రివ్యూ

టైటిల్‌కు తీసిపోకుండా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేవర్స్ * బాగోలేదు

తారాగణం: సంజోష్, రాజేంద్రప్రసాద్, హర్షి పన్వాల్, కాశీ విశ్వనాధ్, గౌతంరాజు తదితరులు..
సంగీతం: సునీల్ కశ్యప్
నిర్మాతలు: పొన్నాల చందు, డా.ఎం.ఎస్.మూర్తి, ఎం.అరవింద్
దర్శకత్వం: రమేష్ చెప్పాల
============================================
తల్లిదండ్రుల ఇష్టాఇష్టాలను బట్టి పిల్లలను పెంచడం కాకుండా, వారి అభిరుచుల్ని బట్టి పేరెంట్స్ మార్గదర్శకత్వం చేస్తే బావుంటుందని చెప్పే బేసిక్ ఐడియా ‘బేవర్స్’దైనా, దాన్ని తెరపైకి తర్జుమా చేయడంలో రమేష్ చెప్పాల (దర్శకుడు) సృష్టించిన గందరగోళంవల్ల చివరకు చిత్రం సినిమా పేరులాగానే ప్రయోజన రహితమైపోయింది. కథలోకి వెళితే... ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివి పైలట్ అవుదామనుకున్న లక్కి (సంజోష్), తండ్రి సత్యమూర్తి (రాజేంద్రప్రసాద్) బలవంతంతో గ్రూప్స్ కోచింగ్‌కు వెళతారు. అక్కడ తనకి ఆరాధ్య (హర్షిత పన్వాల్) పరియం కావడం, ఆమె మనసు దోచుకోవడానికి చేసిన ప్రయత్నాలూ కొనసాగుతాయి. ఈలోగా తన ప్రాణానికి ప్రాణమైన సోదరి సిరి ఆత్మహత్య చేసుకుంటుంది. అయితే ఆ ఆత్మహత్య ఉదంతంలో అతనికి తోచిన అనుమానాల్ని పరిశోధించగా హత్య అని తేలుతుంది. అదెవరు చేశారు? ఆఖరికి ఏమైంది అన్నదానితో ‘బేవర్స్’ పనులు ముగుస్తాయి. ఈ చిన్న వివరణ చదవడంలోనే పాఠకులు సినిమా గాడి తప్పిందన్న భావనకు వెంటనే వచ్చేస్తారు. అక్షరాలా సినిమాలో అదే జరిగింది. అందుకే రమేష్ చెప్పాల సినిమా ద్వారా చెప్పదల్చుకున్నదానికీ చెప్పినదానికీ పొంతన కుదరలేదు. సర్లే, సినిమాల్లో ఇవన్నీ సర్వసాధారణమని సరిపెట్టుకుందామన్నా, చిత్రంలో చూపిన సన్నివేశాలూ నేల విడిచి చేసిన సాములవల్ల ఆడియన్స్‌కు పట్టలేదు. ఉదాహరణకి కొడుకు బాధ్యత లేకుండా తిరుగుతున్నాడని పదే పదే తిట్టడం తప్ప అతన్ని సక్రమ మార్గంలో పెట్టే ప్రయత్నాలు తండ్రి సత్యమూర్తి చేసినట్లు ఎక్కడా కనపడదు. అలాగే ‘నా ఇష్టమొచ్చినట్లు ఉంటా, ఐన్‌స్టీన్, న్యూటన్‌లను కూడా తొలుత బేవర్స్.. అనే అనుకుని ఉండవచ్చు’ అన్న అనుమానం వ్యక్తం చేసినా (నా ఇష్టమొచ్చినట్లు ఉంటా పాటలోని పదాలు) నాయకుడు వారిలా కష్టపడి పనిచేసే తత్వాన్ని అనుసరించే ప్రయత్నాలూ ఎక్కడ చిత్రంలో చేయలేదు. పైగా రోజూ మందు పార్టీలూ వగైరాల్లో తేలుతున్నట్టు చూపారు. ఇక సినిమా ప్రథమార్థం అనంతరం సిరి మరణం ఆత్మహత్య కాదు, హత్యేనని నిరూపించే ప్రక్రియలో, ఆమెను పెళ్లిచేసుకోబోయే కార్తీకే అది చేశాడని చూపించడంలో దర్శకుడు క్రియేట్ చేసిన సీన్స్ అన్నీ విపరీతమైన విసుగు తెప్పించాయి. ఇంకో విచిత్ర విషయమేమిటంటే, సిరిని, కార్తీక్ ఎలాగైతే చంపాడో, అదే రీతిలో అతన్ని సత్యమూర్తి చేత చంపించడం, దీంతో పెద్దమనిషిగా చిత్రించిన సత్యమూర్తి పాత్ర అపఖ్యాతిపరమైంది. ఎందుకంటే నాగరిక సమాజంలో ‘హింసకు హింస’ సమాధానం ఎప్పుడూ కాదు. పోనీ భావోద్వేగాల పరంగా అప్పటికప్పుడు సత్యమూర్తి ఆపని చేసినా, చట్టానికి లొంగిపోయినట్లు చూపితే, ఆ పాత్రకిచ్చిన గౌరవమైనా నిలిచేది. సానుభూతి కలిగేది. వీటినేవీ డైరెక్టర్ గమనించకపోవడం విచారకరం. నాయక పాత్రధారి సంజోష్‌కిది తొలి చిత్రం అయినా పాత్రకిచ్చిన అంచనాల ఆధారంగా అందుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేశాడు. కానీ సన్నివేశాల కల్పనలోని అపసవ్యతలవల్ల అది రాణించలేదు. సత్యమూర్తిగా రాజేంద్రప్రసాద్‌కి ఈ తరహా పాత్రలు ఎడమ చేతి ఆటలంత సులభం. దానే్న మరోసారి ఆయన ఇందులో రీ ప్లే చేశారు. ఆరాధ్యగా హర్షిత పన్యాల్‌కు పెద్దగా పనేం లేదు, పాటల్లో వచ్చి మెరవడం తప్ప. చెల్లి సిరి పాత్రధారిణి బాగా నటించారు. పాటల్లో ‘తల్లీ, తల్లీ, నా చిట్టితల్లీ, నా ప్రాణాలే పోయాయమ్మా’కే అగ్రస్థానం. రాసిన సుద్దాల అశోక్ తేజ అభినందనీయుడు. వాస్తవానికి ఆ ఎమోషన్స్ అన్నీ తెరపై ప్రతిఫలిస్తే బావుండేది. అయితే కొన్ని పాటల పదాల్లో బలవంతంగా ప్రాసకోసం పడిన యాతన అంతా కళ్లకు కట్టినట్లు కన్పడింది. ‘లవ్వాలజీ, యాస్ట్రాలజీ, మైథాలజీ’ ఈ కోవకు చెందినవే. మాటల్లో సినిమాలోనే చెప్పినట్లు ఫేస్‌బుక్ కొటేషన్స్ లాంటివి కొన్ని కనపడ్డా చమత్కరంగా చేసిన కొన్ని ప్రయత్నాలు బాగున్నాయి. పెగ్గు పెగ్గుకీ మధ్య పెరుగన్నం పెట్టినట్లు.. ‘సచిన్ సెంచరీ కొట్టాలంటే బొంబాయిలోనే గ్రౌండ్ ఉండనక్కరలేదు..’ లాంటివి అందుకుదాహరణ. ‘జీవితంలో అత్యంత కష్టమైన అంశం ప్రాణం పోవడం కాదు.. ప్రాణానికి ప్రాణమైన వాళ్లు పోవడం..’ అన్నది మనసుని పట్టేసిన సంభాషణ. కానీ ‘సాఫ్ట్‌వేర్ కదా..’ అంటూ సృష్టించిన హాస్యం ఏ మాత్రం ఆకట్టుకోలేదు. చివరగా ఈ చిత్రంలోనే ఒకచోట చెప్పిన డైలాగ్ (మనిషిగా పుట్టడం ఈజీనే.. కానీ మంచి మనిషిగా బ్రతకడం కష్టం)లాగే ‘సినిమా తీయడం ఈజీనే.. కానీ మంచి సినిమా తీయడం కష్టం..’. ఆ కష్ట రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నాలు చిత్ర బృందం భవిష్యత్తులో చేస్తే బెటర్.

అన్వేషి