రుచి
అమ్మవారికి ఆరగింపు ఇలా..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం..’ అంటూ ప్రతిరోజూ శ్రావణలక్ష్మిని మనసారా పూజించే నెల ఇది. మరి వరలక్ష్మీ వ్రతం రోజున.. ఆ పండక్కి పరిపూర్ణత తెచ్చే నైవేద్యాల సంగతేంటి? ఎప్పుడూ వండుకునే చింతపండు పులిహోర, సేమియా పాయసం, క్షీరాన్నం.. వంటివి కాకుండా ఈసారి భిన్నంగా చేసుకునేందుకు ప్రయత్నిద్దాం.. అమ్మవారికి ఆరగింపు చేద్దాం..
దబ్బకాయ, వాక్కాయ పులిహోర
కావలసిన పదార్థాలు
అన్నం: రెండు కప్పులు
దబ్బకాయ: ఒకటి
వాక్కాయలు: పదిహేను
ఉప్పు: తగినంత
నూనె: పావు కప్పు
పసుపు: పావు చెంచా
తాలింపు గింజలు:
రెండు చెంచాలు
ఎండుమిర్చి: ఆరు
పచ్చిమిర్చి: పది
కరివేపాకు రెబ్బలు:
రెండు
పల్లీలు: పావుకప్పు
ఇంగువ: పావు చెంచా
తయారుచేసే విధానం
దబ్బకాయ రసాన్ని ఒక గినె్నలోకి తీసి పెట్టుకోవాలి. వాక్కాయల్ని చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిని పొయ్యిపై పెట్టి నూనె వేడిచేయాలి. అందులో తాలింపు గింజలు, పల్లీలు వేయాలి. అవి వేగాక ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, ఇంగువ వేయించుకోవాలి. రెండు, మూడు నిముషాల తరువాత తగినంత ఉప్పు, పసుపు, వాక్కాయ తరుగు వేయాలి. ఇది కాస్త మగ్గాక మంట తగ్గించి అన్నాన్ని ఇందులో వేసి బాగా కలిపి స్టవ్ కట్టేయాలి. చివరగా ఇందులో దబ్బకాయ రసం వేసి మరోసారి కలిపితే పులిహోర తయారు అయినట్లే..
క్యారెట్ హల్వా బూరెలు
కావలసిన పదార్థాలు
క్యారెట్లు: నాలుగు
బెల్లం: రెండు కప్పులు
మినపప్పు: అర గ్లాసు
బియ్యం: గ్లాసు
ఉప్పు: కొద్దిగా
నూనె: వేయించడానికి సరిపడా
యాలకులపొడి: అరచెంచా
నెయ్యి: రెండు చెంచాలు
జీడిపప్పు: పది
తయారుచేసే విధానం
నాలుగు గంటలపాటు మినపప్పు, బియ్యాన్ని నానబెట్టుకుని, మెత్తగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. క్యారెట్‌లను సన్నగా తురుముకోవాలి. స్టవ్‌పై బాణలి ఉంచి అందులో నెయ్యివేసి జీడిపప్పులను దోరగా వేయించి పక్కకు తీసుకోవాలి. ఇందులోనే క్యారెట్ తరుము కూడా వేసి వేయించుకోవాలి. తురుము కాస్త వేగాక మరో గినె్నలోకి తీసుకోవాలి. అదే బాణలిలో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోయాలి. బెల్లం కరిగి ఉండపాకం వచ్చాక ముందుగా వేయించి పెట్టుకున్న క్యారెట్ తురుము కలపాలి. ఇది హల్వాలా అయ్యాక యాలకులపొడి, ముందుగా వేయించిపెట్టుకున్న జీడిపప్పు వేసి దించేయాలి. ఈ హల్వా చల్లారాక ఉండల్లా చేసుకోవాలి.
తరువాత స్టవ్‌పై మరో బాణలిని ఉంచి నూనె పోసుకోవాలి. మినపప్పు మిశ్రమంలో కొద్దిగా ఉప్పు కలుపుకోవాలి. క్యారెట్ హల్వా ఉండల్ని మినపప్పు మిశ్రమంలో ముంచి కాగుతున్న నూనెలో వేసుకోవాలి. ఇవి బంగారు రంగు వచ్చేంతవరకు వేయించి తీసుకుని అమ్మవారికి నివేదిస్తే సరి.
కరకజ్జం
కావలసిన పదార్థాలు
సెనగపిండి: కప్పు
బెల్లం: కప్పు
నూనె: వేయించుకోవడానికి సరిపడా
ఉప్పు: కొద్దిగా
నెయ్యి: రెండు చెంచాలు
తయారుచేసే విధానం
సెనగపిండిలో కొద్దిగా ఉప్పు వేసుకుని నీళ్లు పోస్తూ జంతికల పిండిలా కలుపుకోవాలి. బాణలిలో వేయించేందుకు సరిపడా నూనె తీసుకుని వేడిచేసుకోవాలి. ఇప్పుడు సెనగపిండి ముద్దను జంతికల గొట్టంలోకి తీసుకుని కాగుతున్న నూనెలో జంతికల్లా వేసుకుని ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. మరో గినె్నలో బెల్లం తరుగు తీసుకుని అది మునిగేవరకు నీళ్లు పోసుకోవాలి. ఇది ఉండపాకం వచ్చాక వేయించుకున్న జంతికల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని అందులో వేసేయాలి. నిముషం తరువాత స్టవ్ ఆపేయాలి. పాకం జంతికలకు పట్టేలా కలిపి నెయ్యి రాసిన పళ్లెంలోకి ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. కాస్త చల్లారాక ముక్కల్లా వస్తాయి.
తంబిట్టు
కావలసిన పదార్థాలు
గోధుమపిండి: కప్పు
బెల్లం: కప్పు
నెయ్యి: ముప్పావు కప్పు
నీళ్లు: సరిపడా
జీడిపప్పు: అరకప్పు
తయారుచేసే విధానం
ఒక పాన్‌ను తీసుకుని అందులో కొద్దిగా నెయ్యివేసి వేడయ్యాక అందులో కప్పు గోధుమపిండి వేసి దోరగా వేయించాలి. మరో పాన్‌లో రెండు కప్పుల నీళ్లు పోసి మరిగేటప్పుడు తురిమిన బెల్లం వేసి కరిగేవరకూ ఉడికించాలి. తర్వాత బెల్లం నీరు ఫిల్టర్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు పాన్‌లో బెల్లం నీళ్లు పోసి మరిగిన తరువాత వేయించి పెట్టుకున్న గోధుమపిండిని వేసి బాగా కలియబెట్టాలి. ఉండలు కట్టకుండా బాగా కలపాలి. తరువాత ఐదు నిముషాలు పక్కన పెట్టాలి. ఇందులో వేయించిన జీడిపప్పులు కూడా వేయాలి. తరువాత చేతికి నెయ్యి రాసుకుని రెండు అరచేతులకు బాగా మర్దన చేసుకుని పిండిని కొద్దికొద్దిగా తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. అంతే వర మహాలక్ష్మికి అరగింపుచేసే స్పెషల్ అండ్ టేస్టీ తంబిట్టు తయారు.
గుమ్మడి బూరెలు
కావలసిన పదార్థాలు
తీపి గుమ్మడి తురుము: కప్పు
బెల్లం తురుము: కప్పు
యాలకుల పొడి: చెంచా
జీడిపప్పులు: పది
నెయ్యి: పావు కప్పు
మినపప్పు: కప్పు
బియ్యం: రెండు కప్పులు
ఉప్పు: చిటికెడు
నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
మినపప్పు, బియ్యం కలిపి నాలుగు గంటల పాటు నానబెట్టి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. గుమ్మడి తురుమును శుభ్రమైన వస్త్రంలో మూటలా కట్టి దానిపై బరువు పెట్టాలి. కాసేపటికి అందులోని నీరంతా పోతుంది. తరువాత స్టవ్‌పై బాణలిపెట్టి కొద్దిగా నెయ్యివేసి జీడిపప్పులను దోరగా వేయించి తీసేయాలి. అదే బాణలిలో మిగిలిన నెయ్యి కరిగించి గుమ్మడి తురుము వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. దీనికి బెల్లం తురుము వేసి కలుపుతూ ఉంటే కాసేపటికి అది గట్టి పడుతుంది. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు కలిపి దింపేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ముందుగా రుబ్బి పెట్టుకున్న పిండిలో ఉప్పు వేసి కలుపుకోవాలి. స్టవ్‌పై బాణలిని ఉంచి నూనె వేసి వేడిచేయాలి. గుమ్మడి తురుము ఉండల్ని ఒక్కోటి చొప్పున పిండిలో ముంచి కాగే నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసుకోవాలి. అంతే గుమ్మడి బూరెలు రెడీ.
రవ్వ పాయసం
కావలసిన పదార్థాలు
రవ్వ: కప్పు
నీళ్లు: రెండు కప్పులు
పాలు: మూడు కప్పులు
నెయ్యి: రెండు చెంచాలు
జీడిపప్పు: పావు కప్పు
బాదం పప్పు: పావు కప్పు
ద్రాక్ష: పావు కప్పు
పంచదార: రెండు కప్పులు
తయారుచేసే విధానం
ముందుగా మందపాటి పాన్‌ను తీసుకుని స్టౌపై ఉంచి అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసి వేడిచేయాలి. ముందుగా అందులో జీడిపప్పు, బాదం, ద్రాక్షలను వేసి దోరగా వేయించుకుని తీసేసుకోవాలి. అదే నెయ్యిలో రవ్వ వేసి దోరగా వేయించుకోవాలి. దీన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఇందులో నీళ్లను తీసుకుని బాగా మరిగించాలి. నీళ్లు మరిగేటప్పుడు వేయించుకున్న రవ్వ వేయాలి.
రవ్వ ఉడుకుతున్న సమయంలో అందులో పాలు పోసి మొత్తం మిశ్రమాన్ని కలియబెడుతూ ఉడికించుకోవాలి. రవ్వ మెత్తగా ఉడికిన తరువాత అందులో మిగిలిన నెయ్యి, వేయించుకున్న జీడిపప్పు, బాదంపప్పు, ద్రాక్షలను వేసుకోవాలి. తరువాత పంచదార వేయాలి. అది కరిగేంత వరకు ఉంచి దింపేయలి. అంతే రవ్వ పాయసం రెడీ.