బిజినెస్

స్టాక్ మార్కెట్లలోకి రైల్వే సంస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. రైల్ ఇంజినీరింగ్ సంస్థలైన ఆర్‌ఐటిఇఎస్, ఆర్‌విఎన్‌ఎల్‌ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) నిర్వహణకు మర్చెంట్ బ్యాంకర్ల కోసం అనే్వషిస్తోంది. మొత్తం ఐదు ప్రభుత్వరంగ రైల్వే సంస్థలుండగా, అందులో ఈ రెండున్నాయి. మిగతా మూడింటిలో ఐఆర్‌సిఒఎన్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్ప్ (ఐఆర్‌ఎఫ్‌సి), ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సిటిసి) ఉన్నాయి.
వీటన్నింటిలో కూడా కేంద్రానికి ఇప్పుడు 100 శాతం వాటా ఉంది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2017-18)గాను ఈ ఏడాది ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లోనే ప్రభుత్వరంగ రైల్వే సంస్థలను స్టాక్ మార్కెట్లలోకి తీసుకెళ్తామని ప్రకటించారు. గత వారం కేంద్ర కేబినెట్ ఐదు ప్రభుత్వరంగ రైల్వే సంస్థల లిస్టింగ్‌కు పచ్చజెండా కూడా ఊపింది. ఈ క్రమంలోనే ముందుగా ఆర్‌ఐటిఇఎస్, ఆర్‌విఎన్‌ఎల్ సంస్థలను స్టాక్ మార్కెట్లలోకి తెస్తున్నారు. ఈ రెండు ఐపిఒల కోసం తొమ్మిది మర్చెంట్ బ్యాంకర్లు వచ్చే వారం పెట్టుబడులు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (డిఐపిఎఎమ్) అధికారుల ఎదుట ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు. ఈ బ్యాంకర్లలో హెచ్‌ఎస్‌బిసి సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కూడా ఉన్నాయి. ఆర్‌ఐటిఇఎస్ ఐపిఒ నిర్వహణకు ఐదు మర్చెంట్ బ్యాంకర్లను, ఆర్‌విఎన్‌ఎల్ ఐపిఒ నిర్వహణకు నాలుగు మర్చెంట్ బ్యాంకర్లను కేంద్ర ప్రభుత్వం నియమించనుంది. ఈ క్రమంలో ఐపిఒల నిర్వహణకు సంబంధించి వచ్చే నెల 11కల్లా ప్రతిపాదనలను మర్చెంట్ బ్యాంకర్ల నుంచి డిఐపిఎఎమ్ కోరుతోంది. ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ వ్యాపారాల్లో ఉన్న ఆర్‌ఐటిఇఎస్.. 2015-16 ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుల అనంతరం 339 కోట్ల రూపాయల లాభాన్ని అందుకుంది. ఈ సంస్థ విలువ 1,803 కోట్ల రూపాయలుగా ఉంది. అలాగే హై స్పీడ్ రైళ్ల కోసం వౌలిక వసతులను కల్పించే ఆర్‌విఎన్‌ఎల్.. గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో 287.59 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. ఈ సంస్థ విలువ 2,827.83 కోట్ల రూపాయలుగా ఉంది. అర్హత కలిగిన సంస్థ ఉద్యోగులు, రిటైల్ ఇనె్వస్టర్లకు ఇష్యూ ధరపై రాయితీకి షేర్లు లభిస్తాయని డిఐపిఎఎమ్ తెలిపింది.
మొత్తానికి ప్రభుత్వరంగ సంస్థ (పిఎస్‌యు)ల్లో వాటాల విక్రయం ద్వారా నిధుల సమీకరణకు వడివడిగా అడుగులేస్తోంది నరేంద్ర మోదీ సర్కారు. ఇందులో భాగంగానే ఏడు సంస్థల్లో కనిష్టంగా 5 శాతం, గరిష్ఠంగా 15 శాతం మేర వాటాను విక్రయించాలనుకుంటోంది. వీటిలో చమురు రంగ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి), ఉక్కు ఉత్పాదక దిగ్గజమైన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్), విద్యుదుత్పాదక దిగ్గజం ఎన్‌టిపిసితోపాటు ఎన్‌హెచ్‌పిసి, పిఎఫ్‌సి, ఆర్‌ఇసి, నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్‌ఎల్‌సి) ఇండియా లిమిటెడ్ ఉన్నాయి. కాగా, ఈ వాటాల విక్రయం కోసం కూడా మర్చెంట్ బ్యాంకర్లు, లీగల్ అడ్వైజర్ల కోసం డిఐపిఎఎమ్.. ఆర్‌ఎఫ్‌పితో వస్తోంది.
అయితే ఎప్పుడు ఈ వాటాల విక్రయం కార్యరూపం దాల్చుతుందన్నదానికి నిర్ణీత సమయమేదీ పెట్టుకోలేదని డిఐపిఎఎమ్ కార్యదర్శి నీరజ్ గుప్తా అన్నారు. ఈ పెట్టుబడుల ఉపసంహరణ అంతా కూడా సాధారణంగా జరిగేదేనని చెప్పారు. నిజానికి 12 సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు కేబినెట్ నుంచి ఆమోదాన్ని ప్రభుత్వం అందుకుందని, అందులో ముందుగా ఈ ఏడు సంస్థల్లో వాటాల విక్రయం జరగనుందని మరో ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. ఇక ఆర్‌ఎఫ్‌పి ప్రకారం ఐఒసి, సెయిల్, ఎన్‌టిపిసి, ఎన్‌హెచ్‌పిసి, పిఎఫ్‌సిలలో 10 శాతం వరకు వాటా ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అలాగే ఎన్‌ఎల్‌సిలో 15 శాతం, ఆర్‌ఇసిలో 5 శాతం చొప్పున వాటా విక్రయానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఈ వాటాల అమ్మకంతో దాదాపు 34,000 కోట్ల రూపాయల ఆదాయం ఖజానాకు చేకూరుతుందని అంచనాలున్నాయి. ఎంతలేదన్నా ఇందులో ఎన్‌టిపిసి ద్వారా 13,000 కోట్ల రూపాయలు, ఐఒసి నుంచి 6,000 కోట్ల రూపాయలు, సెయిల్ గుండా 2,500 కోట్ల రూపాయల ఆదాయం రానుంది.
అలాగే పిఎఫ్‌సి ద్వారా 4,000 కోట్ల రూపాయలు, ఎన్‌హెచ్‌పిసి నుంచి 3,000 కోట్ల రూపాయలు, ఎన్‌ఎల్‌సి గుండా 2,000 కోట్ల రూపాయలు, ఆర్‌ఇసితో మరో 1,000 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఐఒసిలో ప్రభుత్వానికి 58.28 శాతం వాటా ఉంది. అలాగే ఎన్‌టిపిసిలో 69.74 శాతం, సెయిల్‌లో 75 శాతం, ఎన్‌హెచ్‌పిసిలో 74.50 శాతం, ఎన్‌ఎల్‌సిలో 90 శాతం, పిఎఫ్‌సిలో 67.80 శాతం, ఆర్‌ఇసిలో 60.64 శాతం వాటా ప్రభుత్వానికి ఉంది.
ఈ ఆర్థిక సంవత్సరానికి (2017- 18)గాను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా కనీసం 46,500 కోట్ల రూపాయల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. వ్యూహాత్మక వాటాల అమ్మకంతో మరో 15,000 కోట్ల రూపాయల నిధులను అందుకోవాలని అనుకుంటోంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో ప్రభుత్వరంగ సంస్థల వాటాల విక్రయం ద్వారా 46,247 కోట్ల రూపాయల నిధులు సమకూరాయి.