ఈ వారం కథ

నేను నేనుగా... (ఈ వారం కథ)

  • -శారదా అశోకవర్థన్
  • 14/04/2013

రయ్‌మని వీస్తోంది గాలి. కిటికీ రెక్కల చప్పుడు టప టపామని. రెండు చినుకులు పడ్డట్టున్నాయి. కిటికీపైనుంచి వాన నీళ్లు పడకుండా లోపలకి బయటనుంచి పైన పెట్టించిన రేకులు, చినుకుల చప్పుడుకి డమడమా నెత్తిమీద బాదుతున్నట్టే వుంది. కళ్లు తెరిచి చూశాను. బాలభానుడి పసిడి కిరణాలు, కిటికీ చువ్వల లోంచి నా మొహన పడుతున్నాయి. వాన పడుతుందేమో అనుకుంటూ, గాలి ఇంతలా వీస్తుంటే వానెట్లా పడుతుంది. బలమైన వాయువు, బలంలేని మేఘాలని కొట్టెయ్యదూ అనుకోగానే రాత్రి జరిగిన సంఘటన గుర్తొచ్చింది. నా ఉపమానానికి నాకే నవ్వొచ్చినా, అది అక్షరాలా నిజమనిపించింది. చిన్న చేపని పెద్దచేప, పెద్ద చేపని ఆ పెద్ద చేప, ఆ పెద్ద చేపని మొసలి..ఇలా సృష్టిలోనే ఉంది కండబలం స్వతహాగా కలిగిన మగవాడు తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ఆడదానిపై చెయ్యి చేసుకోవడానికి వెనకాడడు. అందుకే కదా ఇష్టం వచ్చినట్టు కొట్టి వెళ్లిపోయాడు రాత్రి రాజేందర్. మంచం మీంచి లేవబోతుంటే నడుం పట్టేసినట్టయింది. కదలరాలేదు. వీపంతా మంటగా వుంది. ఎన్ని దెబ్బలు కొట్టాడో...మెల్లగా లేచి బాత్‌రూంలో అద్దం ముందు నిలుచున్నాను పళ్లు తోముకోవడానికి. అద్దంలో తన మొహంమీద గోళ్లతో బరికేసిన ఎర్రటి నెత్తుటి చారలు చూసి ఉలిక్కిపడ్డాను. రాజుమీద ఒళ్లు మండిపోయింది. తనూ తిరిగి ఇలా కొడితే? అమ్మో! చంపెయ్యడూ? కారుణ్య, కమలినీ దిక్కులేని వాళ్లైపోతారు. తండ్రి వున్నా లేనట్టే..నేను లేకపోతే వీళ్లు అనాధలే..

పళ్లు తోముకునొచ్చి మెల్లగా కాఫీ కలుపుకున్నాను. కారుణ్య, కమలినీ ఇంకా నిద్దర లేవలేదు.
‘పోనీలే పడుకోనీ..ఇవ్వాళ ఆదివారమే కదా’ అనుకుని ఊరుకున్నాను. పసివాళ్లు బెదిరిపోయారు. ఎప్పుడు పడుకున్నారో ఏమో?
పెదవులు చిట్లినట్టున్నాయి. కాఫీ వేడికి మండుతున్నాయి. జీవితం గురించి ఎనె్నన్నికలలు కన్నాను. ఇలా అయిపోయిందేమిటి? కోరి పెళ్లాడి, ఇద్దరు పిల్లలు పుట్టాక, బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు బలాదూర్‌లా తిరిగే రాజుకి, నా ఆనందాన్ని, నా జీవితాన్ని ముక్కలు చేసి నాశనం చేసే హక్కు ఎవరిచ్చారు? అందరిలాగే నేనూ నా సంసారాన్ని గురించి ఎన్నో కలలు కన్నాను. తెలిసీ తెలియని వయసులో ఎమ్‌ఎ చదువుతుండగానే మా బామ్మా, రాజేందర్ వాళ్ల బామ్మా ఫ్రెండ్సవడంవల్ల, కలిసి లలితా సహస్రనామ పారా యణాలు, పూజలు చేయడంవల్ల, వాళ్లిద్దరూ, మా ఇద్దరికీ పెళ్లి చేసి బొమ్మల పెళ్లిలా స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలనుకున్నారు. అంతే మా అక్క బిందూకి పెళ్లి కుదరకపోయినా, ఎవరికి కుదిర్తే వాళ్లకే చేసేద్దాంలే అన్నట్టు నాకు చేసేశారు నాన్నగారు కూడా. రాజేందర్ ఎల్‌ఐసిలో పనిచేసేవాడు. ఒక్కడే కొడుకు. ఒక అక్క మాధవి. ఆమెకి పెళ్లయిపోయింది. ఏ బాదర బందీ లేదు. స్వంత ఇల్లు. ఆస్తీ అన్నీ ఉన్నాయి. ‘సిందూ’ చాలా అదృష్టవంతురాలు సంబంధం కాళ్లదగ్గరకి వచ్చింది అంటూ మురిసిపోయారు అమ్మా, నాన్నా, బామ్మా అందరూను. నా పెళ్లయిన నాలుగు నెలలకే బిందూ పెళ్లి అవడంతో నా పెళ్లయిన వేళా విశేషం, అల్లుడు అడుగుపెట్టిన వేళా అంటూ అందరూ తెగ పొగిడేశారు. రాజేందర్ పెద్ద అందగాడేం కాదు. నేనూ గొప్ప బ్యూటీని కాకపోయినా, పసిమి రంగు, వత్తయిన నల్లటి పొడవాటి జడ, పొట్టీ, పొడుగుకాని హైట్, అందరూ ఆకర్షణీయంగా ఉందనుకునేవారు. నా పక్కన రాజేందర్ నల్లగా, కొంచెం బొద్దుగా పెద్దకప్పలాంటి ముక్కు ఎలాగో అనిపించినా బామ్మ మాత్రం, ‘వాడు రామచంద్రుడే’ శ్రీరాముని రంగు. నలుపు నాణ్యం అంటారు అనేది తను ఎంపిక చేసిన పిల్లాడు చాలా గొప్పవాడని చెప్పడానికి తాపత్రయపడుతూ. ఒక ఏడాది, నా సంసారం ఎలాగో గడిచిపోయింది. ఇద్దరి వ్యక్తిత్వాలు వేరు వేరే అయినా ఒకరి అభిప్రాయం ఇంకొకరితో ఏనాడొ కలవకపోయినా, చిన్న చిన్న వాదాలు, భేదాలు రగులుకుంటునే ఉన్నా కాలం గడిచిపోయింది. కారుణ్య పుట్టేశాడు. రాజుకు ఇల్లంటే కేవలం పడుకోవడానికి పనికొచ్చే ఒక నాలుగు గోడల గది మాత్రమే. అక్కడ నేనొక జీతం ఇవ్వఖ్కర్లేని పని మనిషిని. జీతం నా చేతికి ఇచ్చేవాడు కాదు. అసలు ఎంతొస్తోందో కూడా చెప్పేవాడు కాదు. స్నేహితులు, ఎప్పటికప్పుడు ఏది కావాలంటే దానికి మాత్రమే సరిపోయేంత ఇచ్చేవాడు. రోజూ తాగుడే. ఏ అర్ధరాత్రికో ఇంటికి రావడం. ‘ఇదేమిటి? ఇంతసేపూ ఎక్కడికెళ్లావు’ అని అడిగితే కొట్టడం, తిట్టడం. అదేమిటో అంత గోలలోనూ మళ్లీ గర్భం వచ్చింది. కమలిని పుట్టేనాటికి, వాళ్ల బామ్మా, మా బామ్మా కూడా స్వర్గానికి నిచ్చెన వేసేసుకున్నారు. ఆ వరసలోనే వాళ్ల నాన్నా చేరిపోయాడు. ఇక తల్లీ కొడుకులు, ఇంటికోసం దెబ్బలాడుకునేవారు. ఆవిడ ఏడ్చేసేది, నేను ఓదార్చేదాన్ని. కానీ రాజేందర్ నాతో దెబ్బలాడినప్పుడు, ఆవిడ కొడుకునేమీ అనేది కాదు. నన్ను ఓదార్చేదీ కాదు. పైపెచ్చు నాకు నీతులు చెప్పేది. మెల్లగా వాడి తప్పులు వాడే తెలుసుకుంటాడు. అప్పుడు మనం అన్నీ మరిచిపోతాం. ఎంత లోతైన గాయమైనా సరే మానిపోతుంది. రాజు నోరు వాడే కానీ చెడ్డవాడు కాదు. ఆడవాళ్లం మనకే సహనము, ఓర్పూ ఉండాలి. సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలి. వాదనలూ, ప్రతివాదనలూ ఉండకూడదు’

అంటూ మాట్లాడేది. ఆ మాటలు నాకు పుండుమీద కారం జల్లినట్టుగా వుండేది. నా కన్నీళ్లు తుడిచి, ఆయనకి బుద్ధి చెప్పే బదులు నాకు చెప్తుందేమిటి నీతులు? మరి తనెందుకు దెబ్బలాడుతుంది అతనితో? డబ్బు కోసమేనా? ఆ రోజున తల్లీ కొడుకులిద్దరు తన్నుకున్నంతగా పోట్లాడుకున్నారు. రాజేందర్ విసురుగా బయటికి వెళ్లిపోయాడు. ఆవిడ, పెట్టేబేడా సర్దుకుని స్టేషన్‌కి వెళ్లి విశాఖపట్నం వెళ్లిపోయింది కూతురి దగ్గరికి నన్నూ, నా పిల్లలిద్దరినీ వదిలేసి నీ తంటాలేవో నువ్వు పడు అని. వారంరోజులకల్లా ఇల్లు, నగదు, బంగారం అంతా కూతురికి రాసిచ్చేసిన విల్లు అందుకుని రాజేందర్ పిచ్చెక్కిన వాడిలా కుప్పిగంతులు వేశాడు. కారణం లేకుండానే పిల్లల్నీ నన్ను చితకబాదాడు.
అప్పటినుంచి ఉద్యోగానికి కూడా సరిగ్గా వెళ్లడంలేదు. ఊరినిండా అప్పులే. ఊళ్లో వున్న బార్‌లు, పబ్బులు అన్నీ అతనివే. అన్నింటికన్నా, ఆడవాళ్లతో తిరుగుళ్లు, నా గుండెల్లో ముళ్లల్లా గుచ్చుకున్నాయ్. కంపరం పుట్టించాయి. ఎవరివల్ల ఏ రోగాలొస్తాయోనన్న భయం. ప్రతిరోజు తప్ప తాగేసి, తూలిపోతూ రావడం, ఆ మత్తులో ఏవేవో ఆడపేర్లు చెబుతూ తనలో తనే మాట్లాడుకోవడం. ఇదేమిటని అడిగితే కొట్టడం.
ఇప్పుడు కారుణ్యకి అయిదేళ్లు. కమలినికి మూడేళ్లు. ఈ గోలంతా నిత్యం వాళ్లు చూస్తూనే ఉన్నారు. నాన్నంటే చనువు లేకపోయినా భయంతో బిక్కచచ్చిపోతున్నారు. నిన్న రాత్రి నాలో సహనం చచ్చిపోయింది. ‘ఊరినిండా అప్పులు చేశారు. ఎలా తీరుస్తారు? అసలు ఎందుకు చేస్తున్నారు అప్పులు?’ అడిగాను. అడగడం తప్పా? భార్యగా నాకా అధికారం లేదా? నా జీవితాన్ని నలిపేసి, నలుగురిలో తలెత్తుకోకుండానే చేసి, నన్ను, నా చదువుని పనికిరాకుండా చేసిన అతడు పతిదేవుడా? పతితుడా?’ఇలా అడిగినందుకు ఇష్టం వచ్చినట్టుకొట్టి ఏడుస్తూ అడ్డం వచ్చిన పిల్లల్ని కూడా తోసేసి ఎటో వెళ్లిపోయాడు. ఏడ్చి ఏడ్చి ఎప్పుడు నిద్దరపోయామో తెలీదు. కాఫీ తాగేలోగా అంతా గుర్తుకొచ్చాయి. గుచ్చుకునే జ్ఞాపకాలు ఒకదాని వెంట ఒకటి.
‘ఆడది ఎప్పటికీ అలుసేనా? చదువుకున్నా చదువుకోకపోయినా ఆమె స్థానం అంతేనా? భార్య అంటే భర్తకి బానిసా? ఆమెకంటూ కోరికలు, కలలు ఉండకూడదా? భర్త దుర్మార్గుడైతే, ఆమె జీవితం నిరాశా, నిస్పృహలతో మాడి మసైపోవాల్సిందేనా? చిత్రహింసలు భరిస్తూ ప డుండవలసిందేనా? నా జీవితం నాది. నేనే దిద్దుకోవాలి. హింసని పశువు కూడా సహించదు’ తలబద్దలైపోతోంది. వెళ్లి వేడిగా మ రో కప్పు కాఫీ తెచ్చుకున్నాను. కాఫీ తాగుతూ రెండు చేతులతోటీ కణతల మీద రుద్దుకున్నాను. కాస్త హాయిగా అనిపించింది. ఆగిపోయిన మనసు పనిచేయడం మొదలుపెట్టింది. ఫోన్ తీసి లాయర్ బాబురావుగారికి ఫోన్ చేసాను. ఆయన పదింటికల్లా వస్తానన్నారు. గీజర్ వేసుకుని స్నానం చేసాను. కారుణ్య, కమలినీ లేచారు. వాళ్లని తయారుచేసి పాలు కలిపిచ్చి ఫ్రిజ్ తెరిచి చూసాను. నిన్నటి ఇడ్లీ పిండి వుంది. కొబ్బరి చిప్పా వుంది. రెండూ తీసి, ఇడ్లీలు వేసి, కొబ్బరి చెట్నీతో టిఫిన్ చేశాను. ముగ్గురం తిన్నాం.
‘‘ఒకసారి అమ్మ నాన్నలను రమ్మంటే?’’
వెంటనే ఫోన్ చేశాను. గుండె నిండిపోయి ఇక పట్టవేమోనన్నట్టు ఒక్కసారిగా విషయాలన్నీ వాటంతటవ్వే ఒకదాని వెనుక ఒకటి వచ్చాయి. చెప్తున్నాను ఏడుస్తున్నాను...ఏడుస్తున్నాను చెప్తున్నాను.
నాన్నగారు కంగారుపడిపోయినా, నాకు ధైర్యం చెప్పి వెంటనే బయలుదేరి వస్తానన్నారు. అమ్మ నన్ను జాగ్రత్తగా వుండమని మరీ మరీ చెప్పింది. పిల్లల్ని కూడా జాగ్రత్త అంటూ హెచ్చరించింది.
లాయర్ బాబూరావుగారొచ్చారు.
అతనితో విషయాలన్నీ చెప్పాను. నాకు విడాకులు కావాలని అడిగాను.
అతని ప్రవర్తన గురించి చెడు తిరుగుళ్లు తాగుడూ అంతా విన్నాడు.
కొట్టిన దెబ్బలని చూశాడు. ఈ ప్రవర్తనవల్ల మీరు విడాకులు కోరుకుంటే వస్తుందని హామీ ఇచ్చాడు. అయినా మీ నాన్నగారూ వాళ్లని కూడా పిలిపించండి అన్నాడు.
‘‘రేపొస్తున్నారు నాన్నగారూ అమ్మ’’ అని చెప్పాను.
మర్నాడు సాయంత్రం వస్తానని చెప్పి బాబురావుగారు వెళ్లిపోయారు.
అమ్మ నన్ను చూడగానే బావురుమంది. ‘‘నిప్పులాంటి ఈ విషయాలన్నీ ఇన్నాళ్లు ఎలా గుండెల్లో దాచుకున్నావే’’ అంటూ కన్నీరు కార్చింది. నాన్న పిల్లలని దగ్గరకు తీసుకుని మాట్లాడిస్తున్నారు. వాళ్లని చూడగానే నాకు ప్రాణం లేచివచ్చింది. కాఫీ టిఫిన్లు భోజనలయ్యాక నాన్నగారు సావకాశంగా అడిగి అన్నీ విన్నారు.
‘రాజేందర్ ఎప్పుడొస్తాడు’ అడిగారు.
‘తెలీదు. ఇంటికొచ్చి మూడురోజులైంది’
మాటల్లోనే వచ్చాడు రాజేందర్. చెల్లా చెదురుగా వున్న జుట్టు, పీక్కుపోయిన కళ్లు, మాసిన గడ్డం, ఈ మూడురోజులు మరింత ఎక్కువ తాగుడు, తిరుగుడూ అయ్యుంటుంది. పిచ్చాడిలా కనిపిస్తున్నాడు. నాన్నగారిని చూడగానే క్షణం గతుక్కుమన్నా, ‘ఇన్స్‌పెక్షన్‌కొచ్చారా? చెప్పా చెయ్యకుండా?’ అంటూ కుర్చీలో కూలబడ్డాడు. పిల్లలిద్దరు బితుక్కు బితుక్కుమంటూ వెళ్లి అమ్మమ్మని చుట్టేశారు. అతని రూపం, మాటలు నాన్నగారికే నచ్చలేదు. కానీ సభ్యతకోసం, ఏదో మాట్లాడబోతుంటే, పెడసరంగా లేచి వెళ్లిపోయాడు.
పోతూ పోతూ అమ్మని చూసి, ‘దాన్ని తీసుకెళ్లడానికొచ్చారా? అది పిలిచిందా?’
‘అదీ..ఇదీ...’ అంటూ రాజేందర్ మాట్లాడుతుంటే అమ్మ ఆశ్చర్యంగా నిశ్శబ్దంగా వుండిపోయింది కానీ వొళ్లు మండిపోయింది. నేనూ వాడూ, వీడూ అ నొచ్చుగా! ఆ స్వేచ్ఛ ఆడదానికి మన సమాజం ఇవ్వలేదు. అందుకేనేమో నాకన్నా చిన్నవాళ్లు ఈ సమస్యల గురించి బాగా అర్ధం చేసుకుని, తమ స్వేచ్ఛని తామే పొందుతున్నారు.
రాజేందర్ స్నానం చేసి బట్టలు మార్చుకుని వెళ్లిపోతున్నాడు.
‘‘నాన్నగారు...అప్పుడే వెళ్లిపోతున్నావేమిటి బాబూ... భోంచేసి వెళ్లు’’ అన్నారు మర్యాదపూర్వకంగా.
సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు. నాన్నగారికి అంతా అర్థమైంది.
‘సింధూ...ఏం చేద్దామనుకుంటున్నావు?’
‘విడాకులు’
ఆ మాటకి అమ్మ ఉలిక్కిపడింది.
నాన్నగారు వౌనంగా ఉండిపోయారు.
అసలు ఆ రోజంతా అందరం ఈ విషయం గురించే చర్చిస్తూ వుండిపోయారు. అమ్మానాన్నలు ఇంకా పాతకాలం వాళ్లే. పరువు, నలుగురు ఏమనుకుంటారు? ఇటువంటివి మన ఇంటా వంటా లేదు ఇత్యాది మాటలతోనే సంభాషణలు నడిచాయి. చివరిసారిగా ఒక్కసారి ఏదో రకంగా కల్పించుకుని తనే అల్లుడిగారిని బతిమిలాడి నీతిబోధనలు చేద్దామని అనుకున్నారు నాన్నగారు. అమ్మ సపోర్టు చేసింది. కానీ ఆ అవకాశం రాజేందర్ నాన్నగారికి కల్పించలేదు. రాత్రి ఎనిమిదీ ఆ ప్రాంతంలో ఒకమ్మాయిని వెంటపెట్టుకుని ఇంటికొచ్చాడు. ఆ అమ్మాయి ఎవరో కొత్తమ్మాయి. నాకు తెలీదు. సరాసరి మా బెడ్‌రూంలోకెళ్లి మంచాల పక్కనున్న కుర్చీలో కూర్చుంది. కనీసం ఆమె ఎవరో నాన్నగారికి కూడా పరిచయం చేయలేదు. గబగబ స్నానం చేసి బట్టలేసుకుని ఆమె వెంటే వెళ్లిపోయాడు. నాన్నగారి మనసు ఆ క్షణంలో ఎంత క్షోభించిందో మాటల్లో చెప్పడం కష్టం. అమ్మ కళ్లు చెరువులయ్యాయి. ఆ రాత్రి రాజేందర్ ఇంటికేరాలేదు.
‘తెల్లారుతుంటే ఫోన్ చేసి, నాకు డబ్బు కావాలి. రోజుకో మనిషిని పంపిస్తాను. ఒకరాత్రికి వెయ్యి రూపాయలు. అలా అయితేనే నీతో కాపురం చేస్తూ నీకు భర్తగా వుంటాను. లేకపోతే నిన్ను పోషించే బాధ్యత నాకక్కర్లేదు’ అతడి మాటలకి అవాక్కయిపోయాను. ఫోన్ నాన్నగారికి ఇచ్చాను. అతడు చెబుతూనే ఉన్నాడు. అంతా విని నాన్న ‘షటప్... యూ.. బ్రూట్’ అని ఫోన్ పెట్టేసాడు.
నాన్నగారు ఏదో డిసైడైపోయిననట్టు, తెల్లవారగానే లాయర్‌గారికి ఫోన్ చేశారు. విషయాలన్నీ చెప్పి విడాకులకు ఏర్పాటు చెయ్యమని చెప్పారు. వెంటనే అందర్నీ బట్టలు సర్దుకోమన్నారు. నా వస్తువులు, పిల్లల వస్తువులు అన్నీ అమ్మ నేను కలిసి ఇంటికి తాళం పెట్టి, తాళం చెవిని పక్కవాళ్లకు ఇచ్చి రాజేందర్ వస్తే ఇచ్చెయ్యమని చెప్పి రెండు ఆటోల్లో అందరం బయలుదేరాం. కాలు బయటపెడుతుంటే కళ్లల్లోంచి నీళ్లు చెంపల మీదుగా జారి గుండెని తడిపేస్తున్నాయి. అదేనేమో ఆడదాని బలహీనత. బంధాన్ని అంత తొందరగా తెంచుకోలేదు మగాడిలాగా. ఎన్ని సెంటిమెంట్లో, ఎన్ని జ్ఞాపకాలో అడ్డొస్తాయి. చూపు మసకబారింది కన్నీళ్లు రావడంతో. ఆ గడపకి గుడ్‌బై చెప్పి ఆటోలో కూర్చున్నాను. పిల్లలిద్దరు తాతయ్యదగ్గర, అమ్మ నా దగ్గర కూర్చున్నారు. పిల్లలకి తాతగారింటికి వెడుతున్నామని మహా సరదాగా ఉంది. ఇంక శాశ్వతంగా అక్కడే వుండిపోతామని వాళ్లకి తెలీదు. వాళ్ల సంతోషం వాళ్లది.
వాళ్లని చూస్తున్న కొద్దీ వాళ్లమీద జాలీ, రాజేందర్‌మీద కోపం హెచ్చిపోతోంది. ఈ పిల్లల మీదైనా అతనికి ప్రేమలేదా? లేదని అనుకుంటే పోయేదేనా?

ఈ బంధం? అతనలా పట్టించుకోకుండా బలాదూర్‌గా తిరుగుతూ వుంటే, వాళ్లకి చదువులు, బాధ్యతలు అన్నీ నా ఒక్కదానివేనా? ఇద్దరం జీవితాంతం కలిసి వుంటామని అగ్నిసాక్షిగా చేసిన పెళ్లినాటి ప్రమాణాల విలువ ఇంతేనా?
గుండె పగిలేలా ఉంది. ఎంతలో ఎంత మార్పు. కుటుంబం అంతా చిందర వందరైపోయింది. సముద్రంలో తయారవుతున్న వాయుగుండంలా అనిపించింది బతుకు. చచ్చిపోతే? చచ్చిపోతే ఇవేవీ వుండవు..అమ్మో మరి పిల్లలో?...అసలు వారికిదంతా అర్థమవుతోందా? వాళ్ల చిన్న మనసుల్లోను తుపానులు రేగుతున్నాయా? లేకపోతే పసితనం వాళ్లని కప్పేసి, ఇవేవీ చేరకుండా చూసుకుంటోందా?’
కళ్లు గట్లు తెగిన చెరువుల్లా కన్నీళ్లను ప్రవహిస్తున్నాయి. లేచివెళ్లి చల్లటి మంచినీళ్లు తాగొచ్చాను. కనీసం ఒక్క విషయంలో అదృష్టం నాకు సాయం పడింది. అమ్మనాన్నల మాటే సరిగ్గా విన్నని ఈ రోజుల్లో పిల్లలు బుద్ధిగా తాతయ్య, అమ్మమ్మల మాట వింటూ చదువుకుంటున్నారంటే అదేనాకు పెద్ద వరంగా భావించాను. మనసు ఒక్కసారి గట్టిపడితే, ముదిరిపోయిన పాకంలా రాయిలా అయి ఇక కరగదు, విరగదు. మనసు కూడా అంతే. గట్టిపడిన మనసు, నన్ను మళ్లీ చదువు మీదకి దృష్టి సారించింది. మధ్యలో ఆపేసిన ఎమ్‌ఎ చదువుని కొనసాగించాను. ఎమ్‌ఫిల్ చేశాను. పిహెచ్‌డి చేసాను. నా కొడుకు టెన్త్ క్లాసు, నా పిహెచ్‌డి డిగ్రీ ఒకే సంవత్సరంలో పూర్తయింది. ఆ సంవత్సరమే నాకు విడాకులు మంజూరయ్యాయి. నా సంతోషానికి అవధుల్లేవు. నేను మహిళా డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా చేరాను. కారుణ్య, లెక్కల సబ్జెక్టుతో ఇంటర్‌లో చేరాడు. ఇంజనీరవ్వాలని వాడి కోరిక. కమలిని టెన్త్‌క్లాసుకొచ్చింది. దానిది కామర్స్‌మైండ్. బికాం చేసి ఎమ్‌బిఎ చేయాలని దాని ఉద్దేశం. పిల్లలు పెద్దవాళ్లయిపోతున్నారు. అదివరకటిలా అమ్మా, అమ్మమ్మా, తాతయ్యా అంటూ వెంట వెంట తిరగడంలేదు. వాళ్ల స్నేహితులు, వాళ్ల వ్యాపకాలు, వారి వారి ఆలోచనలతో వారి వారి వ్యక్తిత్వంతో వాళ్లు ముందుకు పోతున్నారు. కానీ, అమ్మే మంచం పట్టింది తిరుగులేని కాన్సర్ వ్యాధితో. నాన్న బెంగతోనూ, వయోభారంతోను కుంగిపోతున్నారు. నాకళ్ల ఎదుటే రెండు పక్షులు అతి తక్కువ సమయంలో ఈ గూడు విడిచి వెళ్లిపోయాయి. నాలో మళ్లీ పాత ఆలోచనలే! ఛీ..వెధవ బతుకు అంటూ నిరాశా నిస్పృహలే! అలా అని కొందరు స్నేహితులు చెప్పినట్టు మళ్లీ పెళ్లి చేసుకునుంటే? బాబోయ్..! నా పిల్లలకి ఇప్పుడిచ్చినంత ప్రేమ, ధ్యాస ఇవ్వగలిగే దాన్నా? డౌటే! అతని సుఖం, అతని సేవ, అతనికి పుట్టిన పిల్లల్తో కారుణ్య, కమలినిలు నలిగిపోయేవారు. ఇప్పుడు హాయిగా నా ప్రేమలో, నేను వారికి సొంతం, వారు నాకు సొంతం అంతే!
ఇదేమిటి? ఇలా ఆలోచిస్తున్నాను? ఈ బతుకులు ఎవరివి వాళ్లవే!...ఎవరు ఎవరికీ సొంతం కాదు. గజిబిజి ఆలోచనలు ఈ మధ్య తరచు వస్తున్నాయి. లైఫ్ రొటీన్‌గా సాగిపోతోంది. జీవితం సాఫీగానే ఉంది కానీ ఏదో లోటు! ఏం కావాలో తెలీని లోటు! కాలం ముందుకు పోతునే ఉంది. పిల్లల చదువులు పూర్తయ్యాయి. ఇద్దరూ మెరిట్‌లో పాసయ్యారు. ఎంబిఏలో ఇద్దరం ప్రేమించుకున్నాం అంటూ పరిచయం చేసింది అనిరుధ్‌ని కమలిని. అనిరుధ్ బెంగాలీ దేశస్తుడు. ఇద్దరు చూడడానికి ఈడు జోడు ముచ్చటగా వున్నారు. కాసేపు ఆలోచించాను. పెళ్లికి ఒప్పుకున్నాను. వాళ్లిద్దరికీ పెళ్లంటే ఏమిటో తెలుసు. కష్ట సుఖాలు తెలుసు. జీవితం తెలుసు. ఇంక నే చెప్పేదేముంది? అంతా చేయాల్సినదే. నేనే కన్యాదానం చేసి పెళ్లి చేశాను. నాకన్నా ఆ కార్యాన్ని నెరవేర్చడానికి అర్హత ఎవరికుంటుంది. వాళ్లకోసమే బతుకుతున్నదాన్ని. భర్తలేకపోతే అల్లుడి కాళ్లు తను కడిగి కన్యాదానం చెయ్యకూడదా? భర్తలేడని ఎవరినో కూర్చోబెట్టి కన్యాదానం చేయించాలా? లోకం ఎందుకు హర్షించదూ? అయినా కన్యాదానం ఏమిటి? కన్యను వాళ్లకి అప్పగించడం అంటే బావుంటుంది. వివాహం కానంతవరకూ, నీ ప్రవర్తనతో కన్నవారిని ఎంతో సంతోషపెట్టావో, అలాగే ఇప్పుడు కట్టుకున్న వాడి ఇంట్లో కాలుపెట్టి ఆ ఇంటిని సంతోషమయం చెయ్యి అని చెప్పడం మర్యాదపూర్వకంగా అమ్మాయిని పంపించడం అవుతుంది కానీ, దానం కాదు. నా తలపులకి నాకే తృప్తిగా అనిపించింది. నా భావాలని, నా పెంపకంలో పెరిగిన కారుణ్య, కమలినీ ఎంతో గౌరవించారు. కమలిని కలకత్తా వెళ్లిపోయింది అనిరుధ్‌తో. కారుణ్యకి న్యూ జెర్సీలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. వెళ్లిపోయాడు. నన్ను రమ్మని బతిమాలాడు. నేను ఉద్యోగం మానేసి రానన్నాను. అవసరమైనపుడల్లా వచ్చి వెడుతుంటాను కానీ, అక్కడే స్థిరపడిపోలేను అన్నాను. కారుణ్య మొదట్లో కాస్త బాధపడ్డా, తరువాత నా వ్యక్తిత్వానికి విలువనిచ్చి సరేనన్నాడు.
కాలం పరిగెడుతూనే ఉంది. అది ఆగే గడియారం కాదుగా...ఎవరెక్కడున్నా ఏమైపోయినా, దాని పని అది చేసుకుపోతూనే ఉంటుంది. కారుణ్య తనకి నచ్చిన అమ్మాయిని అమెరికాలోనే పెళ్లి చేసుకున్నాడు. నేనూ అమెరికా వెళ్లాను. ఆ అమ్మాయి మనమ్మాయి కాకపోయినా మాతో కలిసిపోయింది. అందరూ నన్ను గౌరవిస్తూ, అభిమానిస్తునే ఉన్నారు కానీ ఏదో కొరత. వెలితి...నాలో అలజడి తప్పడంలేదు. నాకేం కావాలి?..నా సంతోషాన్ని, నా దుఃఖాన్నీ ఆత్మీయంగా పంచుకునే ఒక తోడు కావాలి. అవును..నాకు నిజమైన స్నేహితులు కావాలి! ఆడా... మగా.... ఎవరు? ఎవరైనా కావచ్చు. ఒక్క మంచి స్నేహం..లేదా కమ్మని కలల తోడు...లేదా నన్ను మైమరిపించే వ్యాపకం...ఏదైనా తోడే...ఇప్పుడు చిన్నప్పుడు సగంలో వదిలేసిన సంగీతమే నా తోడు.. దాంతోనే నా స్నేహితం...అదే నా జీవితం! అదే నా లోకం... నేను నేనుగా మై లైఫ్!

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading