స్మృతి లయలు

కార్టూన్ల ఒ(ఉ)రవడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త శీర్షికలకి అంకురార్పణ ఆంధ్రపత్రికయే చేసినప్పటికీ - నేను చేరిన ‘అరవై’లలో వెనక్కి తిరిగి చూస్తే, మనం ఇవాళ ప్రతి పత్రికలోనూ అతి ముఖ్యంగా చూస్తున్న వ్యంగ్య చిత్రాలు (కార్టూన్లు) చాలా అరుదుగా నాటి వీక్లీలో కనబడతాయి - ఒకటీ అరా తప్ప. కానీ తలిశెట్టి రామారావుగారు ఆద్యుడు. ఆయన కార్టూన్‌కి పెట్టిన పేరు ‘సరస చిత్రకల్పనం’. అలాగే ఇంటర్‌వ్యూలు కూడా వుండేవి. వాటి పేరు ‘సంభాషణం’. పాకెట్ - కార్టూన్లకి కూడా రామారావుగారే శ్రీకారం చుట్టారు.
ఐతే.. వీక్లీలో యాభై అరవైల మధ్య ఫుల్‌పేజీ బొమ్మల కథలు బాగా పడ్డాయి. కానీ కార్టూన్లు తక్కువ. 1959లో బాపూగారి ‘బంగారం - సింగారం’ లాంటి బొమ్మల కథలు ఒక కొత్త మలుపు.
నిజానికి అరవై దాకా నా జీవితం విద్యార్థి జీవితం, క్యాంపస్ లైఫూ కావడంతో నేనీ విషయాన్ని - ‘వీక్లీ’కి నేను సేవ చేయాలి’ అన్నది నిర్దేశం అయిపోయినాకా మాత్రమే స్టడీ చేశాను. బాపూ రమణల జమిలి సీరియల్ - ‘బుడుగు చిచ్చుల పిడుగు’ వ్యంగ్య చిత్ర మాలిక‘కీ, హాస్య రచనలకీ కూడా బాగా ‘సాన’బట్టింది. కాగా, తెనుగు కుర్రాళ్లు కార్టూన్ రంగంలో దూకటానికి 1959, ఆగస్టులో - వీక్లీ కార్టూన్లకు పోటీ పెట్టి ఆహ్వానించింది. అదో దోహదం అయింది.
వారం వారం ఉత్తమ వ్యంగ్య చిత్రానికి- పనె్నండు రూపాయలు బహుమతి- ఇది ఒక కథకి లభించే పారితోషికంకన్నా చాలా ఎక్కువే. ‘ఎప్పుడూ ఇంతే’ - సత్యమూర్తి చదువుల్రావుల పాపులారిటీ వ్యంగ్య చిత్రకారులకు బంగారు పిలుపునిచ్చింది. 1961, ఆగస్టులో ఒక సంచిక మీద శంకర్ వ్యంగ్య శీర్షిక ‘ఎప్పుడూ ఇంతే’ కవర్ పేజీకి ఎక్కిందీ అంటే - ‘కొంటె బొమ్మలు’ అంటే తెలుగు పాఠకులకు ఎంత ఇష్టమో? తెలుస్తుంది. అది యించుమించు ‘మామిడికాయ పచ్చడి’లాగా అంటే ఆవకాయలాగ అయిపోయింది.
1960 నుంచీ రాధాకృష్ణగారితో పరిచయం ఉంది. కనుక, ఆయన బెజవాడ వచ్చినప్పుడల్లా - ఇప్పుడు చరిత్రలో కలిసిపోయిన ‘దుర్గ్భావన్’ (ఆంధ్రపత్రిక ఆఫీసు)లో, గంటల తరబడి కూర్చునేవాళ్లం. ఆయన ‘తహతహ’ అంతా, వీక్లీని కొత్త పుంతలు తొక్కించాలన్నదే.
నాటికి డిటెక్టివ్ కథలలో లాగే - వెండితెర నవలలు కూడా జనాలకి మంచి ఆకర్షణ అయిపోయాయి. పత్రిక వీక్లీ ‘వార్ అండ్ పీస్’ మొదలు ‘బెన్‌హర్’ దాకా ఎన్నో ఇంగ్లీష్ సినిమాలని కూడా పరిచయం చేసింది. ఆంగ్ల సాహిత్యం, బెంగాలీ సాహిత్యం, అటు తర్వాత, ‘మా’ వేళకి కన్నడ సాహిత్యం కూడా తెనుగు పాఠకులకు - వెండి పళ్లెరంలో వేడిబువ్వలాగా - అందించింది వీక్లీయే!
‘జూల్స్‌వెర్న్’ గారి సాహస నవలలన్నీ యించుమించు తెనుగులోనే రాశారా? అన్నంత సుళువుగా తర్జుమా అయి, వారపత్రికను అలంకరించాయి. అంతా బాగుంది- నన్ను కూడా ‘నవయుగ’ వారు - వెండితెర నవలలు చేయమని అడిగారు. కానీ, ఒరిజినల్ నవలలు రాసే ‘దీక్ష’లో బిజీగా వున్నాను నేను. రాధాకృష్ణగారికి అమెరికన్ మాగజీన్స్ మీద మోజు ఉంది. పరిచయం కూడా ఉంది. అది నాకూ అంటింది.
1961 దాకా ‘శి.రా’గారి పేరు ‘ప్రింటర్, పబ్లిషర్’గా వస్తున్నదే తప్ప ‘సంపాదకుని’గా పడలేదు. అయ్యవారి పేరు చీఫ్ ఎడిటర్‌గా వేసినప్పటి నుంచీ, రాధాకృష్ణగారి పేరు ‘ఎడిటర్’గా పడింది. అప్పటి నుంచే నేను ‘ఇన్‌వాల్వ్’ అయ్యాను. అసలు వీక్లీ టైటిల్స్‌లో కవర్ మీద హిందీ సినిమా హీరో హీరోయిన్లు - ఉదాహరణకి ప్రదీప్‌కుమార్ మాలాసిన్హా స్టిల్ కూడా ముఖచిత్రంగా అయింది. ‘ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రిక’ అని టైటిల్ వుండేది. లోపల పుటలలో క్రింద ‘ఆంధ్రపత్రిక’ అని పడేది. ఆంధ్రపత్రిక ‘సచిత్ర వారపత్రిక’గా పేరు ఖాయం అవడం మా ‘హయాం’లోనే అయింది. రాధాకృష్ణగారు ‘సాటర్‌డే రుూవ్నింగ్ పోస్ట్’, వారపత్రికకి చందా కట్టారు. ‘టైమ్’ ‘న్యూస్‌వీక్’ పత్రికలు ‘మస్టు’. సాటర్‌డే రుూవ్నింగ్ పోస్ట్ కవర్ మీద వున్న తీరులో ‘పత్రిక’ అన్నది పెద్దపెద్ద అక్షరాలతో మన వీక్లీ మీద కొట్టవచ్చినట్లుండేది. దానిపైన ‘షోల్డర్’లో ‘ఆంధ్రసచిత్ర వార’ అని ఉండేది. ఇలా ఒక ‘లోగో’ తయారుచేయించారు. కవర్‌పేజీకి ఈ లేబిల్ లాంటి ‘ఆంధ్ర’ అనే రెండక్షరాలు కొట్టవచ్చినట్లుండేవి. కవర్ పేజీ చుట్టూరా రెడ్‌రిబ్బన్ టైమ్ పత్రిక మాదిరి ఉండేది. నండూరి, ముళ్లపూడి, బాపు, తూలికాభూషణ్ మొదలయిన వారి కృషి ‘సచిత్ర’ అన్న మాటని కొంతవరకు సార్థకం చేసింది. కథలకు బొమ్మలు స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. ఇంగ్లీష్ సినిమా కథలు, రివ్యూలు, బొంబాయి సినిమా వార్తలు - యివన్నీ తప్పేవి కాదు. ఏడాదికి పది సినిమాలయినా లేకుండా మన తెలుగు ఇండస్ట్రీ ఉండేది. మన బెజవాడ లక్ష్మీ టాకీసులో బాలరాజు సినిమా ముప్ఫయి రెండు వారాలు ఆడేసిందిట.
‘జగదలప్రతాపన్’ అన్న చిత్రం (అరవం) ఎన్ని వారాలు ఆడిందో? మరో కొత్త బొమ్మ రావాలిగా?
అలాంటప్పుడు సొంత కథలు, స్వతంత్ర నవలలు వీటి కోసం ఆంధ్రపత్రిక తరచుగా - కథల, నవలల, వ్యాసాల ‘పోటీలు’ పెడుతూనే ఉండేది. ఆధునిక వచన సాహిత్యానికి ఆనాడు వీక్లీ ద్వారా జరిగిన కృషి చరిత్రార్థకం.
నా ‘విడీవిడని చిక్కులు’ నవల వేళకి (1961) క్రింద అంటే నేను డైలీ హాలులో వున్నాను కానీ, పైన శి.రా.కృ గారు, యస్.వెంకటేశ్వరరావుగారు, మరి కొంతమంది జూనియర్‌లు వీక్లీ డిపార్టుమెంట్‌లో వుండేవారు.
నిజం చెబుతున్నాను -చిన్నప్పుడు నేను వారపత్రిక సీరియల్స్‌కి - వారం వారం - జరిగిన కథ అని పడుతూ వుంటే - అన్నీ వాస్తవ గాథలేనా? కల్పితాలు కావా? అనుకునేవాణ్ని. నా ‘నవల’ సీరియల్‌గా పడుతున్నప్పుడు - వారం వారం ‘జరిగిన కథ’ వేంకటేశ్వరరావు గారు రాసేవాడు. ఇది రాయడం కూడా ఒక ‘కళే’! ‘రొంబ కష్టమబ్బా’. అలాగే, నా ప్రేమకు పగ్గాలు సీరియల్‌కి జరిగిన కథ - మాధవరావు (మతుకుమల్లి) చాలా చక్కగా రాసేవాడు. ఎంత మురిసిపోయేవాడినో? నాకు ఆ ‘ఆర్ట్’ లేదు. ఎస్.వి.రావుగారు, ఇక మన రాజగోపాలరావు మా బాస్ రాధాకృష్ణగారు ఒక వయస్సు వాళ్లు. నాకన్నా ఏడేళ్లు పెద్ద అనుకుంటాను. ఇది యస్.ఆర్. గారి మాట. రాజగోపాల్రావు సంగతి వేరు. అతణ్ణి బెజవాడ కరస్పాండెంట్‌గా వేశారు. నా ‘నవల’ ఫైనల్ ప్రూఫ్ రీడింగ్‌లో ఏదైనా అనుమానం వస్తే - స్వయంగా ఎస్.వి.ఆర్.గారే, క్రింద హాల్లోకి వచ్చి ‘ఇది ఏమిటి?’ అని వివరణ అడిగేవారు. ఎడిటర్‌గారు అంటే శంభుప్రసాద్ గారి మీద మాకు అంత గౌరవం.
భారతిలో నేను రాసిన కవిత ‘ప్రేమలేఖ’ అని జ్ఞాపకం. ఆ సంచిక ఫైనల్ ప్రూఫ్‌ని - వి.వి.ఎన్.గారు చూస్తున్నాడు. నేను పైన వీక్లీ ‘కొలువు’లో వున్నాను. అప్పుడు ‘గిరుక్’న నువ్విలా తిరిగి చూస్తే? లాంటి పదాలున్నాయి కవితలో. పేజీ ప్రూఫ్ వి.వి.ఎన్. - అయ్యవారికి చూపించి ‘సార్! ఈ మాట ఇలా రాశాడు సార్! దీన్ని ‘చురుకు’గా అని మార్చనా?’ అనడిగాడుట. ‘వీరాజీకి చూపించి, అతను మారుస్తాడేమో? అడగండి’ అన్నారుట. పైకి వచ్చి, ‘రుూ మాటేంటి సామీ? ఇట్లా రాశావ్? ఇట్టా మార్చితే పోలా?’ అంటూ అడిగారు వి.వి.ఎన్.గారు.
‘అయ్యవారు ఎండార్స్ చేసి కంపోజ్ చేయించారు కదా? మనం మార్చవచ్చా?’ కొంటెగా నవ్వుతూ కుర్చీ చూపించాను - ‘కూర్చోండి సార్’ అన్నట్లు.. ‘వద్దులే, నా రంకు మగడా! అయ్యవారికి మొత్తం పేజీలు రుూ పూట ఇచ్చేస్తే, రేపు మెషీన్‌కి ఎక్కిస్తాడు ‘వర్గీస్’గాడు’ అంటూ, ఆ మాటని అట్లాగే వుంచి, క్రిందికి దిగి వెళ్లిపోయాడాయన.
ఇదీ, అయ్యవారి రిమోట్ కంట్రోల్! అయ్యవారి చేతి క్రింద 1964లో (శంభుప్రసాద్ గారి) నేరుగా, నేను వీక్లీ చేశాను. అప్పుడు మా బాస్ యస్.ఆర్.గారు అమెరికా యాత్రలో వున్నారు. ఆ మరుపురాని కబుర్లు ఆనక చెబుతా. ఇక్కడ వారపత్రికలో, యస్.ఆర్. గారి హయాంలో మేం చేసిన మార్పులు కొన్ని చెప్పాలి.
ఆంధ్రపత్రిక వీక్లీకి ఆంధ్రప్రభ వీక్లీ గట్టి పోటీ. పైగా, ఏ వారపత్రిక కయినా దిన పత్రిక ‘దన్ను’గా వుండాలి. లేదా, అది ‘సర్క్యులేట్’ అవదు. ప్రాచుర్యం పొందడం కష్టం. మాకు దినపత్రిక ఒక్కటే ఇక్కడ. గానీ, అక్కడ మవుంట్‌రోడ్ (రోడ్డు కూడా వాళ్లది పెద్దదే) మీద ఆంధ్రప్రభ వీక్లీకి ప్రభ డైలీ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ - వగైరా, చాలా ‘బడా’ పత్రికలున్నాయి. అంటే డైలీలు అవి మా వారపత్రికల ‘బరువు’ మోస్తాయని కాదు. డైలీకి ఏజెంట్‌లు, కమ్యూనికేషన్ నెట్‌వర్కూ అవీ వుంటాయి. ‘పది వీక్లీలు కావాలా? అయితే ఇరవై డైలీలు వేసుకో’ అంటాడు - సర్క్యులేషన్ మేనేజర్ ఏజెంట్‌తో. అదే స్ట్ఫాతో ఏజెంట్‌కి పని అయిపోతుంది. అలాగా దేశమంతా వాళ్ల వీక్లీ అన్ని రాష్ట్రాలకీ బండెక్కేసేది. ఆంధ్రపత్రికకీ సదుపాయం తక్కువ.
‘ఆంధ్ర సచిత్ర వారపత్రిక’గా, ‘ఆంధ్ర వారపత్రిక’ లేదా, ‘ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రిక’ లాంటి వేరియేషన్స్ అన్నింటికీ స్వస్తి చెప్పాం. ‘ఆంధ్ర సచిత్ర వారపత్రిక’ని ఖాయం చేశాం.
కథలకి బొమ్మలు, పేజీలలో వ్యంగ్య చిత్రాలు - పైగా అప్పటికే వూపు మీదున్న ‘కథ కాని కథ’ ‘పొట్టి కథలు’ లాంటి వాటికి చోటు ఎక్కువ చేశాం. ‘కథ కాని కథ’లు (లైఫ్ ఈజ్ లైక్ దట్) చాలా పాపులర్. పైగా, ప్రథమ, ద్వితీయ బహుమతులు వున్న వాటికి ఆదరణ ఎక్కువ. కొన్నింటిని నేను తిరిగి రాసుకునేవాణ్ని - రంజుగా ఉండాలని. ‘చందమామ’ పత్రికలో కథలన్నీ కొడవటిగంటి కుటుంబరావుగారే తిరిగి రాస్తారు కదా? మనం కొన్నయినా, తిరిగి రాసుకోవద్దా? అనేవాణ్ణి. రాధాకృష్ణగారు ‘హమేషా తమాషా’ కూడా. మనం ‘మూస’ పోద్దామా?’ అనేవాడు. చెప్పానుగా. వీక్లీలో అప్పటికి కదపలేని శీర్షిక ‘మనమూ - మన దేహస్థితి’ గాలి బాలసుందరరావుగారు (రా.కృ.గారికి ఆయనంటే ఇష్టం) గణపతి శాస్ర్తీగారి పెంకి జవాబులు - ప్రశ్నావళి వగైరాల మీద కాన్‌సెంట్రేట్ చేస్తూ - సినిమా పేజీల మీద అధ్యయనం మొదలెట్టాం. ‘కార్ట్యూన్’లు ‘తెలుగు వెలుగులు’ అదనం. ఈలోగా సినిమా ఇండస్ట్రీ చాలా పెద్దదై పోయింది. రికార్డు స్థాయి చిత్రాలు ఏటా వస్తున్నాయి. కొత్త అమ్మాయిలు చాలా మంచి వాళ్లు వచ్చారు. భానుమతి, అంజలీదేవి, జమున, సావిత్రి, కృష్ణకుమారీల సరసన ఈ కొత్త అందాలు చేరుతున్నారు.
అది అలా ఉంచండి. పోటీలు పెట్టంగానే సరా? వచ్చిన (పోటీలు వరుసగా పెట్టేశాం) వ్యాసాలని వాటినీ చదవొద్దూ? ‘న్యూఢిల్లీ లేఖ’ శ్రీకృష్ణగారు - ఫార్శీవాడు. ఒక విదేశీ పత్రికకి స్ట్రింగర్. పార్లమెంట్‌లోనూ బయటా పలుకుబడి గలవాడు. ఉదాహరణకి - పార్లమెంట్ లోక్‌సభ హాలు ప్రెస్ గ్యాలరీలో - మొదటి వరుసలో - నాలుగో సీటు ‘మాది’ అంటే, ఆంధ్రపత్రిక ఢిల్లీ విలేఖరిది. శ్రీకృష్ణగారి న్యూఢిల్లీ లేఖకి ఇప్పుడు అనువాదకుడు మారాడు - అంటే నేను వచ్చానుగా. మా వాళ్లు కొన్ని కాంప్లికేటెడ్ అయిటమ్స్ వదిలేసేవాళ్లు. కానీ, రా.కృ.గారూ, నేనూ ఆ నారికేళపాకాన్ని మధించేవాళ్లం. రాధాకృష్ణగారు అవతల అమృతాంజన్ మేనేజింగ్ డైరెక్టర్ అయినా కూడా - వీక్లీ మెటీరియల్ ‘బల్క్’గా కారులో తీసుకుని పోయేవాడు.
‘ఇలా యివ్వండి. నేనా ఇంగ్లీష్ ఆర్టికల్‌ని లాగించేస్తాను’ అని, కూర్చుని రాసేసేవాడు. ఒక్కోసారి ‘పాఠకుడికి ఇబ్బందేమో?’ మీరు వాడే మాటలు? అనడానికి వీలు లేదు. అలా అంతా కంపోజ్ చేసెయ్యాలి. ‘బాస్’ కదా? కానీ, ఫైనల్‌లో ‘ఇలా మార్చుదామా?’ అంటూ అడిగేవాడు. ఆయన ‘పుస్తకాల దాహం’ అపారం. కాకపోతే ‘వోడ్‌హవుస్’ అంటే ఎక్కువ యిష్టం. ఆయన చేత పుస్తకం ఎల్లవేళలా వుండేది..
మొత్తానికి ఆ విధంగా ‘సచిత్ర వారపత్రిక’ టైటిల్ మీదే గాదు లోపల కూడా కొన్ని మార్పులు వచ్చాయి. ఒక సంచికలో వచ్చే కథలు, మెయిన్ వ్యాసాలూ అవీ కూడా మొదటి పేజీలలోనే - పాఠకుడి కంటికి ఆకర్షణీయంగా కనపడాలి అన్నది ఆయన వాదన. అంచేత సీరియల్స్, కథలూ గట్రా ఓ పేజీలో బొమ్మతో పెట్టడం దాన్ని ఆపి - మిగతాది ‘్ఫలానీ’ పేజీ చూడండి’ అని ‘తిరుగుడు’లో (జంప్‌లైన్ అంటారు దీన్ని) పడేయడం - ఒక ఆనవాయితీ అయింది.
‘అయ్యా! మధ్యపేజీల నుంచి చివరి దాకా అన్నీ ‘తిరుగుళ్లే’ వస్తే - ‘పర్ర’ అయిపోదా? ఆ తిరుగుడు భాగాల్ని వివిధ చిన్న శీర్షికలతో ‘బ్రేక్’ వేసేవాళ్లం. అదంతా ఓ ‘థ్రిల్’.

ఇంకా వుంది

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com