రుచి

పుట్టగొడుగులతో పసందుగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజూ ఒకేరకం కూరలు తినాలంటే అందరికీ బోరుకొడుతుంది. రోజూ కూరగాయల వంటలు తినాలంటే కూడా ఇబ్బంది పడతారు. అలాగని మాంసం వంటకాలను తినలేరు కదా.. అలాంటివారి కోసమే అనేక పోషకాలు కలిగిన పుట్టగొడుగులు ఉన్నాయి.
వీటిని రకరకాల వంటలుగా చేసుకుని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.
మరి చూసేద్దామా.. ఆ పోషకాల వంటలేవో చూసేద్దామా..
*
వేపుడు
కావలసిన పదార్థాలు
పుట్టగొడుగులు: పావు కేజీ
జీడిపప్పు: పది ఉల్లిపాయ: ఒకటి
టొమాటో: ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక చెంచా
పచ్చిమిర్చి: ఒకటి
కరివేపాకు: రెండు రెబ్బలు
ఆవాలు: పావు చెంచా జీలకర్ర: అర చెంచా
నూనె: సరిపడా కారం: అర చెంచా
పసుపు: చిటికెడు
గరం మసాలా: ఒక చెంచా ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలను కట్ చేసుకోవాలి. జీడిపప్పు పలుకులను పావుగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరికాసేపు వేగించాలి. తరువాత ఉల్లిపాయలు వేయాలి. టొమాటో ముక్కలు వేసి మరికాసేపు వేగనివ్వాలి.
పసుపు, కారం, గరం మసాలా, కరివేపాకు వేసి ఇంకాసేపు వేయించాలి. ఇప్పుడు పుట్టగొడుగులు, జీడిపప్పు, తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. చిన్న మంటపై ఉడికించుకోవాలి. కావాలనుకుంటే నిమ్మరసం పిండుకోవచ్చు. పుట్టగొడుగులు ఉడికిన తరువాత దింపుకుని సర్వ్ చేసుకోవాలి. ఇది చపాతీలోకి లేక అన్నంలోకి ఈ పుట్టగొడుగుల ఫ్రై రుచిగా ఉంటుంది.
*
చిల్లీ ఫ్రై

కావలసిన పదార్థాలు
పుట్టగొడుగులు: పది
నూనె: రెండు చెంచాలు
ఎండుమిర్చి: ఒకటి జీలకర్ర: అర చెంచా
కరివేపాకు: కొద్దిగా పచ్చిమిర్చి: నాలుగు
ఉల్లిపాయ: ఒకటి
అల్లం వెల్లుల్లి ముద్ద: ఒక చెంచా
జీలకర్ర పొడి: అర చెంచా
ధనియాల పొడి: అర చెంచా
పసుపు: చిటికెడు ఉప్పు: తగినంత
వెనిగర్: మూడు చెంచాలు
మిరియాల పొడి: కొద్దిగా
కొత్తిమీర: ఒక కట్ట
తయారుచేసే విధానం
ఒక పాన్ తీసుకుని నూనె వేసి కాస్త వేడయ్యాక ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి వేగించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి మరికాసేపు వేగనివ్వాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేగించాలి. తరువాత ఇందులో పసుపు, కట్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగులు వేసి కలుపుకోవాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి మరికాసేపు వేగించాలి. చివరగా వెనిగర్ వేసి మరికాసేపు వేయించుకుని దించేయాలి. తరువాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మష్రూమ్ చిల్లీ ఫ్రై రెడీ.
*
బఠాణీతో..
కావలసిన పదార్థాలు
పుట్టగొడుగు ముక్కలు: రెండు కప్పులు
పచ్చి బఠాణీ: కప్పు
టొమాటో ముక్కలు: కప్పు
అల్లం తరుగు: చెంచా
మెంతికూర: కట్ట
నూనె: రెండు చెంచాలు
జీలకర్ర: చెంచా
పసుపు: అరచెంచా
ధనియాల పొడి: రెండు చెంచాలు
కారం: చెంచా
ఉప్పు: తగినంత
నిమ్మరసం: అర చెంచా
తయారుచేసే విధానం
స్టవ్‌పై బాణలిని ఉంచి నూనె వేయాలి. కాగిన తరువాత జీలకర్ర వేయాలి. రెండు నిముషాల తరువాత టొమాటో ముక్కలు, పసుపు, అల్లం తరుగు, తగినంత ఉప్పు, ధనియాల పొడి, కారం వేసి మంట తగ్గించాలి. కాసేపటికి టొమాటోలు మెత్తగా అవుతాయి. అప్పుడు పుట్టగొడుగు ముక్కలు, పచ్చి బఠాణీలు, మెంతికూర, కాసిని నీళ్లు పోసి మూత పెట్టాలి. పుట్టగొడుగులు మెత్తగా అయ్యాక నిమ్మరసం వేసి దింపేస్తే చాలు.. ఎంతో రుచికరమైన కర్రీ రెడీ. ఇది అన్నంలోకే కాదు.. రొట్టెల్లోకీ బాగుంటుంది.
*
పెప్పర్‌తో..

కావలసిన పదార్థాలు
పుట్టగొడుగులు: అరకిలో
ఉల్లిపాయ: ఒకటి టొమాటో: ఒకటి
అల్లం వెల్లుల్లి ముద్ద: ఒక చెంచా
వెల్లుల్లి: నాలుగు రెబ్బలు
పచ్చిమిర్చి: ఒకటి
ధనియాల పొడి: ఒక చెంచా
కారం: అర చెంచా పసుపు: చిటికెడు
గరం మసాలా: చిటికెడు
నూనె: రెండు చెంచాలు
ఆవాలు: పావు చెంచా ఉప్పు: తగినంత
మిరియాలు: చెంచా జీలకర్ర: పావు చెంచా
నిమ్మరసం: అర చెంచా
కొత్తిమీర: కట్ట కరివేపాకు: రెండు రెబ్బలు
తయారుచేసే విధానం
వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, జీలకర్ర కచ్చాపచ్చాగా నూరి పక్కన పెట్టుకోవాలి. తరువాత బాణలిని స్టవ్‌పై ఉంచి నూనె వేయాలి. నూనె వేడక్కాక ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేగాక కోసిన పుట్టగొడుగు ముక్కలు వేసి మూతపెట్టి ఉడికించుకోవాలి. అవి ఉడికిన తరువాత పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. నీళ్లన్నీ ఆవిరైపోయిన తరువాత ముందుగా తయారుచేసి పెట్టుకున్న వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ఇది రెండు నిముషాల మగ్గిన తరువాత నిమ్మరసాన్ని పిండి, కొత్తిమీర తురుము చల్లితే సరి.. ఎంతో రుచికరమైన పెప్పర్ మష్రూమ్ మసాలా తయారు.
*
ఊతప్పం

కావలసిన పదార్థాలు
బియ్యం: అరకేజీ
పుట్టగొడుగులు: 30 గ్రాములు
మినపప్పు: పావుకేజీ
శనగపప్పు: 100గ్రాములు
ఉప్పు: రుచికి తగినంత
మిరియాల పొడి: కొద్దిగా
కార్న్: 20 గ్రాములు
తయారుచేసే విధానం
ముందురోజు రాత్రి బియ్యం, మినపప్పు, శనగపప్పు నానబెట్టుకోవాలి. ఉదయానే్న నీళ్లన్నీ తీసేసి తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. పుట్టగొడుగులను బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కార్న్‌ను కడిగి ఉడికించుకుని పెట్టుకోవాలి.
తరువాత ఒక దోసె పాన్‌ను తీసుకుని స్టవ్‌పై ఉంచి, వేడయ్యాక కొద్దిగా నూనె వేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఊతప్పంలా వేయాలి. దీనిపై తరిగి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు, ఉడికించిన కార్న్ వేయాలి. పైన ఊతప్పం బాగా కాలడం కోసం పైన కొంచెం నూనె వేయాలి. ఒకవైపు కాలిన తరువాత ఊతప్పం తిప్పుకుని రెండో వైపు కూడా దోరగా కాల్చుకోవాలి. పల్లీ చట్నీతో తింటే మష్రూమ్ ఊతప్పం టేస్ట్ అదుర్స్.
*
బటర్ మసాలా..
కావలసిన పదార్థాలు
బటన్ మష్రూమ్స్: 200 గ్రాములు
దాల్చిన చెక్క: అంగుళం ముక్క
లవంగాలు: మూడు యాలకులు: నాలుగు
ఉల్లిపాయలు: మూడు ఉప్పు: తగినంత
అల్లం వెల్లుల్లి ముద్ద: రెండు చెంచాలు
టొమాటో: ఒకటి కారం: ఒక చెంచా
పసుపు: అర చెంచా
కసూరి మెంతి: రెండు చెంచాలు
ఉప్పు: తగినంత
జీడిపప్పు ముద్ద: మూడు చెంచాలు
తాజా క్రీమ్: పావు కప్పు వెన్న: ఒక చెంచా
నూనె: మూడు చెంచాలు
తయారుచేసే విధానం
పుట్టగొడుగుల్ని కడిగి సగానికి కోయాలి. ఉల్లిపాయలు, టొమాటోలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. స్టవ్‌పై బాణలిని ఉంచుకుని రెండు చెంచాల నూనె వేసుకోవాలి. ఇది కాగిన తరువాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి అర నిముషం వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేయాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి మరో రెండు నిముషాలు వేయించాలి. తరువాత టొమాటో ముక్కలు, కసూరి మెంతి, కారం, పసుపు కలిపి వేయించాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. తరువాత దీన్ని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత ఒక నాన్‌స్టిక్ పాన్‌ను స్టవ్‌పై ఉంచి మిగిలిన నూనెను వేసుకోవాలి. ఇది వేగిన తరువాత ముక్కలుగా కట్ చేసుకున్న పుట్టగొడుగు ముక్కలు, ఉప్పు వేసి ఉడికించాలి. ఇందులోని నీళ్లన్నీ ఆవిరై పోయిన తరువాత రుబ్బిన మసాలా ముద్దను వేసి బాగా వేయించి అరకప్పు నీళ్లు పోసి ఉడికించాలి. ఈ మిశ్రమం దగ్గరిగా వచ్చిన తరువాత జీడిపప్పు ముద్ద వేసి సిమ్‌లో మరో ఐదు నిముషాలు ఉడికించాలి. చివరగా తాజా మీగడ, వెన్న వేసి బాగా కలిపి దించేయాలి. అంతే.. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టపడి తినే మష్రూమ్ బటర్ మసాలా రెడీ.