రుచి

పర్వదినాల్లో పసందుగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి నుంచే బతుకమ్మ పండుగ మొదలు. పిల్లలకు సెలవులు కూడా.. ఇక ప్రతి ఇంట్లో ఆడపడుచుల పాటలు, నృత్యాలతో పిల్లలు కేరింతలు కూడా జతై పండుగ మరింత ఆనందంగా మారుతుంది. మరి ఇంత సందడిలో పిండి వంటల ఘుమఘుమలు లేకపోతే ఎలా..? అదీ సంప్రదాయ పిండి వంటలు ఉంటే ఆ మజాయే వేరు.. మరి ఆ వంటలను ఒకసారి
చూసేద్దామా..

కజ్జికాయలు

కావలసిన పదార్థాలు

మైదా: ఒక కప్పు
బొంబాయిరవ్వ: అర చెంచా
ఉప్పు: కొద్దిగా
నూనె కొద్దిగా
పుట్నాలపొడి: అరకప్పు
నువ్వులపొడి: అరకప్పు
ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి పొడి: కప్పు
పంచదార: రెండు కప్పులు
యాలకులపొడి: కొద్దిగా
జీడిపప్పు: అరకప్పు

తయారుచేసే విధానం

మైదాపిండిలో ఉప్పు, కొద్దిగా రవ్వ, నూనె వేసి చపాతీపిండిలా కలిపి గంటసేపు నాననివ్వాలి. స్టవ్‌పై బాణలి ఉంచి అందులో బొంబాయిరవ్వను వేసి దోరగా వేయించాలి. ఇది చల్లారిన తరువాత ఇందులో పుట్నాలపొడి, నువ్వులపొడి, కొబ్బరి, పంచదార, యాలకులపొడి, వేయించిన జీడిపప్పు పలుకులు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ముందుగా కలిపి ఉంచుకున్న మైదాపిండిని పూరీల్లా వత్తుకుని అందులో కొబ్బరి మిశ్రమాన్ని ఉంచి అంచులకు నీరు రాసి కజ్జికాయల అచ్చులో పెట్టి కజ్జికాయల్లా చేసుకుని పెట్టుకోవాలి. ఇలా అన్ని కజ్జికాయలు చేసుకున్న తరువాత స్టవ్‌పై నూనెను ఉంచి కాగాక కజ్జికాయలను వేసి దోరగా వేయించుకుని తీసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన కజ్జికాయలు తయారు.

సర్వపిండి

కావలసిన పదార్థాలు

బియ్యప్పిండి: రెండు కప్పులు
కారం: చిన్న చెంచా
పచ్చిమిర్చి: నాలుగు
ఉప్పు: తగినంత
పసుపు: చిటికెడు
కరివేపాకు: నాలుగు రెబ్బలు
సెనగపప్పు: రెండు చెంచాలు
జీలకర్ర: సగం చెంచా
కొత్తిమీర తురుము: తగినంత
నువ్వులు: ఒక చెంచా
కారెట్: ఒకటి
పాలకూర: కొద్దిగా

తయారుచేసే విధానం

కారెట్‌ను, పాలకూరను సన్నగా తరిగిపెట్టుకోవాలి. పాలకూరను బాగా కడిగి ఉంచుకోవాలి. బియ్యప్పిండిలో అన్ని పదార్థాలను వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. తరువాత పెనంపై నూనె రాసి పిండి ముద్దను పెనంపై ఉంచి వేళ్లతో కాస్త మందంగా చపాతీలా వత్తాలి. మధ్యలో నాలుగైదు రంధ్రాలు పెట్టి నూనె వేసి రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన సర్వపిండి రెడీ.. ఇందులో కారెట్, పాలకూరలను వేయడం వల్ల పిల్లలకు పౌష్టికాహారాన్ని కూడా అందించినట్లవుతుంది.

మలిదలు

కావలసిన పదార్థాలు

గోధుమపిండి: ఒక కప్పు
నెయ్యి: నాలుగు చెంచాలు
బెల్లం: అరకప్పు
పిస్తా: పది
బాదం: పది
జీడిపప్పు: పది
ఖర్జూరాలు: పది
సోంపు: చిన్న చెంచా
యాలకులు: ఐదు

తయారుచేసే విధానం

గోధుమపిండిలో తగినన్ని నీళ్లు కలిపి చపాతీపిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని చపాతీలా ఒత్తుకుని పెనంపై వేసి నెయ్యితో కాల్చుకోవాలి. తరువాత ఈ చపాతీలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీలోకచ్చాపచ్చాగా బ్లెండ్ చేయాలి. వీటిని ఓ పెద్ద బౌల్‌లోకి తీసుకోవాలి. తరువాత అన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌ని మిక్సీలో వేసుకుని కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకుని వీటిని కూడా చపాతీ మిశ్రమంలో కలపాలి. తరువాత మిక్సీలో సోంపు, యాలకలను వేసి మెత్తని పొడిలా చేసుకుని దీన్ని కూడా మిశ్రమంలో కలపాలి. తరువాత ఈ మిశ్రమంలో బెల్లం, నెయ్యి వేసి లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే ఎంతో ఆరోగ్యానిచ్చే మలిదలు తయారు. వీటిని వరిపిండితో కూడా చేసుకోవచ్చు. ఇవి పదిహేను రోజుల వరకు చెడిపోకుండా ఉంటాయి.

డ్రై ఫ్రూట్స్ లడ్డు

కావలసిన పదార్థాలు

జీడిపప్పు: పావు కప్పు
బాదాం: పావు కప్పు
పిస్తా: పావు కప్పు
ఓట్స్: అరకప్పు
వాల్‌నట్స్: ఐదు
ఎండు అంజీరాలు: ఎనిమిది
ఖర్జూరం : పదిహేను
నువ్వులు: రెండు పెద్ద చెంచాలు
అవిసెగింజలు: రెండు పెద్ద చెంచాలు
యాలకులపొడి: అర టీ స్పూన్
బెల్లం తురుము: రెండు కప్పులు
నెయ్యి: తగినంత

తయారుచేసే విధానం

ఎండు అంజీరాలు, ఖర్జూరాలను చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. ఓట్స్‌ను రెండు నిముషాల పాటు దోరగా వేయించుకోవాలి. తరువాత అవిసెగింజలు, నువ్వులు, జీడిపప్పు, బాదాం, పిస్తా, వాల్‌నట్స్ అన్నింటిని దోరగా వేయించుకుని అన్నింటినీ కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకుని ఓ పెద్ద బౌల్‌లో వేసుకోవాలి. ఇందులోనే ఓట్స్, అంజీరా, ఖర్జూరాల ముక్కలను కూడా వేసుకోవాలి. బెల్లం తురుము కూడా ఈ మిశ్రమంలో వేసి బాగా కలిపి పాన్‌లో వేసుకుని మూడు నిముషాల పాటు సిమ్‌లో వేయించాలి. ఇందులో యాలకులపొడి కలిపి దించి నెయ్యివేయాలి. ఆరిన తరువాత నెయ్యి అద్దుకుంటూ లడ్డూలు చుట్టుకోవాలి. అంతే ఎంతో ఆరోగ్యాన్నిచ్చే డ్రై ఫ్రూట్ లడ్డూలు తయారీ. ఇందులో ఇన్ని రకాల పౌష్టిక పదార్థాలు వేశాక ఇది పిల్లలకు మంచిదని వేరే చెప్పాలా!

సకినాలు

కావలసిన పదార్థాలు

కొత్త బియ్యం: రెండు కప్పులు
నువ్వులు: పావు కప్పు
వాము: రెండు చిన్న చెంచాలు
నూనె: తగినంత
ఉప్పు: తగినంత

తయారుచేసే విధానం

ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత వడగట్టి తడిసిన బియ్యాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బేటప్పుడు మెత్తగా అయ్యేందుకు కొద్దిగా నీటిని చిలకరించుకోవాలి. అయితే పిండి అతి గట్టిగా కాకుండా, పలుచగా కాకుండా చూసుకోవాలి. ఇందులో నువ్వులు, వాము, ఉప్పు వేసి బాగా కలపాలి. శుభ్రమైన వస్త్రంపై పిండితో గుండ్రంగా మెలితిప్పుతూ నచ్చినన్ని చుట్లను చుట్టాలి. ఇవి ఓ గంట ఆరిన తరువాత వీటిని నూనెలో వేసి దోరగా వేయించుకుని తీయాలి. అంతే కరకరలాడే సకినాలు రెడీ.

సకినాలను సంక్రాంతికి ప్రత్యేకంగా చేసే పిండి వంటకం. కానీ దసరా సెలవుల్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వారికోసం ప్రత్యేకంగా చేస్తారు తల్లులు.