రివ్యూ

కొంచెం ఫన్నీగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు సుప్రీం

తారాగణం:
సాయిధరమ్ తేజ్, రాశిఖన్నా, రాజేంద్రప్రసాద్, సాయికుమార్, శ్రీనివాస్‌రెడ్డి సంగీతం: సాయకార్తీక్
సినిమాటోగ్రఫీ: సాయశ్రీరామ్
నిర్మాత: శిరీష్
సమర్పణ: దిల్‌రాజు
రచన, దర్శకత్వం:
అనిల్ రావిపూడి
--
ఒక్కో సినిమాతో స్టామినా పెంచుకుంటూ కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్. తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా సుప్రీమ్. రాశిఖన్నా హీరోయిన్. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. దిల్‌రాజు బ్యానర్‌లో రూపొందిన సినిమాతో సాయిధరమ్ సుప్రీమ్‌గా ఎలా మారాడో చూద్దాం.
కథ:
అనంతపురంలో ఉన్న జాగృతి ట్రస్ట్ సంస్థ పరిధిలోని వందల ఎకరాలను నమ్ముకొని వేలమంది తరతరాలుగా జీవనం సాగిస్తుంటారు. ట్రస్ట్ పరిధిలోని భూములను కబ్జా చేసి సొంతం చేసుకోవాలని అనుకుంటాడు విక్రమ్ సర్కార్ (కబీర్‌సింగ్). అందుకోసం ప్లాన్ చేస్తాడు. అయితే ఆ ట్రస్ట్ ఓ రాజ కుటుంబీకులదనీ, వారి తరఫువారు ఇంకా బతికే ఉన్నారని తెలియడంతో విక్రమ్ సర్కార్ ప్లాన్ అడ్డం తిరుగుతుంది. ఇక ఈ కథకు ఏమాత్రం సంబంధం లేని బాలు (సాయిధరమ్‌తేజ్) హైద్రాబాద్‌లో ట్యాక్సీ నడుపుకుంటూ తండ్రితో కలిసి జీవిస్తుంటాడు. అతడి జీవితంలోకి రాజన్ పేరుతో ఓ ఎనిమిదేళ్ళ బాలుడు వస్తాడు. రాజన్ వచ్చాక బాలు కథ పూర్తిగా మారిపోతుంది. తనకు ఎలాంటి సంబంధంలేని జాగృతి ట్రస్ట్ కథలోకి బాలు ఎంట్రీ ఇవ్వాల్సి వస్తుంది. అసలు బాలుకి, అక్కడి ప్రజలకు సంబంధమేంటి? రాజన్ అనే బాలుడెవరు? ఆ బాలుడికీ జాగృతి ట్రస్ట్‌కు ఏదైనా సంబంధం ఉందా? లాంటి ప్రశ్నలకు సమాధానమే సినిమా.
హీరో పాత్రకు, ఓ ఎనిమిదేళ్ళ బాలుడికీ మధ్య ఉండే జర్నీ గురించే చెప్పుకోవాలి. ‘నా రాజ్యంలో ప్రజలందరూ క్షేమంగా ఉండాలి’ అంటూ బాలుడితో చెప్పించే పాయింట్‌తో అసలు కథ నడుస్తూంటుంది. పాయింట్ బాగుంది, హీరో, ఈ బాలుడికి మధ్యన వచ్చే సన్నివేశాలు కూడా బాగా ఆకట్టుకుంటాయి. ఇక మొదట్నుంచీ చివరివరకూ చిన్న కథే అయినా చెప్పాల్సిన పాయింట్ చుట్టూ అల్లుకున్న ఫన్ ఎలిమెంట్ సినిమాను నిలబెట్టే అంశంగా చెప్పుకోవచ్చు. హీరో, హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ నుంచి పుట్టుకొచ్చే ఫన్, వీరిద్దరి మధ్యన కెమిస్ట్రీ కూడా బాగుంది. ఇక ఎప్పట్లానే మంచి ఎనర్జీవున్న క్యారెక్టర్‌లో సాయిధరమ్‌తేజ్ అంతే ఎనర్జీతో నటించి సినిమాను ఓ స్థాయికి తీసుకెళ్ళాడు. డ్యాన్సుల్లో, డైలాగ్ డెలివరీలో సాయిధరమ్‌తేజ్ బాగా చేశాడు. రాశిఖన్నా ఫన్ పాత్రలో బాగా నటించింది. కథకు కీలకమైన పాత్రలో బాల నటుడు మైఖేల్ గాంధీ అద్భుతమైన ప్రతిభ చూపి కట్టిపడేశాడు. ఇక మిగతా నటీనటులంతా సినిమాకు అవసరమైనప్పుడల్లా కామెడీని పండిస్తూ అందరూ తమ పాత్రలకు మంచి న్యాయంచేశారు. సెకండాఫ్‌లో సింగిల్ పాయింట్‌లో నడిచే సినిమాకు ఎంటర్‌టైన్‌మెంటే ప్రధాన బలం. పృథ్వీ, ప్రభాస్ శ్రీనుల ఎపిసోడ్, రఘుబాబు, వెనె్నల కిషోర్‌ల నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్, విలన్ రవిశంకర్ క్యారక్టరైజేషన్ నుంచి పుట్టుకొచ్చే కామెడీ.. ఇలాంటివన్నీ సినిమాను ఎప్పటికప్పుడు ఫన్ ట్రాక్ తప్పకుండా మంచి ఫ్లోలో నిలబెడుతూ వచ్చాయి.
మొదట దర్శక, రచయిత అనిల్ రావిపూడి గురించి చెప్పుకోవాలి. అనిల్ ఒక మంచి పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ చాలా చిన్నది. అయితే ఆ చిన్న కథలోనే ఎమోషన్‌ను, ఫన్ ఎలిమెంట్‌ను బాగా వాడుకుంటూ మంచి స్క్రీన్‌ప్లే చేసాడు. దర్శకుడిగానూ అనిల్ రావిపూడి ఒక కమర్షియల్ సినిమాకు అవసరమైన అంశాలను పొందిగ్గా పేర్చుకున్న విధానం బాగా ఆకట్టుకుంటుంది. డైలాగులు బావున్నాయి. ఒక్క ఒడిశా నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు మినహాయిస్తే మేకింగ్‌పరంగా పెద్దగా మెరుపులేమీ లేవు. హీరో- బాలుడి మధ్యన వచ్చే జర్నీని కథలోని ఎమోషన్‌కు కలపడం ఈ సినిమా విషయంలో దర్శకుడిగా అనిల్ చూపిన చక్కటి ప్రతిభగా చెప్పుకోవచ్చు.
సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు టెక్నికల్‌గా బలం. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఒడిశా నేపథ్యంలో వచ్చే ఓ ఛేజ్ సీన్ సినిమాటోగ్రాఫర్ పనితనానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సాయికార్తీక్ సంగీత దర్శకత్వంలో రూపొందిన పాటలన్నీ ఫరవాలేదనిపించాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. ఎంఆర్ వర్మ ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి.
సాయిధరమ్ తేజ్ తనకు బాగా కలిసొచ్చిన జానర్‌నే మళ్ళీ నమ్ముకొని ఈసారీ మెప్పించాడనే చెప్పుకోవచ్చు. హీరో క్యారెక్టరైజేషన్, కథలోని చిన్న పాయింట్, హీరోతో ఓ బాలుడి ప్రయాణం, హీరోయిన్ క్యారెక్టరైజేషన్, మొదట్నుంచీ చివరి వరకూ సినిమాను నిలబెట్టేలా ఉండే కామెడీ ఎపిసోడ్స్ లాంటివన్నీ సినిమాకు అనుకూలాంశాలు. ఇకపోతే లాజిక్ అంటూ లేకపోవడం, అసలు కథ మొదట్లోనే తెలిసిపోవడం లాంటి ప్రతికూలాంశాలు ఉన్నా ఓ కామెడీ సినిమాగా మాత్రం చూస్తే, ‘సుప్రీమ్’ బాగా ఆకట్టుకుంటాడు. సినిమాలోనే చెప్పినట్టు ‘జింగ్ జింగ్’ కామెడీతో హాయిగా నవ్వించే ప్రయత్నం చేసాడు. ఇక ఈ సినిమాకు మేజర్ మైనర్ పాయింట్ అసలు కథంతా మొదటి పావుగంటలోనే తెలిసిపోవడం. ఇక ఈ చిన్న కథతోనే ఇంటర్వెల్ వరకూ సినిమాను పకడ్బందీగా తీసుకొచ్చినా, అక్కడొక ట్విస్ట్ రివీల్ అయ్యాక సినిమా మొత్తంగా సింగిల్ పాయింట్‌లో సాగిపోతూ అక్కడక్కడా నెమ్మదించినట్టు కనిపించింది. ఇక రాజన్ అనే బాలుడి పాత్ర ఎంట్రీ ఇచ్చేవరకూ సినిమాలో అన్ని సన్నివేశాలు కృతకంగా అల్లిన సన్నివేశాల్లా కనిపిస్తాయి. సెకండాఫ్‌లో హీరో, హీరోయిన్ల ట్రాక్‌కు కూడా అవకాశం లేని కొన్ని పరిస్థితులు ముందునుంచే కల్పించడంతో అక్కడ వీరి ప్రయాణం పెద్దగా ఆకట్టుకునేలా లేదు. ఇక సినిమాలో పెద్ద లాజిక్ అన్న అంశానికి చోటే లేదు. పూర్తిగా ఫన్ ఎలిమెంట్‌నే నమ్ముకొని చేసిన ప్రయత్నమిది.

-త్రివేది