స్మృతి లయలు

‘వర్కోహాలికు’డనైనాను...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోతనగారన్నట్లు ‘హాలికుడయననేమి? కౌద్దాలికుడయిననేమి?’ అని నేను ‘వర్కో’హాలికుడనయినాను. కంబైన్డ్ ఫ్యామిలీలో కొత్త కోడలు పాత్ర నాది.. అనేవాణ్ణి నవ్వుతూ. ఆంధ్రపత్రిక వీక్లీ వద్దన్నవాణ్ణి దాన్ని వదిలి నా సొంత ఊరు బెజవాడకి డైలీకి బదిలీ అయిపోయినప్పుడు దానిని వదల్లేక వలవలా విలపించాను. తిరిగి 73లో అదే ‘వీక్లీ’ వచ్చిన నన్ను చుట్టుకుంటే కుమిలి కుమిలి ఏడ్చి డైలీ కోసం మొద్దుబారిపోయాను.
మైలాపూర్ అంటే కపాలేశ్వర దేవాలయం. ‘అమ్మ కర్పకాంబళ్ గుడి’. అదే ముఖ్యం. మా సభాపతి ఓసారి ఆ గుడికి తీసుకుపోయాడు. అతను మొదలియార్. తన పినతండ్రి గుడి ట్రస్టీలో ఒకరు. కనుక ఆ దేవాలయం లోపల పూజారి అతనికి, అతనితోపాటు నాకు చాలా మర్యాదలు అంటే ఆలయ మర్యాదలు చేశారు. కపాలేశ్వరుని గుడికి పశ్చిమాన ఒక పెద్ద తటాకం ఉంది. గుడి నాలుగు వేపుల విశాలమయిన రోడ్లు ఇదే ‘సెంటరు’ అన్నట్లుంది. పూజారి దేవుడి విగ్రహం మీద వున్న పూలమాల తీసి నా మెడలో వేశాడు. అదో సంప్రదాయం అక్కడ. నా వి.ఐ.పి. స్టేటస్ కేవలం నా మిత్రుడు ఇచ్చిన ప్రసాదం కనుక నేను విచలితుడినై అతనివేపు అమిత వాత్సల్యంతో చూశాను.
వెనకటికి శివుడు పార్వతి అమ్మాళ్‌కి ‘ఓం నమశ్శివాయ’ అన్న మంత్రం యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నాడట. అంతలో ఈ దేవుళ్ల ముందు ఒక నెమలి వ్రాలింది. వెంటనే పురివిప్పి నాట్యం చేయడం మొదలుపెట్టిందా మయూరి. అమ్మవారి ఏకాగ్రత దెబ్బతింది. నెమలి నృత్యం ఆమెని ముగ్ధురాలిని చేసింది. అయ్యవారు శివుడు చిరాకు పడ్డాడు. ‘నువ్వు నెమలివై భూలోకంలోకి పో’ అన్నాడు పార్వతీదేవిని.
శాప విమోచన కోసం అమ్మవారు ఇదో ఇలా మైలాపూర్ ప్రాంతంలో ఘోర తపస్సు చేసింది. భోళాశంకరుడు ప్రసన్నుడై ఆమెకు శాపవిముక్తి కలిగించాడు. ‘కర్పగవళ్లి’ అనే పేరు కూడా ప్రసాదించాడు. అందుకే ‘కర్పకాంబాళ్’ అంటారు అమ్మవారిని.
నేనీ ప్రాంతంలో ‘మయిలి’గా ప్రకాశించాను. తపస్సు చేశాను. కనుక ఈ ప్రాంతాన్ని మయిలిపురంగా (తమిళంలో నెమలి) ప్రసిద్ధి చేయమని అమ్మవారు కోరింది. అదే మైలాపూర్ అయింది. అంతలో కొందరు భక్తులు అర్ధగుండు తిరునామాలు గలవాళ్లు గర్భాలయ ద్వారం మీదుగా అమ్మవారి గుడికి పోతూ - తమ జరీ అంచు కండువాలు తీసి ఇలా చెవుల మీదుగా కప్పుకుని - అదే అడ్డంగా ముందుకు పోవడం చూశాను. అర్చకస్వామి చెప్పాడు. శివుడు వాళ్లకి పరాయివాడు కానీ, పార్వతి ‘కర్పకాంబాళ్’ విష్ణుమూర్తి సోదరీమణి కాబట్టి ఆమెను దర్శించి పూజలు చేస్తారు శ్రీవైష్ణవులంతా. వేరే ద్వారం లేదు కనుక కపాలేశ్వరుని ‘దృష్టి ‘ఏమార్చి’ అలా తప్పుకునిపోయి అమ్మవారి దర్శనం చేస్తారు. ‘అప్పిడియా’ అనుకున్నాను.
అక్కడ నుంచి వచ్చి ‘లజ్‌కార్నర్’లో విండో షాపింగ్ చేశాం. దాన్ని ‘లేడీస్ బజార్’ అంటారు. హై.బాద్‌లో ‘లాడ్‌బజార్’ లాంటిది. ‘లవర్స్ కార్నర్’ అని కూడా అంటారు. కర్మ ‘లవర్స్’ కాదు, ‘లజ్’ కాదు. ఆ సెంటర్ పేరు ‘లాలాలజ్‌పతిరాయ్’ గారి పేరున పెట్టారు. లాలాలజ్‌పతి రాయ్ అన్నంత పొడుగు మాట ఉచ్ఛరించలేక ‘లజ్’గా సంక్షిప్తీకరించారు. అలాగే వారికి ఇష్టమైన ప్రాంతం టి.నగర్ కూడా. మంచి కమ్మని కాఫీ దొరికే చోటే గానీ ‘టీ’ కడియాదు. దాని పేరు ‘త్యాగరాయనగర్’. అది ‘టి’గా కత్తిరించబడ్డది.
సభాపతితో ఎక్కడికిపోయినా మనసంతా ఆనందంతో నిండి పోతుంది. కానీ మాకు తీరిక ఏదీ? తను మెడికల్ కాలేజీ హాస్టల్‌లో వుంటాడు. ఓ రాత్రి శివాజీ గణేశన్ నాటకం ‘షాజహాన్’ అనేది ఒకటి చూశాం. ఆ డైలాగు అరిచినా అందంగా ఉంటుంది. ఐతే అర్థం అవదు.
దేవానంద్ తర్వాత శివాజీ గణేశన్ అంటే నాకు ఇష్టం. అదో విరోధాభాస. కానీ రాత్రి పొద్దుపోయాక మా బిల్డింగ్‌లోకి ప్రవేశం చాలా కష్టం. సభాపతి రూమ్‌లో ఉండిపోయేవాణ్ణి. కానీ ఈలోగా ‘వీక్లీ’లోకి మారిపోయాను. డైలీకి గుడ్‌బై. నా సమయానికి అష్టబంధనాలు పడిపోయాయి.
ఓసారి తంబుచెట్టి వీధి మీదుగా శివాజీ గణేశన్ ముష్టి ఎత్తుకుంటూ పోతున్నాడంటూ వర్కర్లు పైకి టెర్రస్ మీదికి పరుగులు తీశారు. నేనూ మిద్దెపై డాబా మీదికి పరుగెత్తాను. ఒక ప్రక్కగా నిలబడ్డాను.
వెనుక నుంచి పాట వినపడుతోంది. మధ్యమధ్య శివాజీ ‘అమ్మా! అయ్యా ధర్మం’ అంటూ డైలాగులు చెపుతూ తన చేతనున్న ‘చిప్ప’ని ఇలా ఇలా ఎగురవేస్తున్నాడు. అదీ ‘ట్రక్కు’ మీద నిలబడే. ‘ట్రక్కూ’ పడకుండా కెమెరా దుకాణాలు జనాలు ఇటూ అటూ పడేలాగా తీశారు. ‘మ్యాట్‌షాట్’ తీశారన్నమాట.
అదే నేను ఆంధ్రపత్రిక టెర్రస్ మీదకు పోవడం. రెండోసారి ‘శంకు’ ఎస్.బి.శంకర్‌కుమార్ స్టూడెంట్‌గా ఏదో టూర్ చేసి ఓ ‘బ్లేజర్’ ధరించి నన్ను చూడటానికి వచ్చాడు. ఓ ‘కెమెరా’ (ఆ రోజుల్లో గొప్ప లగ్జరీ కూడా) భుజానికి వ్రేలాడుతోంది. నా ఫొటో కావాలన్నాడు. మంకుపట్టు పట్టాడు. పైకి పోయాం. ఫొటోలు దిగాం. ఆ ప్రింటులు ఆనక పంపించాడు.
ఇప్పటికీ ఆ ఫొటోలు ఎక్కడో వున్నాయి నా ‘గుభేల్’ వస్త్రాలలో. కార్టూనిస్టులందరికీ ‘మదర్ ఫిగర్’ని అయిపోయాను నేను.
ఆంధ్రపత్రిక మద్రాసు సిబ్బందికీ అంతే. ఆడా మగా తేడా లేదు. చివరికి అందరికీ - హిరణ్య కశిపుడి లాగా కనపడే ‘వర్గీస్ ది సూపరింటెండెంట్’ కూడా ‘ఐ లైక్ యూ వీరాజీ’ అంటూ నా బల్ల దగ్గరికి పరుగులు తీస్తూ వచ్చేవారు. ఖాకీ ప్యాంటు, దాని మీద బనీను (బొజ్జ కూడా ఉండేది) ధరించి - త్వరగా ‘ఇన్నర్ రాపర్’లు ఇచ్చేయ్యాలి. మధ్యలో ఓ సెలవు వస్తోంది లాంటి హడావిడి డిమాండ్‌లు చేసేవాడు.
‘నీ పనే బాగుంది’ అనేవాడు. డైలీలో ఉన్నప్పుడు నన్ను చూసి. ‘వి.వి.ఎన్. ప్రకాశరావులను (రైవల్స్ గదా) ఒక ఆట ఆడించవచ్చును నువ్వు. నా దగ్గరికి రా ట్రిక్కులు చెపుతాను అనేవాడు. ఇదే వర్గీస్‌కి కుంచితపాదం గారన్నా, అయ్యవారన్నా హడల్. మూతి మూసుకుని నిలబడేవాడు.
అన్నట్లు, జి.ఎం.గారు తెలుగు నేర్పమన్నాడుగా ఇంటర్‌వెల్‌లో ‘సారు’ రూము వేపు - ఆటోమాటిక్‌గా వెళ్లాను. ఆయన ‘కమాన్’ అంటూ క్రిందకి రోడ్డుమీదకి నడిచి ‘క్రాస్’ చేసి ఎదురుగా ‘మీనన్ అంగడి’ ప్రక్కన వున్న ‘అయ్యర్’ హోటల్‌లోకి దారితీసేవాడు. ఆయన లంచ్ హాల్ట్ అదేనన్నమాట. పదార్థాలు బాగుంటాయిట!
ఆ మధ్య నేను ఓ పుస్తకం కొని ఇచ్చానాయనకి. ఆ రోజుల్లో ఒక ఫేమస్ సిరీస్ వుండేది. ఒకటి నాకు లెరన్ టామిల్ యిన్ థర్టీడేస్ అది నేను కొనుక్కున్నాను. తెలుగు ఇన్ థర్టీడేస్ (రెండు ఇంగ్లీషు ద్వారానే) ‘సారు’కి కొన్నాను.
ఒరు ఇడ్లీ ఒరు వడ నిండా సాంబారు - దాని మీద ‘డేగిషా గినె్నలో చిన్న గ్లాసు పెట్టి’ ఇచ్చే కమ్మని వేడివేడి కాపీ. (ఎఫ్ పలకదు వాళ్లకి హా’ పలకదు వాళ్లకి. మ‘గా’నుభావులు అంటారు. ‘క్ష’ లేనే లేదు. ఐనా ‘టామిళ్’ ‘మజా’ అలా అంటేనే తెలుగు వాడికి ఇష్టం. అది అతి ప్రాచీనమైన భాష. ఒక తమిళ చిత్రం యొక్క మార్కెట్ దేశ దేశాలలో వుంటుంది. సాధారణంగా వాడుకునే మాటలు ఏవో వచ్చాయి తప్ప. నాకూ ఆయనకి. పాపం; ఆ ‘బ్రాహ్మడి’కి తీరిక ఏది? మొత్తం ఆంధ్రపత్రిక బిజినెస్ భారం అంతా ఆయన మీదే ఉంది. ఒక రకంగా చూస్తే అస్తవ్యస్తంగా ‘తీన్‌తేరా’గా వున్న ఆంధ్రపత్రికని ‘పండితారాధ్యుల వారు గట్రా వెళ్లిపోయాక’ ఎన్నో మార్పులు చేసి - గట్టెక్కించిన వాడు కుంచితపాదం అని యాజమాన్యానికి ఎంతో ఇష్టం.
‘నేను కూడా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రూఫ్‌రీడర్‌గా చేశానబ్బా’ అన్నాడాయన.
జి.ఎం.గారి తెలుగు క్లాసులకి దినదినగండం నాకు. అది లేని రోజున విజయ లాడ్జి ‘్ఫల్‌మీల్’ అవకాశం వుండేది. ‘ప్రూఫ్ రీడర్స్’ అంటే జ్ఞాపకం వస్తోంది.
మంచి ‘గ్రంథసాంగుడు’గా వాసికెక్కిన సికరాజు (ఇది రా.కృ.గారి మాట) భారీ సిఫార్సు లేఖ పుచ్చుకుని వచ్చాడు. అతను బొంబాయి ఆంధ్ర సంఘానికి కార్యదర్శిగా చేశాడట. నాటకాలు రాయడం ఆడించడంలో దిట్టం. మంచి ప్లేస్‌మెంట్ ఇవ్వమన్న ‘రికమండేషన్’ ఒకటి అయ్యవారికి అందింది.
‘గొప్ప రచయిత అంటున్నావు! గనుక ‘వీక్లీ’కి బెటర్’ అంటూ ఆయన ‘చిన్నసారు’ కోర్టులోకి ‘బంతి’ తనే్నశారు. చచ్చింది గొర్రె అనుకున్నారు ఎస్.ఆర్.గారు. అర్జంటుగా డైలీలో ‘ప్రూఫ్‌రీడర్’ వేకెన్సీ వచ్చి పడింది. కావున అక్కడ సికరాజు అను చిత్తజల్లు కనకాంబరరాజుగారికి డైలీ గ్యాలీలలో తప్పు ఒప్పులను దిద్దుటకు వేయించేశారు.
సికరాజు అక్కడ చేరే టైములోనే వాశిరాజు ప్రకాశం హైదరాబాద్‌లో మా సినిమా విలేఖరి వ్యాపకం వదిలిపెట్టి మద్రాసు చేరి నా సరసన వారపత్రికలో ‘సబ్’గా చేరాడు.
హైదరాబాద్ నుంచి డిసెంబర్ మొదటి వారంలో నాకు ఉత్తరం రాశాడు. వీక్లీలో ఉద్యోగం ఇచ్చారు నాకు రాధాకృష్ణగారు. ఫిబ్రవరిలో వచ్చి చేరుతాను. మీ దగ్గర జర్నలిజంలో చాలానే నేర్చుకోగలుగుతాను. రాధాకృష్ణగారి ‘్ఫట్‌పింట్స్’లో నన్ను నేను ‘వెస్టరనైజ్’ చేసుకో గలుగుతాను అంటూ రాశాడు. తరువాత చాలా సన్నిహితుడు అయినాడు. చాలా ‘ఏంబిషస్’ అండ్ హైలీ టాలెంటెడ్ బోయ్’ అన్నాను నేను ఎస్.ఆర్.గారితో.
అక్కడ డైలీలో సికరాజు ఇక్కడ వీక్లీలో వాసిరాజు ప్రకాశం చేరారు. కానీ ప్రకాశం సబ్ ఎడిటర్‌గా చేరాడు.
ప్రకాశం వీక్లీకి హైదరాబాద్ సినిమా రాయడమే కాదు డి.ఎఫ్. కరక్‌గారి ‘కరెంటు’ పత్రికకి ఇంగ్లీషులో పొలిటికల్ స్టోరీస్ అవీ రాసే కంట్రిబ్యూటర్‌గా పని చేస్తూ - అది వదిలేసి నా దగ్గరికి చేరాడు. ఇప్పటిదాకా కూడా ‘దగ్గరివాడు’గానే ఉన్నాడు. మద్రాసు నేను వదిలినాక కూడా.. ప్రకాశం రాసినన్ని ఉత్తరాలు జర్నలిస్టులలో మరెవ్వరూ రాయలేదు.
ప్రకాశం వివాహ మహోత్సవానికి మీరు రాకపోతే..నంటూ ‘మారాం’ చేశాడు. అంత చనువు.
ఆనక ఫిలిం ఫీల్డులో పబ్లిసిటీ రంగంలో ప్రకాశం చాలా ప్రకాశించాడని అందరికీ తెలుసు. నేను వింటూ బెజవాడ నుంచి ఆనందించాను. అట్లాగే సిగరాజు ఒక ‘్ఫనామినల్ ఫిగర్’ అయిపోయి ‘్భమి’ వీక్లీ ప్రాచుర్యాన్ని శిఖరాగ్రానికి చేర్చాడు. అదంతా సరే.
మద్రాసులో ఉన్నప్పుడు, తరువాత బెజవాడలో 1973 నుంచి పత్రిక చివరిదాకా నాతోనే వున్న మతుకుమలి మాధవరావునీ, ఆంధ్రపత్రిక డైలీలో రాణించిన పొట్లూరి వెంకటరావునీ, మా తమ్ముడు సుబ్బారావు ఎంతటి శ్రేయోభిలాషులో అంతటి ఆత్మీయులుగా ఆ ఇద్దర్నీ అప్పటికీ ఇప్పటికీ మరువలేను. ఆ కబుర్లకి ఓ కామా...
ఈ వృత్తి ఒక కత్తుల వంతెన - ‘స్పర్థ’ పోటీలతోపాటు ఈర్ష్యాసూయలు కూడా ఎల్లవేళలా పొంచి వుంటాయి.
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com