రుచి

టిక్కా రుచే వేరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదైనా హోటల్‌కి వెళ్లినా, ఆదివారం రోజు సాయంత్రాలు ఇంట్లో స్నాక్స్ ఏదైనా తినాలన్నా చాలామంది ఓటు స్టాటర్స్ వైపే ఉంటుంది. అవైతే రుచిగా, మసాలాలు అవీ లేకుండా హాయిగా ఉంటాయి. అంతేకాదు ఇవి నూనెలో వేయించకుండా నిప్పుల్లోనే, మైక్రోవేవ్స్‌లోనే చేయడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. అలాంటి రకరకాల టిక్కాల తయారీని చూద్దాం!

రొయ్యలతో..

కావలసిన పదార్థాలు
రొయ్యలు: ముప్పావు కిలో
కొత్తిమీర తరుగు: చెంచా
నిమ్మరసం: ఒకటిన్నర చెంచా
పెరుగు: పావుకప్పు
అల్లం వెల్లుల్లి ముద్ద: ఒకటిన్నర చెంచా
నూనె: చెంచా
కారం: పావు చెంచా
ఉప్పు: తగినంత
మొక్కజొన్నపిండి: పావుకప్పు
తయారుచేసే విధానం
ముందుగా రొయ్యల్ని బాగా శుభ్రం చేసుకోవాలి. వీటిపై మొక్కజొన్న పిండి తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఇరవై నిముషాల తర్వాత వీటిపై మొక్కజొన్న పిండి వేసి మరోసారి కలపాలి. ఈ రొయ్యల్ని ఇనుప చువ్వలకు గుచ్చి.. నిప్పులపై లేదా గ్రిల్ పద్ధతిలో మైక్రోవేవ్‌లో కాల్చుకోవాలి.

మటన్‌తో..
కావలసిన పదార్థాలు
మటన్ ముక్కలు: అరకిలో
మిరియాల పొడి: ఒక చెంచా
ఉప్పు: తగినంత
గరం మసాలా: అరచెంచా
బొప్పాయి గుజ్జు: పెద్ద చెంచా
ధనియాలపొడి: అరచెంచా
వెల్లుల్లి ముద్ద: చెంచా
నూనె: పావు కప్పు
గులాబీ రేకల పొడి: చెంచా
పెరుగు: పావు కప్పు
యాలకులపొడి: చెంచా
లవంగాలపొడి: అరచెంచా
తయారుచేసే విధానం
మటన్‌ను బాగా కడిగి కావలసిన పదార్థాలన్నింటినీ ఓ గినె్నలోకి తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. ఓ అరగంట నానిన తరువాత ఈ ముక్కల్ని ఇనుప చువ్వలకు గుచ్చి.. గ్రిల్ పద్ధతిలో మైక్రోవేవ్‌లో గానీ, బార్బీక్యూ పద్ధతిలో నిప్పులపై కానీ కాల్చుకుని తింటే ఆ రుచే వేరు..

చికెన్‌తో..
కావలసిన పదార్థాలు
బోన్‌లెస్ చికెన్: అరకేజీ
సెనగపిండి: ఒకటిన్నర చెంచాలు
పెరుగు: కప్పు
కారం: చెంచా
మిరియాలపొడి: అరచెంచా
గరం మసాలా: అరచెంచా
పసుపు: పావుచెంచా
ఉప్పు: తగినంత
ధనియాలపొడి: అరచెంచా
కసూరీమేథీ: అరచెంచా
నిమ్మరసం: ఒక చెంచా
బిర్యానీ మసాలా: అరచెంచా
తయారుచేసే విధానం
చికెన్‌ను బాగా శుభ్రం చేసుకోవాలి. తరువాత పదార్థాలన్నింటినీ ఒక గినె్నలో వేసి బాగా కలపాలి. ఇందులోనే చికెన్‌ను కూడా వేసి ముక్కలకు మసాలా పట్టేలా కలపాలి. ఈ గినె్నను ఫ్రిజ్‌లో గంటసేపు ఉంచాలి. తరువాత దీన్ని బయటకు తీసి ఇనుప చువ్వలకు గుచ్చి నిప్పులపై కాల్చాలి. అంతే ఎంతో రుచికరమైన చికెన్ టిక్కా రెడీ.

కీమాతో..
కావలసిన పదార్థాలు
కీమా: పావుకిలో
పెరుగు: పావుకప్పు
అల్లం వెల్లుల్లి ముద్ద: ఒకచెంచా
పచ్చిమిర్చి ముద్ద:
ఒకచెంచా
పసుపు:
పావుచెంచా
జీలకర్రపొడి:
అరచెంచా
నూనె: రెండు చెంచాలు
నిమ్మరసం: మూడు చెంచాలు
జీడిపప్పు ముద్ద: అరకప్పు
మిరియాలపొడి: అరచెంచా
యాలకులపొడి: అరచెంచా
వేయించిన శనగపిండి: పావుకప్పు
ఉప్పు: తగినంత
గుడ్డు: ఒకటి
తయారుచేసే విధానం
కీమాను బాగా శుభ్రం చేసుకోవాలి. ఇందులో కావలసిన పదార్థాలన్నింటినీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని అరగంట పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఉండల్లా చేసి ఇనుప చువ్వలకు గుచ్చి నిప్పులపై పది నిముషాల పాటు కాల్చాలి. తరువాత వీటిని పుదీనా చట్నీతో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి.

వెజిటబుల్స్‌తో..

కావలసిన పదార్థాలు
ఉడికించిన బంగాళా
దుంపలు: నాలుగు
బ్రెడ్ పొడి:
రెండు చెంచాలు
మైదా: అరకప్పు
పనీర్: కప్పు
క్యాబేజీ తరుగు: కప్పు
కాలీఫ్లవర్ తరుగు:
కప్పు
పచ్చిమిర్చి: రెండు
అల్లం తరుగు: చెంచా
వెన్న: రెండు చెంచాలు
కొత్తిమీర తరుగు: కప్పు
కారం: అరచెంచా
పసుపు: పావుచెంచా
ఉప్పు: తగినంత
నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం
బంగాళాదుంపల్ని ఓ గినె్నలో తీసుకుని మెత్తగా చేయాలి. అందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని బాగా కలిపి మూత పెట్టేయాలి. ఐదు నిముషాలయ్యాక ఈ మిశ్రమాన్ని టిక్కీల ఆకృతిలో వచ్చేలా చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె వేడి చేయాలి. అందులో రెండు చొప్పున టిక్కీలు వేసుకుని ఎర్రగా కాల్చుకోవాలి. వీటిని పుదీనా లేదా కొత్తిమీర చట్నీతో కలిపి తింటే చాలా బాగుంటుంది.

చేపలతో..
కావలసిన పదార్థాలు
చేపముక్కలు: అరకిలో
నూనె: ముప్పావుకప్పు
పెరుగు: కప్పు
కారం: చెంచా
గరంమసాలా: చెంచా
అల్లం వెల్లుల్లి ముద్ద: చెంచా
ఉప్పు: తగినంత
నిమ్మరసం: రెండు చెంచాలు
మొక్కజొన్నపిండి: పావుకప్పు
తయారుచేసే విధానం
చేపలను బాగా శుభ్రం చేసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఓ గినె్నలోకి తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. వీటిలోనే చేపలను కూడా వేసి బాగా కలపాలి. అరగంట తరువాత సగం నూనె వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు ఈ చేప ముక్కలను ఇనుప చువ్వలకు గుచ్చాలి. మైక్రోవేవ్ లేదా బార్బీక్యూ పద్ధతిలో చేసుకోవడం ఇష్టం లేనివారు.. స్టవ్‌పై పెనం పెట్టి వేడిచేయాలి. దానిపై ఈ చువ్వల్ని ఉంచి.. నూనె వేసి ఎర్రగా కాల్చుకోవాలి. అంతే పిల్లలు ఇష్టంగా తినేస్తారు.