఈ తరహా కానె్సప్ట్ గతంలో ఎన్నో చిత్రాల్లో మనం చూసే ఉంటాం. అయితే ఇలాంటి కథకు సుకుమార్ శైలిని జోడిస్తే ఎలా ఉంటుందో అదే ‘రంగస్థలం’. కథ పరంగా పాత్రల ఎంపిక, వాటిని చిత్రీకరించిన విధానం అందర్నీ ఆకుట్టుకుంటుంది. కమర్షియల్ సినిమాలకు దూరంగా పూర్తి గ్రామీణ వాతావరణంలో సాగుతుంది. రామ్‌చరణ్ కెరీర్‌లోనే ‘రంగస్థలం’ ది బెస్ట్ అని చెప్పొచ్చు. నటనాపరంగా చిట్టిబాబు క్యారెక్టర్‌ను ఇరగదీశాడు. పాక్షికంగా చెవుడు ఉన్న యువకుడిలా ఒదిగిపోయాడు. ఇలాంటి క్యారెక్టర్ తనకు మళ్లీ వస్తుందో రాదో మరి! గుబురు గడ్డం, గళ్ల లుంగీ, డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ కొత్తగా ఉన్నాయి. ప్రథమార్థమంతా ఊళ్లో చిట్టిబాబు చేసే సందడి.. రామలక్ష్మితో వచ్చే సరదా సన్నివేశాలతో సరదా సరదాగా సాగిపోతుంది. ముఖ్యంగా రామలక్ష్మిగా సమంత నటన కట్టిపడేస్తుంది. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పంచుతాయి. పాటలు కూడా సన్నివేశాలకు తగ్గట్టుగా వచ్చిపోతుంటాయి. మరో పక్క గ్రామంలో ప్రెసిడెంట్ చేసే అన్యాయాలను కుమార్‌బాబు నిలదీయడంతో పాటు సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ వేయడంతో కథ కీలక మలుపు తీసుకుంటుంది. అయితే ఈ పరిణామాలన్నీ చిట్టిబాబుకు తెలియవు. తన తండ్రి, అన్నను ప్రెసిడెంట్ అవమానించడం తెలిసిన తర్వాత చిట్టిబాబు ఎలా స్పందించాడన్నదే ద్వితీయార్థం. పాత్రల పరిచయం వాటి ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ప్రథమార్థం కాస్త నెమ్మదిగా సాగుతుంది. ప్రథమార్థమంతా సరదా సన్నివేశాలతో నడిపించిన దర్శకుడు అసలు కథను ద్వితీయార్ధం కోసం అట్టిపెట్టుకున్నాడు. కుమార్‌బాబు నామినేషన్ వేయడం, ప్రెసిడెంట్ అరాచకాలను ఊరి వాళ్లకు తెలియజేయడం, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు తదితర సన్నివేశాలతో సెకండాఫ్‌ను తీర్చిదిద్దాడు దర్శకుడు. అక్కడి నుంచి కథలో కాస్త వేగం పెరుగుతుంది. ఆ తర్వాత వచ్చే ట్విస్టులు ప్రేక్షకుడిని ఆశ్చర్య పరుస్తాయి. ఇలా ద్వితీయార్ధం మొత్తం దర్శకుడు సుకుమార్ శైలి ట్విస్ట్‌లతో సాగుతుంది. స్క్రీన్‌ప్లే విషయంలో ఎలాంటి ఎక్స్‌ట్రాల జోలికి పోకుండా స్ట్రెయిట్ నెరేషన్‌తో సహజత్వాన్ని ప్రతిబింబించే కథ, పాత్రలు, భావోద్వేగాలు సృష్టించాడు. సుకుమార్ అండ్ టీమ్‌తో పాటు మనని 1980వ దశకంలోకి తీసుకుపోతాడు. ఒక్కసారి గతంలోకి తీసుకెళ్లి కల్పిత గ్రామంలో వాస్తవిక పాత్రలు చూపించడంతో కొత్త అనుభూతిని కలిగిస్తుంటుంది. ఏ సన్నివేశం కూడా కమర్షియల్ విలువ కోసం నేలవిడిచి సాము చేయదు. ఇదే సుకుమార్ దర్శకత్వంలో వున్న గొప్ప లక్షణం. సుకుమార్ రెగ్యులర్‌గా తీసే సినిమాల్లా లేకపోయినా కానీ అతని మార్కు చివరి ఘట్టంలో ప్రస్ఫుటమతుంది. బలమైన సన్నివేశాలు, పదునైన సంభాషణలు వెరసి రంగస్థలం అడుగడుగునా రక్తి కడుతూ రొటీన్ సినిమాల మధ్య రెగ్యులర్ సెటప్‌తోనే చాలా డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది. గతంలో పల్లెటూరి నేపథ్యంలో అనేక సినిమాలొచ్చాయి. కానీ వేటిలోనూ లేనంత సహజత్వం ‘రంగస్థలం’లో కనిపిస్తుంది. చిట్టిబాబుగా పరకాయ ప్రవేశం చేసిన చరణ్ నటన తారాస్థాయికి చేరింది. మూస సినిమాల్లో నటిస్తూ వచ్చిన చరణ్ ‘రంగస్థలం’లో ఫస్ట్ షాట్ నుంచీ మనకి తెలిసిన మెగా పవర్‌స్టార్‌ని మరచిపోయేట్టు చేసి ‘చిట్టిబాబు’ను మాత్రం చూసేట్టు చేశాడు. ఒక నటుడికి ఒక క్యారెక్టర్ నచ్చితే, దాంతో కనెక్ట్ కాగలిగితే ఎంతగా లీనమై పోగలడో, ఇంకెంతగా దానికి జీవం పోయగలడో చరణ్ చూపించాడు. పల్లెటూరి కుర్రాడిలా తన కెరీర్‌లోనే అత్యుత్తమ నట విశ్వరూపాన్ని చూపాడు. వినికిడి లోపంతో ఇబ్బండి పడే సన్నివేశాల్లో అతడి నటన నవ్వులు పూయిస్తుంది. సినిమాలో హాస్యాన్ని పండించే బాధ్యతను కూడా తానే తీసుకున్నాడు. లుక్ విషయంలోనే కాదు, యాస, భాషల విషయంలో కూడా క్యారెక్టర్ కోసం చరణ్ తీసుకున్న కేర్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. ఫస్ట్ఫాలో సరదాగా కనిపించే చరణ్, సెకండ్ హాఫ్‌లో బరువైన ఎమోషన్స్‌ను పలికించి ఆకట్టుకున్నాడు. ద్వితీయార్థంలో చరణ్ నటన చాలా సన్నివేశాల్లో కంటతడి పెట్టిస్తుంది.
ఇక పల్లె అందం తొణికిసలాడే పడుచుపిల్లగా రామలక్ష్మి పాత్రలో సమంత ఒదిగిపోయింది. ముఖ్యంగా యేరు శనగమీద సాంగ్ ‘రంగమ్మ మంగమ్మ’ పాటలో తను చక్కటి హావభావాలను పలికించింది. గతంలో ఎన్నడూ కనిపించనంత మాస్ పాత్రలో కనిపించి చిలిపి ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్స్‌లోనూ తనదైన నటనను ప్రదర్శించింది. ‘రంగస్థలం’లోని నటులందరూ తమ పాత్రలో ఒదిగిపోయారు. చక్కటి క్యారెక్టరైజేషన్లు రాసుకుని, నేటివిటికి తగ్గట్టు సజీవమైన స్కెచ్‌లు డిజైన్ చేయించిన సుకుమార్ ఇందులోని ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోయే సినిమా ఇచ్చాడు. జగపతిబాబు ఎన్నో విలన్ పాత్రలు చేసినా కానీ ఇందులోని ‘ప్రెసిడెంట్ గారు’ ఆయన కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్‌గా చెప్పొచ్చు. ఆయన ఆహార్యం కూడా పాత్రకు తగ్గట్టుగా ఉంది. తన పదవి కోసం ఏమైనా చేసే క్రూరమైన ప్రెసిడెంట్ పాత్రలో జగపతిబాబు మంచి విలనిజం పండించాడు. వెండితెర మీద మంచి క్యారెక్టర్ కోసం ఎదురుచూస్తున్న అనసూయకు ఇందులో ఆ ఛాన్స్ దక్కింది. రంగమ్మత్తగా కీలక పాత్రలో కనిపించిన అనసూయ ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఎమోషనల్ సీన్స్‌లోనూ మెప్పించింది. పద్ధతి కలిగిన కుర్రాడి పాత్రలో ఆది కనిపించి ఆకట్టుకున్నాడు. సీనియర్ నరేష్, రోహిణి, ప్రకాష్‌రాజ్, కాదంబరి కిరణ్, సత్య, జబర్ధస్త్ మహేష్, అజయ్ ఘోష్ ఇలా వారి పాత్రలతో ఆకట్టుకున్నారు.
సాంకేతికంగా ఈ చిత్రం అత్యున్నత స్థాయిలో ఉంది. నిర్మాణ విలువలూ అదే స్థాయిలో వున్నాయి. సంగీత, సాహిత్యాల పరంగా కూడా అప్పటి కాలమానానికి తగ్గ వాయిద్యాలు, భాష వినిపిస్తాయి. దేవిశ్రీ ప్రసాద్ పాటలే కాకుండా నేపథ్య సంగీత కూడా ఎనభైల శైలితో కొత్త అనుభూతినిస్తుంది. ఆరుపాటల్లో నాలుగు పాటలు చాలా బావున్నాయి. సుకుమార్-దేవీశ్రీల మార్క్ ఐటమ్ సాంగ్‌లో పూజా హెగ్డే అలరించింది. పల్లెటూరి నేపథ్యంలో గతంలో అనేక సినిమాలొచ్చాయి. కానీ వేటిలోనూ లేనంత సహజత్వం ఇందులో కనిపిస్తుంది. ఛాయాగ్రహకుడు రత్నవేలు చూపిన ప్రతిభ అపారం. కెమెరా ఈ సినిమాకు పెద్ద ఎసెట్ అయింది. రామకృష్ణ, మోనిక ఆర్ట్ వర్క్ వెనె్నముకలా నిలిచింది. నవీన్ నూలి ఎడిటింగ్ ఫర్వాలేదు. రామ్-లక్ష్మణ్ పోరాట సన్నివేశాలు అదిరిపోయే రేంజ్‌లోనే వున్నాయి. పల్లెటూరి ప్రజల సమస్యలు, అక్కడి రాజకీయ పరిస్థితులు.. పగలు, ప్రతీకారాలతో పాటు మనుషుల్లోని అమాయకత్వం, మంచి తనాన్ని కూడా తెరమీద చాలా బాగా ఆవిష్కరించాడు సుకుమార్. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ ఏ మాత్రం మిస్ అవ్వకుండా జాగ్రత్తపడ్డాడు. కామెడీతో పాటు యాక్షన్, కాస్త రొమాన్స్, ఎమోషన్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి ‘రంగస్థలం’లోకి ప్రయాణించేలా చేశాడు. మొత్తం మీద సినిమా చూసి బయటి వస్తున్న మనం మాత్రం చిట్టిబాబు విశ్వరూపానే్న తలుచుకుంటూ వస్తాం.

--ఎం.డి అబ్దుల్