రివ్యూ

తడితగ్గిన పల్లె ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** రాజావారు.. రాణీగారు
తారాగణం: కిరణ్, రహస్య, రాజ్‌కుమార్, యజుర్వేద్, స్నేహమాధురి, దివ్య తదితరులు
సంగీతం: జై క్రిష్
సినిమాటోగ్రఫీ: విద్యాసాగర్, అమర్ దీప్
ఎడిటర్: విప్లవ నైషధం
నిర్మాత: మనోవికాస్
దర్శకత్వం: రవికిరణ్ కోలా
**
ఊరు మారినా ఉనికి మారునా -అన్నాడో సినీకవి. నిజమే -బతుకు దెరువుకోసం ఊళ్లు వదిలేసినోళ్లంతా తమ ఉనికిలోని స్వచ్ఛత, గాఢతను సందర్భానుసారం వెతుక్కుంటూ ఉంటారు. ఆ బ్యాక్‌డ్రాప్‌కు దూరంగా పెరిగినోళ్లు -అవెలా ఉంటాయో తెలుసుకోవాలని ఆశపడుతుంటారు. అందుకే, ఏదైనా పల్లె కథో.. పల్లెలోని ప్రేమ కథో తెరకెక్కుతుందంటే -ఆడియన్స్‌లో అంతటి ఆసక్తి. గతాన్ని తడిమి చూద్దామని అనుకునేవాళ్లు కొందరు. అనుభవానికి దూరమైన కమ్మదనాన్ని స్క్రీన్‌పై ఆస్వాదిద్దాం అనుకునే వాళ్లు ఇంకొందరు. -పచ్చని పల్లెలు.. వెచ్చని ఆప్యాయతలు.. స్వచ్ఛమైన పలకరింపులు.. కల్మషంలేని ప్రేమలు.. స్పృశించటానికి ఇలాంటివెన్నో ఉంటాయి కనుకే -అంతగా ఆదరణ, ఆసక్తి. ట్రైలర్‌తో అలాంటి ఆసక్తికి సెగపెట్టిన సినిమా -రాజావారు రాణిగారు. ట్రైలర్ సరే, సినిమా ఎంత ఆసక్తిగా సాగిందో సమీక్షలో చూద్దాం.
**
రామాపురం ఓ పల్లెటూరు. ఆ వూళ్లో ఓ రాజా. ఓ రాణి. ఒకే స్కూలు, ఒకే ఈడు. ఇద్దరి మధ్యా సాగిన జట్టు.. ఎదిగేసరికి చనువవుతుంది. పెంచుకున్న చనువు పంచుకునే టైమ్‌కి -స్కూల్ ఫైనలవుతుంది. తన ఇష్టాన్ని రాణికి ధైర్యంగా చెప్పలేకపోతాడు రాజా. అది గ్రహించలేని రాణి -కాలేజీ చదువు కోసం అమ్మమ్మ ఊరెళ్లిపోతుంది. రాణి అమ్మమ్మ ఊరు రాజాకు తెలీదు. అక్కడ ఏ కాలేజ్‌లో చేరిందో అస్సలు తెలీదు. మనసులోని ఇష్టాన్ని కళ్లలోకి తెచ్చుకుని ఎదురు చూస్తుంటాడు రాజా. స్నేహితుడి విరహ వేదనకు చలించిపోతారు స్నేహితులు చౌదరి, నాయుడు. ట్రిక్ ప్లే చేసి రాణి ఊరికొచ్చేలా చేస్తారు. ప్రేమను చెప్పేయమని వత్తిడి చేస్తారు. సరిగ్గా అదే సమయానికి రాణి బావ ఊరునుంచి దిగుతాడు. బావతో రాణి పెళ్లికి తండ్రి రెడీ అవుతాడు. అప్పుడు రాజా ఏం చేశాడు? ఏం జరిగింది? అన్నది మలుపుల మధ్య నడిచే వలపు కథ.
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో లవ్ స్టోరీ -అన్న టాగ్ చాలు, ఆడియన్స్‌లో ఆసక్తి రేకెత్తించడానికి. అమాయక ప్రేమ, వ్యక్తం చేయడానికి భయం, పెద్దలకు చెప్పుకోలేని సంకోచం, పర్యావసాన సంఘర్షణలో ధైర్యాన్నిచ్చే దోస్తులు, యాసనుంచి పుట్టుకొచ్చే వెటకారపు హాస్యం.. ఇవన్నీ ఊహించుకుంటూ థియేటర్‌లోకి అడుగు పెట్టిన ఆడియన్స్‌కి -అన్నీ స్క్రీన్‌పై కనిపించాయి. కాకపోతే -జీవం లేదంతే. లవ్‌స్టోరీలపై ప్రేక్షకుడి పట్టు తక్కువేం కాదు. అలాంటి ప్రేక్షకుడిని -ఓ ప్రేమ కథ, అందులోనూ పల్లె కథతో మెప్పించాలంటే దర్శకుడికి ‘సృజనాత్మక అనుభవం’ ఉండాలి. కొత్త దర్శకుడు రవికిరణ్ కోలాకి అదే కరవైంది. సినిమాను పండించే లేయర్లెన్నోవున్నా -వాటిని పదునుగా ప్రయోగించటంలో విఫలమయ్యాడు. అందుకే దర్శకుడి ప్రయత్నాన్ని మెచ్చుకున్నా -్ఫలితాన్ని ఎక్కువ చేసి చెప్పలేం. తక్కువ పాత్రలతో కథ చెప్పడానికి సాహసించిన దర్శకుడు -మనసుకు పట్టే కథనంతో సన్నివేశాలు అల్లుకుంటే మరోలా ఉండేది. పల్లెటూరి ప్రేమలోని స్వచ్ఛత, గాఢత.. ఏ సన్నివేశంలోనూ ఆడియన్స్‌కి అందలేదు. ఫస్ట్ఫా ఆరంభంలోనే హీరోయిన్ ఊరుదాటేస్తే -ఊరుదాటని హీరో కథ ఎడారి భావన కలిగించింది తప్ప, అందులోని ఒయాసిస్ చల్లదనాన్ని చూపించలేకపోయింది. విడిపోయిన హీరో హీరోయిన్లు మళ్లీ ఒక ఫ్రేమ్‌లోకి వచ్చేవరకూ -ప్రేక్షకుడు పాప్‌కార్న్‌తో కాలక్షేపం చేయక తప్పలేదు. హీరో అనుభూతిని ఆవిష్కరించే విషయంలో ఆడియన్స్ ఆదుర్దాను దర్శకుడు అర్థం చేసుకునివుంటే -కాలయాపనకు కెమెరా అడ్డుపెట్టి ఉండేవాడేమో.
ప్రేమించిన అమ్మాయి దగ్గర పెదవి విప్పలేకపోయే పల్లెటూరి కుర్రాడి కథలు తెలుగులో లెక్కలేనన్ని. అయినా ఎంజాయ్ చేయడానికి ఆడియన్స్ రెడీ అవుతున్నారంటే -కంటెంట్ బలం అలాంటిది. అలాంటి కంటెంట్ తీసుకునీ -బలహీన కథనంతో సాధారణ కథగా మార్చేశాడు దర్శకుడు. ఫస్ట్ఫాలో సాగదీతను కుదించి, సెకెండాఫ్‌లో ఎమోషనల్ మూడ్‌ని పెంచివుంటే -రాజా రాణీల కథ మరో మెట్టుపైనుండేదే.
దర్శకుడి కష్టాన్ని భుజానికెత్తుకోడానికి -లీడ్‌రోల్స్ అనుభవం సరిపోలేదు. హీరో హీరోయిన్ కిరణ్, రహస్యలు.. దర్శకుడు చెప్పిందే చేశారు తప్ప.. ఇంప్రొవైజ్డ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. ఇద్దరూ కొత్తవాళ్లు కావడంతో పాత్రల్ని పండించేంతటి అనుభవం వాళ్లనుంచి ఆశించలేం. హీరో, అతని స్నేహితుల మధ్య సాగే కొద్దిపాటి సన్నివేశాలే ఆడియన్స్‌కి ఒకింత రిలీఫ్. కొత్తవాళ్లే అయినా కామెడీ టైమింగ్, మ్యానరిజమ్‌లో చౌదరి, నాయుడు పాత్రధారులు రాజ్‌కుమార్, యజుర్వేద్ మెప్పించారు. అక్కడక్కడా నవ్వించారు కూడా. హీరోయిన్ తండ్రి పాత్రకు పడిన కొన్ని డైలాగులు -ఆ పాత్రను గుర్తుంచుకునేలా అనిపిస్తుంది. ఓవరాక్షన్‌కు దూరంగా -మిగిలిన ఆర్టిస్టులు పాత్ర పరిధికే పరిమితం కావడం సహజత్వానికి దగ్గరగానే ఉన్నామన్న భావన మాత్రం మిగిల్చింది. ‘నీవై నేనై సాగే’ పాట సంగీత దర్శకుడు జై క్రిష్‌కు మంచి పేరుతెస్తుంది. మిగిలిన బాణీలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ -గ్రామీణ నేపథ్య సినిమా ఫీల్‌ను తేలేకపోయింది. హీరో-ఫ్రెండ్స్ కాంబినేషన్‌లో చాలా సన్నివేశాలకు ఎడిటర్ కత్తెరవేసివుంటే -సాగదీతకు స్కోప్ లేకుండా ఉండేది. ఆడియన్స్ మరింత బోర్ ఫీలవ్వకుండా పల్లె అందాలను హృద్యంగా ఆవిష్కరించటంలో సినిమాటోగ్రఫీ (అమర్‌దీప్, విద్యాసాగర్) పనితనం కాపాడింది. ‘అప్పుడు దూరంగా వెళ్తున్నట్టనిపించింది. ఇప్పుడు దూరమవుతున్నట్టు అనిపిస్తోంది’, ‘ఇష్టపడటం తెలుసు.. బయటపడటం తెలీదు’ లాంటి సంభాషణా చమత్కారాలు గుర్తుంచుకోదగ్గవే. ప్రేమ ఓ పరిమళం. ఆ సుగంధాన్ని అందరికీ అందిద్దామన్న నిర్మాత అభిరుచిని కచ్చితంగా మెచ్చుకుని తీరాలి.

-ప్రసాద్