రివ్యూ

ఈల..చేసిన గోల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజిల్ ** ఫర్వాలేదు
**
తారాగణం: విజయ్, నయనతార, జాకీష్రాఫ్, వివేక్, యోగిబాబు, రోహిణి, ప్రియ కదిర్, ఇందుజా రవీంద్రన్, ఆనంద్‌రాజ్, మోనికా జాన్, అరున్‌బజ్వా తదితరులు
సంగీతం: ఎఆర్ రెహమాన్
కెమెరా: జికె విష్ణు
నిర్మాతలు: కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్
రచన, దర్శకత్వం: అట్లీకుమార్
**
‘పెద్దోళ్లు ఎన్ని అడ్డదార్లు తొక్కైనా ఎదగగలరు. కానీ పేదోళ్లు పైకిరాడానికి స్పోర్ట్స్‌లాంటి ఒకటో రెండో అవకాశాలంతే’ -ఈ సంభాషణే ప్రాతిపదికగా.. ఆటలపై ఆసక్తిరేపి పేదోళ్లను పైకి తేవాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్న అభిప్రాయంతో దర్శకుడు అట్లీకుమాల్ ‘విజిల్’లేద్దామనుకున్నాడు. కానీ ఆ విజిల్ అన్నివర్గాలకు చేరుతుందో లేదనన్న చిన్న సంకోచంతో సినిమాలో మసాలా నింపడంతో ఆదర్శం రేంజ్ అంతగా కనిపించలేదు.
తనవర్గాన్ని కాపాడుకోవడం, పేదోళ్లను ఆదుకోవడంలో చట్టం పట్టని గ్యాంగ్‌స్టర్ రాజప్ప (విజయ్). తన మార్గంలో కాకుండా, ఆసక్తివున్న ఫుట్‌బాల్‌లో కొడుకు రాణించాలని కోరుకుంటాడు. అది నెరవేరే టైం వచ్చేసరికి -ఓ అటాక్‌లో కన్నుమూస్తాడు రాజప్ప. తండ్రి వారసత్వాన్ని తప్పనిసరిగా ధరించాల్సి వస్తుంది కొడుకు మైఖేల్ (విజయ్)కి. రెండు పూటలా తిండికి నోచుకోకున్నా -క్రీడాసక్తి చూపించే పిల్లల్ని చేరదీసి తీర్చిదిద్దమని మిత్రుడు కిరణ్‌ని కోరతాడు. అందుకు తగిన ఆర్థిక సంపత్తిని అజ్ఞాతంగా అందిస్తుంటాడు. మహిళా క్రీడాకారిణుల టీమ్‌కు కోచ్‌గావున్న కిరణ్ సైతం.. మైఖేల్‌ని వెంటాడే నేర జీవితంలో తీవ్ర గాయాలపాలవుతాడు. మరి ఆ మహిళా క్రీడాకారిణుల క్రీడా భవిష్యత్ కోసం మైఖేలే కోచ్‌గామారి ఎలా గెలిపిస్తాడోనన్న కథాగమనంతో సినిమా ముగుస్తుంది. కొనే్నళ్ల క్రితం వచ్చిన షారుక్‌ఖాన్ ‘చెక్‌దే ఇండియా’, ఈమధ్య వచ్చిన కొన్ని ఈ తరహా జోనర్ చిత్రాల అనంతరం విన్న ‘విజిల్’ -వైవిధ్యమైన సౌండ్ ఇవ్వలేదు. కాకపోతే ఇందులో ఫుట్‌బాల్ ఆటతోపాటు కత్తుల ఆట కూడా ఉంది. కొన్నిచోట్ల కత్తుల కసరత్తే పైస్థానం ఆక్రమించింది. దానికితోడు కథా ప్రయాణంలో కావాల్సినన్ని లొసుగులు, నేరచరిత్రగల వ్యక్తి తండ్రిగా ఉంటేనే అభ్యంతరం వ్యక్తపరిచే స్పోర్ట్స్ ఫెడరేషన్, స్వయంగా అప్పటికే నేరచరిత్ర కలిగిన మైఖేల్‌ని ఎలా కోచ్‌గా అనుమతిస్తారో అర్థంకాదు. అంతటి భయాందోళనలలో ఆట ఆడే అభ్యర్థులూ ఆటమీద దృష్టిపెట్టలేరు. అప్పటికి మైఖేల్ ఫుట్‌బాల్ ఆడటం మానేసి ఏడేళ్లయ్యిందని చెప్తారు. మరి అంతటి సుదీర్ఘ విరామానంతరం ఏ ఆటలోనూ మునుపటి సత్తారాదు. కానీ ఇందులో ఆ యువ క్రీడాకారిణుల జట్టుతో మైఖేల్ నిత్యం ప్రాక్టీసు చేసి ఫామ్‌లోవుండే ప్లేయర్‌కన్నా మించిన రీతిలో ఆడినట్టు చూపటం అసహజంగా అనిపిస్తుంది. గాయత్రి, అనిత పాత్రల విషయానికీ ఇదే సూత్రాన్ని వర్తింప చేశారు. స్పోర్ట్స్ యాంగిల్ కనుక వీటిని సినిమాటిక్ లిబర్టీగా సరిపెట్టలేం. ఇక -విలన్ అలెక్ట్, జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులను సమావేశపర్చిన రాజప్ప, వాళ్లముందే అలెక్స్ కొడుకుని తీవ్రంగా కొడతాడు. ఇలాంటి సీన్స్ జీర్ణించుకోవడం కష్టం. పేదల్లోని క్రీడాశక్తికి సాయపడాలన్న దృక్పథంతో తెరకెక్కిన చిత్రంలో -ఇలాంటి సన్నివేశాలు అసలు కథను పక్కదారి పట్టించేశాయి.
ఇది తమిళంలో వచ్చిన బిగిల్‌కు అనువాదం. తెలుగు నేటివిటీ కోసం ఆంధ్ర టీమ్ అనిచెప్పినా, స్క్రీన్‌పై తమిళనాడు కొట్టొచ్చినట్టు కనిపించి గందరగోళానికి దారితీస్తుంది. మూడు గంటల నిడివిలో ‘విజిల్’ శబ్దం నిరంతరాయంగా నిలిచింది. హీరో ఇంట్రో ఫైట్ ఆరు నిమిషాలు, పైగా ఏంజెల్ (నయనతార)తో చేయించిన ఫుట్‌బాల్ కప్ సొట్టల కామెడీలాంటి వాటిని భరించలేం. రాజప్ప- మైఖేల్ పాత్రల్లో రాజప్పగా విజయ్ రాణించాడు. ఆ పాత్రకిచ్చిన ‘నత్తి’ని బాగా వాడుకున్నాడు. మైఖేల్ తరహా పాత్రలు విజయ్‌కు టైలర్‌మేడ్ కనుక చెప్పుకునేదేం లేదు. ఏంజెల్‌గా నయనతారకు స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువే అయినా, బిరియానీ ఎపిసోడ్‌లో బాగా నటించింది. ఆటలు కూడా మా వ్యాపారంలో భాగమేనంటూ నగ్నసత్యం చెప్పిన స్పోర్ట్స్ బోర్డ్ చైర్మన్ శర్మ పాత్రలో జాకీష్రాఫ్ పర్ఫెక్ట్‌గా సరిపోయాడు. కానీ ఆ పాత్రకూ గ్యాంగ్‌లీడర్స్ నేపథ్యం పెట్టడం సరిగాలేదు. క్రీడాకారిణులుగా కీర్తన, పోచమ్మ, అనిత పాత్రధారిణులు బాగా చేశారు. ఇక గాయత్రి కుటుంబానికున్నంత ఆర్థోడాక్స్ లక్షణాలు ఈకాలంలోనూ ఉన్నట్టు చూపడం కొంత ఆడ్‌గా ఉంది. ఎఆర్ రెహమాన్ స్వరాల్లో గొప్పగా చెప్పుకోదగ్గవేం లేవు. నేపథ్య సంగీతం బావుంది. ఓ పాటలో రెహమాన్ తళుక్కున మెరుస్తాడు. పాట లేకుండా క్రీడాకారిణులతో విజయ్, నయనతారలు చేసిన నృత్యం బాగుంది. అట్లీ కూడా ప్రాథమికంగా డ్యాన్సరే కావడంతో ఈ డ్యాన్స్‌పై బాగా శ్రద్ధ పెట్టినట్టు కనిపించింది. ‘ప్రతిభకీ, ఆత్మాభిమానానికీ మొహం అడ్డురాదు’, ‘ఇతరుల కడుపుకొట్టి సంపాదించిన డబ్బు ఆపదలో ఆదుకోదు’ అన్న డైలాగ్స్ బాగున్నాయి. కానీ ‘గెలుపుకోసం ఆడాలి తప్ప ఎదుటివాడు ఓడిపోవాలని కోరుకోకూడదు’ అన్నది డైలాగ్ వరకూ ఓకె అయినా ప్రాక్టీకల్‌గా చూస్తే ఎందులోనైనా ఒకరు ఓడితేకానీ, ఇంకొకరు గెలవరు. ఫుట్‌బాల్ ఆట చిత్రీకరణలో సరిగ్గా మన దృష్టి బాల్‌పైనే కేంద్రీకృతమయ్యేలా చేసిన విష్ణు కెమెరా పనితనం ప్రశంసనీయం.

-అన్వేషి