స్మృతి లయలు

అదో ‘మినీ ఇండియా’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దినపత్రికలో ఉన్నప్పుడు ఆదివారం నాడు కూడా ఎస్.ఆర్.గారు ఆఫీసుకి రావడాన్ని గమనించేవాణ్ని. మా ‘బిల్డింగ్’ నాలుగో అంతస్తు బాల్కనీలో నుంచి ఆం.ప్ర. రాధాకృష్ణగారి రూమ్ కిటికీ, ఐ మూలగా చూస్తే కనబడేది. లైటు వెలగడం, రూములో అలికిడీ అవి గమనించి - ఓ గంట ఆగి క్రిందికి వచ్చి - దారి కాసేవాణ్ని. అంటే, మా ‘బిల్డింగు’ ముందు మెట్ల మీద నిలబడితే చాలు ఆయన కారు ఎక్కించుకునేవాడు. ‘అమృతాంజన్ ఎం.డి. గది’ అంటే, అదో విశాలమయిన హాలు.
వార పత్రిక గురించే ఎక్కువగా చర్చ మా మధ్య. అదే ఆయనకి ఇష్టం. ఐడియాలు పుంఖాను పుంఖాలుగా ‘లొడాలొడా’ చెప్పేస్తూ వుండేవాణ్ని. ‘పాఠకులకు మనం వేసే గమనికలు, సూచనలు లాంటివన్నీ ఆ‘వారా’ ఈ‘వారా’ వేసే బదులు - పాఠకులతో ముఖాముఖీ’ అనో, లేదా ‘మీతో మీ సంపాదకుడు’ అనో - మొదటి పేజీలలో వేసి- అక్కడే విశేషాలూ, విజ్ఞాపనలూ, వేస్తే బాగుంటుందేమో? ‘జస్టేమినిట్’లాగ’ అన్నాను. బాబూరావ్ పటేల్ ‘ఐ.ఎస్.జోహర్’ లాంటి కాలమ్స్ - ‘కొంటె జవాబులు’ లాంటివి వుంటే బాగుంటుందేమో?’ అని కూడా అనుకున్నాము. ‘సలహాలు నేనూ చెబుతాను. కానీ, ఆచరించే వాళ్లుండొద్దా? మీరేమో వారపత్రిక డైలీకన్నా సైజు చిన్నదని కాబోలు, రానంటారు’ అని కోపంగా అనేసి, మళ్లీ సర్దుకున్నాడాయన.
‘మా ఫాదర్ (అయ్యవారు) చెప్పారులెండి. దినపత్రికలో కొన్నాళ్లు చేస్తే - కుర్చీలో కూర్చుంటాడా? కుదురుగా? లేక పుంజాలు త్రెంచుకుని పారిపోతాడా? అన్నది చూద్దాం అనుకున్నాను అని అన్నారు నాన్నగారు’ అన్నాడాయన.
‘సరే చెయ్యండి. మీ సీరియల్ - విడీవిడని చిక్కులు -కి మాత్రం బొమ్మలు కోసం ‘బాపూ’కి పంపుతే, లేటవుతుందేమో? ప్రతీవాడూ బాపూ బొమ్మ వెయ్యాలం’టూ, ఓ షరతు లాగ పెట్టి కథలు పంపిస్తున్నారు. మీరూ అదే మాట అంటే సీరియల్‌పై ఏడాది చివరికి గాని అవదేమో?’ అన్నారు.
నేనన్నాను - కార్టూనిస్టులు చూడండి ఇప్పుడు. ఒక ప్రభంజనం లాగా వస్తున్నారు. ‘మూస’ తప్పించాలి. అదీగాక బాపూ ఉద్యోగంలో చేరడం, వర్ణచిత్రాల మీద కాన్‌సెన్‌ట్రేట్ చేయడం జరుగుతోంది. కనుక - ‘మీ ఇష్టం. సంపాదకునిదే తుది నిర్ణయం. ఇందు ఉత్తర ప్రత్యుత్తరములకు తావులేదు’ అని నవ్వేశాను - చిన్న పిసరు బాధ లోపల ఉంది.
‘మనలో మనం’ అన్న పేరెలాగ వుందీ?’ అనడిగాడాయన ఓ రోజున. ‘అంటే పాఠకులూ, మనమూనా?’ అన్నది ఆయన ప్రశ్నకు నా సమాధానం.
1962 జూన్ నెలలో ఈ శీర్షిక, ‘ఎడిటర్స్ నోట్’ ప్రారంభమయింది.
‘సార్! నేనీ మధ్య మద్రాసుకి డెబ్బై మైళ్ల దూరంలో వున్న ఒక టూరింగ్ టాకీస్‌కి వెళ్లాను. భలే వుంది. ఆర్టికల్ రాసి ‘వీక్లీ’కి ఇస్తాను’ అన్నాను.
అసలు సంగతి నవయుగ మేనేజర్ కాట్రగడ్డ నరసయ్యగారు - వాళ్ల కంపెనీ వాళ్లు పంపితే ఒక బిజినెస్ కోర్సు తీసుకోవడానికి వస్తూ, నాకు లెటర్ రాశాడు. మా కిద్దరికీ ‘దోస్తీ’ ఉంది కనుక - ‘టూరిస్టు టాకీసుల మీద, వో ‘పేపరు’ సబ్‌మిట్ చేస్తా, రేపు బెజవాడలో జరిగే వో సెమినార్‌లో. తమిళనాడులోనే టూరింగు టాకీసులు జాస్తీ అంట. మీకేమయినా అయిడియా ఉందా?’ అనడిగాడు.
‘లోగడ క్యాంపస్‌లో స్టూడెంట్‌గా ఉన్నప్పుడు, నర్సీపట్నం వెళ్లాను, మా పినతాతగారింటికి. 1958లో కాబోలు అక్కడ చూశాను’ అన్నాను.
ఇద్దరం టాక్సీలో వెళ్లాం. ఆ రోజుల్లో ఫొటోలు తియ్యడం, వెయ్యడం కూడా చాలా కష్టం. ఓ ఫొటో సంపాదించాడాయన. ఎలాగో..
‘మీ పేరు పెట్టి వాడుకుంటాను, ఇవ్వండి’ అన్నాను. ఇచ్చాడాయన. వ్యాసం రాశాను గానీ దాన్ని ‘వీరాజీ’ అన్న పేరుతో గాక - ‘కృష్ణానంద్’ పేరుతో ఇచ్చాను. ఎందుకూ? అంటే. ‘నా సీరియల్ వస్తోంది’ అప్పటికే - ప్రక్కనే మళ్లీ నా పేరు (వీరాజీ) మీదే ఆర్టికల్ ఎందుకు?’ ఒకే రచయిత పేరు, ఒకే థీము మీద కథలు అవీ వెయ్యడం బాగుండదు కదా?’ అనుకుంటూ. నేను కూడా ‘సంపాదకవర్గం’లో ఒకణ్ణి గనుక - చాలాసార్లు, చాలా పేర్లు వాడాను. ‘ఇస్పేటు రాజు’ ‘క్రిటిక్’ ‘ఆఠీన్ కింగ్’ ‘కౌశికస’ లాంటి పేర్లతో రాయడం - వారపత్రికకి యేమి ఇచ్చినా - ముఖ్యంగా సినిమా రివ్యూలు - ‘అవీ - ఇవీ - అన్నీ’ అన్న కదంబం వగైరాలకు ‘కృష్ణానంద్’ బాగా పాపులర్ అయింది.
అది 1962. సంక్రాంతికి ముందు బోగిపండుగనే తమిళనాడులో బాగా చేసుకుంటారు - ఆంధ్రపత్రికకి కూడా బోగినాడే సెలవు వుండేది. ఆ ముందు రోజు, ఆళ్వార్‌పేట నుంచి యతిరాజ్ కళా నిలయం నుంచి - కుమారి అభయం ‘రంగోలీ ఎగ్జిబిషన్ పెడుతున్నాం. మీ సండే మాగజీన్‌కి గానీ వీక్లీకి గానీ ‘కవర్’ చేస్తే మా మహిళా లోకం మీకు రుణపడి పోతాం’ అంటూ లెటర్ రాసింది. మనిషిని కూడా పంపించింది - రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటర్‌సైకిల్ ఇచ్చి మరీ-
అసలు వూరెలా ఉంటుందో? అరవ తెలుగు ఆడపిల్లల టేస్ట్ ఎలా ఉంటుందో? వగైరా తెలుసుకోడానికెళ్లాను. అందరూ తలనిండా పూలెట్టుకుని, చిక్కని చీరలూ, మోచేతుల దాకా చేతులున్న (ఆఫ్ స్లీవ్స్) జాకెట్లు ధరించి - రంగుల ముగ్గుల శోభను ఇనుమడింపజేస్తూ కనిపించారు. తెలుగు వాళ్లు ‘అరవం’ భాష అలాగే తమిళపొన్నులు ‘తెలుంగూ’ మాట్లాడేస్తున్నారు! అదేదో పూల అంగళ్ల బజారులాగా ఉంది వాతావరణం అక్కడ. ‘ఎప్పిడి ఇరిక్కిది సార్?’ అభయం, జడ, కనబడకుండా పూలు పెట్టేసుకుంది. ‘నల్లా ఇరిక్కిది’ అనడం నేర్చుకున్నాను. అలవాటే గానీ, కొత్తగా నేర్చుకున్న మాట - ‘ప్రమాదం’ అన్నాను!ప్రమాదం అంటే, ‘చాలా అద్భుతంగా ఉంది’ అని అర్థం - సంతోషించారంతా.
రంగుల ఫొటోలు లేని కాలమది! మనం ‘వర్ణించాలి’ అంతే. ఫొటో వాళ్లే ఇచ్చారు. ‘టామిల్‌వరాదా?’ అనడిగారు అంగనలు ఎందరో. ‘సార్’ అనకుండా వాక్యానికి ఫుల్‌స్టాప్ పెట్టరు వాళ్లు. కట్టెపొంగలి, పాయసం పెట్టారు. అక్కడి వీక్లీ రీడర్స్ బాగా మురిసిపోయారు. అందరూ సరదాగా - ఇంగ్లీషు కూడా మాట్లాడతారు. హిందీలో గానీ ‘షుక్రియా’ అన్నామో ‘తంతాం’ అన్నట్లు మొహం పెడతారు. ‘తెలుగు భాషని ‘సుందర తెలుంగు’ అని మీ సుబ్రహ్మణ్య భారతిగారే మెచ్చుకున్నారు కదా?’ అన్నాను.
తిరుగుదలలో బస్సు ఎక్కించేశారు. అట్లాగా, వాళ్ల నాటకాలు, మీటింగులూ, ఒకటి రెండుసార్లు వాళ్ల అసెంబ్లీ సమావేశాలూ చూసేశాను. మా ఆఫీసులో వర్కర్లు అందరూ ఉభయ భాషాకోవిదులే. వాళ్లల్లో వాళ్లు ‘టామిల్’ మాట్లాడుకునేవారు. నేను అరవ అక్షరాలు నేర్చుకున్నాను గానీ, మాట్లాడే ఛాన్సు రాలేదే - అన్ని చోట్లా తెలుగు వచ్చిన వాళ్లే. సర్క్యులేషన్ డిపార్ట్‌మెంట్ ‘కమల’గారుంది. ‘డబుల్‌పన్నా’ అనేవాళ్లం గానీ, ఆమె పోస్టుగ్రాడ్యుయేట్. వాళ్ల నాన్నగారు ఫిజిక్స్ ప్రొఫెసర్. లావుగా వున్నా, ‘సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ ఆమెకు’ అంటారు మిగతా నలుగురు మహిళా మణులూ. అందులో ముగ్గురు తెలుగు వాళ్లే ఒక మరాఠీ పిల్ల (పెద్దదే) వుంది గానీ, తెలుగు బాగా చదువుతుంది - మాట్లాడుతుంది.
అయితే, అక్కడ కొంతమంది బస్ కండెక్టర్లతో భాష ఇబ్బందే. ‘ఎరుంగో’ అన్నాడో ‘ఏరుంగో’ అన్నాడో తెలియదు. కాకపోతే అతగాడు తెలుగు రాదని మొరాయించినా - తోటి ప్రయాణీకులు ముఖ్యంగా లేడీస్ సీట్లలో వున్న అమ్మాయిలు ‘హెల్ప్’ చేసేవాళ్లు. మద్రాసు బస్సులలో, ముఖ్యంగా సిటీబస్‌లలోనూ ఆడాళ్లకి స్ట్రిక్ట్‌గా వేరే సీట్లు ఉంటాయి.
ఓసారి నేనూ, ప్రకాశరావుగారూ, వేంకటేశ్వర్రావుగారూ (మా ఆఫీసు దరి) చైనా బజారులో ఓ జనరల్ అండ్ ఫ్యాన్సీ షాపుకెళ్లాం. వాళ్లిద్దరూ పార్క్‌రోడ్‌లో ‘లోకల్’ ఎక్కేవారు. నేను తిరిగి నడుచుకుంటూ (దగ్గరేగా) వచ్చేసేవాణ్ని. సరే ప్రకాశరావుగారు తెలుగులో ప్రశ్నలు మొదలెట్టేరు. సాధారణంగా ‘గొప్ప’ కోసం వచ్చీరాని అరవం మాట్లాడే వాళ్లం. (వాళ్లని ప్లీజ్ చెయ్యడం కోసం) కొట్టువాడు ‘తెరియాదు’ ‘తెలియాదు’ అనడం మొదలుపెట్టేడు. ‘అమ్ముకోవా? ఏంట్రా, పిచ్చి మొహమా?’ అంటూ, ఇంకా ఏదో అన్‌పార్లమెంటరీ మాట అనబోతూ వుంటే - ఆపు సామీ! తిరుమలై నుంచి వచ్చుండారనుకున్నా’ అన్నాడు వాడు తెలుగులో.
ఐతే, ఆ రోజు ఓ దుస్సంఘటన జరిగింది. బయట ఫుట్‌పాత్ మీద, ఎస్.వి.ఆర్. గారు ఎందుకనో, ‘ఇరిటేట్’ అయారు నా మాటలకి. అప్పుడు వీక్లీలో వున్నారాయన. అందరూ - ముఖ్యంగా సర్క్యులేషన్ డిపార్టుమెంట్‌లో, మందరపు లలితగారి క్లోజ్‌ఫ్రెండ్ వనజాక్షిగారు నన్నంటూ వుండేది. ‘ఇంత పొడవున్నావ్. అంత ‘మూతీ’ (అంటే మొహం) శివాజీ గణేశన్ లాగా చిన్న చెవులూ వున్నాయి గానీ - షార్ట్ టెంపర్ నిండా ఉంది సార్!’ అని. అదే జరిగింది, ఆ సాయంకాలం. వేంకటేశ్వర్రావుగారు కొంచెం ఉడుకుమోతు. ‘నీ..’ అంటూ, కోపం పట్టలేక మాట జారేడు. ‘చెప్పుచ్చుక్కొట్టాలి’ అన్నాడు కూడా.
అంతలో ప్రకాశరావుగారు జోక్యం చేసుకునేలోగానే, నా కాలిచెప్పు నా చేతిలోకి వచ్చింది - ఆనక, ఆయన చెంప మీదికీను వెళ్లింది. ప్రకాశరావుగారు సర్దేశాడు. శాంతపరిచాడు. నేను తంబుచెట్టి స్ట్రీట్‌లోకీ, ఆయన అవతలి ఫుట్‌పాత్ మీదికీ తిరిగిపోయాం...
మా నాన్నగారు - రాత్రి ఈ సంఘటన చెప్పగానే ‘నీకు నేను రేపే బెల్ట్‌షూజ్‌గానీ, ఆఫ్ షూజ్‌గానీ కొనేస్తాను. నీ ఆవేశంతోపాటు అవయితే, వెంటనే వూడిరావు’ అన్నారు. మర్నాడు ఆఫీసులో ప్రకాశరావుగారన్నాడు. ‘తప్పు అతనిదే గానీ, నీ ‘చెప్పు’ టెంపరే అందరూ చూస్తారు. ప్లస్ అతను రాధాకృష్ణకి సన్నిహితుడు. అయ్యవారింట తద్దినం వస్తే - ‘్భక్త’ కూడా అతనే. లింగధారులతో జాగ్రత్తగా వుండవయ్యా కాస్త..’ అని.
నవ్వేశాను డల్‌గా.
‘సారీ’ అన్నాను కూడా. అంతలో ‘ఎస్సార్’గారు, పైకి వారపత్రికలో తన ‘్ఛంబర్’కి వెళ్లబోతూ - ఇటు తిరిగి, శ్రీరాములుగారి బల్లవేపు వెళ్లాడు. గుండె ఝల్లుమంది. బాస్‌ని చూసి-
శ్రీరాములుగారు ‘హెడ్డు’ కదా - ‘రిపోర్టు చేస్తున్నాడేమో సారు’ అనుకున్నాను. అదేం కాదులెండి. అయితే ఎస్.వి.ఆర్.తో మాటలు బంద్ అయ్యాయి చాలారోజులు.
మా వర్కర్లు అంటూండేవారు - అందులో, సి.డి.ఎస్.రామయ్య అనే వాడుండేవాడు. హుషారుగా, ఎప్పుడూ స్థిరంగా నిలబడకుండా - వూగుతూ మాట్లాడే పొట్టివాడు. మన వారపత్రికలో, కథలు రాసే ఈ కంపోజిటర్ రామయ్యకి - నేనూ, నా కథలూ కూడా ఇష్టం. ‘టామిల్‌దేముంది సార్? వాల్‌పోస్టర్లు చదవతాపాండి. సినిమాలు చూడండి. అదే వచ్చి పూడుస్తుంది’ అనేవాడు. చెరగని నవ్వు మొహం రామయ్యది.
వెంకటేశ్వర్లు, కృష్ణ వగైరాలు ఎక్స్‌పర్ట్ కామెంటరీ ఇవ్వగలవాళ్లు. ఒక రకంగా నాకు కార్మికులతో, గుమాస్తాలతో ఆడపిల్లలతో (పెద్దాళ్లే లేడీజ్ అనేవాళ్లు అంతా) అడ్వర్‌టైజ్‌మెంట్ డిపార్టుమెంట్‌లో అన్నయ్యగారి దగ్గర నుంచీ కొత్తగా చేరిన కె.రామచంద్రయ్య దాకా, అందరితో ‘దోస్తీ’యే నాకు. ‘అందరికీ ముద్దుబిడ్డ వీరాజీ’ అనేవాడు డి.కె.ఎం. (ద్రోణంరాజు కృష్ణమోహన్) అతణ్ని వీక్లీ పాఠకులు బాగా ఎరుగుదురు. కానీ, సంసార సాగరం ఈదుతూ, బాగా ‘నిస్పృహ’ చెందాడు. కానీ, సినిమాలు చూడడం, రాయడం సరదా పోలేదు. ఐతే, ఎప్పుడూ ఏదో ఒక పేచీ తెస్తూండేవాడు. బాగా సీనియర్ - అందరూ సానుభూతి చూపెట్టేవారు. అతనికి ఓ బానబొజ్జ ఉండేది - దాని మీద ఇలా చేతులెట్టి వాయించుకుంటూ వచ్చి, ముసిముసి నవ్వులు నవ్వి మాట్లాడేవాడు. నేను వీక్లీలోకి వెళ్లేకా తరచు కథల మ్యాన్లూ, స్క్రిప్ట్స్’ పట్టుకొచ్చి ఇచ్చేవాడు.
‘రేపొస్తా వీరాజీ బాబూ! వీటి మీద ‘రిజెక్టెడ్’ అని పెన్సిల్‌తో రాసి, పొట్టి సంతకం పెట్టి ఇచ్చేయండి’ అనేవాడు - పాపం!
ఇలా రిజెక్ట్ అయిన ఈ కథలు మరో పత్రికకి పంపిస్తే పదో, పరకో పంపిస్తారు. కాకపోతే ఇక్కడ ‘రిజెక్ట్’ అయిన కథలే బయటికి వేరేవాళ్లకి ఇవ్వాలి గానీ ఇతర పత్రికలకి ముఖ్యంగా పోటీ పత్రిక ‘ప్రభ’కి మేము పంపరాదు’ అన్నది రూలు. (అతనే చెప్పాడు ఈ మాట మొదట 1963లో) కృష్ణమోహన్ గారిదీ బెజవాడే. రామానగర్‌లో ద్రోణంరాజు వారి వీధి అని ఒక పొడవాటి సందుంది. అందులో వాళ్లకి ఇల్లుండేదిట.
ఆంధ్రపత్రిక కార్యాలయం ఓ చిన్నసైజు ఇండియా (సెక్యులర్ అన్నమాట అప్పటికి పుట్టలేదు) అందరూ ‘అతనికేంటండీ, రాజా! ఓ మెట్టు వదిలి ఓ మెట్టు మీద ఉరుకుతూ పైకి పోతాడే గానీ సామాన్య నడక ‘ఇల్లేప్పా’ అనేవాళ్లు నన్ను - వాత్సల్యంగా.
మా సూపరింటెండెంట్ మళయాళీ క్రిస్టియన్ - ‘వర్గీస్’ అతని పేరు. స్టోర్‌కీపర్ ‘దవే’ గుజరాతీ - జి.ఎం.గారు నిండా ‘అయ్యర్..’ ప్రోసెస్‌లో సుదర్శన్, కేశవన్, కోషీ వగైరా అంతా కేరళా సరుకే. ‘వర్గీస్ అండ్ కో’ అన్న మాట ‘దొరైరాజు’ నిలువుబొట్టు, అసిస్టెంట్ స్టోర్‌కీపర్ ‘కుట్టినాయుడు’. అచ్చం సినిమా నటుడు రమణారెడ్డి లాగా వుండేవాడు. శంభుప్రసాద్ గారికి నమ్మినబంటు. రాధాకృష్ణ గారిని చిన్నప్పుడు ఎత్తుకుని ఆడించిన వారిలో ముఖ్యుడు. అయ్యవారి దగ్గరే అక్షరమ్ముక్కలు నేర్చాడు. కానీ ఇవాళ అరవ, తెలుగు, ఇంగ్లీషూ కూడా వచ్చును. వస్తువులు కొనడం, బిల్లులూ వగైరా చూడటం చేస్తాడు. గొప్ప పిసినిగొట్టు.
కుంచితపాదం గారిని కొంతమంది వర్కర్లు ఆయన గది ముందు నిలబడి తెలుగులో చెత్తగా తిట్టుకుంటూంటారని అర్ధగుండు నామాల డఫేదారుకి అనుమానం.
జి.ఎమ్.కీ అయ్యవారికీ, యస్.ఆర్.గారికీ మాత్రమే మోటారు శకటాలు అంటే కార్లున్నాయి. మోటార్‌సైకిల్ మీద రాంప్రసాద్ ఒక్కడే వచ్చేవాడు. ఓ ‘సబ్’ ఎంత సంబలమ్’ అనేవాడు వర్గీస్. వాడికో మొబైల్ వున్నా - ఆఫీస్ వ్యాన్‌నే వాడుకునే వాడు. మా ఆఫీసులో హోదాల ‘మీమాంస’ చాలానే ఉండేది. ఐతే వీళ్లెవ్వరికీ తెలుగు రాదు. అంటే ‘్ఫర్వాయిల్లే’. జి.ఎం.కీ తెలుగు రాదు. అదే ఆయన ప్రాబ్లెం.
‘వీరాజీ! యూ ఆర్ మై గురూ టీచ్‌మీ తెలుగూ’ అనేవాడు ఆయన. అట్టితరి..
(ఇంకా బోలెడుంది)

-వీరాజీ veeraji.columnist@gmail.com 92900 99512