స్మృతి లయలు

‘వెండితెర వెలుగుల’ జాడ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జీవితం ఒక ఫుట్‌బాల్ లాంటిది’ అనిపిస్తుంది. నీ ప్రత్యర్థి జట్టు - ‘సంఘం’ నువ్వు గోల్ కొట్టకుండా అది ఎదురు తంతూ ఉంటుంది. నువ్వు గానీ గోల్‌లోకి బంతి తన్నావా? నిన్నీ లోకం అప్పుడు గుర్తిస్తుంది. లేదా బంతికి తగిలిన కాళ్ల తన్నుల్లాంటి తాపులూ, తన్నులూ మిగుల్తాయి.
ముందే మనవి చేసినట్లు హిందీ సినిమా పాటలు మా మేనమామగారి పెద్ద గ్రామఫోన్‌లో వింటూ పెరగడం చేత - హిందీ సినిమాల మీద కూడా మోజు కలిగింది. స్కూల్లో చదువుతూన్నప్పుడే - ‘మిత్ర’ రాతపత్రికని నేనూ, నా క్లాస్‌మేట్సూ టీమ్‌గా మొదలెట్టాముగా - అందులో - చిత్రం ఏమిటీ? అంటే ఒక సచిత్ర వారపత్రికలో వున్న హంగులన్నీ వున్నాయి. నేను ఆ రోజుల్లో - వీక్లీ ఫ్యాన్‌ని కాను గానీ - ఈ ‘మిత్ర’లో, రెండో యిన్నర్ ‘రేపర్’లో ఒక కార్టూన్ ఫీచర్ - థర్డ్ రేపర్‌లో ఒక సినిమా తార బొమ్మ వేసేవాణ్ని. అవి ఎలా దొరికేవా? ఇవాళ మీరు ఇంటర్‌నెట్‌లోకి పోయి - లిఫ్ట్ ఇరిగేషన్ చేయడం లేదా? అలాగా, నేనూ మా టీమూ.. పత్రికల నుంచి కత్తిరించేసి, ఆ ‘క్లిప్పింగ్స్’తో మేం సేకరించిన ‘సీసా’లో పొడి చేసి, వేసి, నీళ్లు పోసి నానబెట్టి తయారుచేసుకున్న ‘తుమ్మ బంక’తోనే ఫీచర్స్ చేసేవాళ్లం.
ఒకసారి, ఓ యిన్నర్ రేపర్ మీద (్థంక్స్ టు ‘సినీ అడ్వాన్స్’) నూతన్ బొమ్మ వేశాను. సన్నంగా రివటలా వుండి సోగ కనులతో ఉండే ఈ (తార) అమ్మారుూ, (నాకన్నా మూడు నాలుగేళ్లు వయసులో పెద్దది) అలాగే ‘బర్సాత్’లోని నర్గీస్ - మాకు ఫేరెట్లు. ‘బర్సాత్’ విడుదలై, వెళ్లిపోతోంది, అప్పుడు చూశాను. కానీ ‘రివ్యూ’ రాశాను.
నూతన్ తొలి చిత్రం ‘నగీనా’ (నాగమణి) సినిమాకి - అర్ధరూపాయిచ్చి, సరస్వతీ టాకీసులో, నేల తరగతికి రెండు టిక్కెట్లు తీసుకుని - నేనూ, ‘కాకర్లా’ చూశాము. నూతన్ హీరోయిన్‌గా తొలి చిత్రం అయిన ఈ ‘్భతగృహం’ సినిమాకి ‘ఎ’ సర్ట్ఫికెట్ ఇచ్చారుట. పైగా, అందులో నటించిన - ‘1950 మిస్సోరీ బ్యూటీ’గా ఎంపికైన రుూమె (‘మైనర్’ బాలిక (15 సంవత్సరాలే వయసు) కాబట్టి - ‘నగీనా’ ప్రీమియర్ షోని చూడనివ్వలేదుట. పాపం! మరి మేము నూతన్ కంటే చాలా చిన్నవాళ్లం ఐనా మమ్మల్ని ఎవడూ ఆపలేదు, అడ్డలేదు! దర్జాగా పోయి చూసొచ్చాం. ఈ సంగతి నేను నా ‘రివ్యూ’లో విమర్శిస్తూ ‘రాశాను’ చాలా కోపంగా...
అట్లాగా, అమ్మ దగ్గర నుంచి డబ్బులు దొరికితే, చూసి, వాటి రివ్యూలు రాయడం చేత - 1960-61 లలో నాకు మళ్లీ, చెప్పానే - ‘్ఫట్‌బాల్’ ‘విధి’ తంతుందీ అని, అట్లాగా సినిమా రివ్యూల బేరం తగిలింది. బెజవాడలో ‘ప్రజాసేవ’ అనే పత్రిక వుండేది. దాని బాస్ మునిసిపల్ చైర్మన్‌గా కూడా చేసిన, కాంగ్రెస్ పార్టీ నాయకుడు డా.టి.వి.ఎస్. చలపతిరావుగారు. ఐతే, ఆ ‘బ్రాహ్మడికి’ ఈ గోల ఏమీ తెలియదు. తుర్లపాటి కుటుంబరావుగారే చూసేవారు అంతా (ఈయనకి నాటి నుంచీ నేనంటే అమిత స్నేహ వాత్సల్యాలుండేవి) వూళ్లో సినిమా రిలీజయిన రోజే టిక్కెట్ తెప్పించి - పంపేవారు ఈ పత్రిక నుంచి. మా వాడు ‘సిక్’ అయ్యాడుగా - అందుకు నేనే ఆ సినిమాని చూసి - దాని మీద రివ్యూ రాసేవాణ్ని. అలా తొలి రోజు, తొలి ఆట - ‘మేజర్’ సినిమాలు రిలీజ్ కాగానే చూసే అవసరం అవకాశం కలిగింది.
మా ఫ్రెండు కాట్రగడ్డ నరసయ్యగారు నవయుగ ఫిలిమ్స్ మేనేజర్ - సైకిలూ, దాని హ్యాండిల్ బార్‌కి ‘ఎర్రరంగు’ చిన్న సంచీ - ఇవీ ఆయన టిపికల్ పెర్సనాలిటీలో భాగాల. వించిపేట మా ఇంటికి ఆయనొచ్చారంటే- ఏదో సినిమా చర్చకి నాందీ ప్రస్తావన జరిగిందన్న మాటే...
‘నవయుగ’ ‘పూర్ణా’లు - గాంధీనగర్‌లో ప్రక్కప్రక్కనే నివసిస్తున్న సూపర్ స్టార్స్‌లాగా వెలిగేవి. 1961 మొదట్లోనే ‘వెలుగు నీడలు’ సినిమా ‘అక్కినేని, రంగారావు, సావిత్రి’ - విడుదల అయింది - అట్టహాసంగా సంక్రాంతికి ముందు రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి ఆట అలంకార్ థియేటర్‌లో కోలాహలం మధ్య చూశాం. నాటి ప్రేక్షక జనం ఎంత సెన్సిటివ్ అంటే అందులో, ఓ పాటలో హీరో హీరోయిన్లు - పార్కులో కాబోలు - పాడుతూ ఒకళ్ల మీద ఒకళ్లు పడి దొర్లుకుంటూ పోతారు. ఆ సీను ఉదాత్తంగా లేదు అనీ, కత్తిరించమనీ ‘టాపు’ లేపేశారు. ఆ టేస్టే వేరు.
వెలుగు నీడలు సినిమా ఆదుర్తి సుబ్బారావుగారి సూపర్ హిట్ అయిన పిక్చర్. దీనికి ఆంధ్రా ఏరియాలో జనామోదం, ఆకర్షణలను స్టడీ చేసి, పబ్లిసిటీ ఇవ్వాలనుకున్నారు నవయుగ కాట్రగడ్డ నరసయ్యగారు అనగా కాట్రగడ్డ శ్రీనివాసరావుగారు. నాటికే నరసయ్యగారు జగమెరిగిన ‘బ్రాహ్మడు’. ‘నేను, నర్సయ్యనీ’ అనేవాడు ఫోన్ ఎత్తి, అంతే! అందరూ పోల్చేసేవాళ్లు.
ఆయనా, నేనూ, ఒక చిన్న కారు ఎక్కి - బెజవాడ నుంచి వైజాగ్ సైడు సినీ టూర్‌కి బయలుదేరాం. కృష్ణాజిల్లాలో ‘పెద్ద కారు’ అంటే బస్సు. ‘చిన్నకారు’ అంటే టాక్సీ. మొదట ఏలూరులో మార్నింగ్ షో, ఇంటర్‌వెల్ వేళకి అందుకున్నాం. శరత్ టాకీస్ కాబోలు అది. అక్కడ హోటల్‌లో ‘పెసరట్ స్పెషల్’గా కీర్తి గడించింది. అది తిన్నాం. ‘జనాలు వెలుగు నీడల జలతారు వానలో ఓలలాడుతున్నారు. ఏ సీను ప్రేలిందీ? ఎక్కడ జనం మురిసి ముచ్చటై నవ్వుల చప్పట్ల ముక్కలై పోతున్నారు?’ అని, బాల్కనీలో నుంచో, ఆపరేటర్ ప్రక్క ‘కంత’లో నుంచో గమనించడం - మా ‘దీక్ష’ - మా పని.
అదో స్టడీ టూరుగా ఏలూరు, రాజమండ్రీ, తాడేపల్లిగూడెం, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం మొదలైన ఊళ్లలో, ఇట్లా జనాల మధ్య చూస్తూ - ప్రతీ చోటా ‘నోట్సు’ తీసుకుని - చర్చ చేసి - ఆపరేటర్, థియేటర్ మ్యానేజర్ల ఇంటర్‌వ్యూలు చేసి జనాలతో ముచ్చట్లు చేసేవాళ్లం. పండుగ కదా ఐదు షోలు కూడా లాగించేశారు.
తెలుగు సినిమా రంగానికి పెట్టుబడినీ, అటు తర్వాత పంపిణీ బాధ్యతనీ కూడా - కృష్ణా జిల్లానే, నిభాయించే ఆ రోజుల్లో - పంపిణీదారుకి కూడా సినిమా నిర్మాణంలో కూడా కొంత పలుకుబడి ఉండేది. ఈ సినిమాకి - సినిమా సన్నివేశాల ‘్ఫటోలు’ (స్టిల్స్) తీసుకుని వాటి మీద ‘కార్టూన్లు’, వ్యంగ్య వ్యాఖ్యానాలూ రాస్తే- శాస్ర్తీ (తమ్ముడి పేరు అదే అప్పుడు) కార్టూన్ల లాంటి బొమ్మలు వేసేవాడు. పత్రికలలో వారం మధ్యలో (కార్టూన్ సైజులోనే) సినిమాల ప్రకటనలొచ్చేవి. నటుల ‘క్యారికేచరింగ్’ చాలా కష్టం. కనుక ‘స్టిల్స్’ నుంచి తలకాయలు కత్తిరించి తీసి - కార్టూన్ బొమ్మలు గీసేవాడు మా ఆర్టిస్ట్.
ఇట్లా సినిమా రివ్యూలు - సినిమా పబ్లిసిటీలలో తనమున్కలై పోతూనే - ‘పగా ప్రేమా’ నవల పూర్తి చేశాను. వాస్తవానికి ఇది ‘తొలిమలుపు’కి ‘ఎక్స్‌టెన్షన్’ లాంటిది. ఇందులో ‘పెద్దాళ్లయిన’ విద్యార్థి ప్రేమికులుంటారు’. నిర్మాత కె.జయదేవ్‌గారికి కథ కావాలన్నారని - నర్సయ్యగారూ మొదలయిన వాళ్లడిగారు - సరే అదీ చూద్దాం...
నాకేమో ఈ మధ్య శ్రీపాద వారి మీద మోజు ఎక్కువైంది. అందుకని గోదావరి జిల్లా భాష అనగా ‘యాస’లో ఇది రాశాను. అక్కడికోసారి పోయి ఆ కొబ్బరి తోటలూ, నదీ తీరాలూ అవీ తనివి తీరా చూశాను. నవల పూర్తయింది. సినిమా ఆఫర్ రూపు కట్టలేదు. నేను కూడా అంత ‘బాదర్’ అవలేదు. ఈ ‘పగా-ప్రేమ’ ని కూడా విశాలాంధ్రలో వేస్తామని తీసుకున్నారు ఆనక. ఏడాది తిరగకుండా సెకండ్ ఎడిషన్‌కి వచ్చిన ‘తొలి మలుపు’ మలి ఎడిషన్‌తోపాటు ‘పగా-ప్రేమా’ నవల కూడా రిలీజ్ అయింది. మహీధర రామ్మోహనరావు గారు అద్భుతమయిన రివ్యూ రాశారు - దాని మీద.
‘ప్రేమ అనేది నవీనయుగపు సాధ్య భావోద్రేకం ఒక స్ర్తి యొక్క అందమో, ధనమో, సాహచర్యమో, ఆమె యెడ విశేషమైన ఆసక్తిని కలిగించడం- మిగిలిన స్ర్తిల కన్నా ఆమె యెడ ప్రత్యేకత చూపడం ఎప్పుడూ ఉంది. ఆధునిక యుగపు ప్రేమకూ దానికీ సంబంధం లేదు’ అని, ఈ నవల ‘్థము’ మీద ఉపోద్ఘాతం ఇచ్చారాయన. రివ్యూ కొనసాగిస్తూ - నవల ననుసరించి ఇలా వున్నది ప్రేమ అని చెప్పారు.
‘ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల స్వతంత్రత, సమానత్వ సూత్రానికి ముడిపడి వున్న భావన. స్ర్తి పురుషులిద్దరూ వివాహ విషయంలో స్వతంత్రులు కావడం, సమాన హోదా వివాహ సందర్భంలో ఆమోదించబడటమూ, ఆధునిక యుగ సన్నివేశం.
సాహచర్యం, సాన్నిహిత్యం ఏకత్రవాసం దానికి సరిపోతాయి. అందుకే నేటి విద్యాలయాలు ‘ప్రేమ’కు జన్మస్థలాలవుతున్నాయి’ అంటూ విశే్లషించారు, ఈ ‘్థము’ని, ఆయన. పై చదువులు చదువుతున్న రాధాకృష్ణ, మాలతీల ప్రణయ ఘట్టాలలో నేను ‘కవిత’లు కూడా అల్లేను. అది నవలలో కొత్తదనం అన్నారంతా. ‘్భవ తీవ్రతకు చారణగీతిక లనదగ్గ గేయాలవి’ అన్నారు పెద్దలు.
కమ్మనైన కంఠమాధుర్య/ మేమో కాంక్షించిన
గున్నమామిడి కొమ్మ కొసకు ప్రాకి/ కోకిలమ్మ కోరుకొననేమి?
నీ కొంటె మాటల నాలకింతుగాని..!/ ధవళ కాంతుల వలతునేని
మల్లెమొగ్గల కోసుకొనక/ నీదు పలువరస పగుల/ మైమరచిపోదునేమి..?
అంటూ రాయప్రోలు సుబ్బారావుగారి ‘స్కూలు’ అమలిన శృంగార కవిత్వం బాణీ రాశాను. నేను ‘ప్లాటోనిక్ లవ్’ రాయప్రోలు వారి మార్కు- అమలిన శృంగారాన్ని గౌరవించే నాటి ఉన్నత విశ్వవిద్యాలయాల విద్యార్థుల కోవకు చెందినవాఢ్ని. ‘కనుకనే - నీకు పెద్దల మధ్య గుర్తింపు, గౌరవం’ అనేవాళ్లు విజయ సాహితీ పెద్దలందరూ. మహీధర చెప్పారు ఇంకా ఇలాగ ‘వీరాజీది ఒక విశిష్టమైన ఫక్కీ. కథ చెప్పే తీరులోనూ నడిపించే తీరులోనూ సౌకుమార్యం ఉంది. యూనివర్సిటీ విద్యార్థుల ఆశలు ఆశయాలు, మమతలు, ద్వేషాలు, విలాసాలు, విభ్రమలు, పగలు, ప్రేమలు, బాధ్యతలు - నిర్వికల్పతలు - ఆయన కలంలోంచి, సజీవమూర్తులుగా అవతరించుతున్నాయి’ అదీ రివ్యూలోని భాగాలు - అలా అన్న కితాబు సంపాదించుకున్నాను.
కాని, ఆచంట జానకీరామ్‌గారు ఈ నవల మీద సుదీర్ఘమైన రివ్యూ ఓ పేజీ రాశారు. ‘విద్యార్థులు కాలేజీలకు పోయి చదువుకోవాలి గానీ ఇలా ప్రేమకలాపాలు కొనసాగించటాలు తప్పుకాదా? వీరాజీ శ్రీపాద వారి శైలిని అనుసరించడంలో తప్పు లేదు గానీ ఇలా కాలేజీ ప్రేమలకు ఆకర్షణ పెంచి యువతీ యువకుల మీద మత్తుమందు చల్లడం ఏమిటి? అంటూ ఆయన టిపికల్ స్టైల్లో కోప్పడ్డారు. ఓ చెంప పొగుడుతూనే చీవాట్లు పెట్టేశారు. జానకీరామ్‌గారు తెల్లని షరాయి - దాని మీద తెల్ల ఫుల్‌హాండ్స్ (లాల్చీ) చొక్కా - బటన్స్‌లాగా ‘కఫ్స్’ పెట్టుకొని - టిపికల్ వేషంలో - భావకవి అంటే ఇలా ఉంటాడేమో? అన్నట్లు వుండి - గాంధీనగరం అలంకార్ ప్రక్క రోడ్డు మీద తరచు కనపడేవారు. విజయ సాహితీ మీటింగ్‌లకి వచ్చేవారు అరుదుగా. ఇంచుమించు ఇలాగే ‘నయాగరా’ కవులలో ఒకడైన రెంటాల గోపాలకృష్ణగారు కూడా తెల్లని దుస్తులు - జుబ్బా చేతులు పూర్తిగా వేసుకుని, గుండీలు పెట్టేసుకుని దాని మీద రిస్టువాచీ పెట్టుకునేవారు. ఐతే, రుూయనకీ, ఆయనకీ పోలిక అంతవరకే. ఈయన గొప్ప జర్నలిస్టు.
రెంటాలగారు 1966 నుంచీ నాకు చాలా సన్నిహితులుగా ఉండేవారు. చక్కని సూచనలు ఇస్తూ నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. మా ‘దోస్తీ’ నాటి కబుర్లు మున్ముందు చాలా చూస్తారుగా...
ఇంతకీ, పగా-ప్రేమా నవలని కొంత సినిమాటిక్‌గా రాశాను. కారణం కానూరి జయదేవ్‌గారు, ‘సినిమా కోసం రాస్తే బాగుంటుంది’ అని నవయుగ ద్వారానే అడిగారు. కానీ, నేను అంతలో మద్రాసుకి ఉద్యోగం కోసం పెట్టే బేడా సర్దుకోవలసి వచ్చింది. దీని మీద పట్టించుకోలేదు.

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com